madikonda
-
ఇది ప్రారంభం మాత్రమే: కేటీఆర్
సాక్షి, వరంగల్: మడికొండ ఐటీ సెజ్‌లో నిర్మించిన టెక్ మహీంద్ర, సైయంట్ ఐటీ సెంటర్లను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రారంభం మాత్రమేనన్నారు. తెలంగాణలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తున్నామని తెలిపారు. వరంగల్-హైదరాబాద్ హైవేను పారిశ్రామిక కారిడార్‌గా మార్చివేస్తామన్నారు. మంత్రి ఈటల రాజేందర్ చెప్పినట్లుగా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి వరంగల్, కరీంనగర్‌తో పాటు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మంలో కూడా కంపెనీలను ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అడిగిన వెంటనే తెలంగాణలో కంపెనీలు నెలకొల్పిన టెక్ మహీంద్రా సీఈఓ గుర్నాని, సైయంట్ ఎండీ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు నినాదమే తెలంగాణ ఆవిర్భావం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమానికి పెట్టాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పటికీ నిరుద్యోగ యువత సంఖ్య ఎక్కువగా ఉంది. 12-13 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణ ఇస్తున్నాం. రానున్న రోజుల్లో లైఫ్ సైన్స్ పరిశ్రమలు కూడా వస్తాయి. తెలంగాణలోని గ్రామీణ యువతకు మంచి స్కిల్‌తో విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పరిశ్రమల్లో సింహభాగం మన తెలంగాణ యువతకే వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని కేటీఆర్ తెలిపారు. మిల్లు స్థానంలో మెగా టెక్స్టైల్ పార్క్ ‘యాదాద్రి, జనగామ, స్టేషన్ ఘన్పూర్, పరకాల లాంటి చిన్న ప్రాంతాల్లోనూ చేనేత పరిశ్రమలను నిర్మిస్తాం. వరంగల్‌లో అజంజాహి మిల్లు స్థానంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తున్నాం. మహబూబాబాద్‌లో ఆహార శుద్ధి పరిశ్రమ సెంటర్, ఖమ్మం, కరీంనగర్లో ఐటీ హబ్‌ను ప్రారంభిస్తాం. టెక్ మహీంద్రా సీఈఓ గుర్నాని సలహా మేరకు మామూనూర్ ఎయిర్‌పోర్టు పునరుద్దరణతో పాటు హెలిపాడ్ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీపీ గుర్నా, సైయంట్ ఎండీ మోహన్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని కంపెనీలు రావాలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఐటి మంత్రి కేటీఆర్ చొరవతో వరంగల్‌కు టెక్ మహీంద్రా, సైయంట్ వంటి రెండు పెద్ద కంపెనీలు రావడం ఆనందంగా ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే మరిన్ని పరిశ్రమలు, కంపెనీలు రావాలని కోరుతున్నామన్నారు. గ్రామీణ యువత కోసం ప్రణాళికలు రూపొందించాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు పరిశ్రమలు అనగానే ఒక్క హైదరాబాద్ కు మాత్రమే పరిమితమయ్యేవి. ఇప్పుడు కేటీఆర్ చొరవతో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలు రావడం గొప్ప విషయం. ఇవి గ్రామీణ యువతకు ఉపయోగపడేలా కృషి చేయాలి. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్లో చదువుకున్న గ్రామీణ యువత సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ యువత కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఐటీ మంత్రి కేటీఆర్‌ను ఈటల కోరారు. చదవండి: స్టార్టప్‌ల రాష్ట్రంగా తెలంగాణ -
సోమిడిలో అస్థిపంజరం లభ్యం
మడికొండ : సోమిడి శివారులోని వ్యవసాయ బావిలో అస్థిపంజరం లభ్యమైన సంఘటన జరిగింది. మడికొండ ఎస్సై కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం శాటిపల్లి అశోక్‌రావు అనే ఉపాధ్యాయుడు శనివారం తన వ్యవసాయ బావిలో క్రేన్ సహాయంతో పూడిక తీయడానికి వెళ్లాడు. పూడిక తీస్తుండగా మొదటగా చెత్త వచ్చిన అనంతరం ప్యాంట్, తర్వాత షర్టుతో పాటు అస్థి పంజరం వచ్చినట్లు తెలిపారు. వెంటనే మడికొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి ఇన్స్పెక్టర్ రాపెల్లి సంతోష్‌కుమార్, ఎస్సై కుమారస్వామి సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతుడికి ఎలాంటి అనవాళ్లు లేవని కేవలం అస్తిపంజరం మాత్రమే ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. స్థానిక వీఆర్ఓ సురేందర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మడికొండ ఇన్స్పెక్టర్ శ్రీధర్ బదిలీ
వరంగల్ క్రైం: బాలుడు, అతడి తల్లిపై అమానుషంగా ప్రవర్తించారనే ఆరోపణలపై మడికొండ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌పై పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు బదిలీ వేటు వేశారు. ‘బాలుడిపై పోలీసుల దాష్టీకం’అనే శీర్షికన ఈనెల 3న ‘సాక్షి’మెయిన్‌లో కథనం ప్రచురితమైంది. దీంతో పలు ప్రజా సంఘాలు మడికొండ ఘటనను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు. అదేవిధంగా బాధితులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని సంప్రదించారు. మడికొండ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌ను ఈనెల 7న సీడబ్ల్యూసీ ఎదుట హాజరుకావాలని ఆమె నోటీస్ జారీ చేశారు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. శ్రీధర్ మడికొండ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించి 8 నెలలే అవుతోంది. -
నల్లధనం వెలికితీతలో విఫలం
సీపీఐ జాతీయ సమితి సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి మడికొండ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నల్లధనాన్ని వెలికితీస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మడికొండలో బుధవారం జరిగిన పార్టీ మహాసభలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోదీ జన్‌ధన్ పేరుతో జీరో ఖాతాలను తెరిపించి పేదలను మోసం చేస్తున్నారని, బడా పెట్టుబడిదారులకు, కోట్ల రూపాయల పన్ను ఎగవేతదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కార్యదర్శి టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో మోyì ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలలో ఏ ఒక్కటి అమలు పరచలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుంచి పీజీ విద్యపై కేసీఆర్ చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయని విమర్శించారు. సీపీఐ గ్రామశాఖ కార్యదర్శి మాలోతు శంకర్ అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు మేకల రవి, గోలి రాజిరెడ్డి, మద్దెల ఎల్లేష్, మడ్డి రాజారాం, సమ్మయ్య, నర్సింగం, మద్దెల వెంకటస్వామి, మణెమ్మ, రజిత, జ్యోతి, రమ్య, వెంకటేష్ పాల్గొన్నారు. -
రేపు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభం
విద్యారణ్యపురి : మడికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను ఈనెల 4న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభిం^è నున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్. సరిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రారంభోత్సవంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మంత్రి ప్రసంగిస్తారన్నారు. ప్రీ ప్రైమరీ –1, 2, 1వ తరగతులు ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఆమె పేర్కొన్నారు. -
లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
మడికొండ (వరంగల్ జిల్లా) : మడికొండలోని ఎస్బీహెచ్ బ్యాంక్ వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. కె.సముద్రం గ్రామానికి చెందిన బోదాన్ నరేష్(20), సీతాని శీను(21) ద్విచక్రవాహనంపై హైదరాబాద్ వైపు వెళుతుండగా వేగంగా వెళుతున్న లారీని ఓవర్టేక్ చేయబోయి లారీ కింద పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. -
మడికొండ వాసుల నిరసన
జాతీయ రహదారిపై మురుగు నీరు నిల్వడంపై ఆగ్రహం మడికొండ : మడికొండలో జాతీయ రహదారిపై మురుగునీరు నిల్వడంతో ఇబ్బందులను భరించలేక స్థానికులు శనివారం జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. మడికొండ ఆంధ్రాబ్యాంకు ఎదుట మురుగునీరు నిలిచి కాలనీ లోకి వస్తుండగా ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోయూరు. రహదారి విస్తీర్ణంలో భాగంగా సైడ్ కాలువ నిర్మాణం సరిగా లేకపోవడం తో మురుగునీరు నిలుస్తోందని తెలిపారు. దీంతో కాలనీవాసులకే కాకుండా బ్యాంక్ సేవలకు వచ్చే వారికి, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారు. ఎమ్మెల్యే అరూరి రమేష్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఈ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటోందని మురుగునీరు నిలవడంతో పక్క నుంచి పోవడానికి సైతం ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వాహనంపై వెళ్తూ మురుగు నీటిలో పడి ఆస్పత్రుల పాలైన సంఘటనలు ఉన్నాయని వివరించారు. అధికారులు స్పందించి మురుగునీరు నిల్వ ఉండకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో ప్రయాణికులు, కాలనీవాసులు సుర్యారావు, శేఖర్, రాజు, ఎలికంటి బాబు, పాషా, ఐలయ్య పాల్గొన్నారు. -
ధిక్కార స్వరం.. పోరాటమే ఊపిరి
నేడు కాళోజీ వర్ధంతి తప్పు ఎక్కడ జరిగినా చూస్తూ ఉండే రకం కాదాయన. తన కలంతో అది తప్పంటూ ఎలుగెత్తి చాటేవారు. సమన్యాయ పాలన దక్కాలనేది ఆయన అభిమతం. అందుకే నిజాం ప్రభువులతోనూ తలపడ్డారు. పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అని ఎలుగెత్తి చాటారు. కవిగా.. పోరాట యోధుడిగా.. ముందుకుసాగారు. ఆచరణవాదిగా.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఆ మహామనీషి మరెవరో కాదు.. కాళోజీ నారాయణరావు. అందరూ కాళన్నగా పిలుచుకునే ఆయన వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. కాళోజీ.. ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. గుండెల నిండా ధిక్కారం నింపుకున్న ధీరుడు. చిన్నప్పటి నుంచే సాహిత్యాన్ని ఒంటబట్టించుకున్న మహామనీషి ఆయన. తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలతో ఈ పేరు మమేకమైపోయింది. లొల్లి లొల్లికి జతకట్టి, లొల్లికెల్ల.. పెద్ద దిక్కైన నీపేరు, పృథ్విలోన.. ఎల్లకాలము గుర్తుండు, చల్లనయ్య.. కరిగి పోతివా కాళన్న, కరుణ హృదయ.. అంటూ నల్ల ఉపేందర్, ఆయన కుమార్తె నల్ల ప్రభావతీదేవి కాళోజీ జీవిత చరిత్రను శతకంగా రాశారు. 9 సెప్టెంబర్ 1914న రంగారావు, రమాబాయి దంపతులకు కాళోజీ నారాయణరావు జన్మించారు. మడికొండలో ప్రాథమిక విద్య, హన్మకొండ, హైదరాబాద్‌లలో ఉన్నతవిద్య అభ్యసించారు. కాళోజీ సోదరుడు రామేశ్వరరావు ఉర్దూ సాహిత్యంలో గొప్ప కవి. షాద్ కలం పేరుతో రచనలు చేసేవారు. అన్నదమ్ములిద్దరినీ చిన్న, పెద్ద కాళోజీగా పిలిచేవారు. కాళోజీ నారాయణరావు 15 ఏళ్ల వయసు నుంచే ఉద్యమాల్లోనూ, కవితా వ్యాసాంగంలోనూ మునిగితేలేవారు. ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభ, నిజాంస్టేట్ కాంగ్రెస్‌లో ఉంటూ నైజాం వ్యతిరేక పోరాటంలో పనిచేశారు. 1940లో రుక్మిణీబాయిని వివహం చేసుకున్నారు. 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా, ఆంధ్రసారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలలో సభ్యుడిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. కాళోజీ శతజయంతి ఉత్సవ కమిటీ కాళోజీ స్ఫూర్తిని ముందుతరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రముఖచిత్ర దర్శకుడు, చిత్రకారుడు, కవి బి.నర్సింగరావు అధ్యక్షుడిగా, ప్రముఖకవి వరవరరావు గౌరవాధ్యక్షుడిగా, ప్రముఖ మానవహక్కుల వేదిక కార్యకర్త జీవన్‌కుమార్ సమన్వయకర్తగా, ప్రముఖ న్యాయవాదులు కె.ప్రతాప్‌రెడ్డి , కేశవరావుయాదవ్ సలహాదారులుగా కాళోజీ శత జయంతి ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. 2013 సెప్టెంబర్ 9న హన్మకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో కాళోజీ శతజయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామక లక్ష్మణమూర్తికి కాళోజీ పురస్కారం అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తికి, ప్రముఖ ఫోటోగ్రాఫర్, చిత్రకారుడు జి.భరత్‌భూషణ్‌కు ఆత్మీయ సత్కారం చేశారు. ఆ తరువాత ఏడాది పాటు తెలంగాణలోనూ, ఆంధ్రాప్రాంతంలోనూ కాళోజీ సాహిత్యంపై సెమినార్లు నిర్వహించారు. బి.నర్సింగరావు దర్శకత్వంలో మన కాళోజీ డాక్యుమెంటరీ నిర్మించారు. అమ్మంగి వేణుగోపాల్, ఎన్.వేణుగోపాల్, బి.నర్సింగరావు ప్రచురణకర్తలుగా కాళోజీ జీవితం-సమగ్ర సాహిత్యం సంపుటాలను వెలువరించారు. వేదకుమార్ అధ్వర్యంలో కాళోజీ జీవితంపై సంక్షిప్తంగా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కాళోజీ ఎస్సెన్షియల్ పుస్తకం వెలువరించారు. పాలపిట్ట పత్రిక, దక్కన్ డాట్ కామ్లు ప్రత్యేక సంచికలు వెలువరించాయి. కేయూ తెలుగుశాఖ ఆచార్యులు బన్న అయిలయ్య ప్రజాకవి కాళోజీ కవిత్వం అనే పుస్తకం వెలువరించారు. ప్రముఖ కవి లోచన్ కాళోజీపై వ్యాసాల సంపుటి వెలువరించారు. 2014 సెప్టెంబర్ 9వతేదీన కాళోజీ జయంతి రోజున కాళోజీ పేరిట అతిపెద్ద ఆడిటోరియం నిర్మించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దేశంలోనే అరుదైన కవి కాళోజీ నారాయణరావు ఆచరణవాది. ఏంచేసినా ప్రత్యక్ష కార్యాచరణతోనే చేయడం అలవా టు. స్వతహాగా సున్నిత మనుస్కుడైన కాళోజీ తన భావాలను, ధర్మాగ్రహాన్ని కవితలుగా మలిచారు. భారతదేశ సాహిత్య చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు పలు పోరాటాల్లో పాల్గొంటూ ఎప్పటికప్పుడు ఆయా పరిస్థితుల్లోని దౌర్జన్యాలను, వ్యక్తులను ఎండగడుతూ రన్నింగ్ కామెం టరీలా కవిత్వం రాసిన వాళ్లు కాళోజీ తప్ప మరెవరూ లేరంటే అతిశయోక్తికాదు. అలా రాసిన వాటిలో అణాకథలు(1941), నా భారతదేశయాత్ర(1941, బ్రెయిల్ఫోర్డ్ రచించిన రెబల్ ఇండియా పుస్తకానికి అనువాదం), కాళోజీ కథలు(1943), పార్ధివ్యయము(1946), నాగొడవ(1953), తుదివిజయం.. మనది నిజం(1962), తర్వాత వరుసగా నాగొడవ పరాభవ వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం అంటూ నాగొడవను1967లో ముగించారు. ఆ తర్వాత జీవనగీత(1968 ఖలీల్ జిబ్రాన్ రచించిన ద పొయెట్కి అనువాదం), తెలంగాణ ఉద్యమ కవితలు(1969) తర్వాత మళ్లీ నాగొడవ (యువభారతి- 1974), నాగొడవ(1975-77), ఇదీ నాగొడవ (కాళోజీ ఆత్మకథ -1995), బాపూ!బాపూ!!బాపూ!!!(1995) మొదలైన రచనలతో పాటు అంజలి(ఎన్సీ ఫడ్కే రచించిన గ్రంథానికి అనువాదం), ఖలీల్ జిబ్రాన్ కవితలకు అనువాదాలు, భారతీయ సంస్కృతి(సానె గురూజీ రచించిన మరాఠీ గ్రంథానికి అనువాదం) మొదలైన ఆముద్రిత రచనలు ప్రచురణ కావాల్సి ఉంది. మోహనరాగంలో‘మాతృదేశం’ 1940లో ఒక వారపత్రికలో ప్రముఖ ఆంగ్లకవి సర్ వాల్టర్ స్కాట్ రాసిన ‘లే ఆఫ్ ద లాస్ట్ మిన్‌స్ట్రెల్’ గేయంలోని ‘బ్రీత్స్ దేర్ ఏ మాన్ విత్ సోల్ సో డెడ్, హు హేజ్ నాట్ సెడ్ అన్టు హిమ్సెల్ఫ్, దిస్ ఈజ్ మై ఓన్ నేటివ్ లాండ్’ అనే చరణాలను ప్రచురించి అదే భావంతో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించేలా దేశభక్తి ప్రభోదాత్మక గేయాన్ని రాసి పంపాలని ప్రకటించారట. దీనికి స్పందించిన కాళోజీ ఓ గేయాన్ని రాసి పంపారు. ఈ మాతృదేశ గీతాన్ని 1943 మే 26న హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపనోత్సవం రోజున జరిగిన దశమాంధ్ర మహాసభలో పాడి వినిపించారట. మళ్లీ ఇటీవల నిట్ ఆడిటోరియంలో జరిగిన కాళోజీ జయంతి వేడుకల్లో వరంగల్‌లోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ కుప్పా పద్మజ ఆధ్వర్యంలో కళాశాల కర్ణాటక సంగీత ఉపన్యాసకులు పాలకుర్తి రామకృష్ణశర్మ స్వరపరిచిన ఈ గీతాన్ని విద్యార్థినులు కళ్యాణి, శ్రీవాణి, స్వప్న పాడి వినిపించారు. రామకృష్ణశర్మ , మోహనరాగంలో, మిశ్రమ చాపు తాళంలో ఈ గీతాన్ని స్వరపరిచారు. -
22న కేసీఆర్ ప్రచారం
వరంగల్, న్యూస్‌లైన్ :సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. మడికొండలో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించగా... మరోసారి ఈ నెల 22వ తేదీన రెండో దశ ప్రచారం చేయనునున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారి ఒంటరి పోరుకు సిద్ధమైన టీఆర్ఎస్ జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. జిల్లాలో ఎక్కువ స్థానాలే లక్ష్యంగా ప్రచారం తీవ్రం చేసింది. ఇందులో భాగంగా మరో దఫా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో సభల నిర్వహణకు రూపకల్పన చేశారు. గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా పాల్గొనే విధంగా సభలు నిర్వహించనున్నారు. హెలికాప్టర్లో నియోజకవర్గాన్ని చుట్టివేయూలని నిర్ణయించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. 22న కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో జిల్లాకు వచ్చి ప్రచారం చేపట్టనున్నట్లు వివరించారు. ఐదు నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన అనంతరం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లనున్నట్లు రవీందర్ రావు తెలిపారు. -
రేపు టీఆర్ఎస్ సభ
వరంగల్, న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ బహిరంగ సభాస్థలం మా రింది. సభ నిర్వహణ గురువారమే ఖాయమైనప్పటికీ... ఎన్నికల అధికారుల అభ్యంతరాలతో హన్మకొండ నుంచి మడికొండకు షిఫ్ట్ అరుుంది. ముందుగా నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించాలని భావించినప్పటికీ... భారీ జనం వస్తారని, వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, అంతేకాకుండా ప్రభుత్వ విద్యాసంస్థ ప్రాంగణంలో సభ నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో నగర శివారు మడికొండలోని టీఎన్జీవోస్ గ్రౌండ్లో సభ ఏర్పాటుకు టీఆర్ఎస్ నేతలు మంగళవారం సన్నాహాలు మొదలుపెట్టారు. సభా స్థలాన్ని చదును చేసే పనులును ముమ్మరం చేశారు. ఈ బహిరంగ సభకు టీఆ ర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. 17న సాయంత్రం 6 గంటలకు ప్రారంభంకానుండగా... కేసీఆర్ హెలికాప్టర్లో రానున్నారు. ఈ మేరకు హన్మకండలోని జేఎస్ఎం పాఠశాలలో హెలిపాడ్ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన ఇక్కడకు చేరుకుని సభాస్థలికి వెళ్లనున్నారు. ఆరూరిపైనే భారం సభ నిర్వహణ వ్యయం వర్ధన్నపేట నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్‌పైనే వేసినట్లు సమాచారం.తన నియోజకవర్గ పరిధిలో సభ నిర్వహిస్తున్నందున ఎన్నికల్లో ఆయనకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతున్నందున ఈ భారం మోపినట్లు తెలిసింది. హన్మకొండలో సభ జరిగితే ఐదు నియోజకవర్గాలు వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ పశ్చిమ, తూర్పు, పరకాలపై ప్రభావం చూపేదని... ఇప్పుడు వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన మిగతా అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.