Limca Book of Records
-
దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!
India's First Dwarf Driving License: ప్రపంచంలో అందరికి ఏవేవో లోపాలు ఉంటాయి. కొంతమంది వాటిని అధిగమించి తమలో ఉన్న నైపుణ్యాలకు పదునుపెట్టి స్ఫూర్తిదాయకంగా నిలవడానికి ప్రయత్నిస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి అలానే చేసి అందరికి స్ఫూర్తిగా నిలాచాడు. (చదవండి: అందరూ!....వెక్కిరించి అవమానించే ఏకైక వైకల్యం...నత్తి!!) అసలు విషయంలోకెళ్లితే...కరీంనగర్ జిల్లాకి చెందిన గట్టిపల్లి శివపాల్ సుమారు మూడు అడుగుల ఎత్తులో ఉండే 42 ఏళ్ల మరుగుజ్జు వ్యక్తి. అంతేకాదు మరుగుజ్జువాళ్లలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. అయితే అతన్ని ప్రజలు తనని ఎత్తు కారణంగా హేళన చేస్తుండేవారని చెబుతున్నాడు. ఈ క్రమంలో అతను తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, పైగా తనలాంటి వాళ్లకి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రజలు కూడా సుముఖంగా లేరని వాపోయాడు. అయితే తన స్నేహితురాలి సాయంతో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, ప్రస్తుతం తాను అక్కడే 20 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ మేరకు అతను ఎక్కడికైన వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసినప్పుడల్లా వారు తన రైడ్‌ని రద్దుచేసేవారని, పైగా తన భార్యతో కలిసి బయటకి వెళ్లినప్పుడల్లా రకరకాలుగా కామెంట్లు చేసేవారని శివపాల్ అన్నాడు. దీంతో అప్పుడే శివపాల్ తానే స్వయంగా కారు నడపాలనే నిర్ణయించుకున్నాడు. పైగా అందుకోసం ఇంటర్నెట్లో విపరీతంగా సర్చ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే శివపాల్‌కి యూఎస్‌లో ఒక వ్యక్తి అప్లోడ్ చేనిన వీడియో ఒకటి అతన్ని ఆకర్షించింది. అంతేకాదు ఆ వీడియోలో కారుని తన ఎత్తుకు తగిన విధంగా సెటప్ చేస్తే సులభంగా డ్రైవ్ చేయవచ్చునని వివరించి ఉంది. దీంతో అతను అనుకున్నదే తడువుగా తన స్నేహితుడి సాయంతో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అయితే రవాణా శాఖకు ఎత్తుపై కొన్ని మార్గదర్శకాలను కలిగి ఉన్నందున లైసెన్స్ పొందడం మరొక అతి పెద్ద సవాలుగా మారింది. ఈ మేరకు శివపాల్ అధికారులకు విజ్ఞప్తి చేసి సరైన డ్రైవింగ్ టెస్ట్ చేయించి డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. అంతేకాదు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తిగా నిలవడమే కాక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి నామినేట్ అయ్యాడు. దీంతో చాలామంది మరుగుజ్జు వ్యక్తులు శివపాల్ని డ్రైవింగ్ శిక్షణ కోసం సంప్రదించడం విశేషం. అంతేకాదు శివపాల్ వచ్చే ఏడాది శారీరక వికలాంగుల కోసం డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. (చదవండి: హే!..రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్!!) -
వెరైటీ వినాయకుడు..
సాక్షి, కవిటి: శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రంగా బొరివంకలో శ్రీబాలగణపతి ఉద్దానం యూత్ క్లబ్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా లేఖినీరూప కాణిపాక గణపతిని రూపొందించారు. గత ఏడేళ్లుగా పర్యావరణానికి హాని చేయని రీతిలో గణనాథుని విగ్రహాల తయారీలో అందివేసిన చెయ్యిగా పేరు తెచ్చుకున్న ఉద్దానం యూత్ క్లబ్ సభ్యుడు, శిల్పి భైరి తిరుపతిరావు ఈ విగ్రహాన్ని రూపొందించారు. 3,500 సుద్దముక్కలను తీసుకుని ప్రతీ సుద్ద ముక్కపై గణనాథుడిని చెక్కాడు. వీటిని మట్టితో చేసిన గణనాథుడి శరీర ఉపరితలంపై అందంగా అలంకరించాడు. వాటికి ప్రకృతి సిద్ధమైన రంగులను అద్ది ఆకర్షణీయంగా సిద్ధం చేశాడు. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ వరి నారు, నారికేళ, నలుగుపిండి, వనమూలిక, గోధుమ నారు, కొబ్బరిపూలతో వివిధ రూపాల్లో గణేశుని విగ్రహాలను తయారు చేశారు. వీటికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కడం విశేషం. ఫోటోలు ‘సాక్షి’కి పంపండి... నవరాత్రుల పాటు ఆ దేవదేవుడిని కొలవడానికి మీరు ఏర్పాటు చేసే అపురూపమైన మట్టి ప్రతిమల ఫోటోలను ‘సాక్షి’ పంపించండి. మీ సామాజిక కర్తవ్యాన్ని నలుగురికి తెలియజేసి అందరికీ స్పూర్తిగా నిలవండి. మీ నగరంలో, మీ ఊరిలో, మీ వీధిలో, మీ గల్లీలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే వినాయకుడి మట్టి ప్రతిమల ఫోటోలను మొబైల్ ద్వారా మాకు పంపించండి. ఫోటోతో పాటు ఎక్కడ నెలకొల్పిందీ, పేరు, ఊరు, వీధి, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలతో lordganapati@sakshi.comకు మెయిల్ ద్వారా పంపించండి. వాటిని మేము www.sakshi.com వెబ్ సైట్లో ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం... ప్రకృతిని కాపాడుకుందాం. నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం. -
లిమ్కా బుక్స్‌లో మేఘా ఇంజనీరింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో ఘనతను సాధించింది. లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్‌తోపాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. విద్యుత్ సబ్ స్టేషన్‌ను రికార్డు సమయంలో ఏడు నెలల్లోపే నిర్మించడంతో సంస్థకు ఈ గౌరవం దక్కింది. మేఘా పనితీరును మెచ్చి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ‘బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు’తో సత్కరించింది. ‘అనంతపురం జిల్లా నంబూలపూలకుంట వద్ద 400/220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం 2015 సెప్టెంబరు 25న ప్రారంభించి, 2016 ఏప్రిల్ 25న ప్రారంభానికి సిద్ధం చేశాం. ఇటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి సాధారణంగా 15–18 నెలలు పడుతుంది. 18–20 నెలల్లో పూర్తి చేయాలని పవర్ గ్రిడ్ కోరింది. 3 షిఫ్టుల్లో సిబ్బందిని మోహరించి గడువు కంటే ముందే నిర్మించాం’ అని మేఘా డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అడ్డంకులను అధిగమించి.. నిర్మాణ ప్రాంతం ఎక్కువగా రాళ్లతో కూడి ఉందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ శరధ్ దీక్షిత్ వివరించారు. ఆధునిక బ్లాస్టింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించి రాళ్లను తొలగించామన్నారు. ‘సబ్ స్టేషన్ నుంచి సాంకేతిక సమస్యలు లేకుండా మూడేళ్లుగా నిరంతరం విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ ప్రాజెక్టును ఉద్ధేశించి పవర్ గ్రిడ్ తన వెబ్సైట్లో మరో ముందడుగుగా అభివర్ణించింది’ అని తెలిపారు. కాగా, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ రికార్డు సమయంలో పూర్తి చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఇప్పటికే స్థానం దక్కించుకుంది. -
8 ప్రపంచ రికార్డులు ఆయన సొంతం
-
8 ప్రపంచ రికార్డులు ఆయన సొంతం
న్యూఢిల్లీ: 180 కేజీల బరువైన బ్రెడ్, ప్రపంచంలోనే అతిపెద్ద అప్పం, 14,353 చిన్న చిన్న చక్కెర స్ఫటికాలతో నిర్మించిన ఘనం.. ఈ రికార్డులన్నీ సాధించింది ఒక్కరే. అంతేనా.. ఆయన పేరు మీద మొత్తం 8 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అత్యధిక సంఖ్యలో వ్యక్తిగత రికార్డులు కలిగిన ఘనత ఆయన∙సొంతం. ఆయనే జైపూర్‌కు చెందిన మనోజ్ శ్రీవాస్తవ. ప్రస్తుతం మణిపాల్ విశ్వవిద్యాలయం జైపూర్ క్యాంపస్‌లో హోటల్ మేనేజ్మెంట్ విభాగాధిపతిగా ఉన్న మనోజ్ 2008లో 180 కిలోల బ్రెడ్‌ను తయారుచేసి ఆయన మొదటిసారి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. బ్రెడ్‌ను తయారు చేసేందుకు ఆయనకు 16 గంటల సమయం పట్టింది. 2013లో 14 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు కలిగిన అప్పంను 12 గంటల్లోనే తయారు చేశారు. 365 కేజీల బరువైన ఈ అప్పం ప్రపంచంలోనే అతి పెద్దది. -
ప్రవల్లికకు మార్వలెస్ అవార్డు
విజయనగరం టౌన్ : ప్రముఖ చిత్రకారిణి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత సిరిపురపు ప్రవల్లికా నారాయణ్ మార్వలెస్ మహిళ అవార్డును సోమవారం అందుకున్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, విశాఖలో వీటీమ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో హుడా చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు తనకు అవార్డు ప్రదానం చేశారన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపునేని రాజకుమారి, సినీగేయని సునీత , బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల , వీటీమ్ ఈవెంట్స్ సీఈఓ వీరుమామా, తదితరుల చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. -
సచిన్ ‘ఆత్మకథ’కూ అవార్డు
న్యూఢిల్లీ: ఇప్పుడు తన ఆత్మకథతో కూడా అవార్డు దక్కించుకున్నాడు. రెండేళ్ల క్రితం విడుదలైన అతని స్వీయచరిత్ర ‘ప్లేరుుంగ్ ఇట్ మై వే’ అభిమానులు, పుస్తక ప్రియుల ఆదరణతో తాజా గా రేమండ్ క్రాస్‌వర్డ్ పాపులర్ అవార్డును సొంతం చేసుకుంది. అమ్మకాల రికార్డుతో ఈ ఏడాది ఆరంభంలో ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్న ఈ ఆత్మకథకు ఇప్పుడు పాపులర్ చారుుస్ అవార్డు లభించడం పట్ల క్రికెట్ దిగ్గజం... ప్రచురణ కర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. -
లిమ్కా రికార్డ్స్‌లో సమగ్ర కుటుంబ సర్వే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ల్లోకి ఎక్కింది. ఈ సర్వేను జాతీయ రికార్డుగా గుర్తిస్తూ లిమ్కా బుక్ ఆఫ్రికార్డ్స్ ఎడిటర్ విజయ ఘోష్ తెలంగాణ ప్రభుత్వానికి సర్టిఫికేట్ పంపారు. సమగ్ర కుటుంబ సర్వే జరిగిన విధానం వివరాలను కూడా ఇందులో పేర్కొన్నారు. భారత దేశంలో గతంలో ఎన్నడూ, మరే రాష్ట్రంలో జరగని విధంగా ఒకే రోజు తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మంది ఉద్యోగులు 1.09 కోట్ల కుటుంబాల వివరాలు సేకరించింది. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సర్వే నిర్వహించారని, కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, విద్యార్హతలు, వృత్తులు, ఆధార్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలన్నీ సేకరించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడిందని సంస్థ పేర్కొంది. -
‘లిమ్కా బుక్’లోకి అరుదైన ఆపరేషన్
జనగామ ఏరియా ఆస్పత్రి ఆర్ఎంవో ఘనత జనగామ: కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న గర్భిణికి అరుదైన ఆపరేషన్ చేసి తల్లీబిడ్డలను కాపాడిన వరంగల్ జిల్లా జనగామ ఏరియూ ఆస్పత్రి ఆర్ఎంవో సుగుణాకర్‌రాజుకు లిమ్కా బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం విలేకరులకు వెల్లడించారు. నర్మెట మండలం సోలిపురం గ్రామానికి చెం దిన శ్రీనివాస్, రమాదేవి దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. రమాదేవికి పురిటినొప్పులు రావడం, వాంతులు చేసుకోవడంతో కోమాలోకి వెళ్లింది. మెదడు లో రక్తం గడ్డకట్టి పక్షవాతంతో ప్రాణాపాయస్థితికి చేరుకుంది. సుగుణాకర్‌రాజును సంప్రదించగా హైదరాబాద్‌లోని కాకతీయ ఆస్ప త్రిలో చేర్పించారు. మరుసటి రోజు రమాదేవికి ఎండోస్కోపీ చేయగా కడుపులో బిడ్డబతికే ఉంది. అయితే, ఆపరేషన్ చేయడానికి వైద్యులు నిరాకరిం చారు. సుగుణాకర్‌రాజు సొంత పూచీకత్తుతో శస్త్రచికిత్స చేసి తల్లీబిడ్డలను కాపాడారు. పక్షవాతంతో బాధపడుతున్న రమాదేవిని కేవ లం 18 రోజుల్లోనే మామూలు మనిషిని చేశారు. దీంతో సుగుణాకర్కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. -
ఆమెకు ఈ అవార్డు అరుదైనదే
హైదరాబాద్: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు కళ్యాణి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కమెడియన్ గా, పత్యేక నటిగా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన నటి కళ్యాణి తన విశేష ప్రతిభతో లిమ్కా రికార్డు దక్కించుకుంది. కరాటే విద్యలో ఉత్తమమైన బ్లాక్ బెల్టును దక్కించుకున్న ఆమె హరికథ కళాకారిణి కూడా. తాజాగా సుదీర్ఘ హరికథా గానంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నట్టు ఆమె తెలిపారు. దీనికి సంబంధించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయ ఘోష్ నుంచి లేఖ వచ్చినట్టు ఆమె తెలిపారు. ఆదిభట్ల కళాపీఠం వ్యవస్థాపకురాలైన పడాల కళ్యాణి ఈ కళాపీఠం ద్వారా సుదీర్ఘ హరికథా ప్రవచనాలను నిర్వహించి ఈ రికార్డు సాధించారు. గత ఏడాది జూన్ 20 నుంచి 25 వరకు హైదరాబాద్‌లోని సిద్దార్ధనగర్ కమ్యూనిటీ హాల్లో నిరంతరంగా 114 గంటల 45 నిమిషాల 55 సెకెన్ల పాటు హరికథలను వినిపించినట్టు తెలిపారు. దీంతో పాటు 61 మంది కళాకారులతో అష్టోత్తర శతనిర్విరామ హరికథా గాన యజ్ఞం నిర్వహించామన్నారు. గతేడాది ఏప్రిల్ నెలల కళ్యాణిపై పేకాట ఆరోపణలు రావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తనను ఎవరో కావాలనే పేకాట కేసులో ఇరికించారంటూ కళ్యాణి ఆరోపణలను కొట్టి పారేశారు. హరికథ కళాపీఠం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో తన కార్యాకలాపాలను ఆపాలని కొందరు కుట్ర చేసి ఇరికించారన్నారు. కాగా ఈ సంఘటనతో మనస్తాపానికి గురైన కళ్యాణి పట్టుదలతో హరికథ కళాపీఠంపై సీరియస్ గా దృష్టి సారించినట్టు సమాచారం. ఆదిభట్ల కళాపీఠం స్థాపించి, అవార్డు సాధనకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. -
భవనంపై యాపిల్ వనం!
♦ విత్తనం నాటితే 8 ఏళ్లకు, అంటు నాటితే మూడేళ్లకు యాపిల్స్ కాశాయి.. ♦ చెట్టుకు 90 కాయల దిగుబడి ♦ నందకుమార్ టై గార్డెన్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు ఆసక్తి, పట్టుదల ఉండాలే గానీ అనుకున్న లక్ష్యం సాధించవచ్చుననడానికి నందకుమార్ ధుమాల్ ఇంటిపైన యాపిల్ తోటే పచ్చని సాక్ష్యం. నందకుమార్ ధుమాల్ టాటా మోటార్స్ ఉద్యోగి. మహారాష్ట్రలోని పుణే జిల్లా పింప్రీ - చించ్వడ్ పట్టణంలో తన సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ వంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే పండుతాయనుకునే యాపిల్ పండ్లను తన ఇంటిపై పండిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత ఉన్నా... తగిన జాగ్రత్తలు తీసుకుంటే పెంచలేకపోవడమేమిటి? అంటూ స్నేహితులు ఉత్సాహపరిచారు. టై గార్డెన్లో 2000లో యాపిల్ విత్తనాలేసి.. ఏడేళ్లుగా యాపిల్స్ పండించుకొని తింటున్నారు. అయితే ఇంటి పక్కన ఖాళీ స్థలం లేకపోవటంతో టైపై మొక్కలు పెంచుతున్నారు. యాపిల్ పండ్లలోని విత్తనాలను సేకరించి టైపై కుండీల్లో విత్తారు. ఆనాడు నాటిన విత్తనాలు నేడు తోటగా మారడంతో మురిసిపోతున్నారాయన. ఎనిమిదేళ్లకు ఫలించిన కృషి... యాపిల్ పండ్ల విత్తనాలను తొలుత నాటిన నెలకు మొలిచాయి. ఆ మొక్కలను ఎనిమిదేళ్ల పాటు కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత చెట్లకు కాత మొదలైంది. వేసవి కాలం ఉష్ణోగ్రతలు పెరిగిన సమయంలో ప్రతి చెట్టుపైనా నీటిని పిచికారీ చేసేవారు. ఆపిల్ మొక్కల పెంపకంలో ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదు. ఇంటిలోని చెత్త, చెట్ల ఆకులతో పాటు కొన్ని వానపాములను యాపిల్ చెట్లు నాటిన కుండీలలో వేశారు. ఇటీవల కాలంలో అంట్లు నాటితే.. మూడేళ్లలోనే కాపునకు వచ్చాయన్నారు. ఒక్కో చెట్టుకు 90 కాయలు కాస్తున్నాయని నందకుమార్ తెలిపారు. గోల్డెన్ యాపిల్, గ్రీన్ యాపిల్, ఫూజీ యాపిల్ వంటి రకాల చెట్లున్నాయి. నందకుమార్ తోటకు తొలి యాపిల్ టై గార్డెన్‌గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులోను, యూనిక్ వరల్డ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కింది. తన టై గార్డెన్లో పండిన యాపిల్ పండ్లను తాజాగా ఆరగిస్తూ ఉంటే చెప్పలేనంత ఆనందంగా ఉంటుందని నందకుమార్ తెగ సంబరపడుతున్నారు. పింప్రీ-చించివడ్ మున్సిపల్ కమిషనర్ ఇటీవల నందకుమార్ దంపతులను సత్కరించడం విశేషం - శ్రీనివాస్ గుండారి / ఎ.ఎం.చక్రవర్తి, పింప్రీ-చించివడ్, మహారాష్ట్ర -
లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
మరిపెడ: లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వరంగల్ జిల్లా మరిపెడకు చెందిన విద్యార్థి ఆంగోతు సందీప్‌కు స్థానం దక్కింది. సందీప్ స్థానిక సెరుుంట్ ఆగస్టియన్ పాఠశాలలో చదువుతున్నప్పుడు ఒకేసారి 50 జంటలు చదరంగం అడేందుకు వీలుగా చెస్‌బోర్డు తయూరు చేశాడు. దీంతో అప్పట్లో యూనిక్ వరల్డ్ రికార్డు బుక్‌లో చోటు దక్కింది. ఆ తర్వాత లండన్‌లోని యునెటైడ్కింగ్ కళాశాల డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్‌లో కూడ స్థానం సంపాదించాడు. తాజాగా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి మండలానికి పేరు తీసుకొచ్చాడు. మండల కేంద్రంలోని పూలబ జారుకు చెందిన ఆంగోతు మంగీలాల్, పద్మ దంపతుల కుమారుడు సందీప్ ప్రస్తుతం ఖమ్మం లోని ఓ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. గిన్నిస్ బుక్‌లో పేరు నమోదు చేసుకునే వరకు శ్రమిస్తానని చెప్పాడు. -
నాలుగో ఏడాదీ ‘విట్’ రికార్డులు
వెల్లూర్: అత్యధిక మంది విద్యార్థులకు ఒకే స్లాట్‌లో ప్లేస్మెంట్లు సాధించిన విట్ యూనివర్సిటీ... వరుసగా నాలుగో ఏడాదీ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిందని ఆ వర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. 2015లో కోర్సులు పూర్తిచేసే విద్యార్థుల కోసం 2014 సెప్టెంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు ఈ ప్లేస్మెంట్లు జరిగాయని తెలిపింది. నాలుగు ఐటీ కంపెనీలు వెయ్యి మందికిపైగా విద్యార్థులను తీసుకోగా... ఒక్క కాగ్నిజెంట్ సంస్థ 1911 మందిని రిక్రూట్ చేసుకుందని తెలిపింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన తమ ప్రవేశపరీక్షకు రికార్డు స్థాయిలో 2,02,406 మంది రిజిస్టర్ చేసుకున్నారని.. ఇలా రికార్డులను తిరగరాయడం తమ వర్సిటీకే చెల్లిందని విట్ వ్యవస్థాపకుడు, చాన్సలర్ జి.విశ్వనాథన్ పేర్కొన్నారు. -
ట్రిపుల్ ఐటీ ఉద్యోగికి లిమ్కా బుక్‌లో చోటు
బాసర : ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో లైబ్రేరియన్‌గా విధులు నిర్వర్తిస్తున్న నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన కొండా అరుణజ్యోతి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించారు. ట్రిపుల్ ప్రారంభం నుంచే ఎన్నో సంచలనమైన మార్పులకు తెర తీస్తూ, ఆరేళ్లుగా కళాశాలలో విధులు నిర్వర్తిస్తూ లక్షా 10 వేల పుస్తకాలు, మ్యాగజైన్లు, వివిధ రకాల పత్రికలను నాలుగు బ్లాకుల్లో భద్రపరుస్తున్నారు. బ్లాకుల మధ్య 200 నుంచి 500 మీటర్ల దూరంలో ఉంచుతూ ఎంతగానో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ కళాశాలలోని 8 వేల మంది విద్యార్థులు, 300 మంది అధ్యాపకులు రోజూ ఎన్నో వేల పుస్తకాలను చదివినా.. వాటిని అదే స్థానంలో భద్రపరుస్తూ ప్రత్యేకత చాటుతున్నారు. ఏ విభాగాలకు సంబంధించిన పుస్తకాలు కావాలన్నా అతి తక్కువ సమయంలో లభించేలా ప్రణాళికలను తయారు చేయడంలో ఆమెకు ఆమే సాటి. ఇందులో భాగంగానే ఆమెకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం దక్కింది. -
లిమ్కా రికార్డ్స్‌లోకి ‘సత్తెనపల్లి’
హైదరాబాద్: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం త్వరలోనే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కనుంది. ఇటీవల నియోజకవర్గంలో ‘స్వచ్ఛ సత్తెనపల్లి’ పేరుతో 20 వేల మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని వంద రోజుల్లో పూర్తి చేశారు. కాగా, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లిమ్కా బుక్ నిర్వాహకులకు ఇప్పటికే అధికారులు ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను పంపించారు. త్వరలోనే ‘స్వచ్ఛ సత్తెనపల్లి’ అందులో నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే, ఒక రోజు 60 వేల మందితో చేతులు కడిగించే (హ్యాండ్‌వాష్) కార్యక్రమం ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్‌లోకి సత్తెనపల్లిని నమోదు చేయించే ప్రయత్నాన్ని కూడా కోడెల చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. -
లిమ్కాబుక్‌లో శ్రీ చైతన్య విద్యార్థులకు స్థానం
హైదరాబాద్: శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు అరుదైన ప్రయత్నంతో లిమ్కా బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. వివరాలు....చంపాపేట టెక్నో బ్రాంచ్‌లకు చెందిన విద్యార్థులు సోమవారం గంట వ్యవధిలో టోపీలపై మూడు రంగుల జాతీయ చిహ్నాన్ని చేత్తో పెయింటింగ్ వేశారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ 275 బ్రాంచ్‌ల విద్యార్థులు... ఒకేసారి ఓ గంట వ్యవధిలో 20 వేల టోపీలపై జాతీయ చిహ్నాన్ని వేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం దక్కించుకున్నట్టు చంపాపేట శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ నౌషిన్ ఫాతిమా తెలిపారు. (చంపాపేట) -
లిమ్కా బుక్‌లో సంజన!
వంద గంటలు నిరవధికంగా సైకిల్ తొక్కగలుగుతారా? అనడిగితే చేతులెత్తేసేవాళ్ల జాబితానే ఎక్కువగా ఉంటుంది. మరి.. అన్నేసి గంటలంటే మాటలా? కంటిన్యూస్‌గా గంటసేపు తొక్కితేనే నీరసపడిపోతాం. బాగా సత్తా ఉన్నవాళ్లనుకోండి... ఇంకొన్ని గంటలు తొక్కగలుగుతారు. కానీ, 104 గంటలు నిరవధికంగా సైకిల్ తొక్కడం అంటే సాహసమే. కన్నడ భామ సంజన ఆ సాహసం చేశారు. అయ్యో.. గులాబీ బాలకు ఎందుకీ కష్టం అని ఆమె అభిమానులు అనుకోవచ్చు. కానీ, సంజన సవాల్‌గా తీసుకుని రంగంలోకి దిగారు. ఓ సైక్లింగ్ గ్రూప్‌తో కలిసి ఆమె ఈ సవాల్‌ని స్వీకరించారు. 104 గంటలు నిరవధికంగా సైకిల్ తొక్కి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించడం కోసమే సంజన ఈ సైకిల్ ప్రయాణం చేశారు... అనుకున్నది సాధించారు. -
ప్రవల్లికకు చంద్రబాబు ప్రశంసలు
విజయనగరం అర్బన్: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం సాధించుకున్న పట్టణ చిత్రకాళాకారిణి ఎస్.ప్రవల్లికనారాయణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. జిల్లా పర్యటనలో భాగంగా చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చిన ఆయనను ప్రవల్లిక కలిసి తన లిమ్కా రికార్డును, స్వచ్ఛభారత్ కార్యక్రమంపై గీసిన ప్రత్యేక చిత్రలేఖనాన్ని చూపించింది. వాటిని పరిశీలించిన చంద్రబాబునాయుడు అభినందించారని ప్రవల్లిక తండ్రి గౌరీశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
అచ్చంగా ఆరొందల అడుగుల కేక్..
వందల కేజీలకొద్దీ బరువైన కేకును మీరు చూసుంటారు. కానీ ఇది వేలకిలోల బరువైన కేకు. బరువు 3,120 కేజీలు. ఈ కేకు పొడవు ఎంతనుకుంటున్నారు? అక్షరాలా ఆరొందల అడుగులు. కేరళ రాష్ట్రంలోని ‘బేకర్స్ అసోసియేషన్’ సంస్థ వారు దీనిని తయారుచేశారు. దేశంలోనే అత్యంత పొడవైనది కాబట్టే ఈ కేకు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు సంపాదించేసింది. త్రిసూర్‌లో గురువారం ప్రారంభమైన ‘బేక్ ఎక్స్పో 2014’లో దీనిని ప్రదర్శించారు. దేశంలోనే వృద్ధ మహిళగా తాజాగా రికార్డులకెక్కిన కుంజనమ్(112) ఫొటో సహా 700 మంది ప్రముఖుల చిత్రపటాలను ఈ కేకుపై చిత్రించారు. భారత్‌లో కేకును తొలిసారి తయారుచేసి 131 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఎక్స్పోను ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు. -
రికార్డుల కోసం ఎప్పుడూ పని చేయలేదు! :శ్రీకర్‌ప్రసాద్
మణిరత్నంలాంటి ఎందరో సృజనాత్మక దర్శకులకు ఆస్థాన ఎడిటర్ అయిన అక్కినేని శ్రీకర్ప్రసాద్కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. 15 భాషల్లో సినిమాలకు ఎడిటింగ్ చేయడం ఒక రికార్డ్ కాగా, అత్యధిక జాతీయ అవార్డులు కైవసం చేసుకోవడం మరో రికార్డ్. ఈ రెండు రికార్డుల పరంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి రెండు ధ్రువపత్రాలు అందుకున్నారాయన. ఈ సందర్భంగా శ్రీకర్ప్రసాద్తో ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ... కంగ్రాట్స్ సార్... థ్యాంక్సండీ. రెండు రోజుల క్రితమే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి రెండు సర్టిఫికెట్స్ వచ్చాయి. 15 భాషల్లో ఎడిటింగ్ ఎలా చేయగలిగారు? ఇన్ని భాషల్లో చేయాలని లక్ష్యం పెట్టుకుని మాత్రం చేయలేదు. అవకాశాలు వచ్చాయి. చేసుకుంటూ వెళ్లిపోయానంతే. రికార్డుల కోసం మాత్రం చేయలేదు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లిష్, సింహళీ, కర్బీ, కన్నడం, బెంగాలీ, మరాఠీ, అస్సామీ, ఒరియా, మిషింగ్, నేపాలీ, పంజాబీ భాషల్లో 400 పై చిలుకు సినిమాలకు ఎడిటింగ్ చేశాను. భాష తెలియకుండా ఎడిటింగ్ చేయడం కష్టమేమో? భాష తెలియకపోయినా కథను అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటే చాలు. దర్శకుడి ద్వారా కథపై ఒక అవగాహన తెచ్చుకుని ఎడిటింగ్ చేసేస్తాను. భాషలు, సంస్కృతులు వేర్వేరు అయినా కూడా సినిమాల పరంగా ఎమోషన్స్, సెంటిమెంట్స్ మాత్రం ఒక్కటే. అందుకే పెద్ద ఇబ్బంది అనిపించదు. అయినా భావోద్వేగానికి భాష అడ్డంకి కాదనేది నా ఉద్దేశం. ఇంతకూ ఏ భాషల్లో ఎడిటింగ్ చేయడాన్ని ఎక్కువ ఆస్వాదిస్తారు? తెలుగు నా మాతృభాష కాబట్టి, కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అయినా సినిమా అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. భాష ఏదైనా స్టోరీ టెల్లింగే ప్రధానం. అయినా ఒకే భాషలో ఎక్కువ పనిచేస్తే, నాకు మొనాటనీ అనిపిస్తుంది. అదే రకరకాల భాషల్లో పనిచేయడం వల్ల రకరకాల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి రకరకాల అనుభవాలతో కెరీర్ ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఏఏ సినిమాలకు పని చేస్తున్నారు? తెలుగులో ‘రుద్రమదేవి’, హిందీలో ‘దేద్ ఇష్కియా’, తమిళంలో ‘పన్నియారం పద్మినిం’, మలయాళంలో ‘సోపానం’. ఎడిటర్‌గా మీ విజయ రహస్యం? ఇందులో రహస్యం ఏమీ లేదు. ఏదైనా వందశాతం ఫలితం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎడిటింగ్ అనేది స్టోరీ టెల్లింగ్‌లో ఓ భాగం. ఒక కథను షార్ట్‌గా, స్వీట్‌గా, ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ఎడిటింగ్ ఓ సాధనం. ఇన్నేళ్లలో ఎంతోమంది ప్రతిభావంతులతో పనిచేసి, ఎంతో నేర్చుకున్నాను. నేర్చుకుంటాను కూడా. ఈ అనుభవాలు నాకెప్పటికీ ఉపకరిస్తాయి. ఏడు జాతీయ అవార్డులు గెలుచుకోవడమంటే మాటలు కాదే! నేను అవార్డుల కోసం ఎప్పుడూ పని చేయలేదు. ఎడిటర్‌గా నా తొలి సినిమా ‘సింహ స్వప్నం’ (తెలుగు). అయితే తొలి అవకాశం వచ్చింది మాత్రం ‘రాక్’ (1989) అనే హిందీ సినిమాకి. దానికే ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డు వచ్చింది. ఆ తర్వాత రాగ్ బిరాగ్ (1997), నౌక కారిత్రము (1997), ది టైస్ట్ (1998), వానప్రస్థం (2000), కన్నత్తిల్ ముత్తమిట్టాల్ (2002), ఫిరాక్ (2008) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాను. 2010లో స్పెషల్ జ్యూరీ కూడా వచ్చింది. 24 ఏళ్ల ఎడిటింగ్ అనుభవంతో దర్శకత్వం ఏనాడూ చేయాలనుకోలేదా? చాలాసార్లు అనుకున్నా. నేను ఎంతోమంది దర్శకులతో పనిచేశాను. ఆ అనుభవంతో వాళ్లకన్నా బెటర్‌గా చేయాలనే ఒత్తిడి నాపై ఉంటుంది. ఏం చేసినా ఆసక్తికరంగా ఉండేలా చేయాలి. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తాను కానీ, ఎప్పుడనేది మాత్రం చెప్పలేను. అయినా నన్ను ఉద్వేగానికి గురి చేసే కథ దొరకాలిగా. మై టాప్ టెన్ ఫిలిమ్స్ 1. సీతారామయ్యగారి మనవరాలు (తెలుగు), 2. ఒక్కడు (తెలుగు), 3. కన్నత్తిల్ ముత్తమిట్టాల్ (తమిళం), 4. అలైపాయుదే (తమిళం), 5. ది టైస్ట్ (తమిళం), 6. వానప్రస్థం (మలయాళం), 7. దిల్ చాహతాహై (హిందీ), 8. కమీనే (హిందీ), 9. అశోక (హిందీ), 10. రాగ్ బిరాగ్ (అస్సామీ) -
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కెక్కిన తొలి అంధ దర్శకుడు
కరీంనగర్ శివారు ప్రాంతం. ‘మార్గదర్శి’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ ఏరియాలో సినిమా షూటింగ్ జరగడం చాలా రేర్. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒకటే జనం. అంతా కొత్త ఆర్టిస్టులు. వాళ్లంతా కరీంనగర్ రంగస్థల కళాకారులే. డెరైక్టర్ చాలా పెద్దాయన. నల్ల కళ్లజోడు పెట్టుకుని గంభీరంగా ఉన్నాడు. ఆర్టిస్టులకి సీన్ చెప్పి, కెమెరామేన్‌కి షాట్ ఎలా తీయాలో ఎక్స్ప్లెయిన్ చేశాడాయన. సింగిల్ టేక్‌లో షాట్ ఓకే. అంతా క్లాప్స్. ఇంకో షాట్‌కి సిద్ధం. 62 ఏళ్ల వయసులో ఆ డెరైక్టర్ చకచకా సీన్లు తీసేస్తుంటే అందరూ ఆశ్చర్యంగా నోళ్లు వెల్లబెట్టి చూస్తున్నారు. అసలు విషయం తెలిశాక ఇంకా షాకయ్యారు. ఎందుకంటే ఆయనకు కళ్లు లేవు. కానీ ఆయన స్పీడు, టేకింగ్ చూస్తే వళ్లంతా కళ్లున్నట్టుగానే అనిపించింది. ఆయన పేరు బి.యస్.నారాయణ. తొలి అంధ దర్శకుడిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన ఘనుడు. బీయస్ నారాయణ అంటే సాదాసీదా దర్శకుడు కాదు. ఒక్క ‘ఊరుమ్మడి బ్రతుకులు’ చాలు ఆయన ప్రతిభ ఏంటో చెప్పడానికి. శారదకు ‘ఊర్వశి’ పురస్కారం తీసుకొచ్చిన ‘నిమజ్జనం’ సృష్టికర్త కూడా ఆయనే. అంతా మాస్ మసాలా సినిమాల తోక పట్టుకుని గాల్లో ఎగురుతుంటే, ఈయనేమో మట్టి వాసనను నమ్ముకుని నేల మీద తాను గర్వంగా నిలబడి, తన సినిమానూ గర్వంగా నిలబెట్టాడు.35 ఏళ్ల కెరీర్లో 32 సినిమాలే తీశాడాయన. క్వాంటిటీ కన్నా క్వాలిటీనే నమ్ముకున్నాడు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ... భాష ఏదైనా కథలో నాణ్యత ఉండాలి. సినిమాలో నాణ్యత కనబడాలి. అందుకేనేమో ఆయన సినిమాలను ప్రజలూ మెచ్చారు. ప్రభుత్వమూ మెచ్చింది. జాతీయ అవార్డులు, నంది అవార్డులు... ఇంకా ఎన్నెన్నో పురస్కారాలు.ఎదురీత (1963), తిరుపతమ్మ కథ (1963), విశాల హృదయాలు (1965), ఆనంద నిలయం (1971), శ్రీవారు-మావారు (1973), ఆడవాళ్లు-అపనిందలు (1976), ఊరుమ్మడి బ్రతుకులు (1976), నిమజ్జనం (1979), ఆడది గడపదాటితే (1980)... అన్నీ గొప్ప కాన్సెప్టులే. హిందీలో 20 సూత్రాల పథకం నేపథ్యంలో ‘ఏక్ హి ఇతిహాస్’ అనే సినిమా తీశాడాయన. హేమమాలిని, విష్ణువర్థన్, వినోద్మెహ్రాలాంటి హేమాహేమీలు యాక్ట్ చేశారు. కన్నడంలో ‘మమతేయ బంధనం’ సినిమాలే కాదు. కార్మికుల సంక్షేమం, ఫెడరేషన్ వ్యవహారాలు, డెరైక్టర్స్ కాలనీ ఏర్పాటు... బీయస్ ముందుండి తీరాల్సిందే. సరే... ఇదంతా ఓ ఎత్తు. లాస్ట్ ఫేజ్కొచ్చేసరికి షుగర్ ఎటాక్ అయ్యింది. దాంతో అంధుడై పోయారాయన. రెండు కళ్లూ పోయాయి. ఇంకొకరైతే డిప్రెస్ అయిపోయి మంచాన్న కూలబడిపోయేవారు. బీయస్ నారాయణ మొండివాడు. విజన్ ఉన్నవాడు. కళ్లు లేకపోయినా కాన్ఫిడెన్స్ పోలేదుగా అనుకున్నాడు. అంబేద్కరిజాన్ని సమర్థిస్తూ ‘మార్గదర్శి’ మొదలెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన కెమెరామేన్‌ని తీసుకుంటారు. కానీ బీయస్ నారాయణ మాత్రం సురేందర్‌రెడ్డి అనే కొత్త కెమెరామేన్‌ని తీసుకున్నాడు. ఇప్పుడాయన తెలుగులో బిజీ కెమెరామేన్. అంద్శై పాటల రచయితని చేశారు. యాంకర్ ఉదయభానుకి ఇదే తొలి సినిమా. జస్ట్ 28 రోజుల్లో సినిమా ఫినిష్. ఎక్కడా తొట్రుపాటు లేదు. చాలా కమాండింగ్‌గా షూటింగ్ పనులు పూర్తి చేశాడు. పక్కా ప్లానింగ్. పోస్ట్ ప్రొడక్షనూ అంతే. ఎడిటింగ్ ఎలా చేయాలో, తనకేం కావాలో ముందే చెప్పేశాడు. డబ్బింగ్, రీ-రికార్డింగ్ కూడా దగ్గరుండి చూసుకున్నాడు. అవుట్ పుట్ అదిరింది. బీయస్సా మజాకానా!అక్కడితో ఆగిపోలేదాయన. రేకుర్తి కంటి ఆసుపత్రి వాళ్ల కోసం ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే డాక్యుమెంటరీ తీసిచ్చాడు. ఇంకా ఇంకా ఏదేదో చేయాలనుకున్నాడాయన. కానీ పైవాడు తనకో సినిమా తీసిపెట్టమని చక్కా తీసుకుపోయాడు. ‘‘అప్పటికి నేను చాలా టీవీ సీరియల్స్‌కి పని చేశాను. నిర్మాతల ద్వారా బీయస్ నారాయణగారిని కలిశాను. నాకు ఎడిటింగ్ నాలెడ్జ్ కూడా ఉందని తెలియడంతో చాలా ఆనందపడిపోయి, వెంటనే నన్ను కెమెరామేన్‌గా ప్రకటించేశారు. షాట్ డివిజన్, కంపోజిషన్స్ అన్నీ చెప్పేవారు. కెమెరా ఏ హైట్‌లో ఉంది, లెన్స్ ఏ రేంజ్లో ఉందో అడిగి తెలుసుకునేవారు. స్క్రిప్టు దశలోనే వాయిస్ ఓవర్, ఓవర్ లాప్స్ అన్నీ చెప్పేశారు. కళ్లు లేవనే విషయం మేం చెబితే కానీ తెలుసుకోలేనంత కాన్ఫిడెంట్‌గా, కమాండింగ్‌గా షూటింగ్ పూర్తి చేశారు. ఆయన విజన్ అంత గొప్పది’’. - సురేందర్ రెడ్డి, కెమెరామేన్ -
కష్టాలు గట్టెక్కని గట్టయ్య
హైదరాబాద్ : పొడగరి పొలిపాక గట్టయ్యను కష్టాలు చుట్టుముట్టాయి. ఏడు అడుగుల ఆరు అంగుళాల ఎత్తుతో.. యావత్ దేశాన్ని బాప్రే అనిపించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కినగట్టయ్య ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. శిల్పారామంలో కాంట్రాక్ట్ పద్దతిన తొమ్మిదేళ్లుగా అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గట్టయ్య కుడికాలుకు సెప్టిక్ కావటంతో ఇటీవలే దాన్ని పాదం వరకు తొలగించారు. దీంతో ఆయన కృత్రిమ పాదాన్ని పెట్టుకుని గంటల తరబడి నిలబడి శిల్పారామంలో వచ్చిపోయే వారిని పలకరిస్తూ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అయితే కుడికాలుకు సెప్టిక్ అయి కాలు తొలగించే క్రమంలో చేతిలో చిల్లిగవ్వ లేకపోవటంతో కరీంనగర్ జిల్లాలో ఉన్న తన ప్లాట్‌ను అమ్మి వైద్యమైతే చేయించుకున్నారు గాని నెలనెలా మందుల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్నారు. మందులు కొనుక్కోవడానికి అతనికి వచ్చే జీతం రూ.8000 ఎటూ సరిపోని పరిస్థితి. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గట్టయ్య శిల్పారామంలో ఉద్యోగంతో పాటు వికలాంగుల కోటా కింద బస్‌పాస్ మంజూరు చేయించారు. అయితే ఇటీవల బస్‌పాస్ గడువు ముగియగా, రెన్యువల్‌కు అధికారులు నిరాకరించారు. ఇటీవలే సొంతూళ్లో తల్లికి కాలు విరిగి మంచాన పడిందని, అప్పుడప్పుడు ఊరికి వెళ్లివచ్చే వాడినని, ప్రస్తుతం బస్‌పాస్ రెన్యువల్ కాకపోవటంతో తల్లిని చూసేందుకు కూడా వీలుపడటం లేదని గట్టయ్య ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శిల్పారామరంలో అధికారులందరూ తననెంతో అప్యాయంగా చూసుకుంటున్నప్పటికీ భవిష్యత్తు గురించి తలచుకుంటే.. భయం వేస్తుందన్నారు. తన ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తే, తానంటే ఇష్టపడే అమ్మాయి దొరికితే ఓ ఇంటివాడిని కావాలనుకుంటున్నట్లు గట్టయ్య మనసులో మాటను వెలిబుచ్చారు.