yogis
-
గాలితోనే జీవించిన జానీ బాబా! విస్తుపోయిన డీఆర్డీవో శాస్త్రవేత్తలు!
ఏ కారణం చేతైనా ఒక్కపూట తినకపోతే రెండో పూట ఆకలికి ఆగడం కష్టమైన పనే. ఇక పూజో, వ్రతమో చేసి.. తప్పక సాయంకాలం వరకూ ఉపవాసం ఉండాల్సివస్తే మాత్రం రాత్రికి ఆ లెక్క పక్కాగా సరిచేయాల్సిందే. ఉదయం నుంచి తినలేదనే సాకుతో తూకం సరిచేసినట్లుగా నాలుగు ముద్దలు ఎక్కువ లాగించేస్తాం. అలాంటిది ఒక మనిషి.. కొన్ని ఏళ్ల పాటు నీరు, ఆహారం తీసుకోకుండా బతకడం సాధ్యమేనా? గుజరాత్‌కి చెందిన ప్రహ్లాద్ జానీ బాబా 90 ఏళ్ల పాటు అలానే జీవించారు. గాంధీనగర్ జిల్లా, చరాడ అనే గ్రామానికి చెందిన ప్రహ్లాద్ జానీ బాబాకు ‘చున్రీవాలా మాతాజీ’ అనే మరో పేరుంది. అతను నీళ్లు తాగకుండా, ఆహారం తినకుండా కేవలం గాలితోనే బతుకుతున్నాడనే వార్త 2001లో సంచలనం సృష్టించింది. అయితే అదే వార్త.. మరెందరికో అనుమానాలనూ రేకెత్తించింది. దాంతో 2003 నుంచి 2010 మధ్య కాలంలో ప్రహ్లాద్ బాబా జీవన శైలిపై నిఘాపెట్టిన కొందరు శాస్త్రవేత్తలు.. ‘అతను చెప్పేది, చేసేది నిజమే’ అని గ్రహించి నివ్వెరపోయారు. అప్పటికే 70 ఏళ్లు పైబడిన ఆ మాతాజీ.. ‘నేను నా పద్నాలుగో ఏట నుంచి తినడం, తాగడం మానేశాను. ఇన్నేళ్లు నేను బతికుండటానికి కారణం సాక్షాత్తు ఆ అమ్మవారే. స్వయంగా ఆవిడే నన్ను పోషిస్తున్నారు. కాబట్టి నాకు నీరు, ఆహారం అవసరం లేదు’ అని ప్రకటించడంతో భక్తుల శాతం అమాంతం పెరిగింది. అతనిపై ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్’ (డీఆర్డీవో) ఆధ్వర్యంలోని.. ‘డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్’ (డీఐపీఏ) శాస్త్రవేత్తలు, వైద్యులు నిఘా పెట్టారు. సుమారు 15 రోజుల పాటు పరిశీలనాత్మకంగా సీసీ కెమెరాల ద్వారా అతన్ని గమనించారు. ఆ పరిశీలనలో.. అతను ఏం తినకుండా, తాగకుండా కేవలం గాలి సాయంతోనే జీవిస్తున్నాడని, అయినప్పటికీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తేలింది. గాలితో మాత్రమే జీవించే యోగిగా ఎంతో ప్రజాదరణ పొందిన జానీ బాబా.. ‘మాతాజీ’గా పిలిపించుకోవడానికి ఇష్టపడేవారు. అతని వేషధారణ.. పెద్దబొట్టు, పాపిట కుంకుమ, ముక్కపుడక, గాజులు, ఎర్రటి వస్త్రాన్ని చీరగా కట్టుకునే తీరు అంతా కూడా అమ్మవారిని తలపించేది. ‘ఆధ్యాత్మిక అనుభూతి’ కోసం జానీ చాలా చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోయి.. బనస్కాంత జిల్లాలోని అంబాజీ దేవాలయం సమీపంలోని గుహలో నివసించారట. అక్కడే ధ్యానం చేసి.. తను సాధించిన జ్ఞానాన్ని అందరికీ పంచేందుకు ఆ సమీపంలోనే తన ఆశ్రమాన్ని నిర్మించారట. దశాబ్దాల పాటు అన్నపానీయాలు తీసుకోకుండానే జీవించిన మనిషిగా అంతర్జాతీయంగా పాపులరైనప్పటికీ.. సమాజంలోని ఓ వర్గం అతని శైలిని అనుమానించింది. తన 91 ఏట.. 2020 మే నెలలో మాతాజీ మరణించారు. అతని ఆశ్రమంలోనే ఆ బాబాకు సమాధి నిర్మించిన భక్తులు నేటికీ అతన్ని దైవంగానే భావించి పూజిస్తుంటారు. ప్రస్తుతం అతని శిష్యులే ఆ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. అయితే చున్రీవాలా మాతాజీ.. అన్నేళ్లపాటు ఆహారం తీసుకోకుండా, నీళ్లు తాకుండా ఎలా జీవించారు అనేది నేటికీ మిస్టరీనే! సంహిత నిమ్మన (చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్‌పై డాక్టర్ దాడి! వీడియో వైరల్) -
'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!!
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ ప్రస్తావించిన ‘అజ్ఞాత యోగి’ గురించి మరిన్ని వివరాలు బైటపడుతున్నాయి. సదరు యోగి పేరిట ఈమెయిల్ ఐడీని సృష్టించినది ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) ఆనంద్ సుబ్రమణియన్ అని కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ వెల్లడించింది. రుగ్యజుర్సామ @అవుట్‌లుక్‌డాట్‌కామ్ పేరిట క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడీని ఆయనే ఉపయోగించేవారా లేక మరొకరు ఎవరైనా ఆపరేట్ చేసే వారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్యేక సీబీఐ కోర్టుకు తెలిపింది. అలాగే యోగి, చిత్రాకు మధ్య ఈమెయిల్ ద్వారా జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్లో ప్రస్తావనకు వచ్చిన సీషెల్స్ పర్యటనపై కూడా దృష్టి పెడుతున్నట్లు వివరించింది. చిత్రా సిఫార్సుల మేరకు సుబ్రమణియన్‌ను జీవోవోగా నియమించడం తదితర చర్యల ద్వారా ఎన్ఎస్ఈలో పాలనాపరమైన అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆమెతో పాటు ఇతరులపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. నిరాకారుడైన ఓ సిద్ధపురుషుడు తనకు పలు అంశాల్లో మార్గదర్శకత్వం చేసే వారంటూ విచారణ సందర్భంగా చిత్రా వెల్లడించడంతో అజ్ఞాత యోగి పాత్ర తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో చిత్రా, తదితరులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు ప్రకటించింది. అటు వివాదాస్పద ఎన్ఎస్ఈ కో–లొకేషన్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, తాజా కేసుపై కూడా విచారణ జరుపుతోంది. చదవండి: మూడు కోట్ల కార్లు..కోటి రూపాయల డైనింగ్ టేబుల్.. చివరికి -
ఆధ్యాత్మికతను అలవరచుకోవడం ఇలా...
ఆత్మీయం ఆధ్యాత్మికత అనేది అందరికీ అవసరం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరచుకుంటే ఈ చిక్కులూ, చికాకులూ, ఆందోళనలూ, అవరోధాలూ ఉండవు అని అందరూ చెబుతుంటారు కదా! మరి, ఆ ఆధ్యాత్మికతని పెంపొందించుకొనేది ఎలా అన్నది ప్రశ్న. దీనికి యోగులు ఒక సులభమైన మార్గం చెప్పారు. అది ఏమిటంటే, నిరంతరం జ్ఞానులు, పరమ పవిత్రుల సాంగత్యంలో గడపడం. వారందరూ తమ అహాన్ని విడిచిపెట్టినవాళ్ళు కాబట్టి, మనల్ని సులభంగా అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే వెలుగులోకి తీసుకువెళతారు. జీవితంలో మనకు కావాల్సిన సౌందర్యం ఇదే. చెట్టూ చేమలు అందంగా ఎదగడానికి ఎలాగైతే తగినంత వెలుతురు కావాలో అలాగే మనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని, మన అనుబంధాలను అందంగా, ఆనందంగా మార్చుకోవడానికి జ్ఞానమనే వెలుతురు కావాలి. అయితే, మనలో ప్రేమ, విచక్షణ అనేవి తగ్గిపోయి ప్రతికూల భావోద్వేగాలు పెరిగి, తీరని ఆశలకూ, తద్వారా నిరాశా నిస్పృహలకు దారితీస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, చీకటి గదిలో లైటు వేయడానికి స్విచ్ కోసం వెతుక్కొనేవాడిలా మన పరిస్థితి మారుతుంది. ‘సౌందర్య లహరి’ లాంటి రచనలు మనలో పెంపొందించుకోవాల్సిన ఈ జ్ఞానం గురించి చెబుతాయి. మన సంబంధాలన్నిటిలో ఈ రకమైన సౌందర్యాన్ని అన్నిటినీ కట్టి ఉంచే శక్తిగా చేసుకోవాలి. దానివల్ల ప్రతి ఒక్కరిలోని మంచిని మనం గుర్తించగలుగుతాం. అనవసరపు వాదనలు చేయం. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం, అయినదానికీ కానిదానికీ విమర్శలు చేయడం మానగలుగుతాం. ఎదుటివారితో సంబంధాలు ఒత్తిడికి గురైనప్పటికీ, వారిలోని తప్పులను క్షమించి, ముందుకు సాగుతాం. హాయిగా, ప్రశాంతంగా జీవితం గడపగలుగుతాం. -
కార్చనక్కరలేదు ఒక్క కన్నీటి చుక్కైనా!
గ్రంథపు చెక్క రెండు వేల సంవత్సరాల క్రిందట జీవించిన తిరువళ్ళువర్ తమిళనాడుకు చెందిన జిజ్ఞాసువులు, కవి యోగులు అందరిలోకి గొప్పవాడు. తిరువళ్ళువర్ ప్రస్తుత మద్రాస్ నగరంలో అంతర్భాగం అయిన మైలాపూర్ (నెమళ్ళ పట్టణం- మయిల్ అంటే నెమలి) నివసించాడని కచ్చితంగా చెప్పవచ్చు. రెవరెండ్ జి.యు.పోప్ అభిప్రాయం ప్రకారం ‘‘ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఒక విచిత్రమైన ప్రాక్ సౌందర్యం వెల్లివిరుస్తుంటుంది. అక్కడొక పవిత్ర పుష్కరిణి ఉంది. దాని చుట్టూ కొబ్బరి చాపలతో కప్పిన ఇళ్ళు ఎన్నో ఉన్నాయి. వీటిలో దేనిలోనైనా ఈ కవి నివసించి ఉండవచ్చు.’’ ఇక్కడికి సమీపంలోనే సముద్రతీరం ఉంది. ఈ సముద్రతీరం వెంబడి తిరువళ్ళువర్ గ్రీక్, రోమన్, బౌద్ధ, జైన, వైదిక, వైష్ణవ, శైవ తత్వవేత్తలతో కలిసి నడుస్తూ జీవితసత్యాల గురించి, ప్రయోజనాత్మక జీవన కళ గురించి చర్చలు జరుపుతుండిన దృశ్యాన్ని మనం ఊహించుకోవచ్చు. దగ్గర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరో పండితులు, యోగులు తిరువళ్ళువర్ దగ్గరకు వచ్చి ఆయనతో కలిసి సముద్ర స్నానం చేసి ఆయన భార్య వాసుకి వండిన సామాన్యమైనదైనా, రుచికరమైన పరిపూర్ణాహారాన్ని ఆయనతో కలిసి ఆరగించి, ఆయన ఇంటి ముందు అరుగు మీద కూర్చొని అనేక విషయాలు చర్చిస్తూ ఆయనతో కొంత సమయం గడిపి వెళ్ళేవారు. ఒకరోజు వచ్చిన కొందరు స్నేహితులను సాగనంపి, వీధి చివర నిలబడి, వారు కనుమరుగయ్యేదాకా చూసి, బరువెక్కిన హృదయంతో ఇంటి అరుగు మీద కూర్చొని వెళ్ళిపోయిన మిత్రుల గురించి దిగులు చెందుతూ తన ఆలోచనను ఇలా వ్యంగ్యాత్మకంగా ఈవిధంగా చెప్పాడు... ‘మూర్ఖులతో స్నేహం అతి మధురం ఎందుకంటే వారు వెడలిపోయేటప్పుడు కార్చనక్కలేదు ఒక్క కన్నీటి చుక్కైనా’ - యస్.మహరాజన్ రచించిన ‘తిరువళ్ళువర్’ (అనువాదం: కె.ఆర్.కె. మోహన్) నుంచి. -
‘డుంఢి’ నిషేధంపై వెనక్కు తగ్గకండి
సాక్షి, బెంగళూరు: ‘డుంఢి’ పుస్తక నిషేధంపై ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గకూడదని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చిదానందమూర్తి ప్రభుత్వానికి సూచించారు. గురువారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రచయిత యోగీష్ మాస్టర్ తన ‘డుంఢి’ పుస్తకంలో వినాయకుడిని అవమానించే రీతిలో అనేక వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఇవి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. వినాయకుడు హిందువులకు ఆరాధ్య దైవమని, సకల విఘ్నాలను తొలగించే మూషిక వాహనుడి గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరైంది కాదని పేర్కొన్నారు. అందుకే ఈ పుస్తకం నిషేధ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గకూడదని కోరారు. ఈ తరహా పుస్తకాల రచన, ముద్రణ విషయాలకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే విధి విధానాలను రూపొందించాలని కోరారు. అంతేకాక హిందూ దేవతలను అవమానిస్తూ, ధార్మిక భావాలను దెబ్బతీసే విధంగా పుస్తకాలు రచించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఒక చట్టాన్ని సైతం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.