కళింగ సాహిత్య ఉత్సవంలో లక్ష్మీ మందర్‌ను సన్మానిస్తున్న దృశ్యం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ బ్లాక్ మఝిగుడ గ్రామానికి చెందిన లక్ష్మీ మందర్ అక్షరజ్ఞాన మెరుగని ఆదివాసీ మహిళ. అయితేనేమి ఆశు కవయిత్రిగా ఆమెకు ప్రత్యేకత సాధించింది. గంటల తరబడి అనర్గళంగా, ఆశువుగా పాడగలిగే సామర్థ్యం ఆమె కలిగి ఉంది.
ఆశువుగా ప్రకృతి వర్ణనలో ఆమెకు ఆమెసాటి. ఆదివాసీ జనజీవన విధివిధానాలు, సంప్రదాయ పండగలను ఇతి వృత్తాలుగా చేసి పాటలుగా మలిచి అక్కడికక్కడే ఆశువుగా పాడుతూ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆదివాసీ జానపద గీతాలాపనకు ఆమె పెట్టింది పేరు.
ఆదివాసులు ఆమెను కారణజన్మురాలుగా చూస్తారు. తన నిజ జీవితంలో ఎదురొచ్చిన సమస్యలను లెక్కచేయక, అలుపెరుగని రీతిలో పాటలు పాడడం ఆమె నైజం. ఆశువుగా పాడడం తనకు భగవంతుడిచ్చిన వరమని, కొండ కోనల్లో కర్రలు సేకరిస్తున్నప్పుడు, పశువులను కాస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, కడకు పరుల పొలాల్లో కూలి పని చేస్తున్నప్పుడు తన నోట పాటలు జాలువారుతాయని, తాను ఏమాత్రం మౌనంగా ఉన్నా తన తోటివారు పాడమని పురమాయించడం పరిపాటి అని తన పాటల ఒరవడిని వివరించింది.
గృహయోగం లేదు
తన భర్త పేదవాడై దారిద్య్రంలో ఉన్నప్పటికీ, కన్న పిల్లలు పెద్దవారై ఎవరంతట వారు బతుకుతున్నారని, ప్రస్తుతం భర్తతో పాటు ఏ పూటకాపూట కూలి చేస్తూ బతుకు బండి లాగిస్తున్నట్లు ఆమె చెప్పింది. ఉండేందుకు సరైన ఇల్లు లేక ఒక పూరి గుడిసెలో కాపురం చేస్తున్నట్లు చెప్పింది.
గ్రామంలో అనేక మంది ఇందిరా ఆవాజ్ యోజన పథకంలో ఇళ్లను పొందారని, తనకు మాత్రం మంచి ఇంట్లో ఉండే యోగాన్ని భగవంతుడు కలిగించలేదని వాపోతోంది. ప్రభుత్వం తనకు అందిస్తున్న రూ.300 వృద్ధాప్య పింఛన్ తనకు ప్రస్తుతం ఆధారమని చెప్పింది.
ఇటీవల ఈ నెల 7,8 తేదీలలో కొరాపుట్‌లో జరిగిన జాతీయ స్థాయి కళింగ సాహిత్య ఉత్సవంలో తన ప్రతిభను మెచ్చిన పెద్దపెద్దోళ్లందరు తనకు చేసిన సన్మానం తన జీవితానికి లభించిన పరమార్థమని చెప్పింది. సభికుల కోరికపై ఆమె తనకు జరిగిన సన్మానాన్ని ఆశువుగా పాడి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment