హైదరాబాద్: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం త్వరలోనే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కనుంది. ఇటీవల నియోజకవర్గంలో ‘స్వచ్ఛ సత్తెనపల్లి’ పేరుతో 20 వేల మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని వంద రోజుల్లో పూర్తి చేశారు. కాగా, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లిమ్కా బుక్ నిర్వాహకులకు ఇప్పటికే అధికారులు ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను పంపించారు. త్వరలోనే ‘స్వచ్ఛ సత్తెనపల్లి’ అందులో నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే, ఒక రోజు 60 వేల మందితో చేతులు కడిగించే (హ్యాండ్‌వాష్) కార్యక్రమం ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్‌లోకి సత్తెనపల్లిని నమోదు చేయించే ప్రయత్నాన్ని కూడా కోడెల చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది.