Shoreline
-
వణుకుతున్న తీరప్రాంత గ్రామాలు
జిల్లాలోని తీరప్రాంతంలో కడలి కోత కంటిమీదకునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే వందలాది ఎకరాల భూములు సాగర గర్భంలో కలిసిపోయాయి. అయినా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అప్పట్లో పెట్టిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. కేంద్రమంత్రి నిర్మలా సీతా రామన్ తీర గ్రామాన్ని దత్తత తీసుకున్నా.. ఫలితం లేదు. నరసాపురం రూరల్: జిల్లాలోని సముద్ర తీర ప్రాంతానికి పెద్ద ముప్పు పొంచి ఉంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం చిన్నగా మొదలైన సముద్రపు కోత నేడు తీవ్రమైంది. దీంతో జిల్లాలోని 19 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్ర తీర ప్రాంతంలో ముఖ్యంగా మూడు కిలోమీటర్ల పరిధిలో (చినమైనవానిలంక నుంచి పెదమైనవానిలంక వరకు) గ్రామాలకు సముద్రపు కోత రూపంలో ఏ క్షణాన్నయినా ఉపద్రవం సంభవించే ప్రమాదం లేకపోలేదు. తుపానుల ప్రభావంతో సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా వందలాది ఎకరాల విస్తీర్ణం కలిగిన జిరాయితీ భూములు సముద్రగర్భంలో కలిసిపోయాయని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. కొబ్బరి, తాడిచెట్లతోపాటు సర్వే తోటలు కూడా కడలి గర్భంలో కలిసి పోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 250 ఎకరాలపైనే.. 2002 నుంచి సముద్ర గర్భంలో భూములు కలిసిపోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 250 ఎకరాలకుపైనే పంటభూమి కడలిలో కలిసిపోయింది. ఏటా తుపాన్ల వల్ల కొంతమేర భూమి కలిసిపోతున్నా.. అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు. ఇప్పటికైనా కోత నివారణకు యుద్ధ ప్రాతిపదికన యత్నాలు చేయకపోతే మరో రెండు దశాబ్దాలకు సముద్రం మరింత ముందుకొచ్చి చినమైనవానిలంక, పెదమైనవానిలంక గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వాదనను అధికారులు సైతం కొట్టి పారేయలేకపోతున్నారు. రక్షణ గోడకు ప్రతిపాదనలు ఈ ప్రాంతంలో ముందుగా చినమైనవానిలంక, పెదమైనవానిలంక గ్రామాలు సముద్రపు కోతకు గురి కావడంతో పెదమైనవానిలంక గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చినమైవానిలంక నుంచి పెదమైనవానిలంకగ్రామ శివారు వరకు సిమెంట్‌తో కూడిన భారీ రాళ్లతో ఒడ్డునే రక్షణ గోడ నిర్మించాలని ప్రతిపాదించారు. 2015లో గోవా రాష్ట్రం నుంచి ప్రత్యేక కేంద్ర బృందం ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో తీరప్రాంత రక్షణకు సుమారు రూ.200 కోట్ల వరకు ఖర్చు కాగలదని అంచనా వేసింది. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం కోత నివారణకు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. గతంలో కూడా సముద్రకోతను అడ్డుకునేందుకు పలువురు కలెక్టర్లు చేసిన ప్రతిపాదనలనూ అప్పటి ప్రభుత్వాలు నిధుల కొరత కారణం చూపుతూ వాయిదా వేశాయి. ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలు మాత్రమే తీసుకున్నాయి. భూములను కోల్పోయిన రైతులకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎలాంటి ప్రత్యామ్నాయ భూమిని ప్రభుత్వం అందించలేకపోయింది. సునామీ తర్వాత సముద్రం కోత 2004లో సునామీ ప్రభావం తర్వాతనే ఈ ప్రాంతంలో సముద్ర కోత పెరిగింది. థానే, నీలం, లైలా, హుద్‌హుద్, ఫొని తదితర తుపాన్ల ప్రభావం వల్ల కోత తీవ్రమైంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చిన్నప్పటి నుంచి కోతను చూస్తున్నా నాకు తెలుసుండి పాత బియ్యపుతిప్ప, చినమైనవానిలంక గ్రామాల్లో తిరిగాను. నేను చూస్తుండగానే ఆ గ్రామాలు సముద్రగర్భంలో కలిసిపోయాయి. అక్కడ తోటలు, సాగుభూమి కూడా ఉండేవి. భవిషత్తులో ఇదే పరిస్థితి తలెత్తితే ఇప్పుడున్న కాస్త ఊరు కూడా సముద్రంలో కలిసిపోయే ప్రమాదముంది. ప్రభుత్వం సముద్రకోత నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి.– ఒడుగు జనార్దనరావు, చినమైనవానిలంక కోత నివారణకు చర్యలు చేపట్టాలి మా ప్రాంతంలో సముద్ర కోత రోజురోజుకీ పెరిగిపోతోంది. అప్పట్లో నిర్మలా సీతారామన్ మా గ్రామాన్ని దత్తత తీసుకున్న సమయంలో కోత నివారణకు రక్షణగోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇంత వరకు రక్షణ గోడ నిర్మాణానికి పూనుకోలేదు. తక్షణం గోడ నిర్మాణం తలపెట్టకపోతే భవిష్యత్తులో మా ఊరు సముద్రంలో కలిసిపోవడం ఖాయం.– మైల వెంకన్న, పెదమైనవానిలంక -
ఇది టైగర్ ఫిష్
‘టైగర్’ రకం రొయ్యల్ని ప్రత్యేకించి చెరువుల్లో పెంచుతుంటారు. అయితే ఆదివారం తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ వద్ద సముద్రతీరంలో ‘టైగర్ ఫిష్’ కనిపించింది. తెరుచుకున్న నోరు, పులిని పోలిన చర్మం, మచ్చలతో ఉన్న ఈ చేప చనిపోయి తీరానికి కొట్టుకు వచ్చింది. దాదాపు రెండడుగుల పొడవు, 5 కిలోల బరువు ఉన్న ఈ చేప చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నా.. తినడానికి పనికిరాదని మత్స్యకారులు చెప్పారు. సముద్రజలాలు కలుషితం కావడం వల్ల ఇటువంటి చేపలు చనిపోయి ఒడ్డుకు చేరుతున్నాయన్నారు. - కొత్తపల్లి -
కార్చనక్కరలేదు ఒక్క కన్నీటి చుక్కైనా!
గ్రంథపు చెక్క రెండు వేల సంవత్సరాల క్రిందట జీవించిన తిరువళ్ళువర్ తమిళనాడుకు చెందిన జిజ్ఞాసువులు, కవి యోగులు అందరిలోకి గొప్పవాడు. తిరువళ్ళువర్ ప్రస్తుత మద్రాస్ నగరంలో అంతర్భాగం అయిన మైలాపూర్ (నెమళ్ళ పట్టణం- మయిల్ అంటే నెమలి) నివసించాడని కచ్చితంగా చెప్పవచ్చు. రెవరెండ్ జి.యు.పోప్ అభిప్రాయం ప్రకారం ‘‘ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఒక విచిత్రమైన ప్రాక్ సౌందర్యం వెల్లివిరుస్తుంటుంది. అక్కడొక పవిత్ర పుష్కరిణి ఉంది. దాని చుట్టూ కొబ్బరి చాపలతో కప్పిన ఇళ్ళు ఎన్నో ఉన్నాయి. వీటిలో దేనిలోనైనా ఈ కవి నివసించి ఉండవచ్చు.’’ ఇక్కడికి సమీపంలోనే సముద్రతీరం ఉంది. ఈ సముద్రతీరం వెంబడి తిరువళ్ళువర్ గ్రీక్, రోమన్, బౌద్ధ, జైన, వైదిక, వైష్ణవ, శైవ తత్వవేత్తలతో కలిసి నడుస్తూ జీవితసత్యాల గురించి, ప్రయోజనాత్మక జీవన కళ గురించి చర్చలు జరుపుతుండిన దృశ్యాన్ని మనం ఊహించుకోవచ్చు. దగ్గర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరో పండితులు, యోగులు తిరువళ్ళువర్ దగ్గరకు వచ్చి ఆయనతో కలిసి సముద్ర స్నానం చేసి ఆయన భార్య వాసుకి వండిన సామాన్యమైనదైనా, రుచికరమైన పరిపూర్ణాహారాన్ని ఆయనతో కలిసి ఆరగించి, ఆయన ఇంటి ముందు అరుగు మీద కూర్చొని అనేక విషయాలు చర్చిస్తూ ఆయనతో కొంత సమయం గడిపి వెళ్ళేవారు. ఒకరోజు వచ్చిన కొందరు స్నేహితులను సాగనంపి, వీధి చివర నిలబడి, వారు కనుమరుగయ్యేదాకా చూసి, బరువెక్కిన హృదయంతో ఇంటి అరుగు మీద కూర్చొని వెళ్ళిపోయిన మిత్రుల గురించి దిగులు చెందుతూ తన ఆలోచనను ఇలా వ్యంగ్యాత్మకంగా ఈవిధంగా చెప్పాడు... ‘మూర్ఖులతో స్నేహం అతి మధురం ఎందుకంటే వారు వెడలిపోయేటప్పుడు కార్చనక్కలేదు ఒక్క కన్నీటి చుక్కైనా’ - యస్.మహరాజన్ రచించిన ‘తిరువళ్ళువర్’ (అనువాదం: కె.ఆర్.కె. మోహన్) నుంచి.