ఆమెకు ఈ అవార్డు అరుదైనదే
హైదరాబాద్: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు కళ్యాణి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కమెడియన్ గా, పత్యేక నటిగా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన నటి కళ్యాణి తన విశేష ప్రతిభతో లిమ్కా రికార్డు దక్కించుకుంది. కరాటే విద్యలో ఉత్తమమైన బ్లాక్ బెల్టును దక్కించుకున్న ఆమె హరికథ కళాకారిణి కూడా. తాజాగా సుదీర్ఘ హరికథా గానంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నట్టు ఆమె తెలిపారు. దీనికి సంబంధించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయ ఘోష్ నుంచి లేఖ వచ్చినట్టు ఆమె తెలిపారు.
ఆదిభట్ల కళాపీఠం వ్యవస్థాపకురాలైన పడాల కళ్యాణి ఈ కళాపీఠం ద్వారా సుదీర్ఘ హరికథా ప్రవచనాలను నిర్వహించి ఈ రికార్డు సాధించారు. గత ఏడాది జూన్ 20 నుంచి 25 వరకు హైదరాబాద్‌లోని సిద్దార్ధనగర్ కమ్యూనిటీ హాల్‌లో నిరంతరంగా 114 గంటల 45 నిమిషాల 55 సెకెన్ల పాటు హరికథలను వినిపించినట్టు తెలిపారు. దీంతో పాటు 61 మంది కళాకారులతో అష్టోత్తర శతనిర్విరామ హరికథా గాన యజ్ఞం నిర్వహించామన్నారు.
గతేడాది ఏప్రిల్ నెలల కళ్యాణిపై పేకాట ఆరోపణలు రావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తనను ఎవరో కావాలనే పేకాట కేసులో ఇరికించారంటూ కళ్యాణి ఆరోపణలను కొట్టి పారేశారు. హరికథ కళాపీఠం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో తన కార్యాకలాపాలను ఆపాలని కొందరు కుట్ర చేసి ఇరికించారన్నారు. కాగా ఈ సంఘటనతో మనస్తాపానికి గురైన కళ్యాణి పట్టుదలతో హరికథ కళాపీఠంపై సీరియస్ గా దృష్టి సారించినట్టు సమాచారం. ఆదిభట్ల కళాపీఠం స్థాపించి, అవార్డు సాధనకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.