నేడు 102వ జయంతి
విజయనగరం టౌన్ : తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన చాగంటి సోమయాజులు 1915 జనవరి 17న నాగావళి తీరాన శ్రీకాకుళంలో కానుకొలను తులసమ్మ, లక్ష్మీనారాయణలకు జన్మించారు. అప్పుడు ఆయన పేరు నరహరిరావు. పెంపుడు తల్లిదండ్రులు చాగంటి తులసమ్మ బాపిరాజు విజయనగరం తీసుకొచ్చాక చాగంటి సోమయాజులుగా పేరు మారింది. చాసో ఆత్మీయ మిత్రులు రోణంకి, శ్రీశ్రీ , నారాయణబాబు, ఆరుద్ర. తోరుదత్, సరోజీనినాయుడుల రచనల ప్రభావంతో చాసో తొలినాట సాహితీ జీవితం ప్రారంభించారు. రెండో ప్రపంచయుద్ధం, రష్యా విప్లవం, టాల్‌స్టాయ్, గోర్కీ రచనలు, మార్కిస్టు రాజకీయ సిద్ధాంతం చాసోను విశేషంగా ప్రభావితున్ని చేశాయి. ప్రపంచ యుద్ధ బీభత్సం రోజుల్లో ఆయన తొలికవిత ‘ధర్మ క్షేత్రం’ శీర్షికతో 1941లో అచ్చయింది. ఆధునిక సాహిత్యంలో శ్రీశ్రీ మహాప్రస్థానం, నారాయణబాబు గీతాలు హృదిర జ్యోతి, చాసో కథలు మంచి పేరు తెచ్చుకున్నాయి.
ఆణిముత్యాల్లాంటి 46 కథలు
చాసో రాసిన కథలు 46 అయినప్పటికీ తెలుగు కథాసాహిత్యంలో శాశ్వత స్థానం సంపాదించారు. చాసోకు ఆత్మీయమైన రచన ‘చిన్నాజీ’ సమాజంలో అట్టడగు వర్గాలు, దిగువ, మధ్య తరగతి సహా ఉన్నత వర్గాల జీవితాల్లోని దోపీడీ వ్యవస్థ కనిపిస్తుంది. కష్టాలు, కార్మికుల బతుకులు, అవిద్య, అమాయకత్వం, సౌందర్య పిపాస, మతం తదితర అంశాలన్నీ చాసో కథా వస్తువులుగానే వాడేవారు.
తాను నడయాడిన ప్రాంతాల్లోని మనుషులను చదివారు. భాషల్ని, యాసల్ని పట్టుకుని తానెరిగిన జీవితాల నుంచే కథలు సృజించారు. పరబ్రహ్మం, మాతృధర్మం, బొండుమల్లెలు, కుక్కుటేశ్వరం, బొచ్చు తువ్వాలు తదితర కథలు ఆలోచింపజేస్తాయి. గురజాడది విమర్శనాత్మకమైన, వాస్తవికతతో కూడిన సామాజిక చైతన్య పురోగమనమైతే.. చాసో కాలం నాటికి మారిన ప్రపంచ, దేశ పరిస్థితుల నేపథ్యంలో మారŠ?క్సజ దృక్ఫథం ఆయన కథల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఏలూరెళ్లాలి, వేలం, వెంకడు, ఎందుకు పారేస్తాను నాన్నా’ తదితర కథల్లో చిన్న చిన్న వాక్యాలతోనే బరువైన భావాలను పలికించిన చాసో 1994 జనవరి 2న తనువు చాలించారు.
చాసో స్ఫూర్తి సాహితీ
పురస్కారాలు
1995 నుంచి చా.సో. స్ఫూర్తి పురస్కారాలను అందిస్తున్నారు. తొలిసారిగా 1995లో ఆయన సమకాలికుడు మహీధర రామ్మోహనరావుకు పురస్కారాన్ని అందించారు. 1996లో ఆరుద్ర, 1997లో పి.సత్యవతి, 1998లో గంటేడ గౌరునాయుడు, 1999లో బోయ జంగయ్య, 2000లో కేఎన్‌వై పతంజలి, 2001లో చిలుకూరి దేవపుత్ర, 2002లో ముదిగంటి సుజాతారెడ్డి, 2003లో నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, 2004లో కె.వరలక్ష్మి, 2005లో వి.ప్రతిమ, 2006లో మహమ్మద్ ఖదీర్‌బాబు, 2007లో జాజుల గౌరి, 2008లో సయ్యద్ సలీమ్, 2009లో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, 2010లో కుప్పిలి పద్మ, 2011లో శశిశ్రీ, 2012లో ఎఎన్ జగన్నాథశర్మ, 2013లో పెద్దింటి అశోక్ కుమార్, 2015లో చింతకింది శ్రీనివాసరావు, 2016లో కేవీ రమణరావులు అందుకున్నారు.
చాసో సాహితీ వేదిక ప్రారంభం నేడు
చా.సో 102వ జయంతి సందర్భంగా గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం మేడపై చాసో స్ఫూర్తి సాహిత్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం చాసో సాహితీ వేదిక ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకూ కార్యక్రమాలు జరుగుతాయి. చాసో చిత్రపటానికి పూలమాలాలంకరణ, చాగంటి కృష్ణకుమారి స్వాగతోపన్యాసం, బీఏ నారాయణ గురజాడ దేశభక్తి గేయాలాపన ఉంటాయి. అనంతరం ప్రారంభోపన్యాసం కె.శ్రీనివాస్ చేస్తారు. చాసో రచనలపై రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి హాజరయ్యే సాహితీవేత్తలు, అతిథులు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ నిర్వహించే కార్యక్రమాల్లో పుస్తకావిష్కరణలు, సాయంత్రం ప్రముఖులతో చాసో స్ఫూర్తి సాహితీ పురస్కార ప్రదానం ఉంటాయి.
చరిత్ర కెక్కిన చరితార్ధుడు ‘చాసో’
Published Tue, Jan 17 2017 5:01 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
Advertisement