వానర యోధుల్లో ముఖ్యులైన వారిలో సుషేణుడు ఒకడు. సుషేణుడు వానరరాజు సుగ్రీవుడికి మామ. వరుణుడి కొడుకైన సుషేణుడు వానర వైద్యుడు. అతడి ఔషధ పరిజ్ఞానం అనన్యసామాన్యం. రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు నాగాస్త్రానికి రామలక్ష్మణులు బంధితులై కుప్పకూలిపోయినప్పుడు, రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధానికి లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సుషేణుడి సూచనల మేరకే హనుమంతుడు సంజీవని పర్వతానికి చేరుకున్నాడు. సుషేణుడు తనకు సూచించిన ఓషధులను హనుమంతుడు గుర్తించలేక ఏకంగా సంజీవని పర్వతాన్నే పెకలించుకుని వచ్చాడు.
హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తే, సుషేణుడు దానిపైనున్న మొక్కలలో సంజీవకరణి, విశల్యకరణి వంటి ఓషధీ మూలికలను గుర్తించి, వాటితో రామలక్ష్మణులను స్వస్థులను చేశాడు. యుద్ధంలో మరణించిన వానరయోధులను తిరిగి బతికించాడు. గాయపడిన వారి గాయాలను నయం చేశాడు. రామ రావణ యుద్ధంలో శ్రీరాముడి ఘన విజయానికి సుషేణుడు తనవంతు తోడ్పాటునందించాడు.
రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. అయోధ్యలో జరగబోయే శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించడానికి సుగ్రీవ, అంగద, హనుమదాది వానర వీరులు, విభీషణుడు కూడా పుష్పక విమానంలో బయలుదేరారు. మార్గమధ్యంలో సుమంచ పర్వతం మీద శ్రీరాముడు తన పరివారంతో విడిది చేశాడు.
సుమంచ పర్వతం మీదనున్న వృక్షసంపదలో అంతులేని ఓషధీమూలికలను అందించే మొక్కలు, చెట్లు చూసి వానర వైద్యుడు సుషేణుడు అమితానంద భరితుడయ్యాడు. ఓషధీమూలికలతో నిండిన పర్వతం, చుట్టూ చక్కని మహారణ్యం ఉన్నా సుమంచ పర్వతప్రాంతంలోని ప్రజలు రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉండటం చూసి కలత చెందాడు. ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తనవంతుగా వైద్యసేవలు అందించాలని, తన శేషజీవితాన్ని ఈ పర్వతం మీదనే జపతపాదులతో గడపాలని నిర్ణయించుకున్నాడు. శ్రీరాముడికి తన మనోగతాన్ని తెలిపాడు.
‘శ్రీరామా! యుద్ధం పరిసమాప్తమైంది. నీకు ఘనవిజయం సాధ్యమైంది. అయోధ్యకు వెళ్లి పట్టాభిషిక్తుడవై, నీ ప్రజలను జనరంజకంగా పరిపాలించు. నేను ఇక్కడే ఉండి శేషజీవితాన్ని జపతపాదులతో గడపాలని, పరమశివుడు అనుగ్రహిస్తే, బొందితో కైలాసం పోవాలని భావిస్తున్నాను. అద్భుతమైన మూలికలతో నిండిన ఈ పర్వత పరిసర ప్రాంతాల్లోని ప్రజలు రోగపీడితులుగా ఉన్నారు. వారికి సేవలందిస్తాను. ఇందుకు అనుమతించు’ అని కోరాడు.
‘సరే, నీ మనోభీష్టం ప్రకారమే కానివ్వు’ అని పలికాడు రాముడు. సుషేణుడిని ఆశీర్వదించి పరివారంతో కలసి అయోధ్యకు పయనమయ్యాడు. సుషేణుడు సుమంత పర్వతంపైనే ఉంటూ శివుని గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి శ్రీరాముడికి సుషేణుడు గుర్తుకొచ్చాడు. సుషేణుడి యోగక్షేమాలను తెలుసుకుని రమ్మని హనుమంతుడికి చెప్పాడు. రాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు సుమంచ పర్వతానికి చేరుకున్నాడు.
అక్కడ ఏ అలికిడీ వినిపించలేదు. దట్టమైన చెట్ల మధ్య వెదుకులాడుతూ హనుమంతుడు కొంత దూరం ముందుకు సాగాడు. ఒకచోట చెట్టు కింద సుషేణుడి కళేబరం కనిపించింది. అప్పటికే అది పూర్తిగా అస్థిపంజరంగా మారింది. తపస్సులోనే సుషేణుడు శివసాయుజ్యం పొంది ఉంటాడని భావించిన హనుమంతుడు, అక్కడే ఒక గొయ్యి తవ్వి, సుషేణుడి కళేబరాన్ని అందులో పూడ్చిపెట్టాడు.
అక్కడ దొరికిన మల్లెలను కోసి తెచ్చి, సుషేణుడిని పూడ్చిన చోట ఉంచి, గుర్తుగా దానిపై కృష్ణాజినాన్ని కప్పాడు. హనుమంతుడు అక్కడి నుంచి నేరుగా అయోధ్యకు చేరుకుని, రాముడికి సుషేణుడి నిర్యాణ వార్త చెప్పాడు. వెంటనే రాముడు సీతా లక్ష్మణ సమేతంగా హనుమంతుడితో కలసి సుమంచ పర్వతానికి బయలుదేరాడు. పర్వతం మీదకు చేరుకున్నాక, సుషేణుడిని తాను పూడ్చిపెట్టిన చోటుకు వారిని తీసుకువెళ్లాడు హనుమంతుడు.
సుషేణుడి కళేబరాన్ని చూపించడానికి పైన తాను కప్పి ఉంచిన కృష్ణాజినాన్ని తొలగించాడు. ఆశ్చర్యకరంగా అక్కడ సుషేణుడి కళేబరం లేదు. దానికి బదులుగా ఒక శివలింగం కనిపించింది. శివలింగం మీద మల్లెపువ్వులు ఉన్నాయి. అభీష్టం మేరకు సుషేణుడు శివసాయుజ్యం పొందాడని వారికి అర్థమైంది. సమీపంలోని కొలనులో సీతా రామ లక్ష్మణ హనుమంతులు స్నానమాచరించి, శివలింగానికి పూజించడం ప్రారంభించాడు.
పూజ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రచండ వేగంతో గాలులు వీచసాగాయి. ఔషధ మూలికల పరిమళాన్ని నింపుకున్న ఆ గాలులు సోకినంత మేర ఆ ప్రాంతంలోని రోగపీడితులకు ఆశ్చర్యకరంగా రోగాలు నయమయ్యాయి. పూజ కొనసాగిస్తుంటే, శివలింగం క్రమంగా పెరగసాగింది. అక్కడ శివాలయాన్ని నిర్మిద్దామని శ్రీరాముడు అనుకున్నా, శివలింగం పరిమాణం పెరుగుతూ ఉండటంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడు.
సుషేణుడు నిర్యాణం చెందిన ప్రదేశంలో ఆవిర్భవించిన శివలింగంపై మల్లెపూలు, కృష్ణాజినం ఉండటంతో అక్కడ వెలసిన శివుడు మల్లికాజినస్వామిగా ప్రఖ్యాతి పొందాడు. మల్లికాజునస్వామి వెలసిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్‌లో టెక్కలి సమీపంలోని రావివలస గ్రామంలో ఉంది. - సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment