నా కోసం ఎవరి కన్నీళ్ళూ వద్దు...
మీరెవరు, నా కోసం ఏడవడానికి?
మళ్ళీ చెబుతున్నాను వినండి,
ఉన్మాది నంటూ ముద్ర వేసి
మీరు నన్ను ఒంటరిని చేసిందానికి
నాకే కోపతాపాలూ లేవు.
మృత్యువు నాహ్వానిస్తూ
ముంగిట్లో నుంచున్న నన్ను
సర్వ శృంఖలాలూ
ఖణేళ్ మంటూ తెగి పడుతున్న ధ్వని
ఆలాపనై వెంటాడుతోంది.
సంగీతామృత మొకటి
మధు సేవనమై
జిహ్వ మీది ప్రతి బుడిపెనూ తడుముతోంది.
సర్వత్రా విస్తరించిన నిశ్చలత్వం
ఈ గ్రీష్మ నిసి వెన్నెట్లో
వెల్లువై నాలోకి దూసుకొస్తోంది.
ఊహా సహచరి కరచాలనం కోసం
ఈ చరమాంకపు మలుపులో
ఒక సలుపు నన్ను నలిపేస్తోంది.
పునః ప్రారంభానికన్నట్టు
యవనికను మూసిన
పరదాల మడతలు ఊర్ధ్వగమనం చేస్తున్నాయి.
నా ఆఖరి శ్వాసను వీక్షించే జన వాహిని
కేరింతలతో నాకు వీడ్కోలు చెబుతోంది!
ముసురుకున్న ఒంటరితనాన్ని
ఆవలికి విసిరేసి
ధీమాగా ముందుకు అడుగేస్తున్నాను!
జయధ్వానాలు పలకరేం!
(ఆల్బర్ట్ కామూ ‘ది అవుట్‌సైడర్’ చదివాక. కామూ అసంగత తాత్వికత (absurd philosophy) కు అసలు సిసలు చిరునామా. ప్రత్యామ్నాయాలు లేని, వెదకనవసరం లేని జీవిత గత్యంతర రాహిత్యం కామూ రచనల్లో ప్రతి చోటా ద్యోతకమౌతుంది. నవంబర్ 7 కామూ జయంతి.)
తిరువాయపాటి రాజగోపాల్
9573169057
Comments
Please login to add a commentAdd a comment