హిమాలయ పర్వత సానువులకే పరిమితమైన ఆపిల్ సాగును మైదాన ప్రాంతాలకు విస్తరింపజేసే కృషిలో విజయం సాధించాడు ఓ సామాన్య రైతు. ఉష్ణమండల, మైదాన ప్రాంతాల్లోనూ సాగుకు అనువైన హెచ్‌ఆర్‌ఎంఎన్–49 ఆపిల్ వంగడాన్ని సృష్టించాడు. ఆ రైతు శాస్త్రవేత్త పేరు హరిమాన్ శర్మ. హిమాచల్‌ప్రదేశ్ బిలాస్‌పూర్ జిల్లాలోని పనియాలా ఆయన స్వగ్రామం.
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కశ్మీర్ రాష్ట్రాల్లోని కొండప్రాంతాల్లో మాత్రమే ఆపిల్ వాణిజ్య పంటగా సాగులో ఉంది. చల్లని వాతావరణం ఉన్న ప్రాంతాలు మాత్రమే ఆపిల్ సాగుకు అనుకూలంగా ఉండటం వల్ల హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోనూ కొండ ప్రాంతాల్లో మాత్రమే వాతావరణం చల్లగా ఉంటుంది. కానీ ఆ రాష్ట్రంలోనూ కొండలోయల్లో, మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికమే. బిలాస్‌పూర్ జిల్లా సముద్ర మట్టానికి 1,800 మీటర్ల ఎత్తులో ఉన్న లోయ ప్రాంతం.
అక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో రైతులు మామిడిని విస్తారంగా సాగు చేస్తున్నారు. అటువంటి చోట తన ఇంటి పెరట్లో ఒక ఆపిల్ మొక్క మొలకెత్తటాన్ని హరిమాన్ శర్మ గమనించారు. వేడి వాతావరణంలో ఆపిల్ చెట్టు పెరగటం శర్మను ఆకర్షించింది. ఆ మొక్కను అతి జాగ్రత్తగా సాకాలని నిర్ణయించుకున్నారు. ఒక ఏడాది గడిచాక ఆ ఆపిల్ చెట్టు నుంచి వచ్చిన కొమ్మలను తీసుకొని రేగు మొక్కతో అంటుకట్టారు. ఆ ప్రాంతంలో అంటు కట్టటానికి కూడా ఆపిల్ చెట్లు అందుబాటులో లేకపోవటమే దీనిక్కారణం. అతని ప్రయోగం విజయవంతమైంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పంట చేతికొచ్చింది!
అంతేకాదు.. ఆపిల్ కాయలు సైజు, నాణ్యత బావున్నాయి. సిమ్లా ఆపిల్ విత్తనాలు తెప్పించి పెంచిన మొక్కలతో ఈ మొక్కలకు అంటుకట్టాడు. రెండేళ్ల తరువాత మంచి పంట చేతికొచ్చింది. తను సాగు చేస్తున్న మామిడి చెట్లతో పాటే ఆ ఆపిల్ చెట్లను పెంచాడు. ఆ విధంగా ఒక చిన్న ఆపిల్ తోటనే అతను సృష్టించాడు!
తన వంగడానికి హెచ్.ఆర్.ఎం.ఎన్.–99 అని పేరుపెట్టాడు. మూడేళ్లు తిరిగేసరికి కాపుకొస్తుంది. ఇప్పుడున్న దేశవాళీ ఆపిల్ కాయలు జూన్ నాటికి మార్కెట్లోకి రావు. జూన్‌కల్లా దిగుబడినివ్వడం దీని మరో ప్రత్యేకత కావడంతో ఈ వంగడాన్ని సాగు చేస్తున్న రైతులు లాభపడుతున్నారు. హెచ్.ఆర్.ఎం.ఎన్.–99 వంగడంపై నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్.ఐ.ఎఫ్.) రెండేళ్ల క్రితమే దృష్టి కేంద్రీకరించింది. దేశంలోని విభిన్న వ్యవసాయక వాతావరణ ప్రాంతాల్లో 2015–17 మధ్యకాలంలో ప్రయోగాత్మకంగా సాగు చేయించింది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 1,190 మంది రైతులకు 10 వేల ఆపిల్ మొక్కలు ఇచ్చి సాగు చేయించారు. చాలా రాష్ట్రాల్లో సత్ఫలితాలు వచ్చాయని ఎన్.ఐ.ఎఫ్. ప్రకటించింది.
ఏడాదిలో రెండు పంటలు!
పరిశోధనాలయాల్లో సాగులో ఉన్న రకాలతో పోల్చితే హెచ్.ఆర్. ఎం.ఎన్.–99 పండ్లు నాణ్యమైనవని తేలింది. కొన్ని రాష్ట్రాల్లో ఏడాది వయసున్న మొక్కలకే పూత వచ్చింది. దక్షిణాదిన కర్ణాటకలోని చిక్‌మగుళూరు, హరియాణా రైతులు హెచ్‌ఆర్‌ఎంఎన్– 99 ఆపిల్ వంగడాన్ని సాగు చేసి ఏడాదికి రెండు పంటలు తీస్తున్నారు. మంచి దిగుబడులు వస్తున్నాయి. కాయలు రుచిగా ఉండటంతో కొనేందుకు వినియోగదారులు మక్కువ చూపుతున్నారు.
బిలాస్‌పూర్ జిల్లాలోని కొండ దిగువ ప్రాంతాల్లోని వేలాది మంది సాధారణ రైతులకు హరిమాన్ శర్మ స్ఫూర్తి ప్రదాతగా మారారు. అంతకు ముందు ఆ ప్రాంతంలోని రైతులు ఆపిల్‌ను సాగు చేయటం గురించి కలలోనైనా ఊహించలేదు. ఇప్పుడు హరిమాన్ శర్మ పుణ్యాన వాళ్లు ఎంచక్కా ఆపిల్ సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అందుకే ఆయనను బిలాస్‌పూర్ జిల్లా రైతులు ‘ఆపిల్ మనిషి’ అని ఆత్మీయంగా పిలుస్తున్నారు.
ఈ ఆవిష్కరణ ఆయనకు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సంపాయించిపెట్టింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్.ఐ.ఎఫ్. జాతీయ పురస్కారాన్ని,‘ప్రేరణాశ్రోత్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఆపిల్ సాగును దేశవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్న సీసీఎంబీ శాస్త్రవేత్తలు హెచ్‌ఆర్‌ఎంఎన్– 99 ఆపిల్ వంగడాన్ని కూడా వినియోగిస్తున్నారు.
– సాగుబడి డెస్క్