ప్రఖ్యాత ఎడిటర్ అనిల్ మల్నాడ్ (66) ఇకలేరు. కర్నాటకలోని మల్నాడులో పుట్టిన అనిల్ అసలు పేరు జీఆర్ దత్తాత్రేయ. సినిమాటోగ్రఫీ కోర్స్‌లో చేరాలనే ఆశయంతో 17వ ఏట మద్రాసులో అడుగుపెట్టారు దత్తాత్రేయ. సీటు దొరక్కపోవడంతో దర్శకత్వ శాఖలో చేరారు. ప్రముఖ దర్శకుడు బాపు తీసిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికి సహాయ దర్శకుడిగా చేరారు. మరోవైపు ఎడిటింగ్‌పైనా దృష్టి పెట్టారు. దత్తాత్రేయ పని తీరు నచ్చి తాను దర్శకత్వం వహించిన ‘వంశవృక్షం’ చిత్రం ద్వారా ఎడిటర్‌ని చేశారు బాపు.
ఒక్క బాపూ దగ్గరే 22 సినిమాలకు దత్తాత్రేయ ఎడిటర్‌గా చేయడం విశేషం. అప్పుడే దర్శకుడు వంశీ చిత్రాలకూ చేయడం మొదలుపెట్టారు. వంశీ తెరకెక్కించిన ‘సితార’ ద్వారా ఉత్తమ ఎడిటర్‌గా దత్తాత్రేయ జాతీయ అవార్డు అందుకున్నారు. పలు నంది అవార్డులూ సొంతం చేసుకున్నారు. తెలుగులో కె. రాఘవేంద్రరావు, గీతాకృష్ణ వంటి పలు దర్శకుల చిత్రాలకూ, తమిళంలో ఆర్వీ ఉదయ్‌కుమార్, ఆర్.కె. సెల్వమణి తదితరుల చిత్రాలకూ పని చేశారు.
తెలుగుతో పాటు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్.. ఇలా దాదాపు 9 భాషల్లో 200 చిత్రాలకుపైగా పని చేసిన ఘనత దత్తాత్రేయది. ఇన్ని భాషల్లో ఎడిటర్‌గా చేసిన అతి కొద్దిమందిలో దత్తాత్రేయ ఒకరు కావడం విశేషం. ఈయన పేరు అనిల్‌గా మారడానికి కారణం.. తమిళీయులు ‘దత్తాత్రేయ’ పేరుని సరిగ్గా ఉచ్ఛరించలేకపోవడమే. అక్కడివారు అనిల్ దత్ అని పిలిచేవారు. పుట్టిన ఊరు తన పేరులో ఉండాలనుకుని తన పేరుని ‘అనిల్ మల్నాడ్’గా మార్చుకున్నారు.
గతేడాది డిసెంబర్ 4న అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. తలలో రక్తం గడ్డ కట్టడంతో శస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. అనిల్ మల్నాడ్‌కు భార్య శ్రీలక్ష్మీ, కొడుకు సూరజ్, కూతురు అఖిల ఉన్నారు. మంగళవారం ఉదయం చెన్నై, క్రోమ్‌పేటలోని శ్మశాన వాటికలో అనిల్ మల్నాడ్ అంత్యక్రియలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment