
అనంతకు అన్యాయమే!
కవి, గాయకుడు గోరేటి వెంకన్న
అనంతపురం కల్చరల్ : ‘పల్లె కన్నీరు పెడుతోందే.. కనిపించని కుట్రల’ అంటూ పల్లె సంస్కృతిని దెబ్బ తీసిన ప్రపంచీకరణ వైనాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పిన కవి, గాయకుడు గోరేటి వెంకన్న. బలహీన వర్గాల పక్షాన బలమైన సాహిత్యంతో గళం విప్పిన ఆయన.. తెలంగాణ , సీమ అంటూ తేడా లేకుండా సుమధుర సాహిత్యంతో ప్రజల గుండెల్లో ప్రత్యేక చోటు సంపాదించుకున్నారు.
నగరంలోని ఓ సాహితీ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన వెంకన్న ‘సాక్షి’తో ఆత్మీయంగా ముచ్చటించారు. రాష్ట్ర విభజన తర్వాత తలెత్తిన సమస్యలు, ప్రపంచీకరణ నేపథ్యంలో తగ్గుతున్న పల్లె సంస్కృతి, సినిమా పాటలు, కొత్త తరం రచయితలు, రచయితల బాధ్యత తదితర అంశాలపై ఆయన చెప్పిన సంగతులు ఇలా...
సాక్షి : ‘అనంత’తో మీకు ప్రత్యేక అనుబంధం ఉంది కదా...
గోరేటి వెంకన్న : ‘అనంత’ ను చూస్తే మా
మహబూబ్‌నగర్‌ను చూసినట్లే ఉంటుంది. ‘సీమ’ సాహిత్యం, ఇక్కడి రచయితలతో నాకు విడదీయరాని ఆత్మీయ అనుబంధం ఉంది. చాలా మంది ‘సీమ’ రచయితలు నన్ను ప్రభావితం చేస్తారని నేను సగర్వంగా చెబుతా.
సాక్షి : ఎవరితో ఎక్కువ సాన్నిహిత్యముంది..
గో.వె : ఒకరే ంటి? శాంతి నారాయణ, బండి నారాయణస్వామి, చిలకూరి దేవపుత్ర, సింగమనేనని నారాయణ వంటివారే కాకుండా ఇతర జిల్లాల్లోని రాసాని, కేశవరెడ్డి వంటి వారి రచనలు భాషా సాహిత్యాలకు పెద్ద పీట వేశాయి. వారి రచనలంటే నాకు ఎక్కువ గౌరవం. వారి కథలు చదువుతుంటే మా జిల్లాలోని సమస్యలపై కథలు రాసినట్లే ఉంటాయి. ఎందుకంటే అనంత, మహబూబ్‌నగర్, కర్నూలులో దాదాపు ఒకే పరిస్థితులు కన్పిస్తాయి.
సాక్షి : సీమ సంసృతి ఎలా ఉంటుందనిసిస్తుంది..
గో.వె : మాది మహబూబ్‌నగర్ కావడంతో చాలా వరకు రాయలసీమతో సన్నిహిత సంబంధాలున్నాయి. కర్నూలుకు కూత వేటంత దూరంలోనే ఉండడంతో భాష, సాహిత్యం, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు చాలా వరకు సీమను పోలి ఉంటాయి. భాషలోని చాలా పదాలు కూడా తెలంగాణ యాస కన్నా సీమను ఎక్కువగా పోలివున్నాయి. కాబట్టే మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం దాదాపు ఒకటే అని నా భావన.
సాక్షి : రాయలసీమ కరువు మాటేమిటి...
గో.వె : నిస్పందేహంగా రాయలసీమలో కరువు కరాళనృత్యం చేసింది. అయితే తెలంగాణలోని మా మహబూబ్‌నగర్ ప్రాంతం కూడా ఏమి తీసిపోలేదు. తెలంగాణకు అన్యాయం జరిగిందని గతంలో ఎలాంటి ఉద్యమాలు జరిగాయో...సీమకు న్యాయం జరగాలని కూడా ఎప్పటి నుంచో ఉద్యమాలు జరిగాయి. కచ్చితంగా ‘సీమ’ వెనుకబడి ఉంది. న్యాయం జరగాలి. ముఖ్యంగా నదీ జలాల కేటాయింపులో ట్రిబ్యునల్ తీర్పుల మేరకు కచ్చితంగా ‘సీమ’కు వాటా దక్కాలి. అదే పరిస్థితుల్లో మహబూబ్‌నగర్ కరువును కూడా జలాలతో తీర్చాలి.
సాక్షి : ప్రపంచీకరణ ప్రభావం ఎలా ఉందంటారు.. అభివృద్ధి చెందుతోందా..
గో.వె : ప్రపంచీకరణను నేను తీవ్రంగా వ్యతిరేకించినవాడిని. దాని వల్ల ఎంతో నష్టం జరిగింది. కొద్దిగా మేలు కూడా జరిగింది. ప్రపంచీకరణతో కొద్దిగా ఆర్థిక వెసలుబాటు కల్గినా చాలా భాగం విధ్వంసమే జరిగింది. కుల వృత్తులు నాశనమయ్యాయి. సహజంగా ఉన్న వాతావరణం స్థానంలో కృత్రిమత్వం తాండవిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి ఒడిలో హాయిగా ఒదిగే కన్నబిడ్డకు... అద్దె ఆయాల పెంపకంలో పెరిగే పిల్లలకు ఉన్నంత తేడా ఉంది. వెన్నెల వెలుగులో చల్లగాలి ఆనందానికి... ఏసి గదులకు ఉన్నంత తేడా ఉంది. చేత్తో పీకేసి మట్టి తుడుచుకుని తినే వేరుశనగ కాయలకు, హాల్దీరామ్ విత్తనాలకు ఉన్నంత తేడా ఉంది.
సాక్షి : పల్లెల్లోని సంస్కృతి, సంప్రదాయాలపై కూడా ఆ ప్రభావం ఉందంటారా?
గో.వె : కచ్చితంగా.. సమస్యలు, ప్రాంతీయ అసమానతల నేపథ్యంలో ఉద్యమాలు ఎలా వచ్చాయో.. ప్రపంచీకరణపై కూడా అదే స్థాయిలో ఉద్యమం వస్తుంది. సంస్కృతి విఛ్చిన్నం అవుతోంది. ఇంటర్‌నెట్‌లో లభించే నీలి చిత్రాలే ఉదాహరణ. అలాంటి చిత్రాలు అందరూ చూసేలా ఇంటర్‌నెట్‌లో ఉంచడం అవసరమా.. అని నా ప్రశ్న. ఇదే తరహాలో ప్రతీ రంగంపై ప్రపంచీకరణ ప్రభావం ఉంది. దాని ప్రభావం భాషపై కూడా పడింది. వీటి ఒడిదుడుకల మధ్య రచనలు తగ్గిపోతున్నాయి. ఇది కూడా భాషపై, భావ వ్యక్తీకరణపై ప్రభావం చూపుతుంది.
సాక్షి : మిమ్మల్ని ప్రజాకవి అంటారు.. మీ కవిత్వంలోని ప్రత్యేకత వల్లేనా?
గో.వె : నన్ను ప్రజాకవి అంటే వంద శాతం తప్పు అంటాను. కవులందరూ ప్రజాకవులే. నేను ప్రజాకవిని అంటే తక్కిన వారు పాలకుల కవులా? అది కరెక్టు కాదని నేను చాలా సార్లు చెప్పాను. నాలోని కవిత్వానికి ప్రత్యేకంగా గొప్పదనం అంటూ ఏదీ లేదని నేను అనుకుంటాను. ఏ కవికైనా ఏదైనా సందర్భంలో గుండెలో ఉద్భవించిన భావనకు అక్షర రూపం ఇస్తే మంచి కవిత్వం అవుతుంది. పనిగట్టుకుని రాయాలనుకుంటే అందులో ‘ప్రాణం’ కనిపించదు. కవితా ధారలు ప్రవహించడానికి ఆయా సందర్భాలు, అనుభూతులు దోహదపడతాయే కానీ వ్యక్తుల సిద్ధాంతాల వల్ల కాదు. ప్రజా పక్షాన నిలిచే సాహిత్య మార్గాన్ని ఎంచుకున్న కవులంతా సాహితీ సేవకులే.
సాక్షి : విభజనతో సీమకు అన్యాయం జరిగిందని భావించడం లేదా..
గో.వె : కొంత వరకు నేను దానితో ఏకీభవిస్తాను. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా తెలంగాణకు సామ్యమున్న ‘అనంత’, ‘కర్నూలు’ కలిసి ఉంటే బాగుండేదని నేను కూడా భావించాను. అయితే అనాదిగా తెలంగాణలో జరిగిన అన్యాయం ఉద్యమబాటకు అనివార్యమైంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏమైనా భాషా సాహిత్యాల వరకైతే తెలంగాణ, రాయలసీమ భావజాలం ఒకటేనన్నది సత్యదూరం కాని మాట.
సాక్షి : కవిత్వంలో భాగమే పాట అనడం సబబేనా..
గో.వె : ఎంతమాత్రం కాదు.. ఎన్నో దశాబ్దాల కిందట గురుజాడ రాసిన గేయాలు సాహిత్యానికి వరమాలగా మారాయి. తర్వాత ఎందరో కవులు, కళాకారులు గేయం, జానపదం, పాట అన్నింటిలో సాహిత్యాన్ని చక్కగా ఒదిగిపోయేలా చేశారు. అందరికి అందుబాటులో ఉండేది..ప్రజాసమస్యలను చిత్రించేది కవిత్వమంటే తప్పు లేదని నా భావం. చివరగా సినిమా అయినా.. భావ కవిత్వమైనా దేనిని రచిస్తున్నా వారందరూ ధన్యులే. ఎక్కువ, తక్కువ భేధాలు లేవన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం.
సాక్షి :సినిమా పాటలు రాయడంలో బాగా బిజీగా ఉన్నారా!
వెంకన్న: గతంలో శ్రీరాములయ్య, ఎన్‌కౌంటర్, నగరంలో నిద్రపోతున్న వేళ తో పాటు పలు సినిమాలకు రాశాను. ఇప్పుడు కూడా రాజ్యాధికారం, కీచక, బంధుకతో పాటు పది సినిమాలకు రాస్తున్నాను. సినిమాకు నా పాట అవసరం ఉందనుకుంటే తప్పకుండా రాస్తాను.