టాగూర్ మెచ్చిన హరికథకుడు | adibhatla birth anniversary on augest 31st | Sakshi
Sakshi News home page

టాగూర్ మెచ్చిన హరికథకుడు

Published Sat, Aug 29 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

టాగూర్ మెచ్చిన హరికథకుడు

టాగూర్ మెచ్చిన హరికథకుడు

  • ఆగస్టు 31న ఆదిభట్ల నారాయణదాసు జయంతి
  • ఒక్కొక్క ప్రక్రియ ఒక్కొక్కరి చేతిలో పడి ప్రసిద్ధి పొందుతుంది. అందరూ ఆ ప్రక్రియను అనుసరించవచ్చు. కానీ ఒక్కరికే పేరు వస్తుంది. సంస్కృతంలో అనుష్టుప్ శ్లోకానికి వాల్మీకి తరువాత వ్యాసుడూ ప్రతినిధిగా నిలిచేరు. మందాక్రాంత అనగానే కాళిదాసే ఎదురవుతాడు. తెలుగులో వృత్తానికి నన్నయ, కందానికి తిక్కన, సీసానికి శ్రీనాథుడు, ఆటవెలదికి వేమన హక్కుదార్లుగా కనబడతారు. ఇలా హరికథకు ఆదిభట్ల నారాయణదాసు పేరుగాంచారు. హరికథకు ఆయన సృష్టికర్త, ఆద్యుడు కాకపోవచ్చు. విజయనగరం కానుకుర్తివారింట్లో మద్రాసునించి వచ్చిన కుప్పుస్వామినాయుడిగారి హరికథను విని ఆ రాత్రికి రాత్రే తన 18వ ఏట ధ్రువచరిత్రను హరికథగా రచించేరు.
     మహారాష్ట్రుల హరికథలో తమిళులు సంగీతాన్ని జోడిస్తే దాసుగారు హరికథలో నృత్యం ప్రవేశపెట్టారనవచ్చు. ఆయన ప్రవేశపెట్టిన మరొకటి 'మట్లు' ఇవి నృత్యానికి అనుగుణంగా రూపొందించబడ్డాయి. దాసుగారి సంగీత రచనకు జనసామాన్యాల్లో అధిక ప్రచారాన్ని తెచ్చింది ఈ మట్లే!
     అవధాన సరస్వతిని అటు గద్వాలిటు చెన్నపట్నం అంటూ తిరుపతి వేంకట కవులు ఊరేగిస్తే, హరికథా సరస్వతిని దాసుగారు అటు కలకత్తా ఇటు మైసూరు అంటూ ఊరేగించారు. కలకత్తాలో దాసుగారు పాడిన బేహాగ్ రాగం విన్న రవీంద్రనాథ్ టాగూర్ విజయనగరం వచ్చినప్పుడు దాసుగారితో 'మీరు పాడిన బేహాగ్ ఇంకా నా చెవుల్లో మార్మోగుతోంది' అని ప్రశంసించేరు. తరువాతి రోజుల్లో- ఈ రోజుకూ హరికథకులెవరైనా సరే దాసుగారి శిష్యప్రశిష్యులు కావలసిందే. అందుకే చెళ్లపిళ్లవారన్నారు:
     'దాసు నారాయణునకు నీతండు వీని
     దాసు లెల్లడ గల హరిదాసు లెల్ల'
     వాగ్గేయకారునిగా దాసుగారు 14 హరికథలను సంస్కృతంలో, ఆంధ్రంలో రచించేరు. అంతకుమించి (నా యెఱుక, నూఱుగంటి, నవరస తరంగిణి, మన్కి మిన్కు, జగజ్జ్యోతి లాంటి) 32 గ్రంథాలను సాహితీమూర్తిగా దేశానికందించేరు. అసాధ్య అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు చేసేరు. విజయనగరం రాజులతో షికార్లకు వెళ్లేరు, పేకాట ఆడేరు. మైసూరు మహారాజావారు 'మా కొలువులో వుందురా!' అంటే 'మర్త్యుల గొల్వను' అని నిర్భయంగా ప్రకటించేరు.
     ప్రస్తుతానికి వస్తే- దాసుగారు విజయనగరంలో 1919లో ప్రారంభింపబడిన సంగీత కళాశాలకు (విజయరామ గాన పాఠశాల) పాటబడి పెద్దగా (ప్రిన్సిపాల్) తన 55వ ఏట నియమింపబడి, 16 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. కానీ ఇవ్వాళ్టివరకు ఆ పాఠశాలలో హరికథకు స్థానం లేదు. గాత్రం, వయోలిన్, మృదంగం, నృత్యం, సన్నాయి, డోలు వీటన్నిటికీ అధ్యాపకులున్నారు. కపిలేశ్వరపురంలో సర్వారాయ హరికథా పాఠశాలలో ఆడపిల్లలు చక్కగా శిక్షణ పొందుతున్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలోనూ, శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాలలోనూ హరికథా పీఠాలున్నాయి. కానీ విజయనగరంలో- హరికథాపితామహుని పాదముద్రలతో పునీతమైన నగరంలో, ఆ మహనీయుడు మొదటి ప్రిన్సిపాల్‌గా సేవలందించిన నగరంలో హరికథకు స్థానం లేకపోవడం మాత్రం విచారకరం!
     డాక్టర్ అయల సోమయాజుల గోపాలరావు
     9440435262
     (ప్రధాన కార్యదర్శి, శ్రీ ఆధిభట్ల నారాయణదాస ఆరాధనోత్సవ సంఘం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement