వాక్య చతురుడు | Lord Hanuman knows how to talk, writes Usha sri | Sakshi
Sakshi News home page

వాక్య చతురుడు

Published Sat, Apr 8 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

Lord Hanuman knows how to talk, writes Usha sri

సందేశం
చాలామంది దృష్టిలో హనుమంతుడు అంటే రామనామం చెవిన పడగానే ఆనంద బాష్పాలు విడిచే రామభక్తుడని మాత్రమే. అపార మైన బలానికి, శక్తి సామర్థ్యాలకు ఆయన ప్రతీక అని మాత్రమే. అయితే హనుమని గురించి తెలుసుకోవలసిన విషయాలెన్నో ఉన్నాయి.

ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసినవాడు హనుమంతుడు.

కిష్కింధకాండలో ప్రవేశిస్తాడు హనుమంతుడు. అక్కడ నుంచి కథ అంతా హనుమంతుని వెంట నడుస్తుంది. హనుమంతుడు వాక్య కోవిదుడు. ప్రభువు హితవు కోరే సచివునిగా సుగ్రీవునితో; తన ప్రభువుతో స్నేహం చేసేలా రామలక్ష్మణులతో, అపరిచిత ప్రాంతంలో కలిసిన స్వయంప్రభతో, సీతాన్వేషణ కార్యభారాన్ని స్వీకరిస్తూ వానరసేనతో, లంకానగర ప్రవేశాన్ని నిరోధించిన లంఖిణితో, ఆత్మహత్యకు సిద్ధమవుతున్న సీతాదేవితో, తనను ఎదిరించ వచ్చిన రాక్షసులతో, అశోక వన విధ్వంసానికి ఆగ్రహించిన రావణునితో, సీత క్షేమ సమాచారాన్ని అందిస్తూ – వానరులతోనూ, శ్రీరామునితోనూ... అడుగడుగునా హనుమంతుని మాట తీరు అందరికీ అనుసరణీయం. ఆయన మాటలలో ఒక్కటి కూడా అసంబద్ధంగా ఉండదు. విషయంతో సంబంధం లేని మాట కాని, సందిగ్ధం కాని, ఆపి ఆపి మాట్లాడటం కానీ ఉండదని, వాక్యచతురుడని స్వయంగా రాముడే మెచ్చుకున్నాడు. తాను నమ్మిన రాముడే తన బలం అనుకున్నాడు హనుమ. ప్రతి చిన్న విజయానికీ నా అంతటి వాడు లేడంటూ విర్రవీగుతారు అజ్ఞానులు. అహంకారం మనిషిని ఎదగనివ్వదు. వినయం ఉన్నతినిస్తుంది. వినయం అనేది వ్యక్తికీ వ్యక్తిత్వానికీ వన్నె తెచ్చే... పెట్టని అలంకారం. ఎన్ని ఘన విజయాలు సాధించినా వినయాన్ని వీడలేదు హనుమంతుడు. ఎటువంటి పరిస్థితులలోనూ నిగ్రహాన్ని కోల్పోవడం కానీ, ఆత్మవిశ్వాసాన్ని సడలడం కానీ లేదు. ఆయన నుంచి ఈ లక్షణాలను అలవరచుకోవడమే ఆయనకు చేసే పూజ.
(ఉషశ్రీ ‘ఎవరితో ఎలా మాట్లాడాలి’  పుస్తకం నుంచి)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement