వర్షాకాలపు రాత్రి
ఇంకా పక్షులు కిచకిచమంటూ
బహుళ మాండలికాల్లో
నీడల వలల్ని ఏరుకుంటున్నాయి
పొడవాటి చెట్ల నీడలు
జాడలేని అడవి దారుల్లోకి నడుస్తున్నాయి
నీడల నాగలి కలల్ని దున్నుతూనే ఉంది
సూర్యుడి చుట్టూ యింతవరకూ
తచ్చాడిన వింత వర్ణాలన్నీ
యిపుడు ఎక్కడకి మాయమయ్యాయి?
సాయంత్రపు రుతువు
కొండపక్క దారుల్లోకి ఎపుడు మాయమయిందో?
తల్లి జోకొడుతుంటే గాఢమయే
పసిపిల్లాడి కంటి మీద నిద్రలాగ
శబ్దాలన్నీ రాత్రి మౌనంలోకి కరుగుతున్నాయి
ఇప్పటివరకు మబ్బుల మధ్యే
తిరుగాడిన చంద్రలోలకం
ఇపుడు గదిలోకి కూడా ప్రవేశించింది
పచ్చి ఆకులు
ఒళ్ళంతా పరుచుకున్నట్టు
తేమగా, చలిగా
తూర్పు సముద్రపు గాలి.
అడవి అంచుల్లోంచి
చిత్తం చిత్తడిలోకి
బరువుగా ఇంకుతూ
యీ వర్షాకాలపు రాత్రి...
ఆకెళ్ళ రవి ప్రకాష్