మడికొండ వాసుల నిరసన
జాతీయ రహదారిపై మురుగు నీరు నిల్వడంపై ఆగ్రహం
మడికొండ : మడికొండలో జాతీయ రహదారిపై మురుగునీరు నిల్వడంతో ఇబ్బందులను భరించలేక స్థానికులు శనివారం జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. మడికొండ ఆంధ్రాబ్యాంకు ఎదుట మురుగునీరు నిలిచి కాలనీ లోకి వస్తుండగా ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోయూరు. రహదారి విస్తీర్ణంలో భాగంగా సైడ్ కాలువ నిర్మాణం సరిగా లేకపోవడం తో మురుగునీరు నిలుస్తోందని తెలిపారు. దీంతో కాలనీవాసులకే కాకుండా బ్యాంక్ సేవలకు వచ్చే వారికి, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారు.
ఎమ్మెల్యే అరూరి రమేష్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఈ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటోందని మురుగునీరు నిలవడంతో పక్క నుంచి పోవడానికి సైతం ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వాహనంపై వెళ్తూ మురుగు నీటిలో పడి ఆస్పత్రుల పాలైన సంఘటనలు ఉన్నాయని వివరించారు. అధికారులు స్పందించి మురుగునీరు నిల్వ ఉండకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో ప్రయాణికులు, కాలనీవాసులు సుర్యారావు, శేఖర్, రాజు, ఎలికంటి బాబు, పాషా, ఐలయ్య పాల్గొన్నారు.