చెల్లెలి పాత్రల్లో స్టార్‌ హీరోయిన్స్‌.. | Top Heroines Turned Into Sisters For Popular Heroes | Sakshi
Sakshi News home page

Heroines Sister Characters: సిస్టర్‌ క్యారెక్టర్స్‌లో స్టార్‌ హీరోయిన్స్‌..

Published Tue, May 24 2022 7:37 AM | Last Updated on Tue, May 24 2022 8:42 AM

Top Heroines Turned Into Sisters For Popular Heroes - Sakshi

తెలుగు తెరపై అన్నా-చెల్లెలి అనుబంధం అంటే ముందు గుర్తొచ్చే సినిమా ‘రక్త సంబంధం’. హీరో–హీరోయిన్‌గా  హిట్‌ పెయిర్‌ అనిపించుకున్న ఎన్టీఆర్‌–సావిత్రి అన్నా–చెల్లెలిగానూ ఆ సినిమాలో మెప్పించారు. కథానాయికగా సావిత్రి మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు రిస్క్‌ అనుకోకుండా ‘సిస్టర్‌’ క్యారెక్టర్‌ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ తరంలో హీరోయిన్లుగా మంచి ఫామ్‌లో ఉన్న నయనతార, పూజా హెగ్డే, కీర్తీ సురేశ్‌ కూడా చెల్లెలి పాత్ర చేయడానికి వెనక్కి తగ్గడంలేదు. ఈ చెల్లెళ్లుగా మెరవనున్న స్టార్‌ హీరోయిన్స్‌, చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.  

‘సైరా’లో భార్య.. ‘గాడ్‌ ఫాదర్‌’లో చెల్లెలు


ఒకవైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు మరోవైపు రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తూ నయనతార బిజీ బిజీగా ఉన్నారు. ఒక హిందీ, ఒక మలయాళం, రెండు తమిళ చిత్రాలు, తెలుగులో చేస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’తో కలుపుకుని ఐదు చిత్రాలతో బిజీగా ఉన్నారు నయన. మిగతా చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తుండగా చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’లో కీలక పాత్ర చేస్తున్నారామె. మలయాళ సినిమా ‘లూసిఫర్‌’కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. మలయాళంలో హీరో మోహన్‌లాల్‌ చెల్లెలి పాత్రలో మంజు వారియర్‌ కనిపించారు. కథ ప్రకారం హీరోకి జోడీ ఉండదు. తెలుగులోనూ చిరంజీవికి జోడీ ఉండదని చెప్పొచ్చు. 

అందుకే నయనతార చేస్తున్నది చిరంజీవి చెల్లెలి పాత్ర అనే ఊహాగానాలు ఉన్నాయి. నయనతారది కీలక పాత్ర అని పేర్కొన్న చిత్రబృందం ఆమెది చెల్లెలి పాత్ర అని మాత్రం స్పష్టం చేయలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చిరు  సిస్టర్‌ పాత్రనే ఆమె చేస్తున్నారని తెలిసింది. ‘సైరా’లో చిరంజీవి భార్యగా నయనతార నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘గాడ్‌ ఫాదర్‌’లో అన్నాచెల్లెళ్లుగా ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ప్రేక్షకులకు తప్పకుండా ఉంటుంది. మోహన్‌ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 

సిస్టర్‌ ఆఫ్‌ బోళా శంకర్‌ 


కీర్తీ సురేశ్‌ మహానటి.. అందులో డౌటే లేదు. ‘మహానటి’ చిత్రం ఆ విషయాన్ని నిరూపించింది. ఇటు తెలుగు అటు తమిళ, మలయాళంలో లేడీ ఓరియంటెడ్, రెగ్యులర్‌ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తున్న కీర్తీ సురేష్‌ తొలిసారి చెల్లెలి పాత్రలో కనిపించిన చిత్రం ‘పెద్దన్న’. ఇందులో రజనీకాంత్‌ చెల్లెలిగా కనిపించారామె. ఇప్పుడు ‘బోళా శంకర్‌’లో చిరంజీవి చెల్లెలి పాత్ర చేస్తున్నారు. ఇలా వరుసగా చెల్లెలి పాత్రలు చేస్తే అలాంటివే వచ్చే అవకాశం లేకపోలేదు కదా? అని కీర్తీ సురేశ్‌తో అంటే.. ‘వచ్చే అవకాశాల గురించి ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి క్యారెక్టర్లు వదులుకోవాలనుకోను. అటు రజనీ సార్, ఇటు చిరంజీవి సార్‌ ఇద్దరి సినిమాల్లో చాన్స్‌ అంటే చిన్న విషయం కాదు కదా’ అన్నారు కీర్తి. గత ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘బోళా శంకర్‌’లో చిరంజీవికి కీర్తి సురేశ్‌ రాఖీ కడుతున్న ఫొటో విడుదలైంది. ఆ ఫొటోలో ఈ అన్నాచెల్లెళ్ల కెమెస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రానికి మెహర్‌ రమేష్‌ దర్శకుడు. 

వెంకటేశ్‌ చెల్లెలు? 


గ్లామరస్‌ స్టార్‌ పూజా హెగ్డే ఒకవైపు మంచి మసాలా సినిమాల్లో హీరోయిన్‌గా చేయడంతో పాటు స్పెషల్‌ సాంగ్స్‌ కూడా చేస్తున్నారు. ‘గని’ చిత్రంలో కనిపించినట్లు హోమ్లీ క్యారెక్టర్స్‌ కూడా చేస్తుంటారు. తాజాగా ఆమెకు చెల్లెలి పాత్రకు అవకాశం వచ్చిందని సమాచారం. అయితే అది హిందీ సినిమా. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా రూపొందుతున్న ‘కబీ ఈద్‌ కబీ దీవాలి’ చిత్రంలో ఈ కండలవీరుడి సరసన కథానాయికగా నటిస్తున్నారు పూజా హెగ్డే. ఇందులో వెంకటేశ్‌ కీలక పాత్ర చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. వెంకీ చెల్లెలిగా పూజా కనిపిస్తారట. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఫర్హాద్‌ సామ్జీ దర్శకుడు.

చదవండి: జాకీతో ప్రేమ.. అది నాకిష్టం లేదు: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
నా సినిమాకు నాకే టికెట్లు దొరకలేదు: యంగ్‌ హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement