పదం ఆయన కోసం కదం తొక్కుతుంది. కళామతల్లి ఆయన పేరు చెప్తే పులకరించిపోతుంది. తెలంగాణ ఉద్యమంలో మూడక్షరాల పేరు మూడు కోట్ల మందిలో చైతన్యం తీసుకొచ్చింది. ఆయనే ప్రజాకవి గద్దర్. అందరికీ అర్థమయ్యేలా, ముచ్చట చెప్తున్నట్లుగా, రోమాలు నిక్కబొడిచేలా, పిడికిలి బిగించి పోరాటం చేసేలా పాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సినిమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్నో పాటలు పాడారు.
ఆయన పాటలు, కళారూపాలు దేశంలోని దాదాపు అన్ని ఆదివాసీ భాషలు సహా 15 నుంచి 20 దాకా భారతీయ భాషల్లోకి అనువాదమైన చరిత్ర కూడా గద్దర్‌దే! కోట్ల మంది మనసులు గెలుచుకున్న ఆయన గొంతు నేడు(ఆగస్టు 6) శాశ్వతంగా మూగబోయింది. గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఆయన ప్రస్థానం అంత ఈజీగా సాగలేదు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కాలేజీలో వెంట్రుకలు కత్తిరించి అవహేళన
తను ఎదుర్కొన్న వివక్ష గురించి గద్దరే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పెదవి విప్పారు. 'నా పేరు గుమ్మడి విఠల్ రావు.. చిన్నప్పటినుంచి క్లాస్‌లో ఫస్ట్. ఓసారి తరగతిలో టీచర్ ఉండి.. నీదే కులమని అడిగాడు. మేము అంటరానివాళ్లం అని చెప్పాను. మరి నీకెందుకు రావు? అని పేరు చివరన దాన్ని తీసేశారు. ఇప్పుడు నా పేరు రికార్డుల్లో గుమ్మడి విఠల్ అని మాత్రమే ఉంది. చదువులో నేను ముందుండేవాడిని. ఉస్మానియా కాలేజీలో చేరినప్పుడు నా వెంట్రుకలు కత్తిరించేవారు. మొజంజాహీ మార్కెట్‌లోని హాస్టల్ నుంచి ఉస్మానియా కాలేజీకి నడుచుకుంటూ వెళ్లేవాడిని. ఓ పూట తిండి కోసం, కాలేజీ ఫీజు కోసం హోటల్‌లో పనిచేశాను' అని పేర్కొన్నారు.
(చదవండి: విషాదం.. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత)
గోచీ కట్టి, గొంగడి భుజాన వేసుకుని
ఊళ్లో మొదటి బెంచీ కుర్రాడైన గద్దర్ ఇక్కడ మాత్రం చివరి బెంచీలో కూర్చున్నారు. ఈ వివక్షే అతడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. సమాజాన్ని మార్చాలనుకున్నారు. పాటను తన ఆయుధంగా మలుచుకున్నారు. గోచీ కట్టి, గొంగడి భుజాన వేసుకుని ఎర్రజెండా చేతపట్టుకుని గద్దర్ పాట పాడుతూ నృత్యం చేస్తుంటే చూసేవాళ్లకు సాక్షాత్తూ శివుడు తాండవం చేస్తున్నట్లుగా అనిపించేది. అయితే దేవుడి గుడిలో జరిగిన ఓ కార్యక్రమంలో పెద్దలు.. దళితుడైన విఠల్ రావును వేదిక మీది నుంచి కాకుండా కింద ప్రదర్శన ఇవ్వాలనే షరతు పెట్టారు.
బ్యాంకు ఉద్యోగం చేసిన తొలినాళ్లలో విమలను పెళ్లి చేసుకున్నాక ఆయన కులం తెలిసి ఎవరూ అద్దెకిచ్చేవారు కాదు. దీంతో వేరే కులం పేరు చెబుతూ అద్దె ఇళ్లలో కాపురం చేసేవారు. ఈ అసమానతల ప్రపంచంలో ఉనికిని చాటుకునే క్రమంలో గద్దర్‌కు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. బుర్ర కథ కళాకారునిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం (1969)లో పాల్గొని అరెస్టు కావడం, గుడిసెవాసుల పోరాటంలో పాల్గొనడం, అంబేద్కర్ విగ్రహ స్థాపన ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తినటం... ఈ అనుభవాలతో ఆయనకు రాజ్య హింస గురించి తెలిసి వచ్చింది. తాను ఎంచుకున్న మార్గం కష్టాలతో కన్నీటిమయంగా ఉంటుందని తెలిసినా ప్రజల కోసం ఆయన నిలబడ్డారు. నిర్భయంగా, నిక్కచ్చిగా ముందుకు వెళుతూ పాటతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment