భర్త కళాకృష్ణతో ఉమామహేశ్వరి
సాక్షి, మచిలీపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: స్వర మహేశ్వరిగా పేరు తెచ్చుకున్న ఉమామహేశ్వరి (63) సంస్కృతంలో హరికథ చెప్పిన తొలి మహిళా భాగవతారిణి. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఈమె హరికథను చెప్పడంలో ఎన్నో విశిష్టతలు కలిగి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సముచిత గౌరవం ఇచ్చి ఎంపికచేసింది. చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న ‘కుమార సంభవం’ కథే ఇప్పుడు దేశ అత్యుత్తమ పురస్కారానికి ఎంపికయ్యేలా చేసింది.
ఈమె సావిత్రి, భైరవి, శుభపంతువరాలి, కేదారం, కళ్యాణి వంటి కథలను వివిధ రాగాల్లో చెప్పడంలో దిట్ట. నాన్న లాలాజీరావు నాదస్వర విద్వాంసుడు కావడం, అమ్మ సరోజినికి సంగీతంలో ప్రావీణ్యం ఉండడంతో చిన్నప్పటి నుంచే కళా రంగాన్ని ఎంచుకున్న ఉమామహేశ్వరి రాష్ట్రం గర్వపడేలా ఎదిగారు. ఈమె ప్రఖ్యాత నాదస్వర విద్వాన్ దివంగత దాలిపర్తి పిచ్చిహరి మనవరాలు కూడా. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నా.. ఓనమాలు మాత్రం బందరులో నేర్చుకోవడంతో జిల్లా కళాకారులు, ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. త్వరలో రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ అందుకోనున్న ఉమామహేశ్వరి తనను అవార్డు వరించడంపై స్పందించారు. ఆమె ఏమన్నారంటే..
సరదాగా నేర్చుకున్న కథే ఈ స్థాయికి చేర్చింది: 14వ ఏట హరికథకు జీవితం అంకితం చేశాను. అలా సరదాగా మహాకవి కాళిదాసు సంస్కృతంలో రచించిన కుమార సంభవంను నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను ఎన్నో ప్రదర్శనలిచ్చాను. పదికిపైగా సంస్కృతం, 25కి పైగా తెలుగులో హరికథలు నేర్చుకున్నాను. దేశ, విదేశీ కళాకారుల నుంచి పురస్కారాలు అందుకున్నాను. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక సంగీత్ నాటక్ అకాడమీ పురస్కారాన్ని అందుకున్నాను.
ఇవికాక.. యూనివర్సిటీలు, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నాను. 1993లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్ జరిగితే హాజరై సంస్కతంలో హరికథ చెప్పి ప్రశంసలు పొందాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం నాట్యకారుడు, భర్త కళాకృష్ణతో హైదరాబాదులోని బేగంపేటలో ఉంటున్నాం. అమ్మనాన్నలు మరణించాక మచిలీపట్నంకు రావడంలేదు. మేం ఇక్కడ ఉంటున్నా నన్ను ఈ స్థాయికి చేరేలా ఓనమాలు దిద్దించిన బందరు అంటే ప్రేమే.
Comments
Please login to add a commentAdd a comment