భవనంపై యాపిల్ వనం!
♦ విత్తనం నాటితే 8 ఏళ్లకు, అంటు నాటితే మూడేళ్లకు యాపిల్స్ కాశాయి..
♦ చెట్టుకు 90 కాయల దిగుబడి
♦ నందకుమార్ టై గార్డెన్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ఆసక్తి, పట్టుదల ఉండాలే గానీ అనుకున్న లక్ష్యం సాధించవచ్చుననడానికి నందకుమార్ ధుమాల్ ఇంటిపైన యాపిల్ తోటే పచ్చని సాక్ష్యం. నందకుమార్ ధుమాల్ టాటా మోటార్స్ ఉద్యోగి. మహారాష్ట్రలోని పుణే జిల్లా పింప్రీ - చించ్‌వడ్ పట్టణంలో తన సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ వంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే పండుతాయనుకునే యాపిల్ పండ్లను తన ఇంటిపై పండిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత ఉన్నా... తగిన జాగ్రత్తలు తీసుకుంటే పెంచలేకపోవడమేమిటి? అంటూ స్నేహితులు ఉత్సాహపరిచారు. టై గార్డెన్‌లో 2000లో యాపిల్ విత్తనాలేసి.. ఏడేళ్లుగా యాపిల్స్ పండించుకొని తింటున్నారు. అయితే ఇంటి పక్కన ఖాళీ స్థలం లేకపోవటంతో టైపై మొక్కలు పెంచుతున్నారు. యాపిల్ పండ్లలోని విత్తనాలను సేకరించి టైపై కుండీల్లో విత్తారు. ఆనాడు నాటిన విత్తనాలు నేడు తోటగా మారడంతో మురిసిపోతున్నారాయన.
ఎనిమిదేళ్లకు ఫలించిన కృషి...
యాపిల్ పండ్ల విత్తనాలను తొలుత నాటిన నెలకు మొలిచాయి. ఆ మొక్కలను ఎనిమిదేళ్ల పాటు కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత చెట్లకు కాత మొదలైంది. వేసవి కాలం ఉష్ణోగ్రతలు పెరిగిన సమయంలో ప్రతి చెట్టుపైనా నీటిని పిచికారీ చేసేవారు. ఆపిల్ మొక్కల పెంపకంలో ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదు. ఇంటిలోని చెత్త, చెట్ల ఆకులతో పాటు కొన్ని వానపాములను యాపిల్ చెట్లు నాటిన కుండీలలో వేశారు. ఇటీవల కాలంలో అంట్లు నాటితే.. మూడేళ్లలోనే కాపునకు వచ్చాయన్నారు. ఒక్కో చెట్టుకు 90 కాయలు కాస్తున్నాయని నందకుమార్ తెలిపారు. గోల్డెన్ యాపిల్, గ్రీన్ యాపిల్, ఫూజీ యాపిల్ వంటి రకాల చెట్లున్నాయి. నందకుమార్ తోటకు తొలి యాపిల్ టై గార్డెన్‌గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులోను, యూనిక్ వరల్డ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కింది. తన టై గార్డెన్‌లో పండిన యాపిల్ పండ్లను తాజాగా ఆరగిస్తూ ఉంటే చెప్పలేనంత ఆనందంగా ఉంటుందని నందకుమార్ తెగ సంబరపడుతున్నారు. పింప్రీ-చించివడ్ మున్సిపల్ కమిషనర్ ఇటీవల నందకుమార్ దంపతులను సత్కరించడం విశేషం
- శ్రీనివాస్ గుండారి / ఎ.ఎం.చక్రవర్తి, పింప్రీ-చించివడ్, మహారాష్ట్ర