ధిక్కార స్వరం.. పోరాటమే ఊపిరి | today Kaloji anniversary day | Sakshi
Sakshi News home page

ధిక్కార స్వరం.. పోరాటమే ఊపిరి

Published Thu, Nov 13 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

ధిక్కార స్వరం.. పోరాటమే ఊపిరి

నేడు కాళోజీ వర్ధంతి

తప్పు ఎక్కడ జరిగినా చూస్తూ ఉండే రకం కాదాయన. తన కలంతో అది తప్పంటూ ఎలుగెత్తి చాటేవారు. సమన్యాయ పాలన దక్కాలనేది ఆయన అభిమతం. అందుకే నిజాం ప్రభువులతోనూ తలపడ్డారు. పుట్టుక  నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అని ఎలుగెత్తి చాటారు. కవిగా.. పోరాట యోధుడిగా.. ముందుకుసాగారు. ఆచరణవాదిగా.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఆ మహామనీషి మరెవరో కాదు.. కాళోజీ నారాయణరావు. అందరూ కాళన్నగా పిలుచుకునే ఆయన వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
 
కాళోజీ.. ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. గుండెల నిండా ధిక్కారం నింపుకున్న ధీరుడు. చిన్నప్పటి నుంచే సాహిత్యాన్ని ఒంటబట్టించుకున్న మహామనీషి ఆయన. తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలతో ఈ పేరు మమేకమైపోయింది. లొల్లి లొల్లికి జతకట్టి, లొల్లికెల్ల.. పెద్ద దిక్కైన నీపేరు, పృథ్విలోన.. ఎల్లకాలము గుర్తుండు, చల్లనయ్య.. కరిగి పోతివా కాళన్న, కరుణ హృదయ..  అంటూ నల్ల ఉపేందర్, ఆయన కుమార్తె నల్ల ప్రభావతీదేవి కాళోజీ జీవిత చరిత్రను శతకంగా రాశారు. 9 సెప్టెంబర్ 1914న రంగారావు, రమాబాయి దంపతులకు కాళోజీ నారాయణరావు జన్మించారు.

మడికొండలో ప్రాథమిక విద్య, హన్మకొండ, హైదరాబాద్‌లలో ఉన్నతవిద్య అభ్యసించారు. కాళోజీ సోదరుడు రామేశ్వరరావు ఉర్దూ సాహిత్యంలో గొప్ప కవి. షాద్ కలం పేరుతో రచనలు చేసేవారు. అన్నదమ్ములిద్దరినీ చిన్న, పెద్ద కాళోజీగా పిలిచేవారు. కాళోజీ నారాయణరావు 15 ఏళ్ల వయసు నుంచే ఉద్యమాల్లోనూ, కవితా వ్యాసాంగంలోనూ మునిగితేలేవారు. ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభ, నిజాంస్టేట్ కాంగ్రెస్‌లో ఉంటూ నైజాం వ్యతిరేక పోరాటంలో పనిచేశారు. 1940లో రుక్మిణీబాయిని వివహం చేసుకున్నారు. 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా, ఆంధ్రసారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలలో సభ్యుడిగా, తెలంగాణ  రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.
 
కాళోజీ శతజయంతి ఉత్సవ కమిటీ
కాళోజీ స్ఫూర్తిని ముందుతరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రముఖచిత్ర దర్శకుడు, చిత్రకారుడు, కవి బి.నర్సింగరావు అధ్యక్షుడిగా, ప్రముఖకవి వరవరరావు గౌరవాధ్యక్షుడిగా, ప్రముఖ మానవహక్కుల వేదిక కార్యకర్త జీవన్‌కుమార్ సమన్వయకర్తగా, ప్రముఖ న్యాయవాదులు కె.ప్రతాప్‌రెడ్డి , కేశవరావుయాదవ్ సలహాదారులుగా కాళోజీ శత జయంతి ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. 2013 సెప్టెంబర్ 9న హన్మకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో కాళోజీ శతజయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామక లక్ష్మణమూర్తికి కాళోజీ పురస్కారం అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తికి, ప్రముఖ ఫోటోగ్రాఫర్, చిత్రకారుడు జి.భరత్‌భూషణ్‌కు ఆత్మీయ సత్కారం చేశారు. ఆ తరువాత ఏడాది పాటు తెలంగాణలోనూ, ఆంధ్రాప్రాంతంలోనూ కాళోజీ సాహిత్యంపై సెమినార్లు నిర్వహించారు. బి.నర్సింగరావు దర్శకత్వంలో మన కాళోజీ డాక్యుమెంటరీ నిర్మించారు.

అమ్మంగి వేణుగోపాల్, ఎన్.వేణుగోపాల్, బి.నర్సింగరావు ప్రచురణకర్తలుగా కాళోజీ జీవితం-సమగ్ర సాహిత్యం సంపుటాలను వెలువరించారు. వేదకుమార్ అధ్వర్యంలో కాళోజీ జీవితంపై సంక్షిప్తంగా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కాళోజీ ఎస్సెన్షియల్ పుస్తకం వెలువరించారు. పాలపిట్ట పత్రిక, దక్కన్ డాట్ కామ్‌లు ప్రత్యేక సంచికలు వెలువరించాయి. కేయూ తెలుగుశాఖ ఆచార్యులు బన్న అయిలయ్య ప్రజాకవి కాళోజీ కవిత్వం అనే పుస్తకం వెలువరించారు. ప్రముఖ కవి లోచన్ కాళోజీపై వ్యాసాల సంపుటి వెలువరించారు.  2014 సెప్టెంబర్ 9వతేదీన కాళోజీ జయంతి రోజున కాళోజీ పేరిట అతిపెద్ద ఆడిటోరియం నిర్మించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.  
 
దేశంలోనే అరుదైన కవి
కాళోజీ నారాయణరావు ఆచరణవాది. ఏంచేసినా ప్రత్యక్ష కార్యాచరణతోనే చేయడం అలవా టు. స్వతహాగా సున్నిత మనుస్కుడైన కాళోజీ తన భావాలను, ధర్మాగ్రహాన్ని కవితలుగా మలిచారు. భారతదేశ సాహిత్య చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు పలు పోరాటాల్లో పాల్గొంటూ ఎప్పటికప్పుడు ఆయా పరిస్థితుల్లోని దౌర్జన్యాలను, వ్యక్తులను ఎండగడుతూ రన్నింగ్ కామెం టరీలా  కవిత్వం రాసిన వాళ్లు కాళోజీ తప్ప మరెవరూ లేరంటే అతిశయోక్తికాదు.

అలా రాసిన వాటిలో అణాకథలు(1941), నా భారతదేశయాత్ర(1941, బ్రెయిల్‌ఫోర్డ్ రచించిన రెబల్ ఇండియా పుస్తకానికి అనువాదం), కాళోజీ కథలు(1943), పార్ధివ్యయము(1946), నాగొడవ(1953), తుదివిజయం.. మనది నిజం(1962), తర్వాత వరుసగా నాగొడవ పరాభవ వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం అంటూ నాగొడవను1967లో ముగించారు. ఆ తర్వాత జీవనగీత(1968 ఖలీల్ జిబ్రాన్ రచించిన ద పొయెట్‌కి అనువాదం), తెలంగాణ  ఉద్యమ కవితలు(1969) తర్వాత మళ్లీ నాగొడవ (యువభారతి- 1974), నాగొడవ(1975-77), ఇదీ నాగొడవ (కాళోజీ ఆత్మకథ -1995), బాపూ!బాపూ!!బాపూ!!!(1995) మొదలైన రచనలతో పాటు అంజలి(ఎన్‌సీ ఫడ్కే రచించిన గ్రంథానికి అనువాదం), ఖలీల్ జిబ్రాన్ కవితలకు అనువాదాలు, భారతీయ సంస్కృతి(సానె గురూజీ రచించిన మరాఠీ గ్రంథానికి అనువాదం) మొదలైన ఆముద్రిత రచనలు ప్రచురణ కావాల్సి ఉంది.
 
మోహనరాగంలో‘మాతృదేశం’
1940లో ఒక వారపత్రికలో ప్రముఖ ఆంగ్లకవి సర్ వాల్టర్ స్కాట్ రాసిన ‘లే ఆఫ్ ద లాస్ట్ మిన్‌స్ట్రెల్’ గేయంలోని ‘బ్రీత్స్ దేర్ ఏ మాన్ విత్ సోల్ సో డెడ్, హు హేజ్ నాట్ సెడ్ అన్‌టు హిమ్‌సెల్ఫ్, దిస్ ఈజ్ మై ఓన్ నేటివ్ లాండ్’ అనే చరణాలను ప్రచురించి అదే భావంతో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించేలా దేశభక్తి ప్రభోదాత్మక గేయాన్ని రాసి పంపాలని ప్రకటించారట. దీనికి స్పందించిన కాళోజీ ఓ గేయాన్ని రాసి పంపారు.

ఈ మాతృదేశ గీతాన్ని 1943 మే 26న హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపనోత్సవం రోజున జరిగిన దశమాంధ్ర మహాసభలో పాడి వినిపించారట. మళ్లీ ఇటీవల నిట్ ఆడిటోరియంలో జరిగిన కాళోజీ జయంతి వేడుకల్లో వరంగల్‌లోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ కుప్పా పద్మజ ఆధ్వర్యంలో కళాశాల కర్ణాటక సంగీత ఉపన్యాసకులు పాలకుర్తి రామకృష్ణశర్మ స్వరపరిచిన ఈ గీతాన్ని విద్యార్థినులు కళ్యాణి, శ్రీవాణి, స్వప్న పాడి వినిపించారు. రామకృష్ణశర్మ , మోహనరాగంలో,  మిశ్రమ చాపు తాళంలో ఈ గీతాన్ని స్వరపరిచారు.

Related News By Category

Related News By Tags

Advertisement