Sunday Child Stories
-
పిల్లల కథ: దొంగ చెప్పిన తీర్పు!
పూర్వం అవంతీపురంలో రామగుప్తుడు, ధనగుప్తుడు అనే వర్తకులు ఉండేవారు. వ్యాపార నిమిత్తం డబ్బులు అవసరమై ధనగుప్తుడు రామగుప్తుని దగ్గరకు వెళ్ళి వెయ్యి వరహాలు అప్పుగా ఇవ్వమని అడిగాడు. తోటి వర్తకుని మాట కాదనలేక రామగుప్తుడు వెయ్యి వరహాలు ధనగుప్తుడికి అప్పుగా ఇచ్చాడు. చాలాకాలం గడిచింది. అయినా ధనగుప్తుడు రామగుప్తునికి ఇవ్వవలసిన డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఇక లాభం లేదు అనుకుని రామగుప్తుడు స్వయంగా ధనగుప్తుడిని కలసి తాను ఇచ్చిన వెయ్యి వరహాలు ఇవ్వమని అడిగాడు. రేపు, మాపు అంటూ మాట దాటవేశాడు తప్ప అప్పు తీర్చలేదు ధనగుప్తుడు. అటు తర్వాత ధనగుప్తుడు ఆ ప్రాంతంలో కనిపించనేలేదు. చేసేదేమీ లేక బాధపడ్డాడు రామగుప్తుడు. ఓసారి వ్యాపార నిమిత్తం చంద్రగిరికి వెళ్ళాడు రామగుప్తుడు. పనులన్నీ ముగించుకుని పూటకూళ్లవ్వ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ తారసపడ్డాడు ధనగుప్తుడు. వెతకబోయిన తీగ కాళ్ళకి తగినట్లు సంబరపడ్డాడు రామగుప్తుడు. ‘మిత్రమా బాగున్నావా?’ అని పలకరించాడు. రామగుప్తుణ్ణి చూడగానే గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది ధనగుప్తుడికి. ‘ఏం బాగు? వ్యాపారం దివాళా తీసింది. దేశ దిమ్మరిలా తిరుగుతున్నాను’ అన్నాడు. ‘నీ మాటలు నేను నమ్మను. ఇప్పటికే చాలా కాలమైంది. నా వెయ్యి వరహాలు ఇస్తావా? ఇవ్వవా? స్నేహితుడివని వడ్డీ కూడా అడగలేదు. అసలు కూడా ఇవ్వకపోతివి’ అని గట్టిగా నిలదీశాడు రామగుప్తుడు. ‘ఏంటి మీ గొడవ?’ అంటూ పూటకూళ్ళవ్వ అడిగింది. జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు రామగుప్తుడు. ‘సరే! ఏదో పని మీద మా మంత్రి గారు ఈ ఊరు వచ్చారు. మీరిద్దరూ మంత్రి సులోచనుడి దగ్గరికి వెళ్ళండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది’ అని సలహా ఇచ్చింది పూటకూళ్ళవ్వ. సరేనని ఇద్దరూ మంత్రి సులోచనుడి వద్దకు వెళ్ళారు. ‘అయ్యా మా ఇద్దరిదీ అవంతీపురం. చాలా కాలం క్రితం వ్యాపార నిమిత్తం నా దగ్గర వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నాడు ఈ ధనగుప్తుడు. నా అప్పు తీర్చమంటే తీర్చడం లేదు’ అని ఫిర్యాదు చేశాడు రామగుప్తుడు. ‘అదంతా వట్టి అబద్ధం. నేను ఇతని వద్ద అప్పు తీసుకోలేదు. తీసుకుంటే వడ్డీ ఎంత? పత్రం ఏదీ?’ అని బుకాయించాడు ధనగుప్తుడు. మంత్రి సులోచనుడు కాసేపు ఆలోచించి.. ‘రామగుప్తా నువ్వు అప్పు ఇచ్చినట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా?’ అడిగాడు. ‘నా దగ్గర ఏ ఆధారాలు లేవు’ అని జవాబిచ్చాడు రామగుప్తుడు. ‘ఆధారాలు లేనప్పుడు ఎలా శిక్షించగలను? నువ్వు అప్పు ఇవ్వడం నిజమే అయినా నీ సొమ్ము ఎలా ఇప్పించగలను?’ అన్నాడు మంత్రి. చేసేదేమీ లేక దిగాలుగా రామగుప్తుడు, ‘నన్నేమీ చేయలేవు’ అనే అహంభావంతో ధనగుప్తుడు పూటకూళ్లవ్వ ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనాలయ్యాయి. అందరూ కబుర్లు చెప్పుకుని హాయిగా పడుకున్నారు. రెండో ఝాము అయ్యింది. ‘ధడేల్’మని చప్పుడు అయ్యింది. భయపడుతూ అందరూ ఒక్కసారి నిద్రలేచారు. ఏమయ్యిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ‘ఎవ్వరైనా కదిలారో చంపేస్తా’ అన్న మాటలు గట్టిగా వినిపించాయి. లాంతరు వెలుగులో అతని ఆకారాన్ని బట్టి గజదొంగ అని గుర్తించి భయం భయంగా కూర్చున్నారు అందరూ. ఆ గజదొంగ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ‘మీ దగ్గర ఉన్న డబ్బు, బంగారం మాట్లాడకుండా ఇచ్చేయండి లేదా పీక కోస్తా’ అని బెదిరించాడు. ‘బతికుంటే బలుసాకైనా తినవచ్చు’ అనుకుని ఒంటి మీద ఉన్న బంగారం, సంచిలో ఉన్న డబ్బులు ఒక్కొక్కరుగా ఇవ్వసాగారు. ఇది గమనించిన ధనగుప్తుడు.. తన దగ్గర ఉన్న వెయ్యి వరహాల సంచిని రామగుప్తుడి చేతిలో పెట్టి ‘నీ అప్పు తీరిపోయింది.. తీసుకో’ అన్నాడు. ఇప్పుడు తీసుకుంటే దొంగ పాలు అవుతుందని గ్రహించిన రామగుప్తుడు ఆ వరహాలను తీసుకోలేదు. ఆ గజదొంగ నేరుగా ధనగుప్తుడి దగ్గరికి వచ్చి ‘నీ దగ్గర ఉన్న డబ్బులు, బంగారం బయటకి తియ్’ అని గద్దించాడు. ‘ఈ వెయ్యి వరహాలు ఇతనికి అప్పు తీర్చవలసినవి. నా దగ్గర మరేమీ లేవు’ అన్నాడు ధనగుప్తుడు వణుకుతూ. ‘అయితే నీకు ఏ శిక్ష వెయ్యాలో నువ్వే చెప్పు’ అన్నాడు గజదొంగ. గజదొంగ వేషంలో ఉన్నది సులోచనుడని గ్రహించి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు ధనగుప్తుడు. ‘ఆధారం లేకపోతే అన్యాయం చేస్తావా? నీతిగా బతకడం నేర్చుకో’ అని మందలించి విడిచిపెట్టాడు సులోచనుడు. తన తప్పును మన్నించమని రామగుప్తుణ్ణి కోరాడు ధనగుప్తుడు. -కాశీ విశ్వనాథం పట్రాయుడు -
Pillala Katha: ఎవరు నిజాయితీ పరుడు?
సింహగిరిని హిమవంతుడు పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు.. మంత్రి వసంతుడితో ‘ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మంది పనివాళ్లలో ఎవరు నిజాయితీపరుడో తెలుసుకోవాలని ఉంది మంత్రివర్యా! అందుకు వజ్రాలను వారికి దొరికేలా చేద్దాం. వాటికి ఆశపడని వాడే నిజాయితీపరుడు. ఏమంటారు?’ అని అడిగాడు. ‘అలాగే మహారాజా.. మీరన్నట్టే చేద్దాం! నిజాయితీపరుడెవరో తేలుతుంది’ అన్నాడు మంత్రి. మరుసటిరోజే మంత్రితో చెప్పి ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మందీ పనిచేసే ప్రాంతంలో ఒక్కొక్కరికీ ఒక్కో వజ్రం దొరికేలా ఏర్పాటు చేయించాడు రాజు. ఒక గంట తరువాత ఉద్యానవనం చూసుకునే అధికారి ఆ పది మందినీ పిలిచి ‘పొరపాటున ఉద్యానవనంలో పది వజ్రాలు పడిపోయాయి. దొరికిన వాళ్లు వాటిని తీసుకెళ్లి రాజు గారికి ఇస్తే వారికి రాజు గారు ఐదు వెండి నాణేలు ఇస్తారు’ అని చెప్పాడు. అది విన్న పది మందిలో తొమ్మిది మంది అతి సులువుగా ఒక్కో వజ్రాన్ని స్వంతం చేసుకున్నారు. వారిలో ఒకడు ‘మనమేమన్నా పిచ్చివాళ్లమా? వజ్రానికి వెండి నాణేలు తీసుకోవడానికి? మనకు దొరికిన వజ్రాన్ని అమ్ముకుంటే ఎంతో ధనం వస్తుంది’ అన్నాడు. ‘అవునవును’ అన్నారు మిగతావారు. అందరూ మాట్లాడుకుని నేరుగా బంగారు అంగడి భూషయ్య వద్దకు బయలుదేరారు. పదవ వాడైన రామయ్య వద్దకు ఆ అధికారి వచ్చి ‘నేను వజ్రాల గురించి చెబుతున్నా వినకుండా నీ పాటికి నువ్వు పనిచేసుకుంటూ పోతున్నావేంటీ’ అని కసురుకున్నాడు. ‘నాకు పని ముఖ్యం. పనైపోయాక విరామ సమయంలో వెతుకుతాను’ అని బదులిచ్చాడు రామయ్య. అన్నట్టుగానే రామయ్య.. విరామ సమయంలో భోజనం చేసి వజ్రాన్ని వెతికి తీసుకెళ్లి ‘మహారాజా! ఇదిగోండి నాకు దొరికిన వజ్రం’ అంటూ రాజుకు ఇచ్చి ‘తోటలో పని ఉంది’ అంటూ వెంటనే వెళ్లిపోయాడు. దారిలో తొమ్మిది మందిలో ఒకడు ‘ఉద్యానవనంలో పనికి మనకిచ్చే జీతం చాలా తక్కువ. అందుకే ఈ వజ్రాన్ని అమ్మితే వచ్చే ధనంతో నేను పొరుగు దేశం వెళ్లి వ్యాపారం చేసుకుంటాను’ అన్నాడు. మరొకడు ‘పంట పొలం కొంటాన’న్నాడు. ఇలా మిగిలిన వాళ్లూ తమ తమ ఆలోచనలను పంచుకుంటూ భూషయ్య అంగడికి చేరుకున్నారు. వజ్రాలు అమ్మడానికి వచ్చామంటూ భూషయ్యకు తమ దగ్గరున్న వజ్రాలను ఇచ్చారు. వాటిని పరీక్షించిన భూషయ్య ‘ఇవి వజ్రాలు కావు. నాసిరకం రంగు రాళ్లు. నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు’ అని తేల్చాడు. ‘ఒరే! మనం పొరబడ్డాము. తిన్నగా కోటకు వెళ్లి వీటిని రాజు గారికి ఇచ్చి వెండినాణేలు దక్కించుకుందాము’ అన్నాడు వారిలో ఒకడు. ‘అవునురా’ అంటూ వంత పాడారు మిగిలిన వాళ్లు. వెంటనే కోటకు పయనమయ్యారు. రాజు గారి కొలువుకు చేరుకొని ‘మహారాజా! ఇవిగోండి.. మాకు దొరికిన వజ్రాలు’ అంటూ ఆ తొమ్మండుగురూ వాటిని రాజుకిచ్చారు. ‘మీకు భోజన సమయానికి ముందు వజ్రాలు దొరికితే.. అవి అసలైనవనుకుని అమ్మడానికి భూషయ్య వద్దకు వెళ్లారు. అక్కడవి నకిలీవని తేలగానే ఇటు వచ్చారు కదా’ అని గద్దించాడు రాజు. సమాధానమివ్వలేక పోయారు వాళ్లు. ‘రామయ్య ఒక్కడే పని చూసుకుని వజ్రం దొరికిందని ఇచ్చి వెళ్ళాడు. మీలో నిజాయితీపరుడు ఎవరో తెలుసుకోవడం కోసం నేను ఆడిన నాటకం ఇది’ అన్నాడు రాజు. ‘నిజాయితీతో పని చేయలేని మీ అందరినీ మహారాజు గారు కొలువు నుండి తొలగిస్తున్నారు. మీరు పక్షం రోజులు పనిచేసినా మాసం జీతం ఇస్తున్నారు. తీసుకుని వెళ్ళండి’ అన్నాడు మంత్రి. తరువాత రామయ్యను పిలిచి ‘వృత్తికి విలువ ఇచ్చిన తరువాతనే నిజాయితీగా వజ్రం తెచ్చి ఇచ్చావు. అన్న మాట ప్రకారం నీకు ఐదు వెండినాణేలు ఇవ్వాలి. కానీ పది బంగారు నాణేలు ఇస్తున్నాను’ అన్నాడు రాజు. ‘మహారాజా! నాది కానిది పూచిక పుల్ల కూడా నాకు అవసరం లేదు. దొరికిన వజ్రం మీకు తెచ్చిచ్చాను. నాకిచ్చిన కొలువు బంగారం కంటే విలువైనది. మీరిచ్చే జీతం నాకు చాలు’ అని వందనం చేసి వెళ్లిపోయాడు రామయ్య. మరొక్కమారు రామయ్య నిజాయితీని ప్రశంసించి ‘చూశారుగా మంత్రీ.. మన పథకం ఎలా పారిందో!’ అన్నాడు రాజు గర్వంగా. ‘అవును మహారాజా!’ అన్నాడు మంత్రి మెచ్చుకోలుగా! - యు.విజయశేఖర రెడ్డి -
పిల్లల కథ-‘మూడు ముళ్ళ చెట్టు’
ఒక అడవిలో మూడు ముళ్ళ చెట్లు ఉండేవి. వాటి ఆకులు చేదుగా, పూలు ఏమాత్రం వాసన లేకుండా ఉండేవి. దానితో జనాలుగానీ, పశువులుగానీ, పక్షులుగానీ ఏవీ ఆ చెట్ల దగ్గరికి వచ్చేవి కావు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ చెట్లు చాలా దిగులు పడ్డాయి. వనదేవతను తలచుకొని కన్నీరు పెట్టుకున్నాయి. కాపాడమని వేడుకున్నాయి. వనదేవత ‘సరే దిగులు పడకండి. మీకేం కావాలో కోరుకోండి’ అంది. ‘నాకు ఎంతో విలువైన బంగారు ఆకులు కావాలి’ అంది మొదటి చెట్టు. ‘నాకు సువాసన వెదజల్లే ముచ్చటైన రంగురంగుల పూలు కావాలి’ అంది రెండో చెట్టు. ‘నాకు కొమ్మ కొమ్మకు నిండుగా తియ్యని పళ్ళు కావాలి’ అంది మూడవ చెట్టు. ‘అలాగే’ అని దీవించింది చిరునవ్వుతో వనదేవత. అంతే.. మరుక్షణం మొదటి చెట్టు ఆకులన్నీ బంగారం అయిపోయాయి. సూర్యుడి కిరణాలు పడి ధగధగ మెరిసిపోసాగాయి. రెండవ చెట్టుకు రంగురంగుల పూలు పూచాయి. మనసు పరవశమయ్యేలా మధురమైన వాసన వెదజల్లసాగాయి. మూడవ చెట్టుకు సందు లేకుండా తీయని పళ్ళు కాశాయి. వాటి బరువుకు చెట్టుకొమ్మలు కిందికి వంగి ఊగసాగాయి. ఆ మూడు చెట్లు తమను తాము చూసి మురిసిపోయాయి. ఒకదానిని చూసి మరొకటి సంబరపడ్డాయి. రాత్రంతా ఆనందంతో నవ్వుకున్నాయి. మాటలతో మైమరచిపోయాయి. పొద్దు పొడిచింది. ఆ దారిలో నెమ్మదిగా మనుషుల సందడి మొదలైంది. ఆ దారిన పోతూ ఉన్న ఒకతను ఆ బంగారు చెట్టును చూశాడు. ‘ఆహా ఏమి నా అదృష్టం’ అనుకొని పరుగెత్తుకుంటూ వచ్చి కొమ్మలన్నీ విరగ్గొట్టాడు. ఒక్క ఆకు కూడా మిగలకుండా తెంచుకెళ్లాడు. ఒంటిమీద దెబ్బలతో విలవిల్లాడిపోయింది మొదటి చెట్టు. కాసేపటికి ఒక పిల్లల గుంపు అటువైపు వచ్చింది. వాళ్లు పళ్ళచెట్టును చూశారు. ఒకటి తిని ‘ఆహా ఎంత తీయగా ఉన్నాయి పళ్ళు’ అనుకున్నారు. అంతే కోతుల్లాగా చెట్టు మీదికి ఎగబాకారు. అందిన పళ్ళన్నీ తెంపారు. అందకపోతే కొమ్మలు విరిచారు. రాళ్లతో కొట్టారు. ఒక చిన్న పిందె కూడా మిగలకుండా నున్నగా ఊడ్చుకుపోయారు. విరిగిన కొమ్మలను చూసుకుంటూ నొప్పితో అల్లాడిపోయింది రెండో చెట్టు. అంతలో కొంతమంది ఆడపిల్లలు అటువైపు వచ్చారు. రంగురంగుల పూలచెట్టు వాళ్ళ కంటపడింది. ‘ఆహా ఎంత సువాసన వెదజల్లుతున్నాయి ఈ సుందరమైన పూలు’ అనుకుంటూ ఒక్కసారిగా చుట్టుముట్టారు. దొరికిన పూలన్నీ చిన్న మొగ్గ కూడా వదలకుండా కోసుకున్నారు. ‘ఈ చెట్టును తీసుకుపోయి ఇంట్లో నాటుకుందాం’ అంటూ తలా ఒక కొమ్మ విరగ్గొట్టారు. అప్పటిదాకా పూలతో కళకళలాడిన చెట్టు ఒక్క నిమిషంలో విరిగిన కొమ్మలతో బోడిదైపోయింది. మూడూ ఒకదానిని చూసి మరొకటి కళ్ళనీళ్లు పెట్టుకున్నాయి. ‘ఇకపైనుంచి మన బతుకులు ఇంతేనా? చిగుర్లు వేసినా, పూలు పూసినా, కాయలు కాసినా దెబ్బలు తప్పవు. ఇలా భయం భయంగా బతికే కన్నా ఇంతకుముందులా ఉంటేనే మేలు’ అనుకున్నాయి. వనదేవతను వేడుకున్నాయి. ‘తల్లీ తప్పయిపోయింది. మా మొదటి రూపమే మాకివ్వు. ఈ ఆకులూ వద్దు, పూలూ వద్దు, పళ్ళూ వద్దు. ఏ గొడవ లేకుండా మా బతుకేదో మేం బతుకుతాం’ అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాయి. వనదేవత చిరునవ్వు నవ్వి ‘సరే’ అంది అనునయంగా ఓ అమ్మలా! -డా.ఎం.హరి కిషన్