Lord sri sita ramachandra swamy
-
భక్తవిజయం: హనుమత్పురం
మేరుపర్వతానికి దక్షిణ దిశలో పది యోజనాల విస్తీర్ణం గల ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామ ప్రజలు ధార్మికులు. ఎవరి వృత్తులు వారు చేసుకుంటూ, పరస్పర సహకార ధోరణితో ప్రశాంతంగా జీవనం సాగించేవారు. ఆ గ్రామం జలసమృద్ధితో తులతూగేది. పొలాలు నిత్యహరితంగా అలరారేవి. గ్రామం శివార్లలోని వనాలలో ఫలవృక్షాలు పుష్కలంగా ఉండేవి. గోవృషభాది పశుసంపదకు లోటు లేకుండా ఉండేది. వీటన్నింటి వల్ల గ్రామం సుభిక్షంగా ఉండేది. ప్రజలు తీరికవేళల్లో భగవన్నామ సంకీర్తనతో కాలక్షేపం చేసేవారు. పర్వదినాలలో ఊరుమ్మడిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజపురస్కారాలను నిర్వహించేవారు. రావణ వధానంతరం రాముడు పట్టాభిషిక్తుడై అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగిస్తున్న రోజులవి. హనుమంతుడు రాముని కొలువులో ఉండేవాడు. నిత్యం సీతారాములను సేవించుకుంటూ తన ఆరాధ్య దైవమైన రాముని సమక్షంలోనే ఉండేవాడు. సుగ్రీవునితో మైత్రిని కలపడం సహా లంకలో బంధితురాలైన సీత జాడ కనుగొనడం మొదలుకొని యుద్ధంలో ఘనవిజయం వరకు రామునికి హనుమ చేసిన ఉపకారాలు అన్నీ ఇన్నీ కావు. తనకు ఇన్ని ఉపకారాలు చేసిన హనుమకు ప్రత్యుపకారం ఏదైనా చేయాలని తలచాడు రాముడు. ఒకనాడు హనుమను పిలిచాడు. ‘హనుమా! నువ్వు మాకెన్నో ఉపకారాలు చేశావు. నీ ఉపకారాలను మరువజాలను. నీకేదైనా వరమివ్వాలని ఉంది. నీకిష్టమైనదేదో కోరుకో, తప్పక ఇస్తాను’ అన్నాడు. ‘శ్రీరామా! నువ్వు పురుషోత్తముడవు, పరమపురుషుడవు. నీ సేవకు మించిన భాగ్యం ఇంకేదీ లేదు. నిత్యం నీ సన్నిధిలో నిన్ను సేవించుకుంటూ ఉండటమే నాకు పరమభాగ్యం’ అని బదులిచ్చాడు హనుమ. ‘అది కాదు గాని, నీకు ఒక గ్రామాన్ని బహూకరిస్తున్నాను. మేరుపర్వతానికి దక్షిణదిశలో సుఖశాంతులతో అలరారుతున్న ఆ గ్రామం ఇక నీదే! నా వరంగా ఆ గ్రామాన్ని స్వీకరించు. ఆ గ్రామానికి హనుమత్పురమని నామకరణం చేస్తున్నాను. నువ్వు అక్కడకు వెళ్లి, గ్రామ ప్రజల యోగక్షేమాలను గమనిస్తూ ఉండు. ఇకపై అక్కడి ప్రజలు హనుమద్భక్తులై విలసిల్లుతారు. ముల్లోకాలలో నీ పేరు ప్రతిష్ఠలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి’ అన్నాడు రాముడు. రాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు ఆ గ్రామానికి చేరుకున్నాడు. రాముడి ఆదేశం మేరకు హనుమంతుడు ఆ గ్రామానికి అధిపతి. అయితే, హనుమంతుడికి ఆధిపత్య కాంక్ష లేదు. ఆ ఊరి ప్రజలంతా శాంతికాముకులు, ధార్మికులు, భగవత్ చింతనా తత్పరులు. హనుమంతుడు ఆ గ్రామంలోని బ్రాహ్మణులందరినీ పిలిచి సమావేశపరచాడు. ‘మీరిక్కడ ఎన్నాళ్లుగానో ఉంటున్నారు. ఇకపై కూడా మీరంతా మీ మీ కుటుంబాలతో ఇక్కడే ఉంటూ సత్కార్యాలతో కాలక్షేపం చేస్తూ ఉండండి’ అని చెప్పి, రాముడు తనకు ఇచ్చిన ఆ గ్రామాన్ని అక్కడి ప్రజలకే దానమిచ్చేశాడు. అక్కడి నుంచి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు. గ్రామ ప్రజలందరూ హనుమంతుడి ఔదార్యానికి ఆనందభరితులయ్యారు. కృతజ్ఞతగా గ్రామంలో అడుగడుగునా హనుమంతునికి మందిరాలను నిర్మించుకున్నారు. గ్రామస్థుల కృషి, ధార్మిక