
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ ప్రస్తావించిన ‘అజ్ఞాత యోగి’ గురించి మరిన్ని వివరాలు బైటపడుతున్నాయి. సదరు యోగి పేరిట ఈమెయిల్ ఐడీని సృష్టించినది ఎన్‌ఎస్‌ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) ఆనంద్ సుబ్రమణియన్ అని కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ వెల్లడించింది.
రుగ్‌యజుర్‌సామ @అవుట్‌లుక్‌డాట్‌కామ్ పేరిట క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడీని ఆయనే ఉపయోగించేవారా లేక మరొకరు ఎవరైనా ఆపరేట్ చేసే వారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్యేక సీబీఐ కోర్టుకు తెలిపింది. అలాగే యోగి, చిత్రాకు మధ్య ఈమెయిల్ ద్వారా జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్లో ప్రస్తావనకు వచ్చిన సీషెల్స్ పర్యటనపై కూడా దృష్టి పెడుతున్నట్లు వివరించింది.
చిత్రా సిఫార్సుల మేరకు సుబ్రమణియన్‌ను జీవోవోగా నియమించడం తదితర చర్యల ద్వారా ఎన్‌ఎస్‌ఈలో పాలనాపరమైన అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆమెతో పాటు ఇతరులపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. నిరాకారుడైన ఓ సిద్ధపురుషుడు తనకు పలు అంశాల్లో మార్గదర్శకత్వం చేసే వారంటూ విచారణ సందర్భంగా చిత్రా వెల్లడించడంతో అజ్ఞాత యోగి పాత్ర తెరపైకి వచ్చింది.
ఈ వ్యవహారంలో చిత్రా, తదితరులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు ప్రకటించింది. అటు వివాదాస్పద ఎన్‌ఎస్‌ఈ కో–లొకేషన్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, తాజా కేసుపై కూడా విచారణ జరుపుతోంది.
చదవండి: మూడు కోట్ల కార్లు..కోటి రూపాయల డైనింగ్ టేబుల్.. చివరికి
Comments
Please login to add a commentAdd a comment