కార్చనక్కరలేదు ఒక్క కన్నీటి చుక్కైనా!
గ్రంథపు చెక్క
రెండు వేల సంవత్సరాల క్రిందట జీవించిన తిరువళ్ళువర్ తమిళనాడుకు చెందిన జిజ్ఞాసువులు, కవి యోగులు అందరిలోకి గొప్పవాడు. తిరువళ్ళువర్ ప్రస్తుత మద్రాస్ నగరంలో అంతర్భాగం అయిన మైలాపూర్ (నెమళ్ళ పట్టణం- మయిల్ అంటే నెమలి) నివసించాడని కచ్చితంగా చెప్పవచ్చు. రెవరెండ్ జి.యు.పోప్ అభిప్రాయం ప్రకారం ‘‘ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఒక విచిత్రమైన ప్రాక్ సౌందర్యం వెల్లివిరుస్తుంటుంది. అక్కడొక పవిత్ర పుష్కరిణి ఉంది. దాని చుట్టూ కొబ్బరి చాపలతో కప్పిన ఇళ్ళు ఎన్నో ఉన్నాయి. వీటిలో దేనిలోనైనా ఈ కవి నివసించి ఉండవచ్చు.’’
ఇక్కడికి సమీపంలోనే సముద్రతీరం ఉంది. ఈ సముద్రతీరం వెంబడి తిరువళ్ళువర్ గ్రీక్, రోమన్, బౌద్ధ, జైన, వైదిక, వైష్ణవ, శైవ తత్వవేత్తలతో కలిసి నడుస్తూ జీవితసత్యాల గురించి, ప్రయోజనాత్మక జీవన కళ గురించి చర్చలు జరుపుతుండిన దృశ్యాన్ని మనం ఊహించుకోవచ్చు. దగ్గర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరో పండితులు, యోగులు తిరువళ్ళువర్ దగ్గరకు వచ్చి ఆయనతో కలిసి సముద్ర స్నానం చేసి ఆయన భార్య వాసుకి వండిన సామాన్యమైనదైనా, రుచికరమైన పరిపూర్ణాహారాన్ని ఆయనతో కలిసి ఆరగించి,
ఆయన ఇంటి ముందు అరుగు మీద కూర్చొని అనేక విషయాలు చర్చిస్తూ ఆయనతో కొంత సమయం గడిపి వెళ్ళేవారు. ఒకరోజు వచ్చిన కొందరు స్నేహితులను సాగనంపి, వీధి చివర నిలబడి, వారు కనుమరుగయ్యేదాకా చూసి, బరువెక్కిన హృదయంతో ఇంటి అరుగు మీద కూర్చొని వెళ్ళిపోయిన మిత్రుల గురించి దిగులు చెందుతూ తన ఆలోచనను ఇలా వ్యంగ్యాత్మకంగా ఈవిధంగా చెప్పాడు...
‘మూర్ఖులతో స్నేహం అతి మధురం
ఎందుకంటే వారు వెడలిపోయేటప్పుడు
కార్చనక్కలేదు ఒక్క కన్నీటి చుక్కైనా’
- యస్.మహరాజన్ రచించిన ‘తిరువళ్ళువర్’
(అనువాదం: కె.ఆర్.కె. మోహన్) నుంచి.