14వ ఏట నుంచి డి.ఉమామహేశ్వరి హరికథ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. 'సంస్కృతం’లో హరికథ చెప్పగలిగే ఏకైక మహిళా భాగవతారిణి.తెలుగులో ఆమె చెప్పే హరికథలకు విశేష అభిమానులు ఉన్నారు.ప్రతిష్ఠాత్మక సంగీత్ నాటక్ అకాడెమీ పురస్కారాన్ని న్యూఢిల్లీలో నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు.అక్కడి రబీంద్ర భవన్‌లో ఫిబ్రవరి 24న ప్రదర్శన ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే...
‘‘మాది బందర్ (మచిలీపట్నం). మా నాన్న లాలాజీ రావు నాదస్వర విద్వాంసుడు. వేములవాడ దేవస్థానంలో 30 ఏళ్ల పా టు నాదస్వర వాదన చేశాడాయన. మేము వేములవాడలో ఉన్నా అవకాశం దొరికినప్పుడల్లా బందర్‌కు తీసుకెళ్లేవాడు. అక్కడ నేను హరికథలు వినేదాన్ని. మా చిన్నప్పుడు కోట సచ్చిదానంద శాస్త్రిలాంటి వారు 40 రోజుల పా టు మహాభారతం చెప్పేవారు. జనం విరగబడేవారు. సినిమాహాళ్ల యజమానులొచ్చి హరికథను ముగించమని, జనం సినిమాలకు రావడం లేదని బతిమిలాడేవారు. అలా హరికథ నా మనసులో ముద్ర వేసింది.
హరికథా గురుకులంలో...
తూ.గో.జిల్లా కపిలేశ్వరపురంలో జమీందారు సత్యనారాయణ గారు, వారి శ్రీమతి రాజరాజేశ్వరి గారు డాన్స్ స్కూల్ స్థాపించాలనుకున్నారు. కాని నటరాజ రామకృష్ణ గారు ఇది తెలిసి డాన్స్ స్కూల్స్ చాలా ఉన్నాయి హరికథ కళ అంతరించిపోతోంది... దాని కోసం స్కూల్ తెరువు అనంటే రాజావారు తన తండ్రి పేరున శ్రీ సర్వరాయ హరికథా గురుకులం స్థాపించారు. మా నాన్న ఇది తెలిసి నన్ను అక్కడ చేర్పించారు.
14 ఏళ్ల వయసులో అక్కడ చేరి ఆదిభట్ల నారాయణదాసు ఏ సంప్రదాయం హరికథకు స్థిరపరిచారో ఆ సంప్రదాయంలోనే నేర్చుకున్నాను. నాతో పా టు మరో 40 మంది అమ్మాయిలు హరికథను నేర్చుకున్నారు. హరికథ చెప్పాలంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, సంస్కృతం, తెలుగు తెలిసి ఉండాలి. ఆటా పా టా మాట... వీటిని మేటిగా మేళవిస్తూ రక్తి కట్టేలా కథ చెప్పాలి. గురువుల దయవల్ల నేను నేర్చుకోగలిగాను. విజయనగరం సంస్కృత పా ఠశాలలో నా తొలి ప్రదర్శన ఇచ్చాను.
సంస్కృతంలో హరికథ
తెలుగులో హరికథలు చాలామంది చెబుతారు. కాని అవి తెలుగువారికి మాత్రమే పరిమితం. దేశంలో వేద విద్యను సంస్కృతంలో అభ్యసిస్తున్నవారు, సంస్కృత స్కాలర్లు, టీచర్లు, ఆ భాష ప్రేమికులు చాలామంది ఉన్నారు. వారి కోసం సంస్కృతంలో హరికథలు చెప్తే బాగుండునని అనుకున్నాను. ఎన్.పి.హెచ్.కృష్ణమాచార్యులు గారు కాళిదాసు కావ్యాలను హరికథలుగా రాసి ఇచ్చారు.
ఉజ్జయినిలో సంస్కృత పండితుల ఎదుట ‘అభిజ్ఞాన శాకుంతలం’ చెప్పడంతో నేను ఆ భాషలో చెప్పే తొలి మహిళను అయ్యాను. కుమార సంభవం, రఘువంశం, ఆది శంకరాచార్య, గీత గోవిందం, భక్త జయదేవ... వీటిని హరికథలుగా సంస్కృతంలో చెబుతున్నాను. 1993లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్ జరిగితే హాజరయ్యి సంస్కృతంలో హరికథ చెప్పాను. ప్రశంసలుపొందాను.
భక్తిమార్గం
కొందరు సినిమా పా టలను కలిపి హరికథలు చెబుతుంటారు. అది నా మార్గం కాదు. సరిగా హరికథ చెప్తే నేటికీ ప్రేక్షకులు ఎందరో వస్తున్నారు. నా దగ్గరకు వచ్చిన ఔత్సాహికులకు ఈ కళను నేర్పిస్తున్నాను. ఆదిభట్ల గారి మునిమనవరాళ్లకు నేర్పించాను. కాని ఈ కళ కోసం మరింత జరగాల్సి ఉంది.
భర్తతో కలిసి
మా ఆయన కళాకృష్ణ ప్రసిద్ధ నాట్యకారుడు. మాకు కొడుకు, కూతురు ఉన్నారు. మేమిద్దరం శక్తి ఉన్నంత కాలం మా కళను ప్రదర్శిస్తూ కొత్త తరాలకు నేర్పిస్తూ ఉండాలని నిశ్చయించుకున్నాం.’’
Comments
Please login to add a commentAdd a comment