వర్తనల కారణంగా గ్రామం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లసాగింది. ఆ గ్రామ పరిసరాల్లోని అడవిలో దుర్ముఖుడనే రాక్షసుడు ఉండేవాడు. హనుమత్పురం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతుండటం చూసి అతడికి కన్ను కుట్టింది. సుభిక్షమైన ఆ గ్రామాన్ని కైవసం చేసుకోవాలనుకున్నాడు. ఒకనాడు అకస్మాత్తుగా తన రాక్షసదండుతో గ్రామం మీదకు దండెత్తాడు. ‘ఈ గ్రామం నాది. మీరిక్కడ ఉండటానికి వీల్లేదు. వెంటనే గ్రామాన్ని వదిలి వెళ్లిపోండి’ అని గ్రామస్థులను హెచ్చరించాడు. రాక్షసదండును చూడటంతోనే గ్రామస్థులు భయపడ్డారు. దుర్ముఖుడు చేసిన హెచ్చరికతో వారు మరింతగా భీతిల్లారు. ఊరు విడిచి వెళ్లిపోవడానికి రెండురోజులు గడువివ్వమని గ్రామస్థులు దుర్ముఖుడిని వేడుకున్నారు. అతడు అందుకు సమ్మతించి అప్పటికి వెనుదిరిగాడు. దిక్కుతోచని గ్రామస్థులు హనుమంతుని మందిరాల్లో పూజలు చేస్తూ, తమను రక్షించమంటూ ప్రార్థనలు చేశారు. రెండోరోజు రాత్రి ఒక బ్రాహ్మణుడికి కలలో హనుమంతుడు కనిపించాడు. ‘ఈ భూమి ఎవరి రాజ్యమూ కాదు. మాంధాత వంటి చక్రవర్తులు ఈ భూమిని ఏలారు. వారెవరైనా తమ సామ్రాజ్యాలను తమతో పాటే తీసుకుపోయారా? మీ గ్రామంలోనే మీరు ఉండండి. ఇదే మాట దుర్ముఖుడితో చెప్పండి’ అని పలికి, దుర్ముఖుడి రాక్షససేన విడిచి చేసిన వైపుగా బయలుదేరాడు. మరునాటి ఉదయమే దుర్ముఖుడి సేనాని అతడి వద్దకు పరుగు పరుగున చేరుకున్నాడు. ‘నాయకా! తాటిచెట్టంత మహాకాయుడొకడు గ్రామానికి కావలి కాస్తున్నాడు. రాత్రివేళ మన సేన విడిచి చేసిన గుడారాల చుట్టూ తిరిగి కొండ మీదకు చేరుకున్నాడు. కొండ మీద కూర్చుని, బండరాళ్లను బంతుల్లా చేసి ఆడుకుంటున్నాడు. అతణ్ణి చూస్తేనే భయం వేస్తోంది. అతడు బండరాళ్లను మన దండు మీద విసిరితే అంతా నుజ్జు నుజ్జయిపోతాం’ అని చెప్పాడు. దుర్ముఖుడికి పరిస్థితి అర్థమైంది. తెగిస్తే ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించాడు. వెంటనే గ్రామానికి చేరుకుని, ‘గ్రామస్థులారా! మీరంతా సద్వర్తనులు. ఇక్కడ మీరు యథాప్రకారం ఉండండి’ అని చెప్పి వెనుదిరిగాడు. -సాంఖ్యాయన -
అదిగో అయోధ్య... అల్లదిగో అయోధ్య
రాముడు శ్రీరాముడు సకల గుణాభిరాముడు రాఘవుడు... ఇన్ని నామాంతరాలు ఉన్న ఆ దశరథ రాముడు... ఆ రోజున తెల్లవారుజామునే మేల్కొన్నాడు... సరయూ జలాలలో అభ్యంగన స్నానం ఆచరించాడు... అల్లలాడుతున్న అలకలను సరిచేసుకున్నాడు...సూర్య వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం ధరించాడు రవికులుడు... చల్లని వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని వేలికి ధరించాడు... తన పట్టాభిషేక సమయానికి సిద్ధం చేయించిన వస్త్రాలు ధరించాడు.. నాడు భరతుడు సింహాసనం మీద ఉంచి పరిపాలన కొనసాగించిన పాదుకలలో పాదాలుంచాడు... బాల్యంలో చందమామ కావాలి అని మారాము చేసినప్పుడు అద్దంలో చందమామను చూపిన ఆ అద్దంలో ఇప్పుడు ఈ రామచంద్రుడు తన ముఖ బింబాన్ని చూసుకుని... చిరునవ్వులు చిందిస్తూ... గడప దాటి బయటకు అడుగు పెట్టబోతున్నాడు... సరిగ్గా అదే సమయానికి... గుమ్మం ముందర కవి సమూహం లోపలకు వస్తూ కనిపించారు. వారికి వినమ్రపూర్వకంగా నమస్కరించి, లోపలకు ఆహ్వానించి, సముచిత స్థానాలు చూపి, ఆసీనులను చేసి, తాను కూడా గౌరవముద్రలో సింహాసనం అధిరోహించాడు.. అందరూ విశ్రాంతులైన పిదప... ‘వాల్మీకి మహర్షీ! మహానుభావులంతా ఒక్కసారే విచ్చేశారు. కారణం తెలుసుకోవచ్చా’ అని వినమ్రంగా ప్రశ్నించాడు. వాల్మీకి తన గుబురు శ్మశ్రువుల మాటు నుంచి చిన్నగా నవ్వుతూ, ‘ఏమయ్యా! నువ్వు ఇంత తొందరగా ఏదో పని మీద బయలుదేరినట్టున్నావు. విషయం తెలుసుకోవచ్చా’ అన్నాడు ఏమీ ఎరగనట్లు. ‘మహర్షీ! ఏమీ ఎరగనట్లు ప్రశ్నిస్తున్నారు. మీరే కదా నా కథను లవకుశల ద్వారా గానం చేయించి ప్రపంచానికి పరిచయం చేసింది. నాకు ఎంతటి మంచి లక్షణాలు ఉండాలో కూడా మీరే నిర్దేశించారు కదా. అటువంటి మీకు నేను ఎప్పుడు, ఎక్కడకు వెళ్తానో తెలియదా. నా నోటితో చెప్పించాలనే ఆలోచన కాకపోతేను’ అన్నాడు వాల్మీకి మహర్షితో చనువుగా. ‘నాకు తెలుసు రామా! నీ వినయం, విధేయత, గౌరవం... అన్నీ. ఈ రోజు ఇక్కడకు వచ్చినవారిని గమనించావా. వీరంతా నీ కథను ఇన్ని వేల సంవత్సరలుగా సజీవంగా ఉంచిన మహానుభావులు. నేను రాసిన కథను యథాతథంగా ఉంచకుండా, వారికి తోచిన కల్పనలు కూడా చేశారు. వీరందరికీ నువ్వంటే ప్రీతి. అందుకే వారి మనసుకి నచ్చిన విధంగా నిన్ను కీర్తించారు. నిన్ను నెత్తిన పెట్టుకుని నేటికీ ‘రామాయణం’ అనే కావ్యాన్ని ‘రామ’ అనే తారక మంత్రాన్ని ఇంకా పచ్చిగా, లేతగా, తడి ఆరకుండా ఉంచారు... అని వాల్మీకి పారవశ్యంతో పలుకుతుంటే, రాముని శరీరం పులకించిపోయింది. రామా! నీకు ఒక్కొక్కరినీ మరోసారి పరిచయం చేస్తాను. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్లే సంతోషంలో ఉన్నావు. అందువల్ల నేను పరిచయం చేస్తేనే కాని వారిని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోలేవు.... అంటూ పండిత పరిషత్తు వైపునకు తల పరికించాడు. ఇదిగో మొట్టమొదటగా చెప్పవలసిన వ్యక్తి కాళిదాసు. ఈయన కవికుల గురువు. నీ గొప్పదనాన్ని ‘రఘువంశం’ అనే కావ్యంగా వెలయించాడు. మీ కుటుంబాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతించాడో తెలుసా. ఆ కవిత్వమంతా ఇప్పుడు చెప్పనులే. రేఖామాత్రంగానే పరిచయం చేస్తాను. ఇక ఆ పక్కన కూర్చున్న కవి భవభూతి. ఉత్తర రామ చరిత రచించి అందరి కంట నీరు పెట్టించాడు. ఆ పక్కనే ఉన్న భాసుడు ‘ప్రతిమ’ అనే నాటకాన్ని రచించాడు. ఆయనకు నా రామాయణంలోని కొన్ని విషయాలు నచ్చలేదు. అందుకని ఆయన కొన్ని కల్పనలు చేశాడు.కైకేయి దుర్బుద్ధికాని, లక్ష్మణుడు అవాచ్యకాలు పలకలడం కాని ఇందులో కనపడదు. దశరథ ప్రతిమా కల్పనం, దశరథ శ్రాద్ధ కలనం వంటి కొన్ని అంశాలు ఇందులోని కొత్త విషయాలు. అర్థమైందా ఈ కవి విలక్షణత. ఆయనకు కైకమ్మను నిందించాలనిపించలేదు. సరే – ఇంక ఆ పక్కన చూడు... మురారి. ఆయనకు నా పేరు కూడా చేరింది. బాల వాల్మీకి అని పిలుస్తారు. ఎన్నో గురుకుల క్లేశాలు అనుభవించి, చివరకు కవికులంలో స్థానం సంపాదించాడు. ఆ మహానుభావుడు.. నీ తండ్రి దశరథుడిని ఎంత గొప్పగా ప్రశంసించాడో తెలుసా. ఆయనట ఏకంగా దిక్పాలకులను తన ఇంటి ముంగిట్లో బంధించేశాడు. అంటే వారికి పని లేకుండా నీ తండ్రి గారే ముల్లోకాలను సుభిక్షంగా పరిపాలించాడట. అబ్బో ఈ కవి గురించి ఎంత చెప్పినా చాలదు. ఆయన మార్గమే వేరు. నీకు ముందు ముందు ఇటువంటి మార్గంలో వెళ్లిన మరో ఇద్దరిని గురించి చెబుతానులే. ఇక తెలుగు కవులలోకి వస్తే... అబ్బో... బోలెడు మంది.. తెలుగులో ఆది కావ్యం రచించిన నన్నయ మొదలుగా నిన్నమొన్నటి ఉషశ్రీ వరకు ఎంత మంది ఎంత అందంగా నీ కావ్యాన్న రచించారో. కవిత్రయంలో మొదటివాడైన నన్నయభట్టు మహానుభావుడు భారత ఆంధ్రీకరణేకాకుండా నీ కథను ‘రాఘవాభ్యుదయం’ పేరిట తెలుగువారికి అందించాడు. ఆ కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ పేరున తొట్టతొలి ప్రబంధ కావ్యాన్ని, ఒక్క వచనం కూడా లేకుండా పూర్తి పద్యంలో రచించాడు. కవిత్రయంలో మూడవ వాడైన ఎరన్ర కూడా రామాయణం కావ్యాన్ని రచించాడు. ఇక మంత్రి భాస్కరుడు ‘భాస్కర రామాయణం’, కుమ్మరి మొల్ల ‘మొల్ల రామాయణం’, గోన బుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’ రచించారు. వారంతా నీ పట్ల ప్రేమానురాగాలను కురిపిస్తున్న కన్నులతో ఎంత భక్తిగా కూర్చున్నారో చూడు. ఇక వీరందరిదీ ఒక ఎత్తయితే... ఆ మురారిలాగే నిరంకుశుడైన కవి ‘కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ’. ఆ మహానుభావుడు నీ క్రీగంటి చూపు కోసం చూస్తున్నాడు. అటు వైపుగా ఒక్కసారి నీ తల త్రిప్పు. ఈయన నీ కథను ‘రామాయణ కల్పవక్షం’ పేరున రచించి, తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ సత్కారాన్ని అందుకున్నాడు. ఇంకా ఎన్నో సత్కారాలు ఉన్నాయిలే. నిన్ను తనకు కావలసిన విధంగా ప్రస్తుతించుకున్నాడు. ఇక ఈ సభకు హాజరైన చివరివాడు ‘ఉషశ్రీ’. మురారి పంథాలో విశ్వనాథ కావ్యరచన చేస్తే, ఆ విశ్వనాథ చేత ‘ఇది ఉషశ్రీ మార్గము’ అనిపించుకుని, నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగాడు. వాడు త్యాగ్య వాగ్గేయకారుడైతే, వీడు వాక్కావ్యకారుడు. తన నోటితో నీ కథను అందంగా చెబుతూ, తన కలంతో కూడా అంతే అందంగా నిన్ను ప్రస్తుతించాడు. ఇంతమంది కవులు నీ కోసం నిరీక్షిస్తుంటే... నువ్వు నీ బాల రామ ప్రతిష్ఠ కోసం పరుగులు తీయడం న్యాయమేనా. అందుకే నిన్ను లోపలకు పిలిచాను. వీరందరికీ నీ తియ్యని ఆశీర్వచనాలు కావాలి.. అంటూ వాల్మీకి పలుకుతుంటే... మరో నలుగురు పరుగుపరుగున లోపలకు ప్రవేశించారు. వారిలో ప్రథముడు కంచర్ల గోపన్న... అయ్యా! వాల్మీకి మహర్షీ! నన్ను మరచిపోతే ఎలాగయ్యా.. అంటూ పాదాల మీద వాలాడు. వాల్మీకి ఆ గోపన్నను దగ్గరగా తీసుకుని, ‘రామభద్రా! వీడు నీ కోసం భద్రాద్రిలో ఆలయం నిర్మించాడు. నీ పేరున కీర్తనలు రచించి, గోపన్న నామాన్ని రామదాసుగా మార్చుకున్నాడు. నీ కోసం కారాగారం పాలయ్యాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు. అయితేనేం, నీ గురించి ఎన్నో మంచి మంచి కీర్తనలు రచించాడు... అంటుంటే, రామదాసు శ్రీరాముని పాదాల ముందు సాష్టాంగపడ్డాడు. ఇదిగో ఈ మహానుభావుడిని చూడు. ఈయన త్యాగయ్య. నీ మీద ఎన్ని కీర్తనలు రచించాడు. ‘మా జానకి చెట్టపట్టగా మహరాజువైతివి’ అని ఆ తల్లి సీతమ్మను తన గుండెల్లో పొదివిపట్టుకున్నాడు.. అని త్యాగయ్య గురించి పలుకుతుంటే, ఆ మహానుభావుడు తన చేతిలోని తంబురను శ్రీరాముని చేతికిచ్చాడు. ఆ రాముడు తన విల్లును పక్కన పెట్టి, తంబురనే విల్లుగా ధరించాడు. అంతే ఆ దశ్యం చూసిన కొంటె బొమ్మల బాపు... గబగబ అయిదు నిమిషాలలో కవుల కొలువును, తంబుర రాముడిని తన రేఖలలో నింపేశాడు. ఆ పక్కన ముసిముసి నవ్వులతో బాపుని అంటిపెట్టుకున్న ముళ్లపూడి రమణ.. శ్రీరామా! ఓ ఫైవ్ లెటర్స్ అప్పు ఇస్తావా నిన్ను పొగడటానికి... అంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లాడు. ఈసారి రాముడు కాదు, వాల్మీకి పరవశించిపోయాడు. నేను 24 వేల శ్లోకాలతో రామకథను కొన్ని వేల సంవత్సరాల క్రితం రచిస్తే, నేటికీ నా రాముడిని అందరూ అక్షరాలలో బంధిస్తూనే ఉన్నారు. ‘రామా! ఇది నా గొప్పతనం కాదు. ఇది నీ గొప్పదనం. నీ వ్యక్తిత్వ ఔన్నత్యం. నీ తండ్రి దశరథుడు నేర్పిన సంస్కారం గొప్పదనం.మా జన్మలు ధన్యమయ్యాయయ్యా. ఇక నువ్వు నీ బాల విగ్రహ ప్రతిష్ఠ చూడటానికి బయలుదేరు. మేమంతా నీ వెంట వస్తాం. అక్కడ అయోధ్యలో ‘రామాయ రామభద్రాయ రాచంద్రాయ వేధసే’ అంటూ రామాయణ గాథ ఉషశ్రీ గళం వినిపిస్తున్నారట. ‘మన ఉషశ్రీ ధన్యుడయ్యాడు. నీ ఎదుట గళం వినిపించే అదృష్టం అతడిని మాత్రమే వరించింది. అతడి మాటలలోనే నా ఉపన్యాసం ముగిస్తాను. స్వస్తి’ అంటూ వాల్మీకి ముగింపు పలికాడు. అందరూ నెమ్మదిగా అయోధ్య వైపుగా బయలుదేరబోతున్నారు. చకచక అడుగులు వేస్తూ ఉషశ్రీ వేగంగా వెళ్లడం గమనించిన రాముడు, ‘మహర్షీ! మనం కూడా బయలుదేరాలయ్యా. వాడు కాలాంతకుడు. సమయ పాలన వాడి ఆత్మ. నా బాలరామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు కదా. ఆ వ్యాఖ్యానం వీడి గళం నుంచే వెలువడబోతోంది. వాడితో పాటు వాడికి ‘ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇలా ఉండాలి’ అని మార్గదర్శనం చేసిన జమ్మలమడక మాధవరామ శర్మ కూడా ఈ పాటికి అక్కడికి చేరి ఉంటాడు. వేగంగా పదండి’ అని పలికాడు. అదిగో అయోధ్య. అదిగో రాముడు. అదిగో మన కవిపండితులు. అదిగో మన తెలుగువారు. జై శ్రీరామ్... (జనవరి 22, 2024 సోమవారం నాడు బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా సృజన రచన. - డా. పురాణపండ వైజయంతి) -
భక్త విజయం - ‘సుషేణుడి తపస్సు’
వానర యోధుల్లో ముఖ్యులైన వారిలో సుషేణుడు ఒకడు. సుషేణుడు వానరరాజు సుగ్రీవుడికి మామ. వరుణుడి కొడుకైన సుషేణుడు వానర వైద్యుడు. అతడి ఔషధ పరిజ్ఞానం అనన్యసామాన్యం. రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు నాగాస్త్రానికి రామలక్ష్మణులు బంధితులై కుప్పకూలిపోయినప్పుడు, రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధానికి లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సుషేణుడి సూచనల మేరకే హనుమంతుడు సంజీవని పర్వతానికి చేరుకున్నాడు. సుషేణుడు తనకు సూచించిన ఓషధులను హనుమంతుడు గుర్తించలేక ఏకంగా సంజీవని పర్వతాన్నే పెకలించుకుని వచ్చాడు. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తే, సుషేణుడు దానిపైనున్న మొక్కలలో సంజీవకరణి, విశల్యకరణి వంటి ఓషధీ మూలికలను గుర్తించి, వాటితో రామలక్ష్మణులను స్వస్థులను చేశాడు. యుద్ధంలో మరణించిన వానరయోధులను తిరిగి బతికించాడు. గాయపడిన వారి గాయాలను నయం చేశాడు. రామ రావణ యుద్ధంలో శ్రీరాముడి ఘన విజయానికి సుషేణుడు తనవంతు తోడ్పాటునందించాడు. రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. అయోధ్యలో జరగబోయే శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించడానికి సుగ్రీవ, అంగద, హనుమదాది వానర వీరులు, విభీషణుడు కూడా పుష్పక విమానంలో బయలుదేరారు. మార్గమధ్యంలో సుమంచ పర్వతం మీద శ్రీరాముడు తన పరివారంతో విడిది చేశాడు. సుమంచ పర్వతం మీదనున్న వృక్షసంపదలో అంతులేని ఓషధీమూలికలను అందించే మొక్కలు, చెట్లు చూసి వానర వైద్యుడు సుషేణుడు అమితానంద భరితుడయ్యాడు. ఓషధీమూలికలతో నిండిన పర్వతం, చుట్టూ చక్కని మహారణ్యం ఉన్నా సుమంచ పర్వతప్రాంతంలోని ప్రజలు రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉండటం చూసి కలత చెందాడు. ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తనవంతుగా వైద్యసేవలు అందించాలని, తన శేషజీవితాన్ని ఈ పర్వతం మీదనే జపతపాదులతో గడపాలని నిర్ణయించుకున్నాడు. శ్రీరాముడికి తన మనోగతాన్ని తెలిపాడు. ‘శ్రీరామా! యుద్ధం పరిసమాప్తమైంది. నీకు ఘనవిజయం సాధ్యమైంది. అయోధ్యకు వెళ్లి పట్టాభిషిక్తుడవై, నీ ప్రజలను జనరంజకంగా పరిపాలించు. నేను ఇక్కడే ఉండి శేషజీవితాన్ని జపతపాదులతో గడపాలని, పరమశివుడు అనుగ్రహిస్తే, బొందితో కైలాసం పోవాలని భావిస్తున్నాను. అద్భుతమైన మూలికలతో నిండిన ఈ పర్వత పరిసర ప్రాంతాల్లోని ప్రజలు రోగపీడితులుగా ఉన్నారు. వారికి సేవలందిస్తాను. ఇందుకు అనుమతించు’ అని కోరాడు. ‘సరే, నీ మనోభీష్టం ప్రకారమే కానివ్వు’ అని పలికాడు రాముడు. సుషేణుడిని ఆశీర్వదించి పరివారంతో కలసి అయోధ్యకు పయనమయ్యాడు. సుషేణుడు సుమంత పర్వతంపైనే ఉంటూ శివుని గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి శ్రీరాముడికి సుషేణుడు గుర్తుకొచ్చాడు. సుషేణుడి యోగక్షేమాలను తెలుసుకుని రమ్మని హనుమంతుడికి చెప్పాడు. రాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు సుమంచ పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఏ అలికిడీ వినిపించలేదు. దట్టమైన చెట్ల మధ్య వెదుకులాడుతూ హనుమంతుడు కొంత దూరం ముందుకు సాగాడు. ఒకచోట చెట్టు కింద సుషేణుడి కళేబరం కనిపించింది. అప్పటికే అది పూర్తిగా అస్థిపంజరంగా మారింది. తపస్సులోనే సుషేణుడు శివసాయుజ్యం పొంది ఉంటాడని భావించిన హనుమంతుడు, అక్కడే ఒక గొయ్యి తవ్వి, సుషేణుడి కళేబరాన్ని అందులో పూడ్చిపెట్టాడు. అక్కడ దొరికిన మల్లెలను కోసి తెచ్చి, సుషేణుడిని పూడ్చిన చోట ఉంచి, గుర్తుగా దానిపై కృష్ణాజినాన్ని కప్పాడు. హనుమంతుడు అక్కడి నుంచి నేరుగా అయోధ్యకు చేరుకుని, రాముడికి సుషేణుడి నిర్యాణ వార్త చెప్పాడు. వెంటనే రాముడు సీతా లక్ష్మణ సమేతంగా హనుమంతుడితో కలసి సుమంచ పర్వతానికి బయలుదేరాడు. పర్వతం మీదకు చేరుకున్నాక, సుషేణుడిని తాను పూడ్చిపెట్టిన చోటుకు వారిని తీసుకువెళ్లాడు హనుమంతుడు. సుషేణుడి కళేబరాన్ని చూపించడానికి పైన తాను కప్పి ఉంచిన కృష్ణాజినాన్ని తొలగించాడు. ఆశ్చర్యకరంగా అక్కడ సుషేణుడి కళేబరం లేదు. దానికి బదులుగా ఒక శివలింగం కనిపించింది. శివలింగం మీద మల్లెపువ్వులు ఉన్నాయి. అభీష్టం మేరకు సుషేణుడు శివసాయుజ్యం పొందాడని వారికి అర్థమైంది. సమీపంలోని కొలనులో సీతా రామ లక్ష్మణ హనుమంతులు స్నానమాచరించి, శివలింగానికి పూజించడం ప్రారంభించాడు. పూజ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రచండ వేగంతో గాలులు వీచసాగాయి. ఔషధ మూలికల పరిమళాన్ని నింపుకున్న ఆ గాలులు సోకినంత మేర ఆ ప్రాంతంలోని రోగపీడితులకు ఆశ్చర్యకరంగా రోగాలు నయమయ్యాయి. పూజ కొనసాగిస్తుంటే, శివలింగం క్రమంగా పెరగసాగింది. అక్కడ శివాలయాన్ని నిర్మిద్దామని శ్రీరాముడు అనుకున్నా, శివలింగం పరిమాణం పెరుగుతూ ఉండటంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడు. సుషేణుడు నిర్యాణం చెందిన ప్రదేశంలో ఆవిర్భవించిన శివలింగంపై మల్లెపూలు, కృష్ణాజినం ఉండటంతో అక్కడ వెలసిన శివుడు మల్లికాజినస్వామిగా ప్రఖ్యాతి పొందాడు. మల్లికాజునస్వామి వెలసిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో టెక్కలి సమీపంలోని రావివలస గ్రామంలో ఉంది. - సాంఖ్యాయన -
హనుమ హృదయంలో సీతారాములు
రామ రావణ యుద్ధంలో రావణుడు అంతమొందాడు. రాముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా అభిషిక్తుణ్ణి చేశాడు. సీతా సమేతంగా వానర వీరులను, విభీషణుణ్ణి తోడ్కొని పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకోవడానికి బయలుదేరాడు. రాముడి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న భరతుడు అయోధ్య పొలిమేరల్లోనే సపరివారంగా నిలబడి, నెత్తి మీద పాదుకలను ఉంచుకుని రాముడికి స్వాగతం పలికాడు. అయోధ్యవాసుల జయజయ ధ్వానాల నడుమ, పురోహితుల వేద మంత్రాలతో రాముడికి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం తర్వాత రాముడు తనకు అడుగడుగునా సహకరించిన వారందరికీ విలువైన కానుకలను బహూకరించాడు. సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీలుడు, సుషేణుడు, జాంబవంతుడు తదితర వానర యోధులకు, విభీషణుడికి కానుకలతో సత్కరించాడు. హనుమంతుడికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. సీతమ్మవారికి ఒక విలువైన రత్నాల హారాన్ని ఇచ్చాడు. ‘నీకు ఇష్టమైన వారికి దీనిని బహూకరించు’ అని చెప్పాడు రాముడు. ‘మహారాజా! మానసపుత్రుల మధ్య భేదభావాన్ని కలిగించాలనుకుంటున్నారా? తల్లికి బిడ్డలందరూ సమానమే కదా!’ అంది సీత. ‘సమానులెలా అవుతారు? బిడ్డలు అందరూ సమానులే అయితే శాస్త్రాల్లో సుపుత్రులు, కుపుత్రులు అని ఎందుకు వర్ణించారు?’ ప్రశ్నించాడు రాముడు. ‘ఏ వేలికి గాయమైనా నొప్పి సమానంగానే కలుగుతుంది. తల్లికి పుత్రులందరూ సమానమే. తల్లి మమత పుత్రులందరి మీద సమానంగానే ఉంటుంది. అయితే, సద్గుణాల కారణంగా, భక్తి కారణంగా కొంత తారతమ్యం కలుగుతుంది. ఆ తారతమ్యం గుణాలకు సంబంధించినది మాత్రమే!’ అని పలికింది సీత. ‘నా అభిప్రాయం కూడా అదే! గుణాలలో ఎక్కువగా ఎవరిని భావిస్తావో వారికే ఈ కానుక ఇవ్వు’ అన్నాడు రాముడు. ‘అందరూ గుణవంతులే! అందరూ భక్తులే!’ అంది సీత. ‘అయినా కొద్ది తారతమ్యం ఉండనే ఉంటుంది. నువ్వు సంకోచిస్తున్నట్లున్నావు. నువ్వు ఇవ్వదలచుకున్న వాళ్లకు నిస్సంకోచంగా ఈ కానుక ఇవ్వు’ అన్నాడు రాముడు. సభలో ఉన్నవారంతా సీతారాముల మధ్య జరిగిన ఈ సంభాషణను అత్యంత ఉత్కంఠతో ఆలకిస్తూ, ఆ హారాన్ని సీతమ్మవారు ఎవరికి ఇస్తుందా అని ఆత్రంగా చూస్తున్నారు. హనుమంతుడు మాత్రం ఏమీ పట్టనట్లుగా నిశ్చలంగా రాముణ్ణే చూస్తూ ఉన్నాడు. సీతమ్మవారు హనుమంతుడిని పిలిచి, రాముడు తనకు ఇచ్చిన హారాన్ని అతడికిచ్చింది. హనుమంతుడు ఆ హారాన్ని మెడలో ధరించాడు. సభాసదులందరూ హర్షధ్వానాలు చేశారు. తర్వాత హనుమంతుడు తన ఆసనంపై యథాప్రకారం ఆసీనుడయ్యాడు. సీతమ్మవారు తనకు ఇచ్చిన హారంలోని రత్నాలను ఒక్కొక్క దాన్నే పరిశీలనగా చూస్తూ, ఒక్కొక్క రత్నాన్నే కొరికి నేల మీద పడేయసాగాడు. సభాసదులందరూ హనుమంతుని చేష్టను వింతగా చూడసాగారు. ఇంతలో విభీషణుడు ధైర్యం చేసి, ‘కోతికేం తెలుసు అల్లం రుచి’ అన్నాడు. హనుమంతుడు విభీషణుడివైపు చూసి, ‘లంకాధిపా! అయితే ఏమంటావు? మీ లంకలోని రాక్షసులు ఎక్కువగా అల్లం తింటారు. అందుకే మీకు తెలిసినంతగా అల్లం రుచి మా వానరులకు ఎలా తెలుస్తుంది?’ అన్నాడు. ‘తినకపోతే మాత్రం నీలా ఉన్నామా? సీతమ్మవారు విలువైన హారాన్ని కానుకగా ఇస్తే, నువ్వు చేస్తున్న పనేమిటి?’ అని కాస్త కోపంగానే అడిగాడు విభీషణుడు. ‘సీతమ్మ ఎంతో విలువైనదిగా భావించే ఈ హారాన్ని నాకు ఇచ్చింది కదా, ఇందులో నా దేవుడు ఉన్నాడో లేడోనని చూస్తున్నాను. ఏ ఒక్క రత్నంలోనూ నా దేవుడైన రాముడు కనిపించలేదు. నా దేవుడు లేని వస్తువు ఏదైనా అది నాకు విలువ లేనిదే’ అన్నాడు హనుమంతుడు. ‘సరేనయ్యా! ఈ మణులలో నీ దేవుడైన రాముడు లేడు. పర్వతంలాంటి శరీరంతో తిరుగుతున్నావు కదా, అందులో మాత్రం ఉన్నాడేమిటి?’ అన్నాడు విభీషణుడు. ఆ మాటకు ఆవేశభరితుడైన హనుమంతుడు, తన పదునైన గోళ్లతో రొమ్ము చీల్చి గుండె తెరిచాడు. నివ్వెరపోతూ చూస్తున్న సభాసదులకు హనుమ హృదయంలో సీతారాములు కనిపించారు. వారంతా దిగ్భ్రాంతులయ్యారు. రాముడు హుటాహుటిన సింహాసనం దిగివచ్చి, హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. -సాంఖ్యాయన -
సీతారాములకు భారీ కానుకలు సమర్పించిన కంభం వాసి
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామీకి ప్రకాశం జిల్లా కంభంకు చెందిన భక్తులు మల్లేశ్వరరావు, రమాదేవి దంపతులు బుధవారం రెండు బంగారు కిరీటాలను బహుకరించారు. ఆ రెండు కిరీటాలను శ్రీ సీతారామచంద్రస్వామీ ఆలయ అధికారులకు వారు అందజేశారు. ఆ కిరీటాలను శ్రీ సీతారాములకు అలంకరించవలసిందిగా వారు ఆలయ అధికారులను కోరారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా మల్లేశ్వరరావు, రమాదేవి దంపతులు బుధవారం భద్రాద్రిలోని శ్రీసీతారాములను దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రూ.18 లక్షలతో ఆ రెండు కిరీటాలను తయారు చేయించినట్లు శ్రీ సీతారామచంద్రస్వామి భక్తులు మల్లేశ్వరరావు, రమాదేవి దంపతులు తెలిపారు. అంతేకాకుండా శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పర్వదినాల్లో శ్రావణ పౌర్ణమి ఒకటి. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని సీతారాములను దర్శించుకునేందుకు భద్రాద్రి దేవాలయానికి భక్తులు పొటెత్తారు.