గోదావరి గట్టున కవయిత్రి మొల్లకు ఆలయం
– ఆంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పి రాజకుమార్ వుడయార్
రాజమహేంద్రవరం కల్చరల్ : వచ్చే ఏడాది కవయిత్రి మొల్ల జయంతి నాటికి గోదావరి గట్టున ఆమెకు ఆలయాన్ని నిర్మిస్తానని ఆంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పి రాజకుమార్ వుడయార్ వెల్లడించారు. సోమవారం నగర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో సరస్వతీఘాట్‌లో జరిగిన మొల్ల జయంతి ఉత్సవంలో శిల్పి వుడయార్ రూపుద్దిన విగ్రహాన్ని తాత్కాలికంగా ప్రత్యేక వేదికపై అమర్చారు. శిల్పి వుడయార్ మాట్లాడుతూ మొల్ల రచించిన రామాయణం పండితపామర రంజకంగా అందరినీ అలరిస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఫణి నాగేశ్వరరావు మాట్లాడుతూ సహజకవి పోతనామాత్యునికి సాహిత్య వారసురాలిగా మొల్లను పేర్కొన్నారు. మొల్ల తన రామాయణంలో ‘చెప్పమని రామచంద్రుడు చెప్పించిన పల్కు మీర చెప్పెద నేనెల్లప్పుడు..’ అని పేర్కొన్నారని, ఇది పోతనామాత్యుడు ఆంధ్రభాగవత రచనలో చెప్పిన ‘పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట..’ అన్న పద్యంతో సరితూగుతుందన్నారు. ప్రతి తెలుగవాడు మొల్ల రామాయణాన్ని, మొల్ల జీవితచరిత్రను తప్పని సరిగా అధ్యయనం చేయాలని కోరారు. మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ సాహిత్యం కొందరి ఏకఛత్రాధిపత్యంలో వెలుగుతున్న రోజుల్లో– స్త్రీవిద్య వెలుగు చూడని సమయంలో మొల్ల తెలుగులో రామాయణం రచించడం విశేషమన్నారు.
పేరూరి గంగాధరం మనుమరాలు పేరూరి అలేఖ్య మొల్ల వేషధారణలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా సభ్యులు మొల్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీజ్ఞానసరస్వతీపీఠం ట్రస్టీ తోట సుబ్బారావు, డాక్టర్ ఎల్లా అప్పారావు వుడయార్, రాయపూడి శ్రీనివాసరావు, జె.కాళేశ్వరరావు, మార్గాని నాగేశ్వరరావు, శాలివాహన సంఘం సభ్యులు పాల్గొన్నారు.