‘తాతగారు, మీరు పెద్దగా చదువుకోలేదు. అయినా, ఎంతో ఆనందంగా ఉంటారు. అమ్మ నాన్నలు పెద్ద చదువులు చదివారు. పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కానీ సంతోషంగా ఉండరు. ఎందుకని?‘
అమాయకంగా తన పదేళ్ల మనవడడిగిన ప్రశ్నకు పెద్దగా నవ్వేశారా తాతగారు. ‘నానీ, నేను జీవితాన్ని జీవిస్తున్నాను. వాళ్ళు బతుకుతున్నారు. అంతే’ అన్నారాయన. ప్రశ్న అమాయకమైనదే కానీ, సమాధానం ఎంతో లోతైనది. వేదాంతులు, తాత్వికులు చెప్పేటంత, చెప్పినంత సాంద్రమైనది. గాఢమైనది. అనేకానేక అనుభవాల పొరలను తనలో ఇముడ్చుకుని, తమాయించుకుని, తెప్పరిల్లి జీవితార్ణవపు సుఖ దుఃఖాల ఆటుపోట్లను సమంగా తీసుకోగలిగిన స్థితప్రజ్ఞత ధ్వనిస్తోంది ఆ సమాధానం లో. ఆ తాతగారి జీవితానంద ఆస్వాదనకు, కొడుకు, కోడలి ఆందోళనకు, ఆశాంతికి భేదమదే.
జీవితాన్ని జీవించాలి. అంటే..? జీవితంలోని సుఖాలను ఎలా హాయిగా అనుభవిస్తున్నామో, దుఃఖాలనూ అలాగే స్వీకరించగలగాలి. జీవితం పట్ల ఒక అవగాహన ఏర్పరుచుకోవాలి. హిమం ఒక వాతావరణంలో కరిగిపోవటం, మరొక వాతావరణంలో ఘనీభవించటం, సూర్యోదయ సూర్యాస్తమాయాలు ఏర్పడం ఎంత సహజమో /జీవితంలోని ఎత్తు పల్లాలు అంతే. మనిషికి ఆలోచనా శక్తి, ఒక మనస్సు దానికి స్పందన ఉన్నాయి. సుఖాన్ని తీసుకున్నంత హాయిగా ఆహ్లాదంగా మనస్సు దుఃఖాన్ని తీసుకోలేదు. రెండిటిని సమానంగా తీసుకోవాలని బుద్ధికి తెలుస్తుంది. కాని మనస్సుకు తెలియదు. బుద్ధి అనంతమైన భావాలకు / ఆలోచనలకు ఆవాసం. వాటికి స్పందించేది మనస్సు. అది దాని లక్షణం.
సుఖదుఖాల భావన రెండిటికి సమానంగా తెలియాలి. అపుడే జీవితంలోని ఆహ్లాద ఘటనలను, జీవితాన్ని అతలాకుతలం చేసే అనూహ్య సంఘటనలను అక్కున చేర్చుకోగలం. ఆ స్థితికి చేరుకున్నప్పుడే జీవితాన్ని జీవించగలం మనోస్థైర్యంతో. అంతటి కుదురైన మనస్సు మన జీవిత కుదుళ్లను పెకలించలేదు. అన్ని వేళలా మనస్సును స్థిరంగా ఉంచుకోవటమే స్టితప్రజ్ఞతంటే.
ఆ తాతగారికి ఉన్న గొప్ప లక్షణం అదే. కొంతమందికది సహజాభరణం. కొందరు ప్రయత్నించి సాధిస్తారు. ఇంకొందరికి జీవితం నేర్పుతుంది. కొందరికి జీవితంలో ఒంటపట్టదు. మనిషి వివేచనను, విచక్షణలను సంయోగం చేయగలిగితే చాలు. అది చిక్కుతుంది.
ఒక మనిషి జీవితంలో పైకి రావటమనేది అతని తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఒక మార్గాన్ని ఎంపిక చేసుకుని దానిలో పయనించి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలడు. అది ఒక ఉద్యోగం కావచ్చు లేదా వ్యాపారం కావచ్చు. జీవితంలో చక్కగా స్థిరపడి, ఆర్థికం గా పరిపుష్టుడై సమాజంలో గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటాడు. అయినా ఇతనికి తృప్తి లేనట్లయితే ఆశాంతికి లోనవుతుంటాడు. దీనికి భిన్నంగా అంతే తెలివితేటలున్న మరొక వ్యక్తి మంచి ఆవకాశాలు రాక సాధారణ జీవితం గడుపుతూ ఉండచ్చు. సమాజం అతన్ని అసమర్థుడుగా భావించవచ్చు. కాని, ఈ వ్యక్తి తనలోని అద్భుత గుణమైన తృప్తితో తనకున్న దానితో, తను గడుపుతున్న జీవితంతో ఆనందంగా ఉండచ్చు. ఈ ఆనందమే మనిషిని జీవితాన్ని ప్రేమించేటట్లు చేసి నిజంగా జీవించేటట్టు చేస్తుంది. మొదటి వ్యక్తి అంత సాధించినా తృప్తి అనే గుణం లేనందువల్ల ఆశాంతికి గురవుతాడు. మనసు కు ఓ స్థిరత్వం ఉన్నప్పుడే తృప్తి అనే గుణం మనిషి వ్యక్తిత్వంలో ఒదిగిపోతుంది. అది ఉన్నవారే జీవితాన్ని ఆనందంగా గడపగలరు.
చాలామంది తమ జీవితాన్ని ఇతరుల జీవితం తో పోల్చుకుంటారు. ఒకింత స్ఫూర్తికి, అలా తామూ ఎదగాలనే భావన లేదా/ ఆలోచనకు, అది అవసరం. అదీ ఒక స్థాయి వరకు మాత్రమే అభిలషణీయం/ హర్షదాయకం. కానీ అనుచితమైన పోలిక మన ప్రశాంత చిత్తమనే నదిలో పడ్డ రాయి లాంటిది.
జీవితాన్ని ఆనందంగా గడపాలంటే చిన్న, చిన్న విషయాలను ఆస్వాదించటం అలవరచుకోవాలి. నారింజ రంగులో ఉండే సూర్యోదయం, అరుణ వర్ణపు సూర్యాస్తమయం, సప్తవర్ణ శోభిత హరివిల్లు, మంచు బిందువులు ముద్దిస్తున్న పుష్పాలు, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కుటుంబంతో కొంత సమయాన్ని గడపటం, ఒక పుస్తకం చదవటం, మొక్కలకు నీళ్లు పోయటం ఒకరి దప్పికను తీర్చటం, ఒకరి ఆకలిని తీర్చటం... వీటిలో ఏదైనా కావచ్చు. మరేవైనా వారి వారి అభిరుచిని బట్టి అలవాటు చేసుకోవచ్చు. ఇదీ మన జీవితాన్ని ఆనందభరితం చేస్తుంది. ఇవే మనల్ని నిజంగా జీవింప చేస్తాయి. బాహ్య చక్షువులతోపాటు ఆనందం, ఆస్వాదన అనే మనో నేత్రాలు కావాలి. మనమే వాటిని పొందాలి/ సంపాదించుకో వాలి. అప్పుడు జీవితాన్ని ఎంత మనోజ్ఞంగా ఉంటుందో అనుభవంలోకి వస్తుంది.
ఎంతోమంది రుషులు, వేదాంతులు, తత్త్వ వేత్తలు, మహానుభావులు జీవితాన్ని నిర్వచించారు. దాని లోతుపాతులు శోధన చేసి, సాధన చేసి తమ జీవితానుభావాన్ని జోడించి జీవితమంటే ఇది అని చెప్పారు. వాస్తవానికి అది వారి భావన, వారి దార్శనికత. వారి శక్తి, ప్రతిభా వ్యుత్పత్తుల మనోదారుఢ్యం మీద జీవితం/ జీవితపు కొలతలు ఆధారపడి ఉంటాయి. సామాన్యులు వాటిని అర్థం చేసుకోవటానికి వారి జిజ్ఞాసకు కృషి, సాధనల తోడు తప్పనిసరిగా కావాలి. వీరే కాక ప్రతి ఒక్కరు జీవితం అంటే ఇది, ఇదే అంటూ ఎన్నో మాటలు చెపుతుంటారు. ఇక్కడే మనం అప్రమత్తం కావాల్సింది ఉంటుంది. మన ఇంగిత జ్ఞానమూ ఉపయోగించాలి. ఈ ప్రతి నిర్వచనం వారి వారి జీవిత నేపథ్యం నుండి వచ్చింది. ఆ నిర్వచనాన్ని మన జీవితాలకు అన్వయించుకునే ముందు మనకా నేప«థ్యం ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఒకవేళ ఉన్నా, ఆ పరిస్థితులలో ఆ వ్యక్తులు చూపిన గుండె నిబ్బరం, తెగువ, శక్తులు మనకున్నాయో లేదో అంచనా వేసుకోవాలి. అపుడే వాటిని స్వీకరించాలి. అయితే, అన్ని జీవిత నిర్వచనాలలో ఉండే సామ్యత చూడగలగాలి. మన జ్ఞానవివేకాలను సంయోగం చేసి ఎంతవరకు మన జీవితాలకు ఉపయోగించుకోవచ్చో నిర్ణయించుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఈ పరిశీలనకు మన చదువుల సారాన్ని కలపాలి.
జీవితాన్ని ప్రేమించాలి. మనకు లభించిన జీవితాన్ని చక్కగా, హాయిగా జీవించాలి. ఈర్ష్య, అసూయలకు, అహంకారానికి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లనే భావనకు, అసంతృప్తికి, అనవసరపు ప్రాధాన్యతలకు, ఆడంబరాలకు దూరంగా ఉండగలగాలి. ఆ స్థితికి మనం చేరుకున్న క్షణం మనస్సు ఎంతో నిర్మలమవుతుంది. అదే మనలను స్థిరచిత్తులను చేస్తుంది. ఆ దశలో కష్టసుఖాలను సమానంగా తీసుకునే మానసిక శక్తి సహజంగా ఒనగురుతుంది. ఈ పరిపక్వత కోసమే మనం తపించి, సాధించ గలగాలి. అపుడే జీవిత వజ్రాయుధ ఘాతాలను తట్టుకుని నిబ్బరించుకోగలం. జీవితం ఉల్లాసం గా జీవించగలం. జీవితాన్ని జీవించటమంటే అదే.
ఆ తాతగారు తన మనవడికి చెప్పిన మాటలు అందరకు శిరోధార్యమే.
– బొడ్డపాటి చంద్రశేఖర్.
అంగ్లోపన్యాసకులు
Comments
Please login to add a commentAdd a comment