మేరుపర్వతానికి దక్షిణ దిశలో పది యోజనాల విస్తీర్ణం గల ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామ ప్రజలు ధార్మికులు. ఎవరి వృత్తులు వారు చేసుకుంటూ, పరస్పర సహకార ధోరణితో ప్రశాంతంగా జీవనం సాగించేవారు. ఆ గ్రామం జలసమృద్ధితో తులతూగేది. పొలాలు నిత్యహరితంగా అలరారేవి. గ్రామం శివార్లలోని వనాలలో ఫలవృక్షాలు పుష్కలంగా ఉండేవి. గోవృషభాది పశుసంపదకు లోటు లేకుండా ఉండేది. వీటన్నింటి వల్ల గ్రామం సుభిక్షంగా ఉండేది.
ప్రజలు తీరికవేళల్లో భగవన్నామ సంకీర్తనతో కాలక్షేపం చేసేవారు. పర్వదినాలలో ఊరుమ్మడిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజపురస్కారాలను నిర్వహించేవారు. రావణ వధానంతరం రాముడు పట్టాభిషిక్తుడై అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగిస్తున్న రోజులవి. హనుమంతుడు రాముని కొలువులో ఉండేవాడు. నిత్యం సీతారాములను సేవించుకుంటూ తన ఆరాధ్య దైవమైన రాముని సమక్షంలోనే ఉండేవాడు.
సుగ్రీవునితో మైత్రిని కలపడం సహా లంకలో బంధితురాలైన సీత జాడ కనుగొనడం మొదలుకొని యుద్ధంలో ఘనవిజయం వరకు రామునికి హనుమ చేసిన ఉపకారాలు అన్నీ ఇన్నీ కావు. తనకు ఇన్ని ఉపకారాలు చేసిన హనుమకు ప్రత్యుపకారం ఏదైనా చేయాలని తలచాడు రాముడు. ఒకనాడు హనుమను పిలిచాడు. ‘హనుమా! నువ్వు మాకెన్నో ఉపకారాలు చేశావు. నీ ఉపకారాలను మరువజాలను. నీకేదైనా వరమివ్వాలని ఉంది. నీకిష్టమైనదేదో కోరుకో, తప్పక ఇస్తాను’ అన్నాడు.
‘శ్రీరామా! నువ్వు పురుషోత్తముడవు, పరమపురుషుడవు. నీ సేవకు మించిన భాగ్యం ఇంకేదీ లేదు. నిత్యం నీ సన్నిధిలో నిన్ను సేవించుకుంటూ ఉండటమే నాకు పరమభాగ్యం’ అని బదులిచ్చాడు హనుమ. ‘అది కాదు గాని, నీకు ఒక గ్రామాన్ని బహూకరిస్తున్నాను. మేరుపర్వతానికి దక్షిణదిశలో సుఖశాంతులతో అలరారుతున్న ఆ గ్రామం ఇక నీదే! నా వరంగా ఆ గ్రామాన్ని స్వీకరించు. ఆ గ్రామానికి హనుమత్పురమని నామకరణం చేస్తున్నాను.
నువ్వు అక్కడకు వెళ్లి, గ్రామ ప్రజల యోగక్షేమాలను గమనిస్తూ ఉండు. ఇకపై అక్కడి ప్రజలు హనుమద్భక్తులై విలసిల్లుతారు. ముల్లోకాలలో నీ పేరు ప్రతిష్ఠలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి’ అన్నాడు రాముడు. రాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు ఆ గ్రామానికి చేరుకున్నాడు. రాముడి ఆదేశం మేరకు హనుమంతుడు ఆ గ్రామానికి అధిపతి. అయితే, హనుమంతుడికి ఆధిపత్య కాంక్ష లేదు.
ఆ ఊరి ప్రజలంతా శాంతికాముకులు, ధార్మికులు, భగవత్ చింతనా తత్పరులు. హనుమంతుడు ఆ గ్రామంలోని బ్రాహ్మణులందరినీ పిలిచి సమావేశపరచాడు. ‘మీరిక్కడ ఎన్నాళ్లుగానో ఉంటున్నారు. ఇకపై కూడా మీరంతా మీ మీ కుటుంబాలతో ఇక్కడే ఉంటూ సత్కార్యాలతో కాలక్షేపం చేస్తూ ఉండండి’ అని చెప్పి, రాముడు తనకు ఇచ్చిన ఆ గ్రామాన్ని అక్కడి ప్రజలకే దానమిచ్చేశాడు. అక్కడి నుంచి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు.
గ్రామ ప్రజలందరూ హనుమంతుడి ఔదార్యానికి ఆనందభరితులయ్యారు. కృతజ్ఞతగా గ్రామంలో అడుగడుగునా హనుమంతునికి మందిరాలను నిర్మించుకున్నారు. గ్రామస్థుల కృషి, ధార్మిక వర్తనల కారణంగా గ్రామం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లసాగింది. ఆ గ్రామ పరిసరాల్లోని అడవిలో దుర్ముఖుడనే రాక్షసుడు ఉండేవాడు. హనుమత్పురం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతుండటం చూసి అతడికి కన్ను కుట్టింది. సుభిక్షమైన ఆ గ్రామాన్ని కైవసం చేసుకోవాలనుకున్నాడు.
ఒకనాడు అకస్మాత్తుగా తన రాక్షసదండుతో గ్రామం మీదకు దండెత్తాడు. ‘ఈ గ్రామం నాది. మీరిక్కడ ఉండటానికి వీల్లేదు. వెంటనే గ్రామాన్ని వదిలి వెళ్లిపోండి’ అని గ్రామస్థులను హెచ్చరించాడు. రాక్షసదండును చూడటంతోనే గ్రామస్థులు భయపడ్డారు. దుర్ముఖుడు చేసిన హెచ్చరికతో వారు మరింతగా భీతిల్లారు. ఊరు విడిచి వెళ్లిపోవడానికి రెండురోజులు గడువివ్వమని గ్రామస్థులు దుర్ముఖుడిని వేడుకున్నారు. అతడు అందుకు సమ్మతించి అప్పటికి వెనుదిరిగాడు.
దిక్కుతోచని గ్రామస్థులు హనుమంతుని మందిరాల్లో పూజలు చేస్తూ, తమను రక్షించమంటూ ప్రార్థనలు చేశారు. రెండోరోజు రాత్రి ఒక బ్రాహ్మణుడికి కలలో హనుమంతుడు కనిపించాడు. ‘ఈ భూమి ఎవరి రాజ్యమూ కాదు. మాంధాత వంటి చక్రవర్తులు ఈ భూమిని ఏలారు. వారెవరైనా తమ సామ్రాజ్యాలను తమతో పాటే తీసుకుపోయారా? మీ గ్రామంలోనే మీరు ఉండండి. ఇదే మాట దుర్ముఖుడితో చెప్పండి’ అని పలికి, దుర్ముఖుడి రాక్షససేన విడిచి చేసిన వైపుగా బయలుదేరాడు.
మరునాటి ఉదయమే దుర్ముఖుడి సేనాని అతడి వద్దకు పరుగు పరుగున చేరుకున్నాడు. ‘నాయకా! తాటిచెట్టంత మహాకాయుడొకడు గ్రామానికి కావలి కాస్తున్నాడు. రాత్రివేళ మన సేన విడిచి చేసిన గుడారాల చుట్టూ తిరిగి కొండ మీదకు చేరుకున్నాడు. కొండ మీద కూర్చుని, బండరాళ్లను బంతుల్లా చేసి ఆడుకుంటున్నాడు. అతణ్ణి చూస్తేనే భయం వేస్తోంది. అతడు బండరాళ్లను మన దండు మీద విసిరితే అంతా నుజ్జు నుజ్జయిపోతాం’ అని చెప్పాడు.
దుర్ముఖుడికి పరిస్థితి అర్థమైంది. తెగిస్తే ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించాడు. వెంటనే గ్రామానికి చేరుకుని, ‘గ్రామస్థులారా! మీరంతా సద్వర్తనులు. ఇక్కడ మీరు యథాప్రకారం ఉండండి’ అని చెప్పి వెనుదిరిగాడు. -సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment