‘‘అమ్మా, నా బంగారం! నిజానికి మనం అంతా అందరికీ బాధ్యులమే. కానీ ఈ సత్యం మానవాళి గుర్తించటం లేదు. గుర్తించిననాడు భూమి స్వర్గంగా మారిపోతుంది.’’ (కరమజోవ్ సోదరులు)తెలుగు సాహిత్యం వరకూ గతేడాది చివర్లో ఒక అద్భుతం సంభవించింది. అది రష్యన్ మహానవల ‘బ్రదర్స్ కరమజోవ్’కు తెలుగు అనువాదం రావడం! ఆ నవల సృష్టికర్త, ఈ పదాన్ని దాని అక్షరమక్షరంతో నిజం చేసిన ఫ్యోదర్ దోస్తోవ్‌స్కీ (1821–1881) ద్విశతాబ్ది జయంతి కూడా గతేడాదే(నవంబర్ 11) కావడం మరో విశేషం. ఆ సందర్భాన్ని ఉత్సవం చేయడం కోసమే ‘రష్యన్ సాహిత్యాభిమాన వేదిక’ ఈ బృహత్ కార్యానికి పూనిక వహించింది.
తొమ్మిది వందల పేజీల ఈ నవలను ‘సాహితి’ ప్రచురించింది. దీని అనువాదకురాలు అరుణా ప్రసాద్ ఒక జీవితకాలానికి సరిపడా ప్రేమకు అర్హురాలు! ఇంత ఊరించిన తర్వాత దీన్ని చదవడానికి పాఠకుడు ఆతృత పడితే దెబ్బతినొచ్చు. మొత్తంగా పుస్తకంలో ఏం ఉందో(‘పితృహత్య’) మొదటే తెలిసిపోతుంది. కాబట్టి, ఆ క్షణంలో ఏం మాట్లాడుకుంటున్నారో అదే ముఖ్యం. రంగస్థలంపై పాత్రలు వచ్చి, అంతరంగాన్ని ‘ఏకపాత్రాభినయం’లా ఎలా ఆవిష్కరించుకుంటాయో ఇవీ అలాగే చేసినట్టుగా తోస్తుంది. కానీ ఆలోచిస్తే అంత అవాస్తవం ఏమీ అనిపించదు. ఒక ఉద్వేగంలోకి వెళ్లిన మనిషి ఎలా వదరుతాడో ఇక్కడా అంతే! అయితే సంభాషణల్లో జీవితపు మౌలిక ప్రశ్నల్ని ఎలా వెతుక్కుంటారన్నది ముఖ్యం.
ఎన్ని చిత్తవృత్తులు, ఎన్ని వృత్తాంతాలు, ఎన్ని ఒప్పుకోళ్లు, ఎన్ని వేడుకోళ్లు! ఇందులో ప్రతి ఒక్కరూ ‘పాపం’ చేసినట్టే ఉంటారు. దానికి తగిన ‘శిక్ష’ అనుభవిస్తూనే ఉంటారు. అల్పులు, ఉన్మత్తులు, మొరటు మనుషులు, ఏ పెద్దరికమూ నిలుపుకోలేని హాస్యగాళ్లు... అసలు ‘నీచుడు’ అనుకునేవాడిలోనూ అత్యంత సున్నితపు పొరలు ఉంటాయని తెలుస్తున్నప్పుడు ఆనంద బాష్పాలు కారుతాయి. తను చచ్చేంత డబ్బు అవసరంలో ఉన్నా, ఆ డబ్బు కోసం అవసరమైతే తండ్రినే చంపేంత కోపంగా ఉన్నా, అదే డబ్బు అడిగితే తనకు కాత్యా ఇస్తుందని తెలిసినా, ఆమెను కాదని గృషెంకాను ప్రేమిస్తున్నప్పడు, కాత్యాను ఆ డబ్బు అడగలేకపోయానని ద్మిత్రీ విచారణలో చెప్పడం మానవాంతరంగపు లోతుకు అద్దం. ఇంతే లోతైన మరో ఘట్టం– ‘ఎల్డర్’ జోసిమా దగ్గర తన తప్పును ఒప్పుకున్న ‘రహస్య అతిథి’... ఆయన ముందు నైతికంగా తగ్గిపోయానని భావించి తిరిగి ఆయననే చంపాలనుకోవడం! మన మూలమూలలా ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, రచయిత ఎంత సూక్ష్మాంశాల దగ్గరికి వెళ్తాడంటే ఇంత సున్నితమైన నవల మరొకటి ఉందా అనిపిస్తుంది.
ఒకే అమ్మాయి (గృషెంకా) కోసం తండ్రీ కొడుకులు ఫ్యోద్ర్, ద్మిత్రీ పోటీ పడటం; ఒకే అమ్మాయి(కాత్యా) కోసం అన్నాదమ్ములు ద్మిత్రీ, ఇవాన్ బరిలో ఉన్నట్టనిపించడం... జీవితపు చేదు వాస్తవం. ఇందులో ముగ్గురు సోదరులైన ద్మిత్రీ ఒక మృగంలానూ, ఇవాన్ మేధావిలానూ, అల్యోషా ఆధ్యాత్మిక జీవిగానూ కనబడతారు. అయితే దోస్తోవ్‌స్కీకి మృగాల పట్ల తక్కువ అభిప్రాయం లేదు. ‘మృగాలెప్పుడూ, ఎన్నటికీ మానవుడంత క్రూరంగా ఉండజాలవు’.
బహు గొంతులు, సూక్ష్మంలోనూ సూక్ష్మం దోస్తోవ్‌స్కీని అనితర సాధ్యమైన రచయితగా నిలబెడతాయి. ప్రతి పాత్రలోనూ రచయిత ఎంతగా పరకాయ ప్రవేశం చేస్తాడంటే, అదింక ఇంకోలా మాట్లాడే వీలున్నట్టు కనబడదు. చిన్న పాత్రలైన గ్రిగొరీ, మేడమ్ హోలకోవ్, లిజి, కొల్యాకు కూడా ఇది వర్తిస్తుంది. ఆఖరికి, తుంటరి పిల్లాడు ఇల్యూష గుండుసూదిని గుచ్చిన రొట్టెను విసరడంతో తిని చనిపోయిన కుక్క జుట్చ్‌కా కూడా ఒక ‘వ్యక్తి’గా దర్శనమిస్తుంది. అదే మథనంతో మరణానికి చేరువైన ఇల్యూషా కూడా అంతే నొప్పి పుట్టిస్తాడు. జీవితాన్ని చివరికంటా శోధించి, అందులోని సర్వ వికారాల్నీ తడుముతూ కూడా అది ప్రేమకు అర్హమైనదే అని చాటడం దోస్తోవ్‌స్కీ లక్ష్యం! అందుకే దేవుడి సృష్టిలోని సకల దుర్మార్గాలనూ పరిపరి విధాలుగా ఇవాన్ ఎత్తి చూపినప్పుడు కూడా దానికి స్పందనగా– తనను నిర్బంధించిన మహా ధర్మాధికారి పెదవులను క్రీస్తు ముద్దాడిన కథనాన్ని పునర్జీవిస్తూ – అల్యోషా, అన్న పెదవుల మీద ముద్దు పెట్టుకుంటాడు.
ఆధ్యాత్మిక రాజ్యస్థాపన ద్వారానే నిజమైన సోదర భావం నెలకొంటుందని దోస్తోవ్‌స్కీ విశ్వాసం. అరెస్టయ్యి, గంటలకొద్దీ సాగిన విచారణ తర్వాత, అలసటతో నిద్రపోయినప్పుడు... తనకు తలగడ పెట్టే దయ చూపినవారెవరని ద్మిత్రీ కదిలిపోతాడు. అదెవరో రచయిత చెప్పడు. కానీ ఎంతటి నిరాశలోనైనా ఒక దయగల చేయి ఎప్పటికీ ఉంటుందని చాటుతాడు. ‘అటువంటి ఒక్క జ్ఞాపకం ఉన్నా అది కూడా మనను కాపాడటానికి ఉపయోగపడుతుంది’ అని ముగింపులో వీడ్కోలు చెబుతూ పిల్లలకు అల్యోషా చెప్పేది ఇందుకే. అసలు హంతకుడు ఎవరో బయటపడేప్పటికి ఈ నవల కాస్తా సస్పెన్స్ థ్రిల్లర్ రూపు తీసుకుంటుంది. కానీ దీని విస్తృతి రీత్యా ఆ వర్గానికి పరిమితం చేయడం దీన్ని సరైన అంచనా కట్టకపోవడమే అవుతుంది. ఇది సమస్త మానవాళి పశ్చాత్తాపాల చరిత్ర! జీవన మధువును నింపుకోవడానికి ప్రతి ఒక్కరూ పడే తహతహ. పాపభీతితో కుమిలిపోయే ఎందరో జీవన్మృతుల వ్యథ. 1880లో ఈ నవల వచ్చిన 4 నెలలకు దోస్తోవ్‌స్కీ మరణించాడు (ఈ ఫిబ్రవరి 9న 140వ వర్ధంతి.) ఆ లెక్కన ఇది ఒక మహారచయిత చివరి వీలునామా కూడా! ‘అద్భుతాలను’ ఆశిస్తాడు మనిషి. కానీ అద్భుతం వల్ల కాక మామూలుతనం వల్ల దాని విలువ పెరగాలి. ఈ పుస్తకం ఎంత మామూలుదంటే, ఆ మామూలుతనమే అద్భుతంగా తోస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment