Ushasri
-
రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీసుల సెల్యూట్
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లాలో రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా ఎంపీటీసీ సభ్యురాలిని ఎత్తుకెళ్లిన టీడీపీ నేతలను వదిలేసి.. జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ కీలక నేతలపై ఎస్సైతో కేసు పెట్టించడం చర్చనీయాంశమైంది. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక రోజున వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు భారతిని టీడీపీ నేతలు బలవంతంగా ఎత్తుకెళ్లారు.టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయకపోగా.. చివరకు పోలీసులతోనే ఫిర్యాదు చేయించి వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఓ దళిత మహిళను టీడీపీ నేతలు కిడ్నాప్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశి్నంచిన వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఎస్ఐ ఫిర్యాదుతో.. ఉప ఎన్నిక రోజున వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను బాగేపల్లి టోల్‌ప్లాజా నుంచి రామగిరి తీసుకెళ్లాల్సిన పోలీసులు.. మార్గంమధ్యలోని చెన్నేకొత్తపల్లి నుంచి తిరుగు పయనమయ్యారు. ఎంపీటీసీ సభ్యులను సకాలంలో సమావేశ మందిరానికి తీసుకురాలేకపోవడానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కారణమంటూ చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ పెనుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుకొండలో కిడ్నాప్‌నకు గురైన ఎంపీటీసీ సభ్యురాలు రామగిరిలోనే తప్పిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. చెన్నేకొత్తపల్లి ఎస్సై ఫిర్యాదు మేరకు పెనుకొండ ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. 25 మందిపై ఎఫ్ఐఆర్ శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపు దుర్తి ప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్‌రెడ్డి సహా రాప్తాడుకు చెందిన శేఖర్, మరూరు వెంకటేశ్, డోలా రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, యలక్కుంట్ల అమర్నాథ్రెడ్డి, నరసింహారెడ్డి, కురుబ నాగిరెడ్డి, రామాంజినేయులు, ఓబుగారి హరినాథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మీనుగ నాగరాజు, బాబురెడ్డి, ఎం.గోవిందరెడ్డి, చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, మాధవరాజు, రఘునాథరెడ్డి, సుబ్బిరెడ్డి, ఎస్టీడీ శ్రీనివాసరెడ్డి, నీరుగంటి నరసింహులు, చీమల కేశవయ్య, ఎస్.రవీంద్రరెడ్డిపై కేసు నమోదు చేశారు. వీరందరిపైనా బీఎన్ఎస్ సెక్షన్లు 192, 132, 125, 351 (2), 79, 223 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. -
టీడీపీ చేసిన హత్యే ఇది..!
-
పెళ్లాడే బొమ్మా!
మార్చి 20న ఉషశ్రీ జయంతి సందర్భంగా ఆయన 1961లో రాసిన ‘పెళ్లాడే బొమ్మా!’ నవలా లేఖావళి నుంచి మొదటి లేఖ సంక్షిప్తంగా... చిరంజీవినీ – అని నిన్ను సంబోధించడం నాకిష్టం లేదు. అయినా ప్రపంచంలో అన్నీ మనకిష్టమైనవే చేస్తున్నామా! ఇష్టం లేని వాటి మీదనే ఎంతో శ్రద్ధ, ఆప్యాయత. ఔత్సుక్యం ప్రదర్శించడానికి అలవాటు పడిపోయాడు మానవుడు. ఈ విషయంలో పల్లెటూరి వాడి కంటె నాగరికుడు మరీ సామర్థ్యం కనబరుస్తున్నాడు. చదువుకున్న వాడికి ఈ కళలో మంచి ప్రావీణ్యం ఉంది. చదువురాని వాడు ఈ విషయంలో అసమర్థుడేనేమో! చదువుకున్నవాడు చదువుకున్న వాడితో సాగించే ఈ కృత్రిమ వ్యవహారం ఉన్నదే ఇంతకంటె దుర్భరమైనది లేదు. వాస్తవానికి మనిషి కృత్రిమంగా బ్రతకడానికి ఎప్పుడో అలవాటు పడిపోయాడు. అసలు కృత్రిమ శబ్దం ఇక్కడ ఉచితం కాదని నాకు తెలుసు. ఆర్టిఫిషియల్ అనేదానికి తెలుగు రానివాడు రాసిన అనువాదం కృత్రిమం. అందువలన ఒక రకంగా ముసుగులో గుద్దులాట అంటే బావుంటుంది కానీ అదీ సమంజసం కాదు. పచ్చి మోసం అంటే సుఖంగా ఉంటుందేమో అలోచించు. ఇంతసేపూ నీకు నేను అనవసర విషయం మీదనే వ్రాసినట్లున్నాను. ఇది అనవసరమని నాకూ తెలుసు. అసలీ ప్రపంచంలో అవసరమైంది ఏముంది కన్నతల్లీ? అన్నీ అవసరాలే! అనవసరాలనే అవసరాలుగా అంగీకరించి అనుభవించడానికి అలవాటు పడుతున్నాము. పుట్టడం కంటె అనవసరమైనది లేదు. అయినా అది మన చేతుల్లో వున్నదా! అని నువ్వు ప్రశ్నిస్తావు. నిజమేకాని – ఏది మన చేతుల్లో ఉంది. ఊరికే తెలియక కొందరు అమాయకులు అంతా మన చేతుల్లో ఉన్నదంటారు. మరికొందరు ఆకాశంలోని గ్రహాలకు ఈ అధికారం అంటకడుతున్నారు. ఆ గ్రహాలకు ఆ శక్తి ఎలా వచ్చిందంటే ఆగ్రహిస్తారు వారు. అన్నిటికీ అతీతమైన శక్తి ఒకటి ఉందని అంటే హేతువాదులు ఒప్పుకోరు. ఎప్పుడు హేతువాదం, విశ్వాసం కంటె బలీయమైందో అప్పుడే మానవుడు మోసంలో పడిపోయాడు. మోసగించుకొంటున్నాడు. మోసం చేస్తున్నాడు. మోసంలో పడుతున్నాడు. ఇందులో కొంత తెలిసి జరుగుతుంటే కొంత తెలీకుండా జరుపుతున్నాడు. తెలిసినా తెలియకపోయినా ముట్టుకుంటే నిప్పు కాలి తీరుతుంది. అందుచేత ఈ మోసాలకు ప్రాయశ్చిత్తం తప్పదు. అయితే తత్కాలంలో ఇవి వేధించకపోవచ్చు. కాని వీటి పరిణామ రూపమైన ప్రాయశ్చిత్తఫలాన్ని అనుభవించక తప్పదు – అని నేనన్నప్పుడు ‘‘ఈ జన్మలో హాయిగా పోతే చాలు, వచ్చే జన్మ అనేది ఉందో లేదో తెలియనప్పుడు అందులో అనుభవించడమనే అవస్థ ఎక్కడిది?’’ అని నవ్వి పారేశావు. నిజమే! పూర్వజన్మ, పునర్జన్మ, కర్మ అనేవి ప్రత్యక్షమయే విషయాలు కావు. కావు కాని ప్రత్యక్షాంశాలకు హేతువులు దొరకనప్పుడు పై వాటిని స్వీకరించడంలో దోషం కనిపించదు. ఉదాహరణకు నువ్వు బియ్యే చదివావు. నీలానే చదివిన వాళ్లెందరో ఉన్నారు. నీ కంటె గొప్పగా ప్యాసయిన వాళ్లలానే, తక్కువ మార్కులతో ఉత్తీర్ణులయిన వాళ్లూ ఉన్నారు. కానీ – ఈ క్రింది తరగతుల వాళ్లు నీ కంటె మంచి పదవుల్లో ఉండగా ప్రథమ శ్రేణివారు నిరుద్యోగులుగానూ కనిపిస్తున్నారు కదా. ఏమిటి దీనికి కారణం? ఆలోచించవు నువ్వు, అనవసరం అనుకుంటావు. అక్కడే విడుతున్నాం మనం. చిత్రం చూశావా! ఏది నేననవసరమనుకుంటానో అది అందరికీ అవసరంగా కనిపించినట్లే నువ్వ అవసరమనుకునేది మరి కొందరికి అనవసరమవుతుంది. ఇదంతా మన మనస్సుల మీద ఉన్నది. ఈ మనస్సు ఉన్నదే. ఇది బహు ప్రమాదకరమైనది. ప్రమోదానికి ఇదే మూలస్థానం. దీనినే శంకరుడు కోతితో పోల్చాడు. ఉత్త కోతి అన్నాడు మనస్సును. అప్పుడనిపిస్తుంది. మనిషి కోతి నుండి పుట్టాడంటే మనస్సనే కోతిని పెట్టుకు పుట్టాడా అని. నవ్వొస్తుంది నీకు – ఇందుకే కాదు అన్నింటికీ నవ్వడమే అలవాటు నీకు. అదే నీ అదృష్టమేమో జాతక చక్రంలో. ఇంతకూ ప్రపంచంలో... అసలేం వ్రాద్దామనుకున్నానో, ఏం వ్రాయమని నువ్వు అడిగావో అది వ్రాయడమే మరచిపోతున్నానని నువ్వు కాకపోతే నీ పక్కవాళ్లయినా భ్రమపడవచ్చు. అది ఎవరి దోషమూ కాదు. వ్రాసేదాన్ని పూర్తిగా అవగాహన చేసికొని ఆ అక్షర సముదాయం వల్ల ఏర్పడే శబ్దాలిచ్చే అర్థాలతో పాటు ఆ శబ్ద సముదాయం మరే అంశాన్నయినా ధ్వనిస్తున్నదా అని లోచించడం అవసరం అనుకుంటా. ఇలా అన్నందుకు చాలామందికి ఆగ్రహం వస్తుంది. అయినా అందరి ఆగ్రహానుగ్రహాలనూ లక్ష్యం చేస్తూ కూచుంటే మన జీవితాలు సాగవని నువ్వు అనేమాట నేనెరుగుదును. కానీ ఆగ్రహానుగ్రహాల విషయంలో గొప్ప పేచీ ఉంది. ఆ విషయం చాలాసార్లు వివరిద్దామనుకుంటూ మరచిపోతూనే ఉన్నాను. కొన్ని కొన్ని విషయాలు మరిచిపోగలిగితే ఎంత బావుండునూ అనుకుంటాము. కానీ – ఏవి మరచిపోదామనుకుంటామో అవి తరిమి తరిమి వేధిస్తూంటాయి. మనం స్వయంగా చేసిన తప్పులు విష ఫలితాలతో ఎదురయేటప్పుడు మరిచిపోదామనుకుంటాము కాని సాధ్యమా? కాదు, కాదని అటువంటి తప్పులు చేయకుండా ఉండగలమా? తప్పులు చేస్తూండడం, దిద్దుకోవడం... మానవ జీవితానికి నిర్వచనం. చేసిన తప్పులే చేస్తూండడం మేధావులమనుకొనేవారి లక్షణం. ఈ లక్షణానికి మంచి లక్ష్యం ఏమిటో తెలుసా? పెళ్లి – అనుకోలేదు నువ్వు.. ఇంత తొందరగా ఈ అంశంలోకి వస్తానని. నువ్వు ఏమీ అనుకోవు. ఉత్తర దక్షిణాన్ని గురించి ఆలోచనే లేదు నీకు. గతాన్ని స్మరించడమే కిట్టదు. వర్తమానాన్ని మింగుతూ ఉంటావు. ఈ తత్వం అలవరుచుకుంటే వచ్చేది కాదు. జన్మతః సిద్ధిస్తుంది. ఇది జీవితాంతం ఉంటే మంచిదే. కాని అలా భావించడం ఒక పగటి కల. అక్షరాలా పగటి కల. అంటే నీకు కోపం, బాధ, అసహ్యం లాంటివెన్నో కలగవచ్చు. కాని సత్యం సుమీ! అమ్మడూ నేను చెపుతూన్నది. అనాలోచితంగా మానవజాతి చేస్తూన్న పనులలో మొదటిది పెళ్లి. ఎంతో ఆలోచిస్తూ చేస్తూన్నాననుకుంటూ చేసేవాటిలో కూడా ఇదే మొదటిది – భూతభవిష్యద్వర్తమానాలను అనుశీలించి చేస్తున్నామనుకుంటారీ పని. వీరందరూ కూడా ఈ విషయం దగ్గరే భూతాన్ని స్మరించరు. భవిష్యత్తును ఊహించరు. నిజానికి వర్తమానాన్నే స్మరిస్తారు. నిజానికి వర్తమానమే శాశ్వతమై భూతభవిష్యత్తులు లేకపోయినట్లయితే ఎంతో బావుండుననుకుంటాము. నిజానికి గత స్మృతులతో వేగుతూ భవిష్యత్తుకు భయపడుతూ సుఖంగా వర్తమానాన్ని ధ్వంసం చేసుకునే వాళ్ల మీద మనకు సానుభూతి అవసరం లేదు. లేకపోయినా సానుభూతి మానవత్వ లక్షణ శ్రేణిలో మొదటిదని కదా అంటూంటావు. దాన్ని ఆశించనివారు లేరని నీ ఊహ. కాని సానుభూతిని చూపడం ప్రారంభించేవారు, జీవితాంతం దానితోనే ఉండాల్సి వచ్చేసరికి జీవితం విసుగెత్తిపోయి సానుభూతి చూపే వాళ్ల మీద అసహ్యం ఏర్పడుతుంది. దాంపత్యంలో ఉన్న చిక్కే ఇది. సానుభూతి – భర్త భార్య నుంచి తన పరిశ్రమకు సానుభూతిగా చిరునవ్వులు కోరవచ్చు. భార్య భర్త నుండి తన కుటుంబ పరిశ్రమకు సానుభూతిగా చీరలూ, నగలూ వాంఛించవచ్చు. ఈ సానుభూతి పరస్పరాపేక్షితం. అది లభించినట్లయితే వారు చిలకా గోరింకల్లా ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఇది ఒకే వైపు నుండి వస్తుంది. రెండవవారు సదా వాంఛించడమే కాని ప్రదర్శించరు. అప్పుడు అవతలివారు దాన్ని ఇస్తూన్నంత కాలం ఇబ్బంది లేదు. అంటే ఒకరెప్పుడూ ఒదిగి ఉండడమే. ఇందులో సుఖం ఉభయులకూ ఉందని నమ్మగలమా, ఉన్నట్టు నటిస్తారు. ఈ నటన చిరకాలం సాగదే. నటన నటనే. ఎప్పుడో ఈ నటన బయటపడుతుంది. అప్పుడు నరకమే కదా. మరో శ్రేణి ఉంది – వారు ఉభయులకూ ఒకరి మీద ఒకరికి సానుభూతి ఉండదు. పులీ – మేకా మొగుడూ పెళ్లాయినట్లుంటుంది సంసారం. ఇంతకూ – ఏది ఎలా జరుగుతున్నా ఒక పురుషుడూ – ఒక స్త్రీ కలిసిమెలసి ఉంటూన్నట్టు నటిస్తూ అయినా బ్రతకక తప్పనిసరి సామాజిక వ్యవస్థలో మనం బ్రతుకుతూ... ఇప్పుడు ఆ నిబంధనలు ముళ్ల కిరీటాలే అయినా ధరించక తప్పదు. (క్లిక్: నూట పాతికేళ్ళ యువకుడు) స్త్రీకి పురుషుడూ, పురుషునికి స్త్రీ ఆహార నిద్రాద్యవసరాలకే ఆవశ్యకం కాదు సుమా. ఈ అవసరాలకే పరిమితం చేసుకున్న భార్యభర్తలు గిల్లికజ్జాలు పెట్టుకుంటూ అయినా సంసారమే సాగిస్తారు. కాని అందుకు కాదుగా నువ్వడిగింది. జీవితంలో సాహచర్యం కోసం కదా! అటువంటప్పుడు నేనేం చెప్పగలను, అని తప్పుకోవడం నన్ను మోసగించుకోవడం అవుతుంది. ప్రయోజనరహితంగా ఈ మోసకారి జీవితాలు గడిపేవారిని నేనెరుగుదును. కానీ ఈ అల్ప విషయం కోసం అబద్ధమాడడం నాకిష్టం లేదు. కొందరితో అయినా యదార్థంగా ఉండడం మంచిది కనుక ఇంత వ్రాస్తున్నాను. ఈ సారి మరికొంత... – ఉషశ్రీ -
వాక్య చతురుడు
సందేశం చాలామంది దృష్టిలో హనుమంతుడు అంటే రామనామం చెవిన పడగానే ఆనంద బాష్పాలు విడిచే రామభక్తుడని మాత్రమే. అపార మైన బలానికి, శక్తి సామర్థ్యాలకు ఆయన ప్రతీక అని మాత్రమే. అయితే హనుమని గురించి తెలుసుకోవలసిన విషయాలెన్నో ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసినవాడు హనుమంతుడు. కిష్కింధకాండలో ప్రవేశిస్తాడు హనుమంతుడు. అక్కడ నుంచి కథ అంతా హనుమంతుని వెంట నడుస్తుంది. హనుమంతుడు వాక్య కోవిదుడు. ప్రభువు హితవు కోరే సచివునిగా సుగ్రీవునితో; తన ప్రభువుతో స్నేహం చేసేలా రామలక్ష్మణులతో, అపరిచిత ప్రాంతంలో కలిసిన స్వయంప్రభతో, సీతాన్వేషణ కార్యభారాన్ని స్వీకరిస్తూ వానరసేనతో, లంకానగర ప్రవేశాన్ని నిరోధించిన లంఖిణితో, ఆత్మహత్యకు సిద్ధమవుతున్న సీతాదేవితో, తనను ఎదిరించ వచ్చిన రాక్షసులతో, అశోక వన విధ్వంసానికి ఆగ్రహించిన రావణునితో, సీత క్షేమ సమాచారాన్ని అందిస్తూ – వానరులతోనూ, శ్రీరామునితోనూ... అడుగడుగునా హనుమంతుని మాట తీరు అందరికీ అనుసరణీయం. ఆయన మాటలలో ఒక్కటి కూడా అసంబద్ధంగా ఉండదు. విషయంతో సంబంధం లేని మాట కాని, సందిగ్ధం కాని, ఆపి ఆపి మాట్లాడటం కానీ ఉండదని, వాక్యచతురుడని స్వయంగా రాముడే మెచ్చుకున్నాడు. తాను నమ్మిన రాముడే తన బలం అనుకున్నాడు హనుమ. ప్రతి చిన్న విజయానికీ నా అంతటి వాడు లేడంటూ విర్రవీగుతారు అజ్ఞానులు. అహంకారం మనిషిని ఎదగనివ్వదు. వినయం ఉన్నతినిస్తుంది. వినయం అనేది వ్యక్తికీ వ్యక్తిత్వానికీ వన్నె తెచ్చే... పెట్టని అలంకారం. ఎన్ని ఘన విజయాలు సాధించినా వినయాన్ని వీడలేదు హనుమంతుడు. ఎటువంటి పరిస్థితులలోనూ నిగ్రహాన్ని కోల్పోవడం కానీ, ఆత్మవిశ్వాసాన్ని సడలడం కానీ లేదు. ఆయన నుంచి ఈ లక్షణాలను అలవరచుకోవడమే ఆయనకు చేసే పూజ. (ఉషశ్రీ ‘ఎవరితో ఎలా మాట్లాడాలి’ పుస్తకం నుంచి) -
శశిధర్, ఉషశ్రీలకు టైటిల్స్
ఏపీ వెటరన్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెటరన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శశిధర్, ఉషశ్రీలు విజేతలుగా నిలిచారు. అండర్-35 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను శశిధర్, మహిళల సింగిల్స్ ట్రోఫీని ఉషశ్రీ కైవసం చేసుకున్నారు. చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియంలో బుధవారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ ఆటగాడు శశిధర్ వాకోవర్‌తో మురళీకృష్ణ (వైజాగ్)పై గెలుపొందగా, ఉషశ్రీ (విజయనగరం) 21-19, 21-11తో సరిత ప్రియాల్ (వరంగల్)పై నెగ్గింది. అండర్-35 పురుషుల డబుల్స్ ఫైనల్లో కిషోర్ కుమార్ (హైదరాబాద్)-ఉదయ్ భాస్కర్ (వైజాగ్) జోడి 21-8, 21-19తో మురళీకృష్ణ (వైజాగ్)-మనోజ్ కుమార్ (మెదక్) ద్వయంపై విజయం సాధించగా, మహిళల ఫైనల్లో చంద్రకళ (ఖమ్మం)-సరిత ప్రియా (వరంగల్) ద్వయం 21-18, 21-19 సుబ్బలక్ష్మి-ఉషశ్రీ (విజయనగరం) జంటపై గెలుపొందింది. అండర్-45 పురుషుల సింగిల్స్ ఫైనల్లో లింగేశ్వర రావు (వైజాగ్) 21-17, 21-9తో వైజాగ్‌కే చెందిన నాయక్‌ను ఓడించగా, మహిళల సింగిల్స్‌లో గురుప్రీత్ సంధు 21-15, 21-16తో సావిత్రిపై గెలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో గురుప్రీతమ్ సింగ్-స్మిత (హైదరాబాద్) జోడి 21-16, 21-15తో అఫ్జల్ బేగం-సావిత్రి (ఖమ్మం) జంటపై నెగ్గింది. అండర్-45 మిక్స్డ్ డబుల్స్ తుదిపోరులో కమలాకర్-గురుప్రీత్ సంధు (హైదరాబాద్) జంట 21-9, 21-6తో లింగేశ్వర రావు-స్మిత జిందాల్ (వైజాగ్) ద్వయంపై గెలిచింది. అండర్-55 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రకాశ్ (హైదరాబాద్) చేజిక్కించుకోగా, డబుల్స్ టైటిల్‌ను రవీంద్రనాథ్ రెడ్డి-ప్రకాశ్ (హైదరాబాద్) జోడి గెలుచుకుంది.