Harikatha
-
ఆగిన హరికథా గంగా ప్రవాహం
హరి కథలు చెప్పడమంటే మాటలు కాదు..అందుకు అద్భుతమైన సంగీత, పాండిత్య ప్రతిభ అవసరం. అది అందరికీ అబ్బే విద్య కాదు. ఈ తరంలో చాలా మందికి హరికథ అంటే తెలియదు. హరికథ అనేది తెలుగువారి సాంప్రదాయంలో ఓ భాగం. సంగీత, సాహిత్య నృత్య, అభినయాల సమ్మేళనమే ఈ హరికథ..ఈ విశిష్ట కళలో తెలుగునాట ప్రసిద్ధి చెందిన హరికథకుడు కోట సచ్చిదానందశాస్త్రి. ఆయన కథ చెప్పే విధానం గంగా ప్రవాహంలా సాగిపోతుంది. తన అద్భుతమైన, అనర్గళమైన వాక్పటిమతో, శ్రావ్యమైన సంగీత, నాద, తాళ పాండిత్యంతో, శ్రోతలను రసమాధుర్యంలో ఓలలాడించే వారు ‘కోట’. ఆయన హరికథంటే జనం ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చేవారు... తండోపతండాలుగా వచ్చిన వారితో అక్కడ హౌస్‌ఫుల్... ఆ రోజు సినిమా థియేటర్లలో సెకండ్ షోకు జనం నిల్... చిన్న పిట్టకథలు, చతురోక్తులతో ‘కోట’ కథాగానం జనరంజకంగా సాగేది..మధూకరం చేసుకుంటూ వేదవిద్యను నేర్చుకుని, హరికథను సాధన చేసి, ప్రఖ్యాత హరికథకుడిగా ‘కోట’ ఎదిగారు. 7 దశాబ్దాల సుదీర్ఘ కథాగానంతో భారత ప్రభుత్వంచే ‘పద్మశ్రీ’ స్వీకరించారు. హరికథకు తొలిసారిగా పద్మశ్రీ అందించిన తొలి భాగవతార్‌గా కీర్తిని పొందారు. రామాయణ, భారత, భాగవతాలను గానం చేస్తూ విశేష ప్రాచుర్యం కల్పించారు. 7 దశాబ్దాలుగా దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చారు. శతాధిక కథావారసులను తీర్చిదిద్దారు. 8 పదుల వయసులోనూ కథాగానం చేస్తూ వచ్చారు. అలసిపోయిన ఆ గానం ఇక శాశ్వతంగా మూగబోయింది. తెనాలి: సచ్చిదానంద శాస్త్రి స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి. తల్లిదండ్రులు వెంకట శివయ్య, సుబ్బమ్మ. పురోహితుడైన తండ్రి దగ్గరే శాస్త్రి చిన్నతనంలో వేదవిద్య అభ్యసించారు. బ్రాహ్మణ కోడూరులో మధూకర వృత్తితో పమిడిమర్రు సుబ్బావధానులు దగ్గర వేద విద్య నేర్చారు. 14 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో అయిదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగబిడ్డల్లో పెద్దవాడైన సచ్చిదానందశాస్త్రిపై కుటుంబ బాధ్యతలు పడ్డాయి. బంధువర్గంలో కళాకారులు, హరికథకులు ఉండటంతో సహజంగానే ఆసక్తి కలిగిన శాస్త్రి..ఒకపక్క పౌరోహిత్యం చేస్తూనే..పరిమి సుబ్రహ్మణ్య భాగవతుల రచనలు చదివి స్వయంగా కథాగానం సాధన చేశారు. తర్వాత అదే జీవనాధారమైంది. విజయవాడలో ఓగిరాల గోపాలం, తణుకులో ముసునూరు సూర్యనారాయణమూర్తి భాగవతులు, తెనాలిలో భాగవతుల అన్నపూర్ణయ్య దగ్గర తన కథాగానాన్ని మెరుగుపరుచుకుంటూ, ప్రదర్శనలిస్తూ వచ్చారు. విజయనగరంలో ఏడేళ్లపాటు ఉండి ఆంధ్ర, ఒడిశా పరిసరాల్లో కథాగానం చేశారు.హరికథను జనరంజకం చేసిన కోట..57 ఏళ్ల క్రితం గుంటూరు చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. ఆసక్తి కలిగిన శిష్యులకు శిక్షణనిస్తూ వచ్చారు. చతురోక్తులు, సరస సంభాషణలతో ప్రేక్షకుల మనసు తనపై లగ్నమయ్యేవరకు కాలక్షేపం చేసి, కథాంశంతో హరికథను ఆరంభించేవారు. భక్తిరస సినిమా పాటలు, సున్నితమైన హాస్య సంభాషణలను చొప్పించటం, నృత్యాలు, అభినయం, నాటకీయతను చేర్చి హరికథను జనరంజకం చేశారు. ఈ ప్రత్యేకతతో వారికి ఎంతో డిమాండ్ ఏర్పడింది. ఒక్కరోజు విరామం లేకుండా హరికథలు చెప్పేవారు. బొత్తిగా చదువులేని వారికీ విద్య నేర్పారు. ఎలాంటి ప్రతిఫలం తీసుకోలేదు. వారంతా హరికథ వృత్తిగా స్థిరపడినవారే. ఆకాశవాణిలో ఆయన టాప్ ఏ గ్రేడ్ ఆరి్టస్టు. ముఖ్యమైన పట్టణాలు, పుణ్యక్షేత్రాలు, లండన్, మారిషస్ వంటి దేశాల్లోనూ ప్రదర్శనలిచ్చారు. కంచిలోని పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి, శృంగేరీ పీఠాధిపతి, త్రిదండి చినజీయర్‌స్వామి, కుర్తాళం పీఠాధిపతుల సమక్షంలో కథాగానం చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు, ఆచార్య రంగా, నీలం సంజీవరెడ్డి, బ్రహా్మనందరెడ్డి, తెన్నేటి విశ్వనాథం వంటి ప్రముఖులు సచ్చిదానందశాస్త్రి కథాగానానికి పరవశులయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి వీణను బహూకరిస్తే, ఎస్పీ బాలు చేతులమీదుగా అభిమానులు స్వర్ణకంకణం తొడిగారు. రాష్ట్ర ప్రభుత్వం ‘కళారత్న’తో గౌరవించింది. విజయనగరం మహారాజా కళాశాల శతజయంతి ఉత్సవాల్లో హరికథా పితామహ ఆది¿¶భట్ల నారాయణదాసు పురస్కారంతో సచ్చిదానందను సత్కరించారు. హరికథా త్రిమూర్తులుగా పేరొందిన ఆదిభట్ల నారాయణదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్, పరిమి సుబ్రహ్మణ్యం భాగవతులు ఆరాధన ఉత్సవాలను గత 26 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు సచ్చిదానందశాస్త్రి. కోట హరికథాగాన కళాపీఠం పేరుతో జరిపే ఆ ఉత్సవాల్లో 25–30 ప్రోగ్రాములు, ప్రతిరోజూ అన్నదానం, ఏడు పదులు పైబడిన హరికథకులను సత్కరిస్తూ వస్తున్నారు. ‘హరికథ సజీవకళ. దీనిని ఉద్ధరించాలి’ అనేది సచ్చిదానందశాస్త్రి ఆశయం. ‘ఆదిభట్ల’తో సహా ఏ ఒక్క హరికథకుడిì కీ దక్కని పద్మశ్రీ గౌరవం తనకు దక్కటం అదృష్టమని చెప్పారు. ప్రతి దేవస్ధానంలో ఒక హరికథకుడిని నిర్ణయించటం, సంప్రదాయ కళారూపాల కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగితే కళలు పదికాలాలపాటు నిలిచి ఉంటాయని చెప్పేవారు..గుంటూరులోసచ్చిదానందశాస్త్రి తుదిశ్వాసనగరంపాలెం: ప్రముఖ హరికథా భాగవతార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచ్చిదానందశాస్త్రి (90) కన్నుమూశారు. వృద్ధాప్యంతో బాధపడుతోన్న ఆయన సోమవారం రాత్రి గుంటూరు అమరావతిరోడ్లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సీతాదేవి, కుమారులు శివశాస్త్రి, శ్రీరామచంద్రమూర్తి, కృష్ణ మోహన్, కుమార్తె దుర్గవెంకటసుబ్బలక్ష్మీ ఉన్నారు. ఆయన భార్య గతంలోనే చనిపోయారు. సోమవారం సాయంత్రం అంత్యక్రియలను గుంటూరు బొంగరాల బీడు శ్మశానవాటికలో నిర్వహించినట్లు పెద్ద కుమారుడు శివశాస్త్రి తెలిపారు. సచ్చిదానందశాస్త్రి గతేడాది జనవరిలో పద్మశ్రీ అవార్డు, 2022లో సంగీతనాటక అకాడమి అవార్డు, 2023 నవంబర్‌లో వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2015లో హంసా పురస్కారం, 2009లో కొప్పరపు కవుల పురస్కారాలను అందుకున్నారు. -
ఎంతో ఆనందంగా ఉంది..
సాక్షి, మచిలీపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: స్వర మహేశ్వరిగా పేరు తెచ్చుకున్న ఉమామహేశ్వరి (63) సంస్కృతంలో హరికథ చెప్పిన తొలి మహిళా భాగవతారిణి. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఈమె హరికథను చెప్పడంలో ఎన్నో విశిష్టతలు కలిగి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సముచిత గౌరవం ఇచ్చి ఎంపికచేసింది. చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న ‘కుమార సంభవం’ కథే ఇప్పుడు దేశ అత్యుత్తమ పురస్కారానికి ఎంపికయ్యేలా చేసింది. ఈమె సావిత్రి, భైరవి, శుభపంతువరాలి, కేదారం, కళ్యాణి వంటి కథలను వివిధ రాగాల్లో చెప్పడంలో దిట్ట. నాన్న లాలాజీరావు నాదస్వర విద్వాంసుడు కావడం, అమ్మ సరోజినికి సంగీతంలో ప్రావీణ్యం ఉండడంతో చిన్నప్పటి నుంచే కళా రంగాన్ని ఎంచుకున్న ఉమామహేశ్వరి రాష్ట్రం గర్వపడేలా ఎదిగారు. ఈమె ప్రఖ్యాత నాదస్వర విద్వాన్ దివంగత దాలిపర్తి పిచ్చిహరి మనవరాలు కూడా. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నా.. ఓనమాలు మాత్రం బందరులో నేర్చుకోవడంతో జిల్లా కళాకారులు, ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. త్వరలో రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ అందుకోనున్న ఉమామహేశ్వరి తనను అవార్డు వరించడంపై స్పందించారు. ఆమె ఏమన్నారంటే.. సరదాగా నేర్చుకున్న కథే ఈ స్థాయికి చేర్చింది: 14వ ఏట హరికథకు జీవితం అంకితం చేశాను. అలా సరదాగా మహాకవి కాళిదాసు సంస్కృతంలో రచించిన కుమార సంభవంను నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను ఎన్నో ప్రదర్శనలిచ్చాను. పదికిపైగా సంస్కృతం, 25కి పైగా తెలుగులో హరికథలు నేర్చుకున్నాను. దేశ, విదేశీ కళాకారుల నుంచి పురస్కారాలు అందుకున్నాను. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక సంగీత్ నాటక్ అకాడమీ పురస్కారాన్ని అందుకున్నాను. ఇవికాక.. యూనివర్సిటీలు, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నాను. 1993లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్ జరిగితే హాజరై సంస్కతంలో హరికథ చెప్పి ప్రశంసలు పొందాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం నాట్యకారుడు, భర్త కళాకృష్ణతో హైదరాబాదులోని బేగంపేటలో ఉంటున్నాం. అమ్మనాన్నలు మరణించాక మచిలీపట్నంకు రావడంలేదు. మేం ఇక్కడ ఉంటున్నా నన్ను ఈ స్థాయికి చేరేలా ఓనమాలు దిద్దించిన బందరు అంటే ప్రేమే. -
ఆదిభట్ల అంటే 'హరికథ'..'హరికథ' అంటే..
తెలుగు వారిని ఊరించి ఊగించి ఉప్పొంగించిన కళాస్వరూపాలలో అపురూపమైనది 'హరికథ'. ఈ కళాకేళికి అపూర్వమైన కీర్తిని కట్టబెట్టినవాడు ఆదిభట్ల నారాయణదాసు. ఆదిభట్ల అంటే హరికథ - హరికథ అంటే ఆదిభట్ల. వీరికి పూర్వం కూడా హరికథ ఉంది,హరికథకులు ఉన్నారు. ఈ ప్రక్రియకు కొత్తరూపును, సరికొత్త ప్రాపును తెచ్చినవాడు కేవలం నారాయణదాసు. సంగీత సాహిత్య సార్వభౌముడుగా, లయబ్రహ్మగా ప్రసిద్ధుడు. 'హరికథా పితామహుడు'గా సుప్రసిద్ధుడు.'ఆటపాటల మేటి'గా అనంత వైభవశ్రీమంతుడు. ఆధునిక కాలంలో,తెలుగునేలపై ఇంతటి బహుముఖ ప్రతిభామూర్తి మరొకరు లేరనడం అతిశయోక్తికాదు. సామాన్యులను, అసామాన్యులను అనుపమానంగా మెప్పించి 'హరికథ'కు పట్టం కట్టిన ప్రతిభాశాలి.కేవలం తెలుగువారే కాదు,యావత్తు భారతీయులు,ఆంగ్లేయులు సైతం ఆయన ప్రజ్ఞకు మోకరిల్లారు. బహుకళా ప్రావీణ్యం,బహుభాషా ఆధిక్యం ఆదిభట్ల సొమ్ము."ఆధునిక కాలంలో నా దృష్టిలో దైవాంశ సంభూతులు ముగ్గురే ముగ్గురు. ఒకరు అసమాన దేహబల సంపన్నుడైన కోడి రామ్మూర్తి, ఇంకొకరు మారుత వేగ కవితా స్వరూపులైన కొప్పరపు కవులు, మరొకరు పంచముఖీ పరమేశ్వరుడైన ఆదిభట్ల నారాయణదాసు"..... అని 'కవి సమ్రాట్ ' విశ్వనాథ సత్యనారాయణ ఒక సమావేశంలో నారాయణదాసు శక్తి స్వరూపానికి అక్షరార్చన చేశారు. నారాయణదాసుపై అద్భుతమైన పరిశోధన చేసి డాక్టరేట్,గోల్డ్ మెడల్ తీసుకున్న డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణ (గుంటూరు) ఈ విషయాన్ని ఆత్మీయుల దగ్గర చెబుతుండేవారు. కథాగానం చేస్తూ..ఏకకాలంలో శరీరంలోని ఐదు భాగాలతో ఐదు తాళలను మేళవించడం అతిమానుష శక్తిగా (సూపర్ హ్యూమన్ ) నాటి మహాకవి పండిత,క ళామూర్తులు నిలువెల్లా భజించారు. రెండు చేతులు,రెండు కాళ్ళు, తలతో అయుదు తాళాలకు దరువు వేసి చూపించే ఆ ప్రజ్ఞ ప్రపంచంలోనే ఎవ్వరికీ లేదు. అది అనితర సాధ్యం. ఇంతటి శక్తి కేవలం నారాయణదాసుకే వశమైంది. ఇది నభూతో ! న భవిష్యతి! గా పెద్దలందరూ నిర్ణయించారు. మహారాష్ట్రలో 'అభంగులు', తమిళనాడులో 'కాలక్షేపం', కర్ణాటకలో 'హరికథా కాలక్షేపం', మనకంటే కాస్త ముందుగా రూపుదిద్దుకున్నాయి. మనకు 'యక్షగానం ఉంది. ఉన్నప్పటికీ, హరికథకు - యక్షగానానికి కొన్ని పోలికలతో పాటు, కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. నారాయణదాసు చేతిలో 'తెలుగు హరికథ' సర్వాంగ సుందరంగా కొత్త రూపును దిద్దుకుంది, తీరు మార్చుకుంది, కొంగ్రొత్త వన్నెలు, వయ్యారాలు పోయింది. మరాఠా, తమిళ, కన్నడుల ప్రభావంతో, మన తెలుగుదేశంలో నారాయణదాసు కంటే ముందు కొందరు హరికథా ప్రదర్శనలు చేశారు.' కథాగానం' మూలంగా రూపుదిద్దుకున్న ఈ కళ అత్యంత ప్రాచీనమైంది. మిగిలిన రాష్ట్రాలలో సంగీతం, సాహిత్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ కథాగానాలు సాగేవి. అందులో నృత్యం, అభినయం అనేవి ఉండేవి కావు. సంగీతం,కవిత్వం, నృత్యం, అభినయం, నాటకం పెనవేసుకున్న అపూర్వ సర్వ కళాస్వరూపం మన ఆదిభట్ల చేతుల్లో అవతారమెత్తిన 'హరికథా రూపం. హాస్య ప్రసంగాలు, పిట్టకథలు, విసుర్లు,చెణుకులు, చమత్కార భరితమైన చాటుపద్య మణిమంజరులతో,గజ్జెకట్టి, చిరు తాళాలు మోగిస్తూ... నారాయణదాసు హరికథా ప్రదర్శన చేస్తూంటే... కొన్ని వేలమంది ఒళ్ళు మరచి,ఆ రససముద్రంలో మునిగితేలేవారు. తెల్లవార్లూ సాగే ఆ ఆటపాటలతో అలిసిసొలసి పోయేవారు. ఆదిభట్ల వారి 'బేహాగ్' రాగ ప్రస్థానానికి 'విశ్వకవి' రవీంద్రనాథ్ ఠాగూర్ మంత్రముగ్ధుడైపోయారు. సర్వేపల్లి రాధాకృష్ణ, సరోజనీదేవి వంటి విజ్ఞులు,ప్రాజ్ఞులు ఎందరో ఆదిభట్లవారి ప్రజ్ఞకు నీరాజనాలు పట్టారు. విజయనగరంలో ఐదుతాళాలతో కథాగానం చేసి, దక్షిణాది పండితులను ఓడించి 'పంచముఖీ పరమేశ్వర' బిరుదును గెలుచున్న ఘనుడు ఆదిభట్ల. హరికథలే కాక, అష్టావధానాలు చేశారు. తెలుగు,సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఇంగ్లిష్, అరబ్బీ, పార్శీ మొదలైన అనేక భాషల్లో ప్రావీణ్యం ఆయన ఐశ్వర్యం. శతాధిక గ్రంథాలు రాశారు. సంగీతాన్ని - సాహిత్యాన్ని సమ ప్రతిభతో ప్రదర్శన చేశారు. అనేక అంశాలపై అపురూపమైన పరిశోధనలు చేశారు. సంగీతంపై లాక్షణిక గ్రంథాలు రాశారు. తాత్వికత సిద్ధాంతాల శాస్త్ర గ్రంథాలు రాశారు. హరికథలు, ప్రబంధాలు,శతకాలు, నాటకాలు,అనువాదాలు ఇలా అనంతముఖంగా ఆ రచనా విన్యాసం విజృంభించింది. ఉమర్ ఖయ్యామ్ రుబాయీలను అనువాదం చేసిన తీరు అనన్య సామాన్యం.నాలుగు విధాలుగా ఆ అనువాదం సాగింది. పారశీలో నుంచి సంస్కృతంలోకి, అచ్చ తెలుగులోకి అనువాదం చేశారు. పీట్స్ జెరల్డ్ ఇంగ్లిష్ లో రాసిన దానిని కూడా అచ్చతెలుగు,సంస్కృతంలో భిన్న ఛందస్సుల్లో అనుసృజన చేసిన తీరు ఆదిభట్లకే చెల్లింది. 'నవరస తరంగిణి' అద్భుతమైన రచన.కాళిదాసు సంస్కృత కవిత్వం,షేక్స్ పియర్ ఇంగ్లిష్ సాహిత్యంలోని నవరసాలను తెలుగులో అనువదించిన వైనం అనితర సాధ్యం.'దశవిధ రాగ సవతి కుసుమ మంజరి' మరో మాణిక్యం. మంజరీ వృత్తంలో 90 రాగాలతో ఈ రచన సాగింది.ఋగ్వేదంలోని ఋక్కులను స్వరపరచి వీణపై వినిపించడమే కాక,ఎందరికో నేర్పించారు.ఆ ఋక్కులను తెలుగుగీతాలు గానూ సృష్టించాడు.ఆయన 'శంభో..' అంటూ నినాదం చేస్తూంటే.. విజయనగరం మొత్తం వినపడేది. కేవలం,ఆయన గురించే విజయనగరంలో సంగీత విద్యాలయాన్ని స్థాపించారు.దానికి ఆయనే మొట్టమొదటి ప్రిన్సిపాల్. నోబెల్ ప్రైజ్ కు నామినేట్ చేయడానికి బ్రిటిష్ వారు ఉత్సాహం చూపించినా, ఆయన సున్నితంగా తిరస్కరించారు.ఎన్నో రచనలు చేశారు.ఎన్నో వేషాలు వేశారు. 'అచ్చతెలుగు'పై మక్కువ ఎక్కువ పెంచుకొని విశిష్టమైన కృషి చేశారు, రచనలు అందించారు. నూరుగంట, మొక్కుబడి,వేల్పువంద,తల్లి విన్కి (లలితా సహస్ర నామం), వెన్నుని వేయిపేర్ల వినికరి (విష్ణు సహస్ర నామ కీర్తనం) మొదలైనవి ఎన్నో ఉన్నాయి. అనేక అచ్చతెలుగు పదాలను సృష్టించారు. ఆయన ముట్టని కళ లేదు.ఆయనకు దక్కని బిరుదు సత్కారాలు లేవు.తెలుగునాట గజ్జెకట్టి కథ చెప్పే ప్రతి హరిదాసు మొట్టమొదటగా తలుచుకొనేది నారాయణదాసునే.సర్వ విద్యా పారంగతుడు,సర్వ కళాస్వరూపుడైన ఆయనకు గురువంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేరు.ఆన్నీ స్వయంగా సిద్ధించినవే.రససిద్ధిని చేకూర్చినవే.చెన్నపట్టణానికి చెందిన భాగవతార్ కుప్పుస్వామి నాయుడు విజయనగరంలో చెప్పిన హరికథ విని,నారాయణదాసు 'ధ్రువ చరిత్రం' అనే హరికథను రాశారు.అదే ఆదిభట్ల రచించిన మొట్టమొదటి కథ. సొంత కీర్తనలు,భాగవత పద్యాలు, పంచతంత్రకథలు కలిపి రూపకల్పన చేశారు. వేణుగోపాలస్వామి దేవాలయంలో 1883లో తొట్టతొలిగా ప్రదర్శన చేశారు. కాళ్ళకు గజ్జెకట్టి ఆడిన ఆ ఆటే తర్వాత ' ఆటపాటల మేటి'గా అనంతమైన కీర్తిశిఖరాలకు చేర్చింది. శ్రీకాకుళం జిల్లా ఉర్లాం సంస్థానంలో తొలిసారిగా సంగీత సాహిత్య సమలంకృతంగా 'అష్టావధానం' చేశారు. ఎవరో సవాల్ విసిరితే! రాత్రికి రాత్రి 'అంబరీషోపాఖ్యానం' హరికథను రూపొందించారు. అదంతా ధారణలో ఉంచుకొని, ఆ మర్నాడే అద్భుతంగా ప్రదర్శించి అందరినీ అమితాశ్చర్యపరచారు. అది కూడా ఉర్లాం సంస్థానంలోనే జరిగింది. ఇది ఆయన రూపొందించిన రెండో హరికథ. 20 ఏళ్ళ వయస్సు రాకముందే ప్రదర్శనలు ఇచ్చి, తెలుగు హరికథకు కొత్త రూపాన్ని ఇచ్చారు. ఆయన ఏకసంథాగ్రాహి. ఏదైనా కేవలం ఒక్కసారి వింటే,హృదయంలో నాటుకుపోయేది. చిన్నప్పటి నుంచీ అదే తీరు. నాలుగేళ్ల వయస్సులోనే భాగవత పద్యాలు చదివేవాడు. పద్నాలుగేళ్ళ వయస్సు వరకూ స్కూల్ ముఖమే చూడలేదు. కొన్ని వందల పద్యాలు, శ్లోకాలు,కీర్తనలు కేవలం విని హృదయస్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఎఫ్ ఏ పాసయ్యారు. పదేళ్ల ప్రాయంలోనే తాళపత్ర రచనలో ప్రావీణ్యం పొందారు. వీణావాదనా ప్రజ్ఞ కూడా సహజ ప్రతిభా సంస్కారాలతోనే అబ్బింది. బొబ్బిలి సంస్థాన విద్వాంసుడు వాసా సాంబయ్య దగ్గర కేవలం ఒక నెలరోజుల పాటు వీణలో శిష్యరికం చేశారు. తదనంతర జీవితంలో ఎందరో పెద్దలతో పరిచయ భాగ్యం ఏర్పడింది. వారి నుంచి అనేక విశేషాలు, మెళుకువలను తన సూక్ష్మగ్రాహ్య ప్రజ్ఞతో ఒంటపట్టించుకున్నారు. ఆ గానం,ఆ గాత్రం,ఆ ప్రదర్శనం,ఆ వ్యక్తిత్వం,ఆ వైభవం ఆన్నీ ముగ్ధమనోహరమైనవే.ఆయన ఆత్మకథ ' నా ఎరుక' పెను సంచలనం.తన ముప్పైఏళ్ళ వరకూ జీవితంలో సాగిన విశేషాలన్నీ అందులో ఉంటాయి.తన విలాస పురుషత్వం,రసికత్వం ఆన్నీ అక్షరబద్ధం చేశారు. ఏ అనుభవాన్నీ దాచిపెట్టని తెగువ ఆయనకే చెల్లింది. ఆయన జీవితమే ఒక ప్రభంజనం. ఆగష్టు 31 ఆదిభట్లవారి జయంతి.యఎనిమిది పదుల సంపూర్ణ జీవితాన్ని అనుభవించిన పరిపూర్ణుడు (1864-1945). సూర్యనారాయణ నుంచి నారాయణదాసుగా మహా అవతారమూర్తిగా వాసికెక్కిన ప్రతిభామూర్తి. ఈ హరికథా పితామహుడు మన తెలుగువాడు. సర్వ కళలకు రేడు. మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: భాషోద్యమంలో పిడుగు గిడుగు!) -
హరికథే ఆమె కథ
14వ ఏట నుంచి డి.ఉమామహేశ్వరి హరికథ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. 'సంస్కృతం’లో హరికథ చెప్పగలిగే ఏకైక మహిళా భాగవతారిణి.తెలుగులో ఆమె చెప్పే హరికథలకు విశేష అభిమానులు ఉన్నారు.ప్రతిష్ఠాత్మక సంగీత్ నాటక్ అకాడెమీ పురస్కారాన్ని న్యూఢిల్లీలో నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు.అక్కడి రబీంద్ర భవన్లో ఫిబ్రవరి 24న ప్రదర్శన ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... ‘‘మాది బందర్ (మచిలీపట్నం). మా నాన్న లాలాజీ రావు నాదస్వర విద్వాంసుడు. వేములవాడ దేవస్థానంలో 30 ఏళ్ల పా టు నాదస్వర వాదన చేశాడాయన. మేము వేములవాడలో ఉన్నా అవకాశం దొరికినప్పుడల్లా బందర్‌కు తీసుకెళ్లేవాడు. అక్కడ నేను హరికథలు వినేదాన్ని. మా చిన్నప్పుడు కోట సచ్చిదానంద శాస్త్రిలాంటి వారు 40 రోజుల పా టు మహాభారతం చెప్పేవారు. జనం విరగబడేవారు. సినిమాహాళ్ల యజమానులొచ్చి హరికథను ముగించమని, జనం సినిమాలకు రావడం లేదని బతిమిలాడేవారు. అలా హరికథ నా మనసులో ముద్ర వేసింది. హరికథా గురుకులంలో... తూ.గో.జిల్లా కపిలేశ్వరపురంలో జమీందారు సత్యనారాయణ గారు, వారి శ్రీమతి రాజరాజేశ్వరి గారు డాన్స్ స్కూల్ స్థాపించాలనుకున్నారు. కాని నటరాజ రామకృష్ణ గారు ఇది తెలిసి డాన్స్ స్కూల్స్ చాలా ఉన్నాయి హరికథ కళ అంతరించిపోతోంది... దాని కోసం స్కూల్ తెరువు అనంటే రాజావారు తన తండ్రి పేరున శ్రీ సర్వరాయ హరికథా గురుకులం స్థాపించారు. మా నాన్న ఇది తెలిసి నన్ను అక్కడ చేర్పించారు. 14 ఏళ్ల వయసులో అక్కడ చేరి ఆదిభట్ల నారాయణదాసు ఏ సంప్రదాయం హరికథకు స్థిరపరిచారో ఆ సంప్రదాయంలోనే నేర్చుకున్నాను. నాతో పా టు మరో 40 మంది అమ్మాయిలు హరికథను నేర్చుకున్నారు. హరికథ చెప్పాలంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, సంస్కృతం, తెలుగు తెలిసి ఉండాలి. ఆటా పా టా మాట... వీటిని మేటిగా మేళవిస్తూ రక్తి కట్టేలా కథ చెప్పాలి. గురువుల దయవల్ల నేను నేర్చుకోగలిగాను. విజయనగరం సంస్కృత పా ఠశాలలో నా తొలి ప్రదర్శన ఇచ్చాను. సంస్కృతంలో హరికథ తెలుగులో హరికథలు చాలామంది చెబుతారు. కాని అవి తెలుగువారికి మాత్రమే పరిమితం. దేశంలో వేద విద్యను సంస్కృతంలో అభ్యసిస్తున్నవారు, సంస్కృత స్కాలర్లు, టీచర్లు, ఆ భాష ప్రేమికులు చాలామంది ఉన్నారు. వారి కోసం సంస్కృతంలో హరికథలు చెప్తే బాగుండునని అనుకున్నాను. ఎన్.పి.హెచ్.కృష్ణమాచార్యులు గారు కాళిదాసు కావ్యాలను హరికథలుగా రాసి ఇచ్చారు. ఉజ్జయినిలో సంస్కృత పండితుల ఎదుట ‘అభిజ్ఞాన శాకుంతలం’ చెప్పడంతో నేను ఆ భాషలో చెప్పే తొలి మహిళను అయ్యాను. కుమార సంభవం, రఘువంశం, ఆది శంకరాచార్య, గీత గోవిందం, భక్త జయదేవ... వీటిని హరికథలుగా సంస్కృతంలో చెబుతున్నాను. 1993లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్ జరిగితే హాజరయ్యి సంస్కృతంలో హరికథ చెప్పాను. ప్రశంసలుపొందాను. భక్తిమార్గం కొందరు సినిమా పా టలను కలిపి హరికథలు చెబుతుంటారు. అది నా మార్గం కాదు. సరిగా హరికథ చెప్తే నేటికీ ప్రేక్షకులు ఎందరో వస్తున్నారు. నా దగ్గరకు వచ్చిన ఔత్సాహికులకు ఈ కళను నేర్పిస్తున్నాను. ఆదిభట్ల గారి మునిమనవరాళ్లకు నేర్పించాను. కాని ఈ కళ కోసం మరింత జరగాల్సి ఉంది. భర్తతో కలిసి మా ఆయన కళాకృష్ణ ప్రసిద్ధ నాట్యకారుడు. మాకు కొడుకు, కూతురు ఉన్నారు. మేమిద్దరం శక్తి ఉన్నంత కాలం మా కళను ప్రదర్శిస్తూ కొత్త తరాలకు నేర్పిస్తూ ఉండాలని నిశ్చయించుకున్నాం.’’ -
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా హరికథ ఫస్ట్‌లుక్
డైరెక్టర్ అనుదీప్ రెడ్డి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం హరికథ. ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు , కవిత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల్ రామ్, లావణ్య రెడ్డి, కీర్తిలు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేసింది చిత్రం బృందం. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదు ఈ రోజు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. కాగా ఈ చిత్రానికి కెమెరామెన్ గా మస్తాన్ షరీఫ్ వ్యవహరించగా బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మహావీర్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకొని విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
వృషభం ఎక్కడికి పోతుంది?
హరికథా పితామహుడిగా పేరుగాంచిన ఆదిభట్ల నారాయణదాసు ఇంట్లో ఉన్నప్పుడు గోచీ మాత్రమే కట్టుకునేవారు. బయటికి వెళ్తే మాత్రం పట్టు వస్త్రాలు ధరించేవారు. గంధపు పూత, కొప్పుకు పూదండ, ఆభరణాలు, హారాలు... చాలా దర్జాగా ఉండేది వ్యవహారం. ఆ వేషధారణలో ఓసారి విజయనగరం ఆస్థానానికి వెళ్లారు. అసలే మనిషి ఎత్తు. ఆరు అడుగుల రెండు అంగుళాలు ఉండేవారు. దానికి తగిన లావు. ఈ ఆహార్యాన్ని చూసి, సంస్థానాధీశుడు శ్లేషగా, ‘కవి వృషభులు ఎక్కడికో బయలుదేరినట్టు ఉన్నారు’ అని పలకరించాడు. కవి కేసరి, కవి కోకిల లాంటి బిరుదులు ఇవ్వడం మన సాంప్రదాయమే. ఆ కోవలో కవి వృషభులు అనడం ఆదిభట్లను గౌరవించడమూ అదే సమయంలో వృషభంలా ఉన్నావు అని వెక్కిరించడమూ కూడా. మరి ఆదిభట్ల తక్కువవాడా? రాజు అంటే అన్నీ ఇచ్చేవాడు కదా! ఆ అర్థం వచ్చేట్టుగానూ మరో భావం స్ఫురించేట్టుగానూ చమత్కారంగా ఇలా జవాబిచ్చారు. ‘ఇంకెక్కడికి ప్రభూ, కామధేనువు లాంటి మీ దగ్గరికే’. -
ఆమెకు ఈ అవార్డు అరుదైనదే
హైదరాబాద్: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు కళ్యాణి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కమెడియన్ గా, పత్యేక నటిగా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన నటి కళ్యాణి తన విశేష ప్రతిభతో లిమ్కా రికార్డు దక్కించుకుంది. కరాటే విద్యలో ఉత్తమమైన బ్లాక్ బెల్టును దక్కించుకున్న ఆమె హరికథ కళాకారిణి కూడా. తాజాగా సుదీర్ఘ హరికథా గానంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నట్టు ఆమె తెలిపారు. దీనికి సంబంధించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయ ఘోష్ నుంచి లేఖ వచ్చినట్టు ఆమె తెలిపారు. ఆదిభట్ల కళాపీఠం వ్యవస్థాపకురాలైన పడాల కళ్యాణి ఈ కళాపీఠం ద్వారా సుదీర్ఘ హరికథా ప్రవచనాలను నిర్వహించి ఈ రికార్డు సాధించారు. గత ఏడాది జూన్ 20 నుంచి 25 వరకు హైదరాబాద్‌లోని సిద్దార్ధనగర్ కమ్యూనిటీ హాల్లో నిరంతరంగా 114 గంటల 45 నిమిషాల 55 సెకెన్ల పాటు హరికథలను వినిపించినట్టు తెలిపారు. దీంతో పాటు 61 మంది కళాకారులతో అష్టోత్తర శతనిర్విరామ హరికథా గాన యజ్ఞం నిర్వహించామన్నారు. గతేడాది ఏప్రిల్ నెలల కళ్యాణిపై పేకాట ఆరోపణలు రావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తనను ఎవరో కావాలనే పేకాట కేసులో ఇరికించారంటూ కళ్యాణి ఆరోపణలను కొట్టి పారేశారు. హరికథ కళాపీఠం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో తన కార్యాకలాపాలను ఆపాలని కొందరు కుట్ర చేసి ఇరికించారన్నారు. కాగా ఈ సంఘటనతో మనస్తాపానికి గురైన కళ్యాణి పట్టుదలతో హరికథ కళాపీఠంపై సీరియస్ గా దృష్టి సారించినట్టు సమాచారం. ఆదిభట్ల కళాపీఠం స్థాపించి, అవార్డు సాధనకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. -
'హరికథ' కాదు 'నేను శైలజ'
యంగ్ హీరో రామ్ మరోసారి ఆలోచనలో పడ్డాడు. రొటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన యంగ్ హీరో చాలా రోజులుగా ఒక్క హిట్ కూడా లేకుండా కెరీర్ నెట్టుకొస్తున్నాడు. 'పండగ చేస్కో' సినిమాతో కాస్త ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించిన 'శివమ్' సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. రొటీన్ కథా కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు రామ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో 'సెకండ్ హ్యాండ్' ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సినిమా ప్రారంభానికి ముందే ఈ సినిమాకు 'హరికథ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే రామ్ ఈ టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నాడట. హరికథ అనే టైటిల్ పాతగా అనిపిస్తోందన్న ఉద్దేశంతో 'నేను శైలజ' అనే సాఫ్ట్ టైటిల్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం యంగ్ హీరోలందరూ 'నాన్నకు ప్రేమతో', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అత్తారింటికి దారేది' లాంటి సాఫ్ట్ టైటిల్స్‌తో వస్తుంటే తను మాత్రం ప్రయోగం చేయటం ఎందుకు అని భావించిన రామ్, 'నేను శైలజ' టైటిల్‌కే ఫిక్స్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే చిత్రయూనిట్ ఈ టైటిల్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారట. -
టాగూర్ మెచ్చిన హరికథకుడు
ఆగస్టు 31న ఆదిభట్ల నారాయణదాసు జయంతి ఒక్కొక్క ప్రక్రియ ఒక్కొక్కరి చేతిలో పడి ప్రసిద్ధి పొందుతుంది. అందరూ ఆ ప్రక్రియను అనుసరించవచ్చు. కానీ ఒక్కరికే పేరు వస్తుంది. సంస్కృతంలో అనుష్టుప్ శ్లోకానికి వాల్మీకి తరువాత వ్యాసుడూ ప్రతినిధిగా నిలిచేరు. మందాక్రాంత అనగానే కాళిదాసే ఎదురవుతాడు. తెలుగులో వృత్తానికి నన్నయ, కందానికి తిక్కన, సీసానికి శ్రీనాథుడు, ఆటవెలదికి వేమన హక్కుదార్లుగా కనబడతారు. ఇలా హరికథకు ఆదిభట్ల నారాయణదాసు పేరుగాంచారు. హరికథకు ఆయన సృష్టికర్త, ఆద్యుడు కాకపోవచ్చు. విజయనగరం కానుకుర్తివారింట్లో మద్రాసునించి వచ్చిన కుప్పుస్వామినాయుడిగారి హరికథను విని ఆ రాత్రికి రాత్రే తన 18వ ఏట ధ్రువచరిత్రను హరికథగా రచించేరు. మహారాష్ట్రుల హరికథలో తమిళులు సంగీతాన్ని జోడిస్తే దాసుగారు హరికథలో నృత్యం ప్రవేశపెట్టారనవచ్చు. ఆయన ప్రవేశపెట్టిన మరొకటి 'మట్లు' ఇవి నృత్యానికి అనుగుణంగా రూపొందించబడ్డాయి. దాసుగారి సంగీత రచనకు జనసామాన్యాల్లో అధిక ప్రచారాన్ని తెచ్చింది ఈ మట్లే! అవధాన సరస్వతిని అటు గద్వాలిటు చెన్నపట్నం అంటూ తిరుపతి వేంకట కవులు ఊరేగిస్తే, హరికథా సరస్వతిని దాసుగారు అటు కలకత్తా ఇటు మైసూరు అంటూ ఊరేగించారు. కలకత్తాలో దాసుగారు పాడిన బేహాగ్ రాగం విన్న రవీంద్రనాథ్ టాగూర్ విజయనగరం వచ్చినప్పుడు దాసుగారితో 'మీరు పాడిన బేహాగ్ ఇంకా నా చెవుల్లో మార్మోగుతోంది' అని ప్రశంసించేరు. తరువాతి రోజుల్లో- ఈ రోజుకూ హరికథకులెవరైనా సరే దాసుగారి శిష్యప్రశిష్యులు కావలసిందే. అందుకే చెళ్లపిళ్లవారన్నారు: 'దాసు నారాయణునకు నీతండు వీని దాసు లెల్లడ గల హరిదాసు లెల్ల' వాగ్గేయకారునిగా దాసుగారు 14 హరికథలను సంస్కృతంలో, ఆంధ్రంలో రచించేరు. అంతకుమించి (నా యెఱుక, నూఱుగంటి, నవరస తరంగిణి, మన్కి మిన్కు, జగజ్జ్యోతి లాంటి) 32 గ్రంథాలను సాహితీమూర్తిగా దేశానికందించేరు. అసాధ్య అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు చేసేరు. విజయనగరం రాజులతో షికార్లకు వెళ్లేరు, పేకాట ఆడేరు. మైసూరు మహారాజావారు 'మా కొలువులో వుందురా!' అంటే 'మర్త్యుల గొల్వను' అని నిర్భయంగా ప్రకటించేరు. ప్రస్తుతానికి వస్తే- దాసుగారు విజయనగరంలో 1919లో ప్రారంభింపబడిన సంగీత కళాశాలకు (విజయరామ గాన పాఠశాల) పాటబడి పెద్దగా (ప్రిన్సిపాల్) తన 55వ ఏట నియమింపబడి, 16 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. కానీ ఇవ్వాళ్టివరకు ఆ పాఠశాలలో హరికథకు స్థానం లేదు. గాత్రం, వయోలిన్, మృదంగం, నృత్యం, సన్నాయి, డోలు వీటన్నిటికీ అధ్యాపకులున్నారు. కపిలేశ్వరపురంలో సర్వారాయ హరికథా పాఠశాలలో ఆడపిల్లలు చక్కగా శిక్షణ పొందుతున్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలోనూ, శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాలలోనూ హరికథా పీఠాలున్నాయి. కానీ విజయనగరంలో- హరికథాపితామహుని పాదముద్రలతో పునీతమైన నగరంలో, ఆ మహనీయుడు మొదటి ప్రిన్సిపాల్‌గా సేవలందించిన నగరంలో హరికథకు స్థానం లేకపోవడం మాత్రం విచారకరం! డాక్టర్ అయల సోమయాజుల గోపాలరావు 9440435262 (ప్రధాన కార్యదర్శి, శ్రీ ఆధిభట్ల నారాయణదాస ఆరాధనోత్సవ సంఘం) -
పొల్లాచ్చిలో... కొత్త సినిమా
ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్న యువ కథానాయకుడు రామ్ ముచ్చటగా మూడో సినిమాకు శ్రీకారం చుట్టేశారు. శ్రీస్రవంతీ మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ ఈ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హరికథ’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ కొత్త చిత్రం షూటింగ్ బుధవారం మొదలైంది. తమిళనాడులోని పొల్లాచ్చిలో మొదలైన షూటింగ్ ఈ నెల 15 వరకు అక్కడే జరగనుంది. ‘‘చక్కటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్’’గా నిర్మాత పేర్కొంటున్న ఈ చిత్రంలో రామ్ సరసన కీర్తీ సురేష్ నాయిక. ఈ ఏడాది వచ్చిన తొలి హిట్ ‘రఘువరన్ బి.టెక్’కి మంచి సంభాషణలు అందించిన కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘రామ్ పోషించే పాత్ర చాలా ఉత్సాహంగా సాగుతుంది. ఈ షెడ్యూల్లో ఒక పాట, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం’’ అని నిర్మాత రవికిశోర్ పేర్కొన్నారు. సత్యరాజ్, ప్రదీప్ రావత్, నరేశ్, విజయకుమార్, రోహిణి లాంటి పేరున్న నటీనటులు ముఖ్యపాత్రధారులు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నిజానికి, ఇప్పటికే ‘శివమ్’ అనే చిత్రాన్ని రామ్ హీరోగా కృష్ణచైతన్య సమర్పణలో రవికిశోర్ నిర్మిస్తున్నారు. అదే నిర్మాత, హీరోల కాంబినేషన్లో ఏకకాలంలో రెండో సినిమా కూడా సెట్స్‌పైకి వచ్చింది. మరోపక్క ‘పండగ చేస్కో’లో కూడా రామ్ హీరో. వరుసగా ఇలా మూడు చిత్రాల షూటింగ్‌లతో ఒక యువ హీరో బిజీగా ఉండడం విశేషమే.