త్రిస్సూర్: ఇంటర్ సెక్స్ వ్యక్తులు జీవశాస్త్ర పరంగా మగ లేదా ఆడవారు కాదు. జన్యుపరంగా, హార్మోనుల పరంగా, లైంగిక భాగాల తయారీలో తప్పులున్నప్పుడు మగ, ఆడ రెండు లక్షణాలతో జన్మిస్తారు. వీరిలో కొంతమందిలో ఆపరేషనుల ద్వారా, మందుల ద్వారా సరి చేయవచ్చు. అయితే సమాజంలో వీరు ఎంతగానో వివక్షకు గురవుతున్నారు. కొన్నిచోట్ల ఇలాంటి పిల్లలను పురిటిలోనే చంపేస్తున్నారు. దీంతో ఇంటర్ సెక్స్ పిల్లలకు కూడా ప్రేమ పంచాల్సిన అవసరం ఉందంటూ కేరళలోని త్రిస్సూర్‌లో హిజ్రా హక్కుల కార్యకర్త, రచయిత్రి విజయరాజా మల్లిక కవితా ఆల్బమ్‌ను రూపొందించారు. 'ఇది శాపమో, పాపమో కాదు.. నా బంగారు పాప.. నువ్వు నా అదృష్టానివి. నా తొలి చుక్కానవి' అంటూ మలయాళీ భాషలో ఈ కవిత్వం సాగుతుంది. ఇందులో నటి తువ్వాలలో చుట్టుకొన్న బిడ్డను ఎత్తుకొని కన్న మమకారం చూపిస్తూ ప్రేమను కురిపిస్తుంది. (చదవండి:కవి మనసు ఖాళీగా ఉండదు)
'నా రంగుల హరివిల్లా, నువ్వు అబ్బాయి కాకపోయినా, అమ్మాయి అవకపోయినా నీకు నా రొమ్ము పాలు పడతాను' అంటూ సమాజం చూపే వివక్షను అణిచివేస్తూ తల్లిప్రేమను పంచుతుంది. ప్రస్తుతం ఈ పాట అందరి మనసులను కదిలిస్తోంది. విజయరాజా మల్లిక రచించిన ఈ కవిత్వానికి కరీంభుజా సంగీతం అందించగా, శిని అవంతిక మనోహరంగా ఆలపించి పాటగా రూపొందించారు. ఈ వీడియోలో మల్లిక, తన భర్త జషీంతో కలిసి నటించారు. ఈ ఆల్బమ్‌ను డ్యాన్సర్ రాజశ్రీ వారియర్ ఆదివారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. "ఇంటర్‌సెక్స్ పిల్లలను చెత్తకుప్పల్లో పడేసిన ఘటనలు ఉన్నాయి. కానీ ఈ పాటలో ఉన్న తల్లి మాత్రం పుట్టిన బిడ్డ ఆడో, మగో తెలియకపోయినా శిశువును గుండెలకు హత్తుకుంటోంది" అని తెలిపారు. ఇంటర్‌సెక్స్ శిశువులపై మలయాళంలో వచ్చిన తొలి కవిత్వం ఇదేనని పలువురు పేర్కొంటున్నారు. (చదవండి: ఏం చేస్తున్నావు? నేను చూసేశాను!)
Comments
Please login to add a commentAdd a comment