
సాహిత్యం ముందుగా ఊహించి జోస్యం చెప్పే రంగం కానప్పటికీ సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలాలో సామాన్య జనాలను కదిలించే శక్తి ఎప్పటికీ ఉంటుందని చెప్పవచ్చు. ఆయన కవిత్వంలోను, వచనంలోను కొత్త తరం అర్థాలను కనుక్కోవచ్చు. కడచిన శతాబ్దంలో మనం కనిపెట్టలేకపోయిన లేదా విస్మరించిన విశేషాలను వెలికి తీయవచ్చు. నిరాలా భావ కవి. అదే సమయంలో ఆయన రష్యన్ భావ కవి అలెగ్జాండర్ పుష్కిన్ మాదిరిగా విప్లవాత్మక వాస్తవికతావాది. ఆయన సృజన సారాంశం ఎలా ఉంటుందంటే, అది ఒక కవితలో ఒక వృత్తాకారాన్ని పూర్తి చేసుకున్నట్లుగా కనిపిస్తుంది.
ఆ తరువాతి కవితలోనే, పూర్తిగా కొత్త దిశలు అన్వేషిస్తూ, అది ఆ వలయాన్ని ఛేదించుకుంటుంది. నిరాలా గణనీయమైన రీతిలో కొత్త పుంతలు తొక్కే సృజనాత్మక వచన రచయిత. ఆయన ఆధునిక వచనం కళాఖండాల స్థాయిని సంపాదించుకుంది. నిరాలా రచనాతత్వం గురించి ఆయన సమకాలీన కవి సుమిత్రా నందన్ పంత్ చెప్పిన మాటలు బహుశా ఆయన మొత్తం సారాన్ని పట్టిస్తాయనిపిస్తుంది. ఛంద్ కే బం«ద్ తథా రూహియోంకే బంధన్.. అంటే చందస్సుతో పాటు మూఢ విశ్వాసాల బంధనాలను ఆయన ఛేదించారని పంత్ అంటారు.
గత శతాబ్దంలో మూడవ దశాబ్దం నుంచి ఆరవ దశాబ్దం వరకు విస్తరించిన సాహితీ వ్యాసంగంలో వస్తువు, భాష రెండింటి విషయంలోనూ అంతటి వేగవంతమైన మార్పులు తీసుకొచ్చిన మరొక కవిని కనుక్కోవడం కష్టం. తొలిదశలో ఆయన కవితల్లో తరచు వచ్చే చిహ్నం మేఘం. దానిని ఆయన విప్లవానికి ప్రతీకగా తీసుకున్నారు. ఆధునిక భారతదేశపు మహోన్నత కవులలో నిరాలా ఒకరు. ఆయన ప్రాంతాలకు, కాలానికి అతీతమైన కవి. నిరాలా బెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో జన్మించారు.
ఆయన తండ్రి పండిట్ రామసహాయ త్రిపాఠీ. నిరాలా తల్లి అతడు బాగా చిన్నగా ఉన్నప్పుడే కన్నుమూశారు. మొదట బెంగాలీ మీడియంలో చదువుకున్న నిరాలా, తండ్రి పూర్వీకుల స్వస్థలమైన లక్నో వెళ్లాక.. రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, రవీంద్రనాథ్ టాగూర్ వంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందారు. ఇక అతడు ప్రఖ్యాత హిందీ కవి అయేందుకు కారకులైన వారి గురించి మనం తప్పక తెలుసుకోవాలి. వారు నిరాలా భార్య మనోహరా దేవి. ఆమె ప్రోద్బలం వల్లనే నిరాలా తన 20 ఏళ్ల వయసులో హిందీ నేర్చుకున్నారు. అనంతరం హిందీ కవిగా అవతరించారు.
– కేదార్‌నాథ్ సింగ్, హిందీ కవి, విమర్శకులు
(చదవండి: ఎయిర్‌పోర్ట్‌కి శంకర్ పేరు)
Comments
Please login to add a commentAdd a comment