నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి– తెలుగు, సంస్కృతాల్లో పండితుడు. ఆయన రాసిన ‘శబ్దమంజరి’ సంస్కృతం నేర్చుకునే విద్యార్థులకు ప్రాథమిక గ్రంథం. ఆయన ఎవరినీ మన్నన చేయడని పేరు. ఆయనోసారి పూసపాటి ఆనంద గజపతి కొలువుకు వెళ్లారు. శాస్త్రి ఇంటిపేరును దృష్టిలో పెట్టుకుని, ‘గురువుగారూ, అటు ముందరి ఇల్లూ కాకుండా, ఇటు వెనక ఇల్లూ కాకుండా నడిమిల్లు ఏమిటండీ చిత్రంగా’ అన్నారు ఆనంద గజపతి వ్యంగ్యంగా.
‘మహారాజా, ఎంత నడిమిల్లు అయినా పూస పాటి చేయదా?’ అని అదే ఇంటిపేరుతో తిప్పికొట్టారు శాస్త్రి. ఇక, ఈయన సభలూ శాస్త్రాలూ అంటూ ఊళ్లు తిరుగుతూవుంటే ఆయన కొడుకే ఇంటినిర్వహణ భారాన్ని వహించేవాడు. అట్లాంటి కుమారుడు హఠాత్తుగా చనిపోయాడు. శవాన్ని మోయడానికి బంధువులు రావాలికదా! ఈయన తేలుకొండి స్వభావం వలన వాళ్లందరూ విరోధులై ఉన్నారు. అందుకే ఎవరూ ముందుకు రాలేదు. అంత బాధలోనూ– ‘మావాడు బతికివున్నప్పుడూ నిర్వాహకుడే; చనిపోయాకా నిర్వాహకుడే’ అన్నారట శ్లేషతో శాస్త్రి. ఇంకంతే, బంధువులు వచ్చి అనంతర కార్యక్రమాల్లో పాల్గొన్నారట.
Comments
Please login to add a commentAdd a comment