
సాక్షి, అమరావతి బ్యూరో: వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన విశిష్ట వ్యక్తులకు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలను ఆగస్టు 13న సీఎం వైఎస్ జగన్ ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడ బందరు రోడ్డులోని ఏ–1 కన్వెన్షన్ హాలును సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్‌లతో కలిసి మంత్రి గురువారం పరిశీలించారు.
అవార్డుల ప్రదానోత్సవానికి వేదిక, ఇతర ఏర్పాట్లకు సంబంధించి ఏ–1 కన్వెన్షన్ హాలు ఏ మేరకు అనువుగా ఉంటుందో పరిశీలించి, కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్షించారు. వెలంపల్లి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన విశిష్ట వ్యక్తులకు జూలై 7న వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలను ప్రకటించిందని గుర్తు చేశారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపికను అందిస్తామన్నారు.