అతడి కవిత్వం ఉడికిన అన్నానికి మెతుకు వంటిది.
ఉదయమిత్ర 1968 కన్నా ముందే జడ్చర్లలో ‘కొత్త చిగుళ్లు’ వంటి విద్యార్థుల కవితా సంకలనాల వెలువరింత కోసం కృషి చేసిన కవి. భావుకుడు. ఉద్యమ భావుకుడు. ‘కాలిబాట’ పేరుతో తన రెండవ కవితా సంపుటితో ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు. ‘కాలిబాట’ ఒక ప్రతీక. ఒక సంకేతం. అది ఆయన కవిత్వ సారం. ఆయన ప్రాపంచిక దృక్పథ ప్రకటన. ఆయనే చెప్పినట్టు
కాలిబాటలు
అడవికీ అడవికీ
అడవికీ మైదానానికీ
గూడేనికి గూడేనికి మధ్య నిలిచే వారధులు
పొలాల పాపిటలు
పల్లెల ప్రాణ స్నేహితులు
అడవి అల్లికలో సైతం దారులు తీసే
పురాతన దిక్సూచికలు...
కాలిబాటను సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కబళిస్తున్న కాలంలో వెలువడుతున్న ఉదయమిత్ర ‘కాలిబాట’ కవిత్వం ఒక ప్రత్యామ్నాయ మార్గం- భావికి బాట. అంతేకాదు, నూరో డిగ్రీ దగ్గర ఉడికిన అన్నానికి మెతుకువంటిది. ఉదయమిత్ర ఇప్పటికే కథలు, నాటికలు, నాటకాలు, కవిత్వం రాసి రచయితగా లబ్ధప్రతిష్టుడు. నిరంతర సాధకుడు. ఎంత భావుకుడో అంత కృషీవలుడు. పట్టణీకరణ ప్రభావం సోకనీయకుండా గ్రామీణ నిసర్గ స్పందనను, సౌందర్యాన్ని రక్షించుకున్నవాడు. ఒక సంఘటనకు, ఒక స్పర్శకు, ఒక శబ్దానికి, ఒక వార్తకు, ఒక మంచి రచనకు స్పందించే సహజమైన పసి మనసును కప్పకుండా కాపాడుకుంటున్నవాడు. ఆయనలో ఎన్ని సందేహాలున్నాయో అన్ని సమాధానా లున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన హృదయం ఉండవలసిన చోట ఉన్నది.
‘కాలిబాట’లోని కవితలన్నీ 1984-2014 మధ్యకాలంలో అంటే ముప్పై ఏళ్ల కాలంలో రాసినవి. ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తున్న కాగడా ఇది. ఇంకా తాను మోస్తూనే అందిస్తున్న జ్వాలాతోరణం. అయితే ఈ ముప్పై ఏళ్లు దేశాన్ని తెలుగు సమాజాన్ని కదిపేసిన దశ అత్యంత విషాదకరమైంది.
అత్యంత విప్లవాత్మకమైంది. అత్యంత విధ్వంసానికి గురైంది. కనుక సహజంగానే నీటి లోపలి చేపలు నీళ్లను నిర్మాణంలోకి తెస్తున్న సంఘటనలు, అడవి ఆయుధాలు ధరించిన చెట్లయి కదిలి వస్తున్న కదలికలు, శ్రమైక జీవులు నిర్మిస్తున్న పోరాట సౌందర్యాలు... ఇవన్నీ పాలమూరు నుంచి పాలస్తీనా దాకా విస్తరించిన వైనమే ఈ కవిత్వం. ఇందులో రెండు వందల పేజీలకు డెబ్బై కవితలకు మించి ఉన్నాయి. ఉదయమిత్ర విస్తృతి ఎంత వైవిధ్య భరితమైనదంటే ఆయన దృష్టికి వచ్చే ఏ మూలనో పత్రికలో ఉండే వార్త మొదలు, పుస్తకంలో ఉండే పాత్ర దాకా ప్రతిదీ కవిత్వమవుతుంది. చత్తీస్‌గఢ్ కొండల, అడవుల, నదుల సౌందర్యం గురించి ఎంత తన్మయుడవుతాడో నూతన మానవావిష్కరణ జరుగుతున్న జనతన సర్కార్‌పై గ్రీన్‌హంట్ ఆపరేషన్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీభత్సమైన దాడి చేస్తూ ప్రజలపై ప్రకటించిన యుద్ధాన్ని అంతగా ప్రతిఘటిస్తాడు. అంతిమంగా చూస్తే ఉదయమిత్ర కవిత్వం ‘రగిలి రగిలి రక్తంలో ముంచి రాసే కవిత్వం’.
- వివి