పద్యానవనం: కాదేదీ కవితకనర్హం... | Empty mind thinks more about life, poectry to reach | Sakshi
Sakshi News home page

పద్యానవనం: కాదేదీ కవితకనర్హం...

Published Sun, Jul 20 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

పద్యానవనం: కాదేదీ కవితకనర్హం...

పద్యానవనం: కాదేదీ కవితకనర్హం...

నిరుపహతి స్థలంబు రమణీప్రియ దూతిక తెచ్చి యిచ్చు క
 ప్పురవిడె మాత్మ కింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త
 ప్పరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
 దొరకినగాక యూరక కృతుల్ రచియింపుమనంగ శక్యమే!
 
 ఆశువుగా కవిత్వం చెప్పడం  ఆషామాషీ కాదు, అందుకు

ఏమేం కావాలో సెలవిస్తున్నాడు ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన. ఇవన్నీ ఉంటేగాని కృతి కూర్చడం వల్లకాదని ప్రభువు కృష్ణదేవరాయలకే విన్నవిస్తాడు. భంగపాటుకు ఆస్కారం లేని ఏకాంతపు స్థలమట, ఆత్మకింపయిన భోజనమట, ఆ పై ప్రియరమణి తాంబూలం తెచ్చివ్వాలట, మేను వాల్చడానికో ఊయల మంచమట... అంతటితో చాలదు, తప్పొప్పులు ఎత్తిచూపగల రసజ్ఞులట, తానేమి చెబుతున్నానో ఊహించగల ఉత్తములగు లేఖకులు-పాఠకులు... ఇవన్నీ సమకూరితే కాని, ఊరకే కావ్యాలు రచించమంటే అయ్యే పని కాదని స్పష్టం చేస్తాడు ఈ కవివరేణ్యుడు. ఇదే పెద్దన ఇంకో సందర్భంలో ఆశుకవిత్వమంటే ఏంటో పేరిణి శివతాండవమాడినట్టు ఆడి, తన తడాఖా చూపించాడు. అది గండపెండేర బహూకరణ సమయం.
 
  ఓ రోజు కృష్ణరాయలు,  సంస్కృతాంధ్రాలలో సమానంగా కవితను నడుపగల సమర్థులకు ఈ బహుమానమివ్వాలనుకున్నానంటే... ఎవరూ కదలలేదట. ‘‘ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగా నొద్దిక నాకొసంగుమని యొక్కరు గోరగలేరు లేరొకొ...’’ అంటుండగానే పెద్దనామాత్యుడు లేచి, ‘‘పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీ వెఱుంగవే పెద్దన కీదలంచినను బేరిమి నా కిడు కృష్ణరాణ్ణృపా!’’ అంటూ పద్య పూరణం చేశాడు. ఆ వెంటనే, ‘పూతమెణుంగులుం... ’ అంటూ మొదలెట్టి, ధారగా తెలుగు, సంస్కృత పద సముచ్ఛయమైన కవిత్వాన్ని పరుగులు తీయిస్తూ, ‘... రసప్రసార రుచిర ప్రసరంబుగ సారెసారెకున్’ అని ముగించాడు. సభికులంతా నిశ్చేష్టులయ్యేలా అప్పటికప్పుడు ముప్పై పాదాలుగా ముప్పిరిగొన్న అద్భుతమైన ఉత్పలమాలికను అల్లివేశారు అల్లసానివారు. అదీ కవిత్వమంటే!
 కాకపోతే, ఆనాటి కాలమాన పరిస్థితులవి. కడుపు నిండిన వాళ్లకు, రససృష్టి కళాపోషణలో భాగమైనపుడు పుట్టిందా కవిత్వం. కాలం మారింది. కవిత్వమూ, దాని నేపథ్యము, అవసరము, సందర్భం, స్వరూపము, లక్ష్యం... అన్నీ మారాయి.  కవిత్వం చెప్పడానికి పైన పేర్కొన్న హంగులు ఉండాల్సిందేనా? ఊహిస్తున్న ఆదర్శవంతమైన వ్యవస్థకి, అనుభవిస్తున్న పరిస్థితికి మధ్య సంఘర్షణే కవిత్వమని కొందరు నిర్వచిస్తారు. కవిత్వ సృష్టికి ప్రేరణ కలిగించే పరిస్థితులే ముఖ్యమన్నది పలు మార్లు రుజువైన సత్యం. అందుకేనేమో శ్రీశ్రీ  ‘... చారిత్రక విభాత సంధ్యల సామాన్యుని జీవనమెట్టిది? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీలెవ్వరు?’ అని ప్రశ్నించగలిగాడు.
 
 కళ్ల ముందరి పరిస్థితులే కవనానికి, కవిత్వానికి ప్రేరణనిస్తాయి, స్పందించే గుణమున్నపుడు. ఇక, వ్యక్తీకరణ వారి వారి భాషా సామర్థ్యాన్ని, భావ సంపదను, వస్తు వైవిధ్యాన్ని, అభివ్యక్తి నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడో చిన్నపుడు చదివిన కవిత ఇప్పటికీ గుర్తుంది. ‘‘మబ్బులకు చెల్లెళ్లు, ఈ దేశపు ఆడవాళ్లు, హరించుకుపోయే కడవరకు క్షణ క్షణం కన్నీళ్లు’’ ఎంత బలమైన వ్యక్తీకరణ! మినీ కవితల క్రమంలోనే, మరింత అలతి అలతి పదాలతో అనల్పార్థాన్ని ఇమిడ్చిన నానీలు ప్రసిద్ధి గాంచాయి. ఎవరో అంటారు, ‘‘...ఆయన చేలో పండిన పత్తి, సరిగ్గా ఉరితాడుకు సరిపోయింది’’ అని.
 
 ఏం, ఇది కాదా కవిత్వం? ఎవరికి వారు చదివి, చప్పరించి, అనుభూతి చెందాల్సిందే తప్ప, చలం అన్నట్టు కవిత్వాన్ని కొలవడానికి తూకం రాళ్లుండవు. ఎవరు ఏం చెప్పినా, కొన్నిసార్లు సదరు కవిత్వం స్వీకరించేవాళ్లను బట్టికూడా ఉంటుంది. పెద్దన చెప్పినట్టు తప్పొప్పులు తేల్చగలిగిన రసజ్ఞులు కావాలి. అంతే కాని, కాస్త పేరొచ్చినపుడు  హిమాలయాలెక్కించి, కొంచెం మరుగున పడగానే పాతాళానికి తొక్కేసే సగటు మనిషి నైజం సరికాదు. అటువంటి వారినుద్దేశించే ‘మహాప్రస్థానం’లో మహాకవి శ్రీశ్రీ చిన్న కవితా పంక్తుల్లోనే గొప్పగా చెప్పారు. ‘‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే, నిబిడాశ్చర్యంతో వీరు/ నెత్తురు కక్కుకుంటూ నేలకు నే కూలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే!’’
 -దిలీప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement