ఆధ్యాత్మికతను అలవరచుకోవడం ఇలా...
ఆత్మీయం
ఆధ్యాత్మికత అనేది అందరికీ అవసరం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరచుకుంటే ఈ చిక్కులూ, చికాకులూ, ఆందోళనలూ, అవరోధాలూ ఉండవు అని అందరూ చెబుతుంటారు కదా! మరి, ఆ ఆధ్యాత్మికతని పెంపొందించుకొనేది ఎలా అన్నది ప్రశ్న. దీనికి యోగులు ఒక సులభమైన మార్గం చెప్పారు. అది ఏమిటంటే, నిరంతరం జ్ఞానులు, పరమ పవిత్రుల సాంగత్యంలో గడపడం. వారందరూ తమ అహాన్ని విడిచిపెట్టినవాళ్ళు కాబట్టి, మనల్ని సులభంగా అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే వెలుగులోకి తీసుకువెళతారు. జీవితంలో మనకు కావాల్సిన సౌందర్యం ఇదే.
చెట్టూ చేమలు అందంగా ఎదగడానికి ఎలాగైతే తగినంత వెలుతురు కావాలో అలాగే మనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని, మన అనుబంధాలను అందంగా, ఆనందంగా మార్చుకోవడానికి జ్ఞానమనే వెలుతురు కావాలి. అయితే, మనలో ప్రేమ, విచక్షణ అనేవి తగ్గిపోయి ప్రతికూల భావోద్వేగాలు పెరిగి, తీరని ఆశలకూ, తద్వారా నిరాశా నిస్పృహలకు దారితీస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, చీకటి గదిలో లైటు వేయడానికి స్విచ్ కోసం వెతుక్కొనేవాడిలా మన పరిస్థితి మారుతుంది.
‘సౌందర్య లహరి’ లాంటి రచనలు మనలో పెంపొందించుకోవాల్సిన ఈ జ్ఞానం గురించి చెబుతాయి. మన సంబంధాలన్నిటిలో ఈ రకమైన సౌందర్యాన్ని అన్నిటినీ కట్టి ఉంచే శక్తిగా చేసుకోవాలి. దానివల్ల ప్రతి ఒక్కరిలోని మంచిని మనం గుర్తించగలుగుతాం. అనవసరపు వాదనలు చేయం. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం, అయినదానికీ కానిదానికీ విమర్శలు చేయడం మానగలుగుతాం. ఎదుటివారితో సంబంధాలు ఒత్తిడికి గురైనప్పటికీ, వారిలోని తప్పులను క్షమించి, ముందుకు సాగుతాం. హాయిగా, ప్రశాంతంగా జీవితం గడపగలుగుతాం.