‘‘నాకు అమూల్యమైన అవకాశం దొరికింది. గురువుగారికి స్థాన శుశ్రూష చేస్తున్నాను. (అంటే గురువుగారు ఎక్కడున్నారో అక్కడ ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం), ఆత్మ శుశ్రూష చేస్తున్నాను. (అంటే గురువుగారి మాటలు వింటూ వాటిని జ్ఞాపకం పెట్టుకుని మననం చేయడం. గురువుగారు చేసే జ్ఞానబోధ జారిపోకుండా మనసులో నిలబెట్టుకోవడం). వీటన్నింటికన్నా దేహ శుశ్రూష చేస్తున్నా...’’
గురువుగారు ఎంతకాలం ఉంటారో అంతకాలమే మాట్లాడగలరు. గురువుగారి శరీరం పతనం అయితే ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కారణం –‘‘నైనం చిందంతి శస్త్రాణి/నైనం దహతి పావకః /న చైనం క్లేదయంత్యాపో /న శోషయతి మారుతః’’ అన్నది భగవద్గీత వాక్యం.. శరీరం అసత్యం, ఆత్మ నిత్యం అనీ, అది ఖడ్గం చేత నరకబడదు, అగ్నిచేత కాల్చబడదు, నీటిచేత తడపబడదు, గాలిచేత విసిరి వేయబడదు.. అటువంటి ఆత్మ తానని గురువుగారికి తెలుసు. అందువల్ల శరీరం పతనమయితే ఆయన పొందే బాధేం లేదు. అది సహజం. కానీ గురువుశరీరం వదిలి పెట్టేస్తే నష్టం ఎవరికి అంటే శిష్యులకు.
అందుకని శిష్యులు గురువుగారి శరీరాన్ని కాపాడుకుంటుంటారు. పద్మపాదుడు అలానే కదూ శంకరాచార్యులవారిని కాపాడుకున్నది! ‘‘...అలా గురుశుశ్రూష చేస్తున్నా. పరమపావనమైన గంగానదిలో స్నానం చేస్తున్నా. ఆపైన విశ్వనాథ దర్శనం చేస్తున్నా. ఈ మూడూ ప్రతిరోజూ జరుగుతున్నాయి. ఇంతకన్నా ఐశ్వర్యం ఏముంటుంది! అందువల్ల నాకు అమ్మానాన్నలను చూడాలనో, తోబుట్టువులను, నా స్నేహితులను చూడాలనో కోరికలు లేవు. మీదగ్గర ఉండడం చాలు నాకు’’ అన్నారు ముత్తుస్వామి దీక్షితార్ వారు... ‘చాలా కాలమయింది అమ్మానాన్నలను వదిలివచ్చి, ఇల్లు గుర్తుకు రావడం లేదా...’’ అని అడిగిన గురువుగారితో.
శిష్యుని గురుభక్తికి చిదంబర నాథ యోగి గారు పరమానందం పొందారు. ఆరోజు గంగానదికి స్నానానికి వెళ్లేటప్పుడు శిష్యుడిని పిలిచి..‘‘నాయనా! ఈరోజు ముందు నీవు వెళ్ళు. రోజూ నదిలో స్నానానికి ఎక్కడిదాకా వెడతావో దానికంటే కొంచెం ముందుకు వెళ్ళివచ్చేటప్పడు మజ్జనం (తలను పూర్తిగా ముంచడం) చెయ్యి. అక్కడ తడిమి చూడు’’ అన్నారు. దీక్షితార్ వారు అలా చేసి చూస్తే అక్కడ ఆయనకు ఒక వీణ దొరికింది. అన్ని వీణలకు యాళి కిందికుంటే దీనికి పైన ఉంది.
అది చూసి గురువుగారు సంతోషించారు. నీ శుశ్రూషకి గంగమ్మ అనుగ్రహించి దీనిని ప్రసాదించిందని చెప్పారు. నువ్వు గొప్ప వాగ్గేయకారుడివై అసమాన కీర్తి ప్రతిష్ఠలు పొందుతావు.’’ అని ఆశీర్వదించి స్నానానికి వెళ్లి నీటిలో మునిగారు. ఇక పైకి లేవలేదు. తరువాత ఆయన భౌతిక కాయం లభించింది. అంత్యేష్ఠి సంస్కారం చేసి ముత్తుస్వామి దీక్షితార్ వారు తిరిగొచ్చేసారు. వాగ్గేయకారుడిగా కీర్తిప్రతిష్ఠలు గడించారు. గురువుల వైభవాన్ని కీర్తిస్తూ ఆయన చాలా కీర్తనలు చేసారు. వాటిలో ఒకదానిని చిదంబరనాథ యోగి పేర కూడా చేసారు.. అంత గొప్ప గురుభక్తి దీక్షితార్ వారిది.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment