ఒక అడవిలో మూడు ముళ్ళ చెట్లు ఉండేవి. వాటి ఆకులు చేదుగా, పూలు ఏమాత్రం వాసన లేకుండా ఉండేవి. దానితో జనాలుగానీ, పశువులుగానీ, పక్షులుగానీ ఏవీ ఆ చెట్ల దగ్గరికి వచ్చేవి కావు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ చెట్లు చాలా దిగులు పడ్డాయి. వనదేవతను తలచుకొని కన్నీరు పెట్టుకున్నాయి. కాపాడమని వేడుకున్నాయి.
వనదేవత ‘సరే దిగులు పడకండి. మీకేం కావాలో కోరుకోండి’ అంది. ‘నాకు ఎంతో విలువైన బంగారు ఆకులు కావాలి’ అంది మొదటి చెట్టు. ‘నాకు సువాసన వెదజల్లే ముచ్చటైన రంగురంగుల పూలు కావాలి’ అంది రెండో చెట్టు. ‘నాకు కొమ్మ కొమ్మకు నిండుగా తియ్యని పళ్ళు కావాలి’ అంది మూడవ చెట్టు.
‘అలాగే’ అని దీవించింది చిరునవ్వుతో వనదేవత. అంతే.. మరుక్షణం మొదటి చెట్టు ఆకులన్నీ బంగారం అయిపోయాయి. సూర్యుడి కిరణాలు పడి ధగధగ మెరిసిపోసాగాయి. రెండవ చెట్టుకు రంగురంగుల పూలు పూచాయి. మనసు పరవశమయ్యేలా మధురమైన వాసన వెదజల్లసాగాయి. మూడవ చెట్టుకు సందు లేకుండా తీయని పళ్ళు కాశాయి. వాటి బరువుకు చెట్టుకొమ్మలు కిందికి వంగి ఊగసాగాయి.
ఆ మూడు చెట్లు తమను తాము చూసి మురిసిపోయాయి. ఒకదానిని చూసి మరొకటి సంబరపడ్డాయి. రాత్రంతా ఆనందంతో నవ్వుకున్నాయి. మాటలతో మైమరచిపోయాయి. పొద్దు పొడిచింది. ఆ దారిలో నెమ్మదిగా మనుషుల సందడి మొదలైంది. ఆ దారిన పోతూ ఉన్న ఒకతను ఆ బంగారు చెట్టును చూశాడు. ‘ఆహా ఏమి నా అదృష్టం’ అనుకొని పరుగెత్తుకుంటూ వచ్చి కొమ్మలన్నీ విరగ్గొట్టాడు. ఒక్క ఆకు కూడా మిగలకుండా తెంచుకెళ్లాడు. ఒంటిమీద దెబ్బలతో విలవిల్లాడిపోయింది మొదటి చెట్టు.
కాసేపటికి ఒక పిల్లల గుంపు అటువైపు వచ్చింది. వాళ్లు పళ్ళచెట్టును చూశారు. ఒకటి తిని ‘ఆహా ఎంత తీయగా ఉన్నాయి పళ్ళు’ అనుకున్నారు. అంతే కోతుల్లాగా చెట్టు మీదికి ఎగబాకారు. అందిన పళ్ళన్నీ తెంపారు. అందకపోతే కొమ్మలు విరిచారు. రాళ్లతో కొట్టారు. ఒక చిన్న పిందె కూడా మిగలకుండా నున్నగా ఊడ్చుకుపోయారు. విరిగిన కొమ్మలను చూసుకుంటూ నొప్పితో అల్లాడిపోయింది రెండో చెట్టు.
అంతలో కొంతమంది ఆడపిల్లలు అటువైపు వచ్చారు. రంగురంగుల పూలచెట్టు వాళ్ళ కంటపడింది. ‘ఆహా ఎంత సువాసన వెదజల్లుతున్నాయి ఈ సుందరమైన పూలు’ అనుకుంటూ ఒక్కసారిగా చుట్టుముట్టారు. దొరికిన పూలన్నీ చిన్న మొగ్గ కూడా వదలకుండా కోసుకున్నారు. ‘ఈ చెట్టును తీసుకుపోయి ఇంట్లో నాటుకుందాం’ అంటూ తలా ఒక కొమ్మ విరగ్గొట్టారు. అప్పటిదాకా పూలతో కళకళలాడిన చెట్టు ఒక్క నిమిషంలో విరిగిన కొమ్మలతో బోడిదైపోయింది.
మూడూ ఒకదానిని చూసి మరొకటి కళ్ళనీళ్లు పెట్టుకున్నాయి. ‘ఇకపైనుంచి మన బతుకులు ఇంతేనా? చిగుర్లు వేసినా, పూలు పూసినా, కాయలు కాసినా దెబ్బలు తప్పవు. ఇలా భయం భయంగా బతికే కన్నా ఇంతకుముందులా ఉంటేనే మేలు’ అనుకున్నాయి.
వనదేవతను వేడుకున్నాయి. ‘తల్లీ తప్పయిపోయింది. మా మొదటి రూపమే మాకివ్వు. ఈ ఆకులూ వద్దు, పూలూ వద్దు, పళ్ళూ వద్దు. ఏ గొడవ లేకుండా మా బతుకేదో మేం బతుకుతాం’ అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాయి. వనదేవత చిరునవ్వు నవ్వి ‘సరే’ అంది అనునయంగా ఓ అమ్మలా! -డా.ఎం.హరి కిషన్
Comments
Please login to add a commentAdd a comment