హనుమాన్‌ను కేవలం దైవంగానే కాదు.. పిల్లల దృష్టిలో సూపర్ హీరోగానూ వెండి తెర ఆవిష్కరించింది. ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న జై హనుమాన్ చిత్రంలో కన్నడ నటుడు, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్‌గా కనిపించబోతున్నట్లు మేకర్స్ లుక్ రివీల్ చేశారు. అయితే..
గతంలోనూ కొందరు నటులు వెండి తెరపై హనుమంతుడి అవతారంలో ఆడియొన్స్‌ను మెప్పించే ప్రయత్నమూ చేశారు. వాళ్లెవరంటే..
దేవ్‌దత్తా నాగే
ఆదిపురుష్(2023).. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.. రెబల్ స్టార్ ప్రభాస్‌ను రాముడి(రాఘవ)గా చూపించిన ప్రయత్నం. అయితే ఆకట్టుకోని విజువల్స్, పైగా కంటెంట్ విషయంలోనూ ఆ చిత్రం తీవ్ర విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. ఈ చిత్రంలో మరాఠీ నటుడు దేవ్‌దత్తా నాగే.. హనుమంతుడి(భజరంగ్) పాత్రలో నటించాడు. కానీ, ఆ క్యారెక్టర్ కూడా ఇంటర్నెట్‌లో నవ్వులపాలవ్వడంతో ఆయన కష్టం వృథా అయ్యింది.
ఏ. జనార్ధన రావు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆంజనేయస్వామి పాత్రలకు రిఫరెన్స్‌గా ఈయన్ని చూపిస్తుంటారు. ఏకంగా 20 చిత్రాల్లో ఆ పాత్రలో నటించారాయన. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన జనార్ధన రావు.. 1955లో మిస్టర్ ఇండియా టైటిల్ దక్కించుకున్నారు. కమలాకర కామేశ్వర రావు తీసిన వీరాంజనేయ (1968)చిత్రంలో తొలిసారి ఆయన హనుమాన్ పాత్రలో నటించారు. అయితే తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించారు.
ఆ ప్రభావంతో దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు హనుమంతుడి పాత్రల విషయంలో ఆయనకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు దర్శకనిర్మాతలు. అలా.. శ్రీ రామాంజనేయ యుద్ధం, సంపూర్ణ రామాయణం, శ్రీ కృష్ణ సత్య, ఎన్టీఆర్ సూపర్‌మేన్.. చిత్రాలు ఈనాటికి ఆయన హనుమంతుడి రూపాన్ని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాయి.
రాజనాల
తెలుగు విలన్లలో అగ్రతాంబూలం అందుకున్న తొలి నటుడు.. బహుశా ఇంటి పేరునే స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్న తొలి నటుడు కూడా ఈయనేనేమో!(రాజనాల కాళేశ్వర రావు). అయితే 1400కి పైగా అన్ని రకాల జానర్ చిత్రాల్లో నటించిన రాజనాల.. హనుమాన్‌గా కనిపించిన ఒకే ఒక్క చిత్రం ‘శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం’(1972). కానీ, ఆ పాత్రలో మరిచిపోలేని అభినయం కనబర్చారాయన.
దారా సింగ్
మల్లు యోధుడిగానే కాదు.. ఇటు నటుడిగా, దర్శకుడిగా.. అటు రాజకీయాల్లోనూ రాణించారీయన. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో ఏళ్ల తరబడి రాణించిన దారా సింగ్.. ఆ తర్వాత సినీ రంగం వైపు అడుగులేశారు. భజరంగబలి(1976) చిత్రంలో తొలిసారి హనుమాన్‌గా అలరించి.. ఆ తర్వాత రామానంద సాగర్ ‘రామాయణ్’లో హనుమాన్ క్యారెక్టర్‌లో జీవించి.. భారతీయ బుల్లితెర చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారాయాన.
చిరంజీవి
ఆంజనేయ స్వామికి కొణిదెల శివశంకర్ వరప్రసాద్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అప్పటికే అగ్రతారగా వెలుగొందుతున్న టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఓ ఫైట్ పోర్షన్‌లో హనుమాన్‌గా అలరించారాయన. అంతేకాదు.. హనుమాన్(2005) యానిమేటెడ్ చిత్రంలో ఆ పాత్రకు తెలుగు వెర్షన్‌లో వాయిస్ ఓవర్ కూడా అందించారు.
నిర్భయ్ వాద్వా
తెలుగులో జనార్ధన రావుకు ఎలాగైతే హనుమాన్ క్యారెక్టర్లు గుర్తింపు తెచ్చి పెట్టాయో.. హిందీ టీవీ సీరియల్స్‌లో ఈ యువ నటుడికి అదే విధంగా ఆ పాత్ర మంచి గుర్తింపు ఇచ్చింది. సంకట మోచన్ మహాబలి హనుమాన్(2015-17)లో తొలిసారి హనుమంతుడి పాత్రలో నటించిన నిర్భయ్‌కు.. ఆ తర్వాత మరో రెండు సీరియల్స్‌లోనూ ఆ రోల్ దక్కింది. ఈ ఏడాది ప్రారంభమైన శ్రీమద్ రామాయణ్‌లోనూ ఆయన హనుమాన్ రోల్‌లోనే నటిస్తున్నారు.
ప్రశాంత్ శెట్టి
ప్రశాంత్ శెట్టి.. ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవచ్చు. రిషబ్ శెట్టిగా అప్పటిదాకా కన్నడ ఆడియొన్స్‌ను మాత్రమే అలరిస్తూ వచ్చిన ఈ మల్టీ టాలెంట్ పర్సన్(నటుడు, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్).. కాంతారతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకట్టుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో కాంతారను తీసి.. జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులనూ దక్కించుకున్నాడు. బహుశా ఆ గుర్తింపే ఆయనకు జై హనుమాన్‌లో హనుమాన్ క్యారెక్టర్ దక్కడానికి ఓ కారణం అయ్యి ఉండొచ్చు కూడా!.
ಕನ್ನಡ ನೆಲದ ವರಸುತ ಆಂಜನೇಯನ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ಭಾರತ ಇತಿಹಾಸದ ಸರ್ವಶ್ರೇಷ್ಠ ಭಾವವೊಂದನ್ನು ತೆರೆಯ ಮೇಲೆ ತರಲಿದ್ದೇವೆ.
ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿ ಬೆಂಬಲ ಆಶೀರ್ವಾದ ಎಂದಿನಂತೆ ಸದಾ ಇರಲಿ - ಜೈ ಹನುಮಾನ್
A vow from the Tretayuga, bound to be fulfilled in the Kaliyuga🙏
We bring forth an epic of loyalty, courage and… pic.twitter.com/Zvgnt1tGnl— Rishab Shetty (@shetty_rishab) October 30, 2024
ఇంకా ఎవరైనా నటీనటులను మరిచిపోయి ఉంటే.. వాళ్లు ఏ భాషకు చెందిన వాళ్లైనా సరే కామెంట్ సెక్షన్‌లో వాళ్ల పేర్లను మీరు తెలియజేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment