పెళ్లాడే బొమ్మా! | Telugu Poet Ushasri: First Letter From Pellade Bomma Novel | Sakshi
Sakshi News home page

పెళ్లాడే బొమ్మా!

Published Sat, Mar 19 2022 2:25 PM | Last Updated on Sat, Mar 19 2022 7:52 PM

Telugu Poet Ushasri: First Letter From Pellade Bomma Novel - Sakshi

మార్చి 20న ఉషశ్రీ జయంతి సందర్భంగా ఆయన 1961లో రాసిన ‘పెళ్లాడే బొమ్మా!’ నవలా లేఖావళి నుంచి మొదటి లేఖ సంక్షిప్తంగా...

చిరంజీవినీ –
అని నిన్ను సంబోధించడం నాకిష్టం లేదు. అయినా ప్రపంచంలో అన్నీ మనకిష్టమైనవే చేస్తున్నామా! ఇష్టం లేని వాటి మీదనే ఎంతో శ్రద్ధ, ఆప్యాయత. ఔత్సుక్యం ప్రదర్శించడానికి అలవాటు పడిపోయాడు మానవుడు. ఈ విషయంలో పల్లెటూరి వాడి కంటె నాగరికుడు మరీ సామర్థ్యం కనబరుస్తున్నాడు. చదువుకున్న వాడికి ఈ కళలో మంచి ప్రావీణ్యం ఉంది. చదువురాని వాడు ఈ విషయంలో అసమర్థుడేనేమో! చదువుకున్నవాడు చదువుకున్న వాడితో సాగించే ఈ కృత్రిమ వ్యవహారం ఉన్నదే ఇంతకంటె దుర్భరమైనది లేదు. వాస్తవానికి మనిషి కృత్రిమంగా బ్రతకడానికి ఎప్పుడో అలవాటు పడిపోయాడు.

అసలు కృత్రిమ శబ్దం ఇక్కడ ఉచితం కాదని నాకు తెలుసు. ఆర్టిఫిషియల్‌ అనేదానికి తెలుగు రానివాడు రాసిన అనువాదం కృత్రిమం. అందువలన ఒక రకంగా ముసుగులో గుద్దులాట అంటే బావుంటుంది కానీ అదీ సమంజసం కాదు. పచ్చి మోసం అంటే సుఖంగా ఉంటుందేమో అలోచించు. ఇంతసేపూ నీకు నేను అనవసర విషయం మీదనే వ్రాసినట్లున్నాను. ఇది అనవసరమని నాకూ తెలుసు. అసలీ ప్రపంచంలో అవసరమైంది ఏముంది కన్నతల్లీ?

అన్నీ అవసరాలే!
అనవసరాలనే అవసరాలుగా అంగీకరించి అనుభవించడానికి అలవాటు పడుతున్నాము. పుట్టడం కంటె అనవసరమైనది లేదు. అయినా అది మన చేతుల్లో వున్నదా! అని నువ్వు ప్రశ్నిస్తావు. నిజమేకాని – ఏది మన చేతుల్లో ఉంది. ఊరికే తెలియక కొందరు అమాయకులు అంతా మన చేతుల్లో ఉన్నదంటారు. మరికొందరు ఆకాశంలోని గ్రహాలకు ఈ అధికారం అంటకడుతున్నారు. ఆ గ్రహాలకు ఆ శక్తి ఎలా వచ్చిందంటే ఆగ్రహిస్తారు వారు. అన్నిటికీ అతీతమైన శక్తి ఒకటి ఉందని అంటే హేతువాదులు ఒప్పుకోరు. ఎప్పుడు హేతువాదం, విశ్వాసం కంటె బలీయమైందో అప్పుడే మానవుడు మోసంలో పడిపోయాడు. మోసగించుకొంటున్నాడు. మోసం చేస్తున్నాడు. మోసంలో పడుతున్నాడు. ఇందులో కొంత తెలిసి జరుగుతుంటే కొంత తెలీకుండా జరుపుతున్నాడు. తెలిసినా తెలియకపోయినా ముట్టుకుంటే నిప్పు కాలి తీరుతుంది. అందుచేత ఈ మోసాలకు ప్రాయశ్చిత్తం తప్పదు. అయితే తత్కాలంలో ఇవి వేధించకపోవచ్చు. కాని వీటి పరిణామ రూపమైన ప్రాయశ్చిత్తఫలాన్ని అనుభవించక తప్పదు – అని నేనన్నప్పుడు ‘‘ఈ జన్మలో హాయిగా పోతే చాలు, వచ్చే జన్మ అనేది ఉందో లేదో తెలియనప్పుడు అందులో అనుభవించడమనే అవస్థ ఎక్కడిది?’’ అని నవ్వి పారేశావు.

నిజమే!
పూర్వజన్మ, పునర్జన్మ, కర్మ అనేవి ప్రత్యక్షమయే విషయాలు కావు. కావు కాని ప్రత్యక్షాంశాలకు హేతువులు దొరకనప్పుడు పై వాటిని స్వీకరించడంలో దోషం కనిపించదు. ఉదాహరణకు  నువ్వు బియ్యే చదివావు. నీలానే చదివిన వాళ్లెందరో ఉన్నారు. నీ కంటె గొప్పగా ప్యాసయిన వాళ్లలానే, తక్కువ మార్కులతో ఉత్తీర్ణులయిన వాళ్లూ ఉన్నారు. కానీ – ఈ క్రింది తరగతుల వాళ్లు నీ కంటె మంచి పదవుల్లో ఉండగా ప్రథమ శ్రేణివారు నిరుద్యోగులుగానూ కనిపిస్తున్నారు కదా. ఏమిటి దీనికి కారణం?
ఆలోచించవు నువ్వు, అనవసరం అనుకుంటావు.

అక్కడే విడుతున్నాం మనం. చిత్రం చూశావా! ఏది నేననవసరమనుకుంటానో అది అందరికీ అవసరంగా కనిపించినట్లే నువ్వ అవసరమనుకునేది మరి కొందరికి అనవసరమవుతుంది. ఇదంతా మన మనస్సుల మీద ఉన్నది.

ఈ మనస్సు ఉన్నదే. ఇది బహు ప్రమాదకరమైనది. ప్రమోదానికి ఇదే మూలస్థానం. దీనినే శంకరుడు కోతితో పోల్చాడు. ఉత్త కోతి అన్నాడు మనస్సును. అప్పుడనిపిస్తుంది. మనిషి కోతి నుండి పుట్టాడంటే మనస్సనే కోతిని పెట్టుకు పుట్టాడా అని.

నవ్వొస్తుంది నీకు –
ఇందుకే కాదు అన్నింటికీ నవ్వడమే అలవాటు నీకు. అదే నీ అదృష్టమేమో జాతక చక్రంలో. ఇంతకూ ప్రపంచంలో...
అసలేం వ్రాద్దామనుకున్నానో, ఏం వ్రాయమని నువ్వు అడిగావో అది వ్రాయడమే మరచిపోతున్నానని నువ్వు కాకపోతే నీ పక్కవాళ్లయినా భ్రమపడవచ్చు. అది ఎవరి దోషమూ కాదు. వ్రాసేదాన్ని పూర్తిగా అవగాహన చేసికొని ఆ అక్షర సముదాయం వల్ల ఏర్పడే శబ్దాలిచ్చే అర్థాలతో పాటు ఆ శబ్ద సముదాయం మరే అంశాన్నయినా ధ్వనిస్తున్నదా అని లోచించడం అవసరం అనుకుంటా. ఇలా అన్నందుకు చాలామందికి ఆగ్రహం వస్తుంది.

అయినా అందరి ఆగ్రహానుగ్రహాలనూ లక్ష్యం చేస్తూ కూచుంటే మన జీవితాలు సాగవని నువ్వు అనేమాట నేనెరుగుదును. కానీ ఆగ్రహానుగ్రహాల విషయంలో గొప్ప పేచీ ఉంది. ఆ విషయం చాలాసార్లు వివరిద్దామనుకుంటూ మరచిపోతూనే ఉన్నాను. కొన్ని కొన్ని విషయాలు మరిచిపోగలిగితే ఎంత బావుండునూ అనుకుంటాము. కానీ –
ఏవి మరచిపోదామనుకుంటామో అవి తరిమి తరిమి వేధిస్తూంటాయి. మనం స్వయంగా చేసిన తప్పులు విష ఫలితాలతో ఎదురయేటప్పుడు మరిచిపోదామనుకుంటాము కాని సాధ్యమా?

కాదు, కాదని అటువంటి తప్పులు చేయకుండా ఉండగలమా? తప్పులు చేస్తూండడం, దిద్దుకోవడం... మానవ జీవితానికి నిర్వచనం. చేసిన తప్పులే చేస్తూండడం మేధావులమనుకొనేవారి లక్షణం.
ఈ లక్షణానికి మంచి లక్ష్యం ఏమిటో తెలుసా?

పెళ్లి –
అనుకోలేదు నువ్వు.. ఇంత తొందరగా ఈ అంశంలోకి వస్తానని. నువ్వు ఏమీ అనుకోవు. ఉత్తర దక్షిణాన్ని గురించి ఆలోచనే లేదు నీకు. గతాన్ని స్మరించడమే కిట్టదు. వర్తమానాన్ని మింగుతూ ఉంటావు. ఈ తత్వం అలవరుచుకుంటే వచ్చేది కాదు. జన్మతః సిద్ధిస్తుంది. ఇది జీవితాంతం ఉంటే మంచిదే. కాని అలా భావించడం ఒక పగటి కల. అక్షరాలా పగటి కల. అంటే నీకు కోపం, బాధ, అసహ్యం లాంటివెన్నో కలగవచ్చు. కాని సత్యం సుమీ! అమ్మడూ నేను చెపుతూన్నది.
అనాలోచితంగా మానవజాతి చేస్తూన్న పనులలో మొదటిది పెళ్లి.

ఎంతో ఆలోచిస్తూ  చేస్తూన్నాననుకుంటూ  చేసేవాటిలో కూడా ఇదే మొదటిది –
భూతభవిష్యద్వర్తమానాలను అనుశీలించి చేస్తున్నామనుకుంటారీ పని. వీరందరూ కూడా ఈ విషయం దగ్గరే భూతాన్ని స్మరించరు. భవిష్యత్తును ఊహించరు. నిజానికి వర్తమానాన్నే స్మరిస్తారు. నిజానికి వర్తమానమే శాశ్వతమై  భూతభవిష్యత్తులు లేకపోయినట్లయితే ఎంతో బావుండుననుకుంటాము. నిజానికి గత స్మృతులతో వేగుతూ భవిష్యత్తుకు భయపడుతూ సుఖంగా వర్తమానాన్ని ధ్వంసం చేసుకునే వాళ్ల మీద మనకు సానుభూతి అవసరం లేదు.

లేకపోయినా సానుభూతి మానవత్వ లక్షణ శ్రేణిలో మొదటిదని కదా అంటూంటావు. దాన్ని ఆశించనివారు లేరని నీ ఊహ. కాని సానుభూతిని చూపడం ప్రారంభించేవారు, జీవితాంతం దానితోనే ఉండాల్సి వచ్చేసరికి జీవితం విసుగెత్తిపోయి సానుభూతి చూపే వాళ్ల మీద అసహ్యం ఏర్పడుతుంది.
దాంపత్యంలో ఉన్న చిక్కే ఇది.

సానుభూతి – భర్త భార్య నుంచి తన పరిశ్రమకు సానుభూతిగా చిరునవ్వులు కోరవచ్చు. భార్య భర్త నుండి తన కుటుంబ పరిశ్రమకు సానుభూతిగా చీరలూ, నగలూ వాంఛించవచ్చు.

ఈ సానుభూతి పరస్పరాపేక్షితం. అది లభించినట్లయితే వారు చిలకా గోరింకల్లా ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఇది ఒకే వైపు నుండి వస్తుంది. రెండవవారు సదా వాంఛించడమే కాని ప్రదర్శించరు. అప్పుడు అవతలివారు దాన్ని ఇస్తూన్నంత కాలం ఇబ్బంది లేదు. అంటే ఒకరెప్పుడూ ఒదిగి ఉండడమే. ఇందులో సుఖం ఉభయులకూ ఉందని నమ్మగలమా, ఉన్నట్టు నటిస్తారు. ఈ నటన చిరకాలం సాగదే. నటన నటనే. ఎప్పుడో ఈ నటన బయటపడుతుంది. అప్పుడు నరకమే కదా.

మరో శ్రేణి ఉంది –
వారు ఉభయులకూ ఒకరి మీద ఒకరికి సానుభూతి ఉండదు. పులీ – మేకా మొగుడూ పెళ్లాయినట్లుంటుంది సంసారం.
ఇంతకూ – ఏది ఎలా జరుగుతున్నా ఒక పురుషుడూ – ఒక స్త్రీ కలిసిమెలసి ఉంటూన్నట్టు నటిస్తూ అయినా బ్రతకక తప్పనిసరి సామాజిక వ్యవస్థలో మనం బ్రతుకుతూ... ఇప్పుడు ఆ నిబంధనలు ముళ్ల కిరీటాలే అయినా ధరించక తప్పదు. (క్లిక్‌: నూట పాతికేళ్ళ యువకుడు)

స్త్రీకి పురుషుడూ, పురుషునికి స్త్రీ ఆహార నిద్రాద్యవసరాలకే ఆవశ్యకం కాదు సుమా. ఈ అవసరాలకే పరిమితం చేసుకున్న భార్యభర్తలు గిల్లికజ్జాలు పెట్టుకుంటూ అయినా సంసారమే సాగిస్తారు.

కాని అందుకు కాదుగా నువ్వడిగింది. జీవితంలో సాహచర్యం కోసం కదా! అటువంటప్పుడు నేనేం చెప్పగలను, అని తప్పుకోవడం నన్ను మోసగించుకోవడం అవుతుంది. ప్రయోజనరహితంగా ఈ మోసకారి జీవితాలు గడిపేవారిని నేనెరుగుదును. కానీ ఈ అల్ప విషయం కోసం అబద్ధమాడడం నాకిష్టం లేదు. కొందరితో అయినా యదార్థంగా ఉండడం మంచిది కనుక ఇంత వ్రాస్తున్నాను. ఈ సారి మరికొంత...

– ఉషశ్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement