శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు యుగయుగాలుగా సేవలందిస్తూ వస్తున్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారంలో కూడా అవసరమైన వేళల్లో గరుత్మంతుడు శ్రీహరిని సేవించుకుంటూ ఉండేవాడు. గరుత్మంతుడు పుట్టుకతోనే అమిత బలశాలి. ‘అసలు ముల్లోకాలలోనూ నా ఎదుట నిలిచి, తనను యుద్ధంలో గెలవగల ధీరుడెవడున్నాడు? లోకపాలకుడైన శ్రీమన్నారాయణుడినే వీపుమీద మోస్తున్నవాడిని నన్ను మించిన వీరుడింకెవడున్నాడు’ అనుకుని గర్వించసాగాడు.గరుడుని ధోరణిని కొన్నాళ్లుగా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ఎలాగైనా, అతడికి గర్వభంగం చేయాలని తలచాడు.
ద్వారకలో సత్యా సమేతుడై సభలో కొలువుదీరిన శ్రీకృష్ణుడు ఒకసారి గరుత్మంతుడిని తలచుకున్నాడు. వెంటనే గరుత్మంతుడు కృష్ణుని ముందు వాలి, ‘ప్రభూ! ఏమి ఆజ్ఞ’ అంటూ మోకరిల్లాడు.‘వీరాధి వీరా! వైనతేయా! నీతో ముఖ్యమైన పని పడింది. అందుకే నిన్ను తలచుకున్నాను’ అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు కృష్ణుడు. ‘ఆజ్ఞ ఏమిటోసెలవివ్వు ప్రభూ’ అంటూ చేతులు జోడించాడు గరుత్మంతుడు.‘మరేమీ లేదు. గంధమాదన పర్వతం మీద కదళీవనంలో తపస్సు చేసుకుంటూ హనుమంతుడు ఉంటాడు. అతడితో ముఖ్యమైన విషయం మాట్లాడవలసి ఉంది. అతణ్ణి ఇక్కడకు తోడ్కొని రావాలి. ఈ పనికి నువ్వే తగిన సమర్థుడవు’ అన్నాడు కృష్ణుడు. కృష్ణుడి ఆదేశానికి గరుత్మంతుడు మనసులో నొచ్చుకున్నాడు.
‘నేనేమిటి? నా పరాక్రమమేమిటి? ఒక వానరాన్ని తోడ్కొని రావడానికి నేను స్వయంగా వెళ్లడమా?’ అనుకున్నాడు. అయినా ప్రభువు ఆజ్ఞ కదా, ఎలాగైనా నెరవేర్చవలసిందే అనుకుని తక్షణమే బయలుదేరాడు. మనోవేగంతో ఎగురుకుంటూ వెళ్లి, గంధమాదన పర్వతం మీద వాలాడు. అక్కడ హనుమంతుడు నిశ్చల ధ్యానమగ్నుడై కనిపించాడు. గరుత్మంతుడు హనుమంతుడిని పిలిచాడు. ధ్యానంలో ఉన్న హనుమంతుడికి అతడి పిలుపు వినిపించలేదు. ‘ఓ వానరశ్రేష్ఠా! మహాత్ముడైన భగవంతుడు శ్రీకృష్ణుడు నిన్ను పిలుస్తున్నాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ అనుల్లంఘనీయం. కనుక నిన్ను తీసుకుపోకుండా ఇక్కడి నుంచి కదలను’ అని బిగ్గరగా అన్నాడు. తదేక ధ్యానంలో ఉన్న హనుమంతుడు కదల్లేదు, మెదల్లేదు. గరుత్మంతుడికి కోపం వచ్చింది.
హనుమంతుడికి ధ్యానభంగం కలిగించైనా, తనతో తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. తన పొడవాటి ముక్కును హనుమంతుడి ముక్కు రంధ్రంలోకి పోనిచ్చాడు. గరుత్మంతుడి వికారచేష్టను గమనించి కూడా, హనుమంతుడు నిశ్చలంగా ఉన్నాడు. కాసేపటికి తన ధ్యానాన్ని విరమించుకుని, ప్రాణాయామం ప్రారంభించాడు. ముక్కు కుడి రంధ్రం నుంచి వాయువును విడిచి, ఎడమ రంధ్రం ద్వారా పీల్చుకోసాగాడు. హనుమంతుడి ప్రాణాయామ సాధన గరుత్మంతుడికి ప్రాణసంకటంగా మారింది. హనుమంతుడు గాలి విడిచేటప్పుడు ఎవరో బలంగా నెట్టేసినట్లు గరుత్మంతుడు దూరంగా వెళ్లి పడుతున్నాడు. హనుమంతుడు గాలి పీల్చుకునేటప్పుడు ఎవరో బలంగా లాగుతున్నట్లు హనుమంతుడి వైపు రాసాగాడు.
హనుమంతుడు ఊపిరి బిగించి వాయువును కుంభించేటప్పుడు అతడి ముక్కుకు అతుక్కుంటున్నాడు. ఈ ఉత్పాతానికి బిక్కచచ్చిన గరుడుడు వజవజ వణకసాగాడు. హనుమంతుడి ప్రాణాయామం పూర్తయ్యాక గరుత్మంతుడు విడుదలయ్యాడు. బతుకు జీవుడా అనుకుని తెప్పరిల్లాడు. కృష్ణాజ్ఞను ఉల్లంఘించినందుకు హనుమంతుడి మీద కోపం తెచ్చుకున్నాడు. దేహాన్ని పెంచి, ఆకాశాన్ని కమ్మేస్తూ హనుమంతుడిని తీసుకుపోయేందుకు అతని చుట్టూ ఎగురుతూ తిరగసాగాడు.గరుత్మంతుడిని పట్టుకునేందుకు హనుమంతుడు తన తోకను ఆకాశం వరకు పెంచాడు. అదేదో కొయ్య స్తంభం అనుకున్నాడు గరుత్మంతుడు. ఎగిరి ఎగిరి అలసిపోయి, కాసేపు ఈ స్తంభాన్ని ఆనుకుని సేదదీరాలనుకుని, హనుమద్వాలం మీద వాలాడు. తాను వాలినది స్తంభం కాదని, హనుమంతుడి తోక అని గ్రహించి, దానిని తన పదునైన ముక్కుతో పొడవడం ప్రారంభించాడు.
హనుమంతుడికి చిర్రెత్తింది. తన తోక రోమాల మధ్య గరుత్మంతుణ్ణి బంధించాడు. అంత బలశాలి అయిన గరుత్మంతుడు కూడా హనుమంతుడి తోక రోమాలలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరయ్యాడు. హనుమంతుడు తన తోకను గిరగిర తిప్పి, గరుత్మంతుణ్ణి ఒక్కసారిగా విసిరేశాడు. ఆ దెబ్బకు అవయవాలన్నీ చితికిన గరుత్మంతుడు ఏకంగా పాలసముద్రంలో పడ్డాడు. కాసేపు అక్కడే సేదదీరాడు. తిరిగి శక్తి కూడదీసుకుని, ద్వారక చేరుకుని శ్రీకృష్ణుడి ముందు వాలాడు. తన ముందు దీనంగా నిలుచుకున్న గరుత్మంతుణ్ణి చూసిన కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘ఖగేంద్రా! అలా నిర్విణ్ణుడవై నీరసంగా నిలుచున్నావేమిటి? ఏం జరిగింది? చెప్పు’ అన్నాడు.
‘దేవదేవా! జగన్నాటక సూత్రధారీ! మీ ఆజ్ఞ నెరవేర్చడానికి హనుమంతుడి వద్దకు వెళ్లాను. అతడు నా మాట వినలేదు’ అని గరుత్మంతుడు చెబుతుండగానే శ్రీకృష్ణుడు అడ్డు తగిలాడు.‘ఛీ! ఏమిటీ ఆలస్యం? అతడితో నాకు ముఖ్యమైన పని ఉంది. వెంటనే తీసుకురా’ అన్నాడు.‘స్వామీ! నా బలగర్వం అణిగింది. వానరరూపంలో నా మృత్యువే అక్కడ ఉంది. హనుమంతుడు ఉండే చోటుకు తప్ప ఇంకెక్కడికి పంపినా వెళతాను’ అన్నాడు గరుత్మంతుడు.‘ఈసారి అలా జరగదు. రామనామం జపిస్తూ వెళ్లు. నీ సీతారాముడు నిన్ను పిలుస్తున్నాడని చెప్పు. హనుమ నీతో మారు మాటాడకుండా వస్తాడు’ అని చెప్పాడు శ్రీకృష్ణుడు. గరుత్మంతుడు ఈసారి వినయంగా వెళ్లి, శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారమే చెప్పి హనుమంతుడిని తనతో తోడ్కొని వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment