మన దేశంలో కవుల జయంతులు, వర్ధంతులు తప్పనిసరి తతంగాలుగా జరుగుతాయి. ఈ తప్పనిసరి తతంగాల్లో ఉత్సాహభరితమైన కార్యక్రమాలు ఉండవు. విందు వినోదాలు ఉండవు. కళా ప్రదర్శనలు ఉండవు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. మన దేశంలో కవుల జయంతులు, వర్ధంతుల కార్యక్రమాల్లో వక్తల ఊకదంపుడు ఉపన్యాసాలకు మించిన విశేషాలేవీ ఉండవు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇంగ్లండ్, స్కాట్లండ్‌లలోనైతే, రాబర్ట్ బర్న్స్ పుట్టినరోజు కవితాభిమానులకు పండుగరోజు. ఆయన పుట్టినరోజు అయిన జనవరి 25న ఏటా ఇంగ్లండ్, స్కాట్లండ్‌లలోని ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. ‘బర్న్స్ నైట్’ పేరుతో విందు వినోదాలు, కవితా గోష్ఠులు, సంప్రదాయ సంగీత, నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. బర్న్స్ కవిత్వాన్ని చదువుతూ అభిమానులు ఉర్రూతలూగిపోతారు. గాయనీ గాయకులు ఆయన గీతాలను ఆలపిస్తారు. వేడుకలు జరిగే వేదికలకు చేరువలోనే బర్న్స్ జ్ఞాపకాలను తలపోసుకుంటూ భారీస్థాయిలో విందు భోజనాలను ‘బర్న్స్ నైట్ సప్పర్’ పేరుతో నిర్వహిస్తారు.
ఈ వేడుకలకు విచ్చేసే అతిథులను సంప్రదాయ బ్యాగ్‌పైపర్ వాయిద్యాలను మోగిస్తూ స్వాగతం పలుకుతారు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా బర్న్స్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇంగ్లండ్, స్కాట్లండ్‌లలోని వివిధ నగరాల్లోని అభిమానులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించారు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన స్కాటిష్ కవి రాబర్ట్ బర్న్స్ 1759 జనవరి 25న పుట్టాడు. తన కవిత్వంతో స్కాటిష్ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు.
ఆయన 1796 జూలై 21న మరణించాడు. స్కాట్స్ భాషను, స్కాటిష్ కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవిదిగ్గజం రాబర్ట్ బర్న్స్ జ్ఞాపకార్థం నిర్వహించే ‘బర్న్స్ నైట్ సప్పర్’ కార్యక్రమాన్ని స్కాటిష్ పార్లమెంటు ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమంగా పరిగణిస్తుంది. స్కాటిష్ పార్లమెంటు కూడా ఈ సందర్భంగా విందు ఏర్పాటు చేస్తుంది. ఈ విందులో స్కాటిష్ బ్రోత్, పొటాటో సూప్, కల్లెన్ స్కింక్, కాక్–ఏ–లీకీ వంటి సూప్స్, గొర్రెమాంసంతో తయారుచేసే హ్యాగిస్ వంటి సంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు. ఒక కవి పుట్టినరోజును మరే దేశంలోనూ ఇలా ఒక పండుగలా జరుపుకోవడం కనిపించదు.
(చదవండి: ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు! ఎలా చేస్తారంటే..)
Comments
Please login to add a commentAdd a comment