‘శీతకాలం కోత పెట్టగ కొరడు కట్టీ ఆకలేసీ కేకలేశానే’ అని రాశాడు శ్రీశ్రీ. ‘జయభేరి’ పేరుతో ‘మహాప్రస్థానం’లో ఉన్న ఆ కవిత రాసే సమయానికి శ్రీశ్రీకి 23 ఏళ్లు. ‘పద్దెనిమిదేళ్లు దాటేస్తున్నాను. ఇంకా ఒక మంచి కవిత రాయలేదే’ అని బాధ పడతాడు మహాకవి జాన్ మిల్టన్. అతడు తన మాగ్నమ్ ఓపస్ ‘ప్యారడైజ్ లాస్ట్’ ప్రచురించే సమయానికి అరవై ఏళ్లు రాక తప్పలేదు. ‘సర్రియలిజం’ను సాహిత్యంలో ప్రవేశపెట్టిన ఝంఝామారుత ఫ్రెంచ్ కవి ఆర్థర్ రాంబో టీనేజ్‌లోనే రాయవలసిందంతా రాసేసి 20వ ఏటకు రిటైర్ అయిపోయాడు. అంటే 20 తర్వాత రాయాల్సింది ఏమీ లేదని అనుకున్నాడు. 80 ఏళ్ల వరకూ జీవించిన ఇంగ్లిష్ కవి విలియమ్ వర్డ్స్‌వర్త్ లేటు వయసులో అమెరికా వెళితే కుర్రవాళ్లు అతని పద్యాలను చదవడం మొదలుపెట్టారట. వర్డ్స్‌వర్త్ వారిని ఆపి ‘ఈ మధ్య రాసినవి చదవొద్దు. నా తొలి రోజుల్లో రాసినవి చదవండి. అవే నాకు ఇష్టం’ అన్నాడట.
కవిత్వానికి యువరక్తానికి గట్టి సంబంధం ఉంది. ఒంట్లో కండరాలు గట్టిపడి, నరాల్లో నెత్తురు ఉత్సాహంగా దౌడు తీస్తూ, కళ్లు చురుగ్గా చూస్తూ, గుండె సరైన కారణాలకు కొట్టుకుంటూ, స్పందించే సమయాలలో నాలుక పిడచగడుతూ ఉంటే గనక బహుశా కవిత్వమే వస్తుంది. టి.ఎస్. ఇలియట్ మాస్టర్ పీస్ ‘ది వేస్ట్ ల్యాండ్’ పాతికేళ్ల లోపలే రాసినా, జాన్ కీట్స్ అత్యుత్తమమైన కవిత్వమంతా పాతికేళ్ల లోపే రాసి మరణించినా వయసు తాలూకు తాజా స్పందన కవిత్వంలో ప్రవహించడమే కారణం. ‘నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నుడివితిని’ అని శ్రీనాథుడు రాసుకోవడం వల్లే అతడు చేసిన కవన కృషి మనకు తెలిసింది.
‘ఎమోషనల్ ఫెర్వర్ ఉన్నంత కాలం మంచి కవిత్వం వస్తుంది’ అంటాడో పాశ్చాత్య కవి. యవ్వనంలో ఉండే దూకుడు, నిలదీత, ఆగ్రహం, తిరుగుబాటు, అరాచకత్వం, బేఫర్వా, అమరత్వ అభిలాష... కవికి భావోద్వేగాల ఆవేశాన్ని ఇస్తాయి. కవిత్వం ఉబుకుతుంది. ధార అవుతుంది. స్వచ్ఛదనం దానికి సజీవత్వం ఇస్తుంది. తెలుగులో భావ, అభ్యుదయ, విప్లవ కవులు, ఆ తర్వాత స్త్రీవాద, దళిత, మైనారిటీ, బహుజన కవులు ఐతే ఆ ఉద్యమాల యవ్వనంలో లేదా తాము యవ్వనవంతులుగా ఉన్నప్పుడో రాసిన కవిత్వంలోని పదును, వాక్యం తాకి చూస్తే చీరుకునే వాదర ఆ తర్వాతి స్థిర పంక్తులలో కనిపించవు. ఈ ఒక్క గుణం చేతనే కవిత్వం ఎప్పటికప్పుడు యువ మునివేళ్లను వెతుక్కుంటూ వెళ్లి ప్రతి తరంలోనూ మరుజన్మ పొందుతూ ఉంటుంది.
‘వత్తి జేసి నూనె బోసి బతుకును వెల్గించినందుకు కొడుకు ఈ అమ్మదీపాన్ని గాలికి పెట్టి పోయిండు’ అని రాస్తాడు తగుళ్ల గోపాల్. మహబూబ్ నగర్ నుంచి కవిత్వం రాస్తున్న ఇతడు ‘దండ కడియం’ పేరుతో కవిత్వం వెలువరించాడు. ‘టేబుల్‌పై ఎన్ని కూరలున్నా మాటల్ని కలుపుకుని తిన్నప్పుడే కడుపు నిండా తిన్నట్టుంటుంది’ అంటాడు ‘నాలుగు గిన్నెల కూడలి’ కవితలో. మరో కవి పల్లిపట్టు నాగరాజు ‘దూడ మూతి వాసన’ కవితలో ‘మనలా మనుషులైతే కులం వాసనో మతం వాసనో వచ్చేదేమో కసువు తినే బిడ్డలు కదా... కవుడూ కుచ్చడం తెలీని మూగజీవాల ప్రేమ వాసన’ అని రాస్తాడు. ఇతనిది చిత్తూరు జిల్లా. ‘యాలై పూడ్సింది’ ఇతని పుస్తకం. ‘ఇవ్వాళంతా వాన కురిసింది. నువ్వు లాలనగా తాకినట్టు గాలి. నువ్వు కోపంతో తోసినట్టు వరద. నువ్వు నిదానంగా కూర్చున్నట్టు ఊరు’ అని రాస్తాడు నంద కిశోర్ తన కవిత్వ పుస్తకం ‘యథేచ్ఛ’లో. ఇతనిది వరంగల్.
మొన్న ప్రకటించిన ‘సాహిత్య అకాడెమీ యువ పురస్కారం– 2021’కి తుది పోటీలో నిలిచిన ఎనిమిది పుస్తకాలూ కవిత్వానివే కావడం చూస్తే కవిత్వం యువ కవులను అంటి పెట్టుకునే ఉన్నది అనిపిస్తుంది. గత యాభై ఏళ్లలో అక్షరాస్యత తాకిన వర్గాల నుంచి, గత రెండు మూడు దశాబ్దాలలో తాగునీరు, సాగునీరు చూసిన పల్లెల నుంచి వస్తున్న ఇటీవలి కవులు తమ ప్రాంతాల, నేపథ్యాల, జీవనాల గాథలు గాఢంగా కవిత్వంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ‘ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో నిర్మితమైన ఉపగ్రహాలు అడవుల గర్భంలో దాగున్న ఖనిజాలను లొకేట్ చేస్తాయి... ఆదివాసీ నవ్వు పువ్వులను చిదిమేస్తాయి’ అని రాస్తాడు సురేంద్రదేవ్ చెల్లి తన ‘నడిచే దారి’ పుస్తకంలో. ఇతనిది యానాం. తండ హరీష్ గౌడ్, బండారి రాజ్‌కుమార్, రమేశ్ కార్తిక్ నాయక్, జాని తక్కెడ శిల... వీరంతా ఈ పురస్కారం కోసం చివరి పట్టికలో నిలిచినవారిలో ఉన్నారు. పోటాపోటీగా ఢీకొన్నారు.
యువ సాహిత్యకారులను ప్రోత్సహించడానికి అకాడెమీ ‘యువ పురస్కారం’ ప్రకటించిన గత కొన్నేళ్ల నుంచి యువతీ యువకులు ఉత్సాహంగా చేయదగ్గ కృషి చేస్తున్నారన్నది వాస్తవం. చిన్న వయసులో గుర్తింపు దక్కితే పొంగిపోతున్నారన్నదీ వాస్తవం. అయితే ఆ తర్వాతి కొనసాగింపు గురించే కొందరికి చింత ఉన్నది. చిన్న వయసులో ఎక్కువ గుర్తింపు వస్తే సృజన క్షుద్బాధ తీరి ఒడ్డున కూర్చుంటారని హెచ్చరించే పెద్దలు ఉన్నారు. ఇప్పటివరకూ యువ పురస్కారం పొందిన వారు ఆ పురస్కారం పొందాక ఏ మేరకు కృషిని హెచ్చింపు చేసుకున్నారో పరిశీలించుకోవాల్సి ఉంది. పెద్ద గీత గీయాల్సి ఉంది. యువకులే భావి సాహిత్య నిర్మాతలు. ఆశలు వారిపైనే! కాకపోతే ప్రవాహాన్ని వీడ వద్దని, తెడ్డు వదల వద్దని, ఈత వచ్చేసిందని పొగడ్తల సుడిలో దూకేయవద్దని హితవు!! యువ కవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Comments
Please login to add a commentAdd a comment