పద్మశ్రీ కోట సచ్చిదానందశాస్త్రి కన్నుమూత
హరికథకు పద్మశ్రీ అందించిన తొలి భాగవతార్‌గా గుర్తింపు
ఎలాంటి ప్రతిఫలం లేకుండా ఎంతో మందికి శిక్షణ
దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు
హరి కథలు చెప్పడమంటే మాటలు కాదు..అందుకు అద్భుతమైన సంగీత, పాండిత్య ప్రతిభ అవసరం. అది అందరికీ అబ్బే విద్య కాదు. ఈ తరంలో చాలా మందికి హరికథ అంటే తెలియదు. హరికథ అనేది తెలుగువారి సాంప్రదాయంలో ఓ భాగం. సంగీత, సాహిత్య నృత్య, అభినయాల సమ్మేళనమే ఈ హరికథ..ఈ విశిష్ట కళలో తెలుగునాట ప్రసిద్ధి చెందిన హరికథకుడు కోట సచ్చిదానందశాస్త్రి. ఆయన కథ చెప్పే విధానం గంగా ప్రవాహంలా సాగిపోతుంది.
తన అద్భుతమైన, అనర్గళమైన వాక్పటిమతో, శ్రావ్యమైన సంగీత, నాద, తాళ పాండిత్యంతో, శ్రోతలను రసమాధుర్యంలో ఓలలాడించే వారు ‘కోట’. ఆయన హరికథంటే జనం ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చేవారు... తండోపతండాలుగా వచ్చిన వారితో అక్కడ హౌస్‌ఫుల్... ఆ రోజు సినిమా థియేటర్లలో సెకండ్ షోకు జనం నిల్... చిన్న పిట్టకథలు, చతురోక్తులతో ‘కోట’ కథాగానం జనరంజకంగా సాగేది..మధూకరం చేసుకుంటూ వేదవిద్యను నేర్చుకుని, హరికథను సాధన చేసి, ప్రఖ్యాత హరికథకుడిగా ‘కోట’ ఎదిగారు.
7 దశాబ్దాల సుదీర్ఘ కథాగానంతో భారత ప్రభుత్వంచే ‘పద్మశ్రీ’ స్వీకరించారు. హరికథకు తొలిసారిగా పద్మశ్రీ అందించిన తొలి భాగవతార్‌గా కీర్తిని పొందారు. రామాయణ, భారత, భాగవతాలను గానం చేస్తూ విశేష ప్రాచుర్యం కల్పించారు. 7 దశాబ్దాలుగా దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చారు. శతాధిక కథావారసులను తీర్చిదిద్దారు. 8 పదుల వయసులోనూ కథాగానం చేస్తూ వచ్చారు. అలసిపోయిన ఆ గానం ఇక శాశ్వతంగా మూగబోయింది.
తెనాలి: సచ్చిదానంద శాస్త్రి స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి. తల్లిదండ్రులు వెంకట శివయ్య, సుబ్బమ్మ. పురోహితుడైన తండ్రి దగ్గరే శాస్త్రి చిన్నతనంలో వేదవిద్య అభ్యసించారు. బ్రాహ్మణ కోడూరులో మధూకర వృత్తితో పమిడిమర్రు సుబ్బావధానులు దగ్గర వేద విద్య నేర్చారు. 14 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో అయిదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగబిడ్డల్లో పెద్దవాడైన సచ్చిదానందశాస్త్రిపై కుటుంబ బాధ్యతలు పడ్డాయి.
బంధువర్గంలో కళాకారులు, హరికథకులు ఉండటంతో సహజంగానే ఆసక్తి కలిగిన శాస్త్రి..ఒకపక్క పౌరోహిత్యం చేస్తూనే..పరిమి సుబ్రహ్మణ్య భాగవతుల రచనలు చదివి స్వయంగా కథాగానం సాధన చేశారు. తర్వాత అదే జీవనాధారమైంది. విజయవాడలో ఓగిరాల గోపాలం, తణుకులో ముసునూరు సూర్యనారాయణమూర్తి భాగవతులు, తెనాలిలో భాగవతుల అన్నపూర్ణయ్య దగ్గర తన కథాగానాన్ని మెరుగుపరుచుకుంటూ, ప్రదర్శనలిస్తూ వచ్చారు. విజయనగరంలో ఏడేళ్లపాటు ఉండి ఆంధ్ర, ఒడిశా పరిసరాల్లో కథాగానం చేశారు.
హరికథను జనరంజకం చేసిన కోట..
57 ఏళ్ల క్రితం గుంటూరు చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. ఆసక్తి కలిగిన శిష్యులకు శిక్షణనిస్తూ వచ్చారు. చతురోక్తులు, సరస సంభాషణలతో ప్రేక్షకుల మనసు తనపై లగ్నమయ్యేవరకు కాలక్షేపం చేసి, కథాంశంతో హరికథను ఆరంభించేవారు. భక్తిరస సినిమా పాటలు, సున్నితమైన హాస్య సంభాషణలను చొప్పించటం, నృత్యాలు, అభినయం, నాటకీయతను చేర్చి హరికథను జనరంజకం చేశారు. ఈ ప్రత్యేకతతో వారికి ఎంతో డిమాండ్ ఏర్పడింది. ఒక్కరోజు విరామం లేకుండా హరికథలు చెప్పేవారు. బొత్తిగా చదువులేని వారికీ విద్య నేర్పారు. ఎలాంటి ప్రతిఫలం తీసుకోలేదు.
వారంతా హరికథ వృత్తిగా స్థిరపడినవారే. ఆకాశవాణిలో ఆయన టాప్ ఏ గ్రేడ్ ఆరి్టస్టు. ముఖ్యమైన పట్టణాలు, పుణ్యక్షేత్రాలు, లండన్, మారిషస్ వంటి దేశాల్లోనూ ప్రదర్శనలిచ్చారు. కంచిలోని పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి, శృంగేరీ పీఠాధిపతి, త్రిదండి చినజీయర్‌స్వామి, కుర్తాళం పీఠాధిపతుల సమక్షంలో కథాగానం చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు, ఆచార్య రంగా, నీలం సంజీవరెడ్డి, బ్రహా్మనందరెడ్డి, తెన్నేటి విశ్వనాథం వంటి ప్రముఖులు సచ్చిదానందశాస్త్రి కథాగానానికి పరవశులయ్యారు.
కోట్ల విజయభాస్కరరెడ్డి వీణను బహూకరిస్తే, ఎస్పీ బాలు చేతులమీదుగా అభిమానులు స్వర్ణకంకణం తొడిగారు. రాష్ట్ర ప్రభుత్వం ‘కళారత్న’తో గౌరవించింది. విజయనగరం మహారాజా కళాశాల శతజయంతి ఉత్సవాల్లో హరికథా పితామహ ఆది¿¶భట్ల నారాయణదాసు పురస్కారంతో సచ్చిదానందను సత్కరించారు. హరికథా త్రిమూర్తులుగా పేరొందిన ఆదిభట్ల నారాయణదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్, పరిమి సుబ్రహ్మణ్యం భాగవతులు ఆరాధన ఉత్సవాలను గత 26 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు సచ్చిదానందశాస్త్రి.
కోట హరికథాగాన కళాపీఠం పేరుతో జరిపే ఆ ఉత్సవాల్లో 25–30 ప్రోగ్రాములు, ప్రతిరోజూ అన్నదానం, ఏడు పదులు పైబడిన హరికథకులను సత్కరిస్తూ వస్తున్నారు. ‘హరికథ సజీవకళ. దీనిని ఉద్ధరించాలి’ అనేది సచ్చిదానందశాస్త్రి ఆశయం. ‘ఆదిభట్ల’తో సహా ఏ ఒక్క హరికథకుడిì కీ దక్కని పద్మశ్రీ గౌరవం తనకు దక్కటం అదృష్టమని చెప్పారు. ప్రతి దేవస్ధానంలో ఒక హరికథకుడిని నిర్ణయించటం, సంప్రదాయ కళారూపాల కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగితే కళలు పదికాలాలపాటు నిలిచి ఉంటాయని చెప్పేవారు..
గుంటూరులోసచ్చిదానందశాస్త్రి తుదిశ్వాస
నగరంపాలెం: ప్రముఖ హరికథా భాగవతార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచ్చిదానందశాస్త్రి (90) కన్నుమూశారు. వృద్ధాప్యంతో బాధపడుతోన్న ఆయన సోమవారం రాత్రి గుంటూరు అమరావతిరోడ్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సీతాదేవి, కుమారులు శివశాస్త్రి, శ్రీరామచంద్రమూర్తి, కృష్ణ మోహన్, కుమార్తె దుర్గవెంకటసుబ్బలక్ష్మీ ఉన్నారు. ఆయన భార్య గతంలోనే చనిపోయారు.
సోమవారం సాయంత్రం అంత్యక్రియలను గుంటూరు బొంగరాల బీడు శ్మశానవాటికలో నిర్వహించినట్లు పెద్ద కుమారుడు శివశాస్త్రి తెలిపారు. సచ్చిదానందశాస్త్రి గతేడాది జనవరిలో పద్మశ్రీ అవార్డు, 2022లో సంగీతనాటక అకాడమి అవార్డు, 2023 నవంబర్‌లో వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 2015లో హంసా పురస్కారం, 2009లో కొప్పరపు కవుల పురస్కారాలను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment