పూర్వం అవంతీపురంలో రామగుప్తుడు, ధనగుప్తుడు అనే వర్తకులు ఉండేవారు. వ్యాపార నిమిత్తం డబ్బులు అవసరమై ధనగుప్తుడు రామగుప్తుని దగ్గరకు వెళ్ళి వెయ్యి వరహాలు అప్పుగా ఇవ్వమని అడిగాడు. తోటి వర్తకుని మాట కాదనలేక రామగుప్తుడు వెయ్యి వరహాలు ధనగుప్తుడికి అప్పుగా ఇచ్చాడు. చాలాకాలం గడిచింది. అయినా ధనగుప్తుడు రామగుప్తునికి ఇవ్వవలసిన డబ్బులు తిరిగి ఇవ్వలేదు.
ఇక లాభం లేదు అనుకుని రామగుప్తుడు స్వయంగా ధనగుప్తుడిని కలసి తాను ఇచ్చిన వెయ్యి వరహాలు ఇవ్వమని అడిగాడు. రేపు, మాపు అంటూ మాట దాటవేశాడు తప్ప అప్పు తీర్చలేదు ధనగుప్తుడు. అటు తర్వాత ధనగుప్తుడు ఆ ప్రాంతంలో కనిపించనేలేదు. చేసేదేమీ లేక బాధపడ్డాడు రామగుప్తుడు.
ఓసారి వ్యాపార నిమిత్తం చంద్రగిరికి వెళ్ళాడు రామగుప్తుడు. పనులన్నీ ముగించుకుని పూటకూళ్లవ్వ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ తారసపడ్డాడు ధనగుప్తుడు. వెతకబోయిన తీగ కాళ్ళకి తగినట్లు సంబరపడ్డాడు రామగుప్తుడు. ‘మిత్రమా బాగున్నావా?’ అని పలకరించాడు. రామగుప్తుణ్ణి చూడగానే గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది ధనగుప్తుడికి. ‘ఏం బాగు? వ్యాపారం దివాళా తీసింది. దేశ దిమ్మరిలా తిరుగుతున్నాను’ అన్నాడు.
‘నీ మాటలు నేను నమ్మను. ఇప్పటికే చాలా కాలమైంది. నా వెయ్యి వరహాలు ఇస్తావా? ఇవ్వవా? స్నేహితుడివని వడ్డీ కూడా అడగలేదు. అసలు కూడా ఇవ్వకపోతివి’ అని గట్టిగా నిలదీశాడు రామగుప్తుడు. ‘ఏంటి మీ గొడవ?’ అంటూ పూటకూళ్ళవ్వ అడిగింది. జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు రామగుప్తుడు. ‘సరే! ఏదో పని మీద మా మంత్రి గారు ఈ ఊరు వచ్చారు. మీరిద్దరూ మంత్రి సులోచనుడి దగ్గరికి వెళ్ళండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది’ అని సలహా ఇచ్చింది పూటకూళ్ళవ్వ. సరేనని ఇద్దరూ మంత్రి సులోచనుడి వద్దకు వెళ్ళారు.
‘అయ్యా మా ఇద్దరిదీ అవంతీపురం. చాలా కాలం క్రితం వ్యాపార నిమిత్తం నా దగ్గర వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నాడు ఈ ధనగుప్తుడు. నా అప్పు తీర్చమంటే తీర్చడం లేదు’ అని ఫిర్యాదు చేశాడు రామగుప్తుడు. ‘అదంతా వట్టి అబద్ధం. నేను ఇతని వద్ద అప్పు తీసుకోలేదు. తీసుకుంటే వడ్డీ ఎంత? పత్రం ఏదీ?’ అని బుకాయించాడు ధనగుప్తుడు.
మంత్రి సులోచనుడు కాసేపు ఆలోచించి.. ‘రామగుప్తా నువ్వు అప్పు ఇచ్చినట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా?’ అడిగాడు. ‘నా దగ్గర ఏ ఆధారాలు లేవు’ అని జవాబిచ్చాడు రామగుప్తుడు. ‘ఆధారాలు లేనప్పుడు ఎలా శిక్షించగలను? నువ్వు అప్పు ఇవ్వడం నిజమే అయినా నీ సొమ్ము ఎలా ఇప్పించగలను?’ అన్నాడు మంత్రి. చేసేదేమీ లేక దిగాలుగా రామగుప్తుడు, ‘నన్నేమీ చేయలేవు’ అనే అహంభావంతో ధనగుప్తుడు పూటకూళ్లవ్వ ఇంటికి చేరుకున్నారు.
రాత్రి భోజనాలయ్యాయి. అందరూ కబుర్లు చెప్పుకుని హాయిగా పడుకున్నారు. రెండో ఝాము అయ్యింది. ‘ధడేల్’మని చప్పుడు అయ్యింది. భయపడుతూ అందరూ ఒక్కసారి నిద్రలేచారు. ఏమయ్యిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ‘ఎవ్వరైనా కదిలారో చంపేస్తా’ అన్న మాటలు గట్టిగా వినిపించాయి. లాంతరు వెలుగులో అతని ఆకారాన్ని బట్టి గజదొంగ అని గుర్తించి భయం భయంగా కూర్చున్నారు అందరూ.
ఆ గజదొంగ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ‘మీ దగ్గర ఉన్న డబ్బు, బంగారం మాట్లాడకుండా ఇచ్చేయండి లేదా పీక కోస్తా’ అని బెదిరించాడు. ‘బతికుంటే బలుసాకైనా తినవచ్చు’ అనుకుని ఒంటి మీద ఉన్న బంగారం, సంచిలో ఉన్న డబ్బులు ఒక్కొక్కరుగా ఇవ్వసాగారు. ఇది గమనించిన ధనగుప్తుడు.. తన దగ్గర ఉన్న వెయ్యి వరహాల సంచిని రామగుప్తుడి చేతిలో పెట్టి ‘నీ అప్పు తీరిపోయింది.. తీసుకో’ అన్నాడు.
ఇప్పుడు తీసుకుంటే దొంగ పాలు అవుతుందని గ్రహించిన రామగుప్తుడు ఆ వరహాలను తీసుకోలేదు. ఆ గజదొంగ నేరుగా ధనగుప్తుడి దగ్గరికి వచ్చి ‘నీ దగ్గర ఉన్న డబ్బులు, బంగారం బయటకి తియ్’ అని గద్దించాడు. ‘ఈ వెయ్యి వరహాలు ఇతనికి అప్పు తీర్చవలసినవి. నా దగ్గర మరేమీ లేవు’ అన్నాడు ధనగుప్తుడు వణుకుతూ. ‘అయితే నీకు ఏ శిక్ష వెయ్యాలో నువ్వే చెప్పు’ అన్నాడు గజదొంగ.
గజదొంగ వేషంలో ఉన్నది సులోచనుడని గ్రహించి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు ధనగుప్తుడు. ‘ఆధారం లేకపోతే అన్యాయం చేస్తావా? నీతిగా బతకడం నేర్చుకో’ అని మందలించి విడిచిపెట్టాడు సులోచనుడు. తన తప్పును మన్నించమని రామగుప్తుణ్ణి కోరాడు ధనగుప్తుడు. -కాశీ విశ్వనాథం పట్రాయుడు
Comments
Please login to add a commentAdd a comment