రికార్డుల కోసం ఎప్పుడూ పని చేయలేదు! :శ్రీకర్‌ప్రసాద్ | chit chat with srikar prasad | Sakshi
Sakshi News home page

రికార్డుల కోసం ఎప్పుడూ పని చేయలేదు! :శ్రీకర్‌ప్రసాద్

Published Fri, Dec 20 2013 12:10 AM | Last Updated on Mon, Jul 29 2019 7:41 PM

శ్రీకర్‌ప్రసాద్‌ - Sakshi

శ్రీకర్‌ప్రసాద్‌

 మణిరత్నంలాంటి ఎందరో సృజనాత్మక దర్శకులకు ఆస్థాన ఎడిటర్ అయిన అక్కినేని శ్రీకర్‌ప్రసాద్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. 15 భాషల్లో సినిమాలకు ఎడిటింగ్ చేయడం ఒక రికార్డ్ కాగా, అత్యధిక జాతీయ అవార్డులు కైవసం చేసుకోవడం మరో రికార్డ్. ఈ రెండు రికార్డుల పరంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి రెండు ధ్రువపత్రాలు అందుకున్నారాయన. ఈ సందర్భంగా శ్రీకర్‌ప్రసాద్‌తో ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ...
 
 కంగ్రాట్స్ సార్...
 
 థ్యాంక్సండీ. రెండు రోజుల క్రితమే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి రెండు సర్టిఫికెట్స్ వచ్చాయి.
 15 భాషల్లో ఎడిటింగ్ ఎలా చేయగలిగారు?
 ఇన్ని భాషల్లో చేయాలని లక్ష్యం పెట్టుకుని మాత్రం చేయలేదు. అవకాశాలు వచ్చాయి. చేసుకుంటూ వెళ్లిపోయానంతే. రికార్డుల కోసం మాత్రం చేయలేదు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లిష్, సింహళీ, కర్బీ, కన్నడం, బెంగాలీ, మరాఠీ, అస్సామీ, ఒరియా, మిషింగ్, నేపాలీ, పంజాబీ భాషల్లో 400 పై చిలుకు సినిమాలకు ఎడిటింగ్ చేశాను.
 
 భాష తెలియకుండా ఎడిటింగ్ చేయడం కష్టమేమో?
 భాష తెలియకపోయినా కథను అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటే చాలు. దర్శకుడి ద్వారా కథపై ఒక అవగాహన తెచ్చుకుని ఎడిటింగ్ చేసేస్తాను. భాషలు, సంస్కృతులు వేర్వేరు అయినా కూడా సినిమాల పరంగా ఎమోషన్స్, సెంటిమెంట్స్ మాత్రం ఒక్కటే. అందుకే పెద్ద ఇబ్బంది అనిపించదు. అయినా భావోద్వేగానికి భాష అడ్డంకి కాదనేది నా ఉద్దేశం.
 
 ఇంతకూ ఏ భాషల్లో ఎడిటింగ్ చేయడాన్ని ఎక్కువ ఆస్వాదిస్తారు?
 తెలుగు నా మాతృభాష కాబట్టి, కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అయినా సినిమా అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. భాష ఏదైనా స్టోరీ టెల్లింగే ప్రధానం. అయినా ఒకే భాషలో ఎక్కువ పనిచేస్తే, నాకు మొనాటనీ అనిపిస్తుంది. అదే రకరకాల భాషల్లో పనిచేయడం వల్ల రకరకాల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి రకరకాల అనుభవాలతో కెరీర్ ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది.
 
 ప్రస్తుతం ఏఏ సినిమాలకు పని చేస్తున్నారు?
 తెలుగులో ‘రుద్రమదేవి’, హిందీలో ‘దేద్ ఇష్కియా’, తమిళంలో ‘పన్నియారం పద్మినిం’, మలయాళంలో ‘సోపానం’.
 
 ఎడిటర్‌గా మీ విజయ రహస్యం?
 ఇందులో రహస్యం ఏమీ లేదు. ఏదైనా వందశాతం ఫలితం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎడిటింగ్ అనేది స్టోరీ టెల్లింగ్‌లో ఓ భాగం. ఒక కథను షార్ట్‌గా, స్వీట్‌గా, ఇంట్రెస్టింగ్‌గా చెప్పడానికి ఎడిటింగ్ ఓ సాధనం. ఇన్నేళ్లలో ఎంతోమంది ప్రతిభావంతులతో పనిచేసి, ఎంతో నేర్చుకున్నాను. నేర్చుకుంటాను కూడా. ఈ అనుభవాలు నాకెప్పటికీ ఉపకరిస్తాయి.
 
 ఏడు జాతీయ అవార్డులు గెలుచుకోవడమంటే మాటలు కాదే!
 నేను అవార్డుల కోసం ఎప్పుడూ పని చేయలేదు. ఎడిటర్‌గా నా తొలి సినిమా ‘సింహ స్వప్నం’ (తెలుగు). అయితే తొలి అవకాశం వచ్చింది మాత్రం ‘రాక్’ (1989) అనే హిందీ సినిమాకి. దానికే ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డు వచ్చింది. ఆ తర్వాత రాగ్ బిరాగ్ (1997), నౌక కారిత్రము (1997), ది టైస్ట్ (1998), వానప్రస్థం (2000), కన్నత్తిల్ ముత్తమిట్టాల్ (2002), ఫిరాక్ (2008) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాను. 2010లో స్పెషల్ జ్యూరీ కూడా వచ్చింది.
 
 24 ఏళ్ల ఎడిటింగ్ అనుభవంతో దర్శకత్వం ఏనాడూ చేయాలనుకోలేదా?
 చాలాసార్లు అనుకున్నా. నేను ఎంతోమంది దర్శకులతో పనిచేశాను. ఆ అనుభవంతో వాళ్లకన్నా బెటర్‌గా చేయాలనే ఒత్తిడి నాపై ఉంటుంది. ఏం చేసినా ఆసక్తికరంగా ఉండేలా చేయాలి. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తాను కానీ, ఎప్పుడనేది మాత్రం చెప్పలేను. అయినా నన్ను ఉద్వేగానికి గురి చేసే కథ దొరకాలిగా.
 
 మై టాప్ టెన్ ఫిలిమ్స్
 1. సీతారామయ్యగారి మనవరాలు (తెలుగు), 2. ఒక్కడు (తెలుగు), 3. కన్నత్తిల్ ముత్తమిట్టాల్ (తమిళం), 4. అలైపాయుదే (తమిళం), 5. ది టైస్ట్ (తమిళం), 6. వానప్రస్థం (మలయాళం),
 7. దిల్ చాహతాహై (హిందీ), 8. కమీనే (హిందీ),
 9. అశోక (హిందీ), 10. రాగ్ బిరాగ్ (అస్సామీ)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